Home » vaddera chandidas » Anukshanikam 2



    "నీ పుణ్యం అటు వెళ్ళకిప్పుడు. ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోందక్కడ. యెంతైనా నీకు అప్పుడు మేస్టరు కదయ్యా పట్టించుకోకు" అన్నాడు శ్రీపతి.
    "అనేకదా నేను వెనకడుతున్నాను" అన్నాడు రామ్మూర్తి.
    "యేఁవిఁటివిశేషాలు?" అన్నాడు శ్రీపతి.
    "యేమున్నయ్ పాఠాలూ నెలజీతాలూ. శ్రీమతికి నిత్యనీరసపురోగం. పిల్లలకి అన్ని చిల్లర మల్లర జబ్బులు. ఆపైన - అదుగో వాడు, యింట్లో హాయిగా మెక్కి, మా నాన్నగారి దగ్గిరినుండి కొంతతెప్పించుకుని తాగుతూ సినిమాలూ. దీనికి తోడుగా రెవల్యూషరీ బ్రిగేడ్ అంటూ వేషాలూ" అన్నాడు రామ్మూర్తి. కేంటీన్ లో అవతలి బల్ల దగ్గిర్నుంచి వెడుతున్న తమ్ముడు నీలకంఠశర్మ వొంక చూపెడుతూ.
    కుక్కుటేశ్వరరావు, "యిప్పుడే వస్తా" అని అవతల వొకరి దగ్గిరికి వెళ్ళాడు.
    నీలకంఠశర్మ పక్కన పాకుడు కాంతారావు వున్నాడు. వాళ్ళిద్దరూ విరసం శాఖలో ముఖ్యులు.
    "వొక్కొక్కరిది వొక్కో దృష్టి. దానిదేఁవుందిలే" అన్నాడు శ్రీపతి.
    "వీళ్ళకి తోడు ఆ పరమేశ్వర్రావొకడు. వాడి అన్న కులశేఖరరావు కనపడటం లేదీమధ్య యేమయ్యాడు? సోదర ద్వయం - ఆ ఆరెస్సెస్ వీరుణ్ణి యీ కమ్యూనిస్ట్ వీరున్నీ కాలేజీ ఎలక్షన్లో పోటీకి నిలబెడితే తమాషాగా వుంటుంది" అన్నాడు రామ్మూర్తి.
    "కులశేఖరుడు గత యేడాదినుంచీ పోర్టుఫోలియో లేని మంత్రిలాగా యిక్కడ కాలం వెళ్ళబుచ్చి యిటీవలే ఢిల్లీవెళ్ళాడు. జీవనాధారం కోసం. యింకో నెలకి యెలక్షన్లు కదా ఆ తరవాత జనసంఘ్ పరిస్థితి యెలా వుంటుందోనని. దీపం వుండగానే యిల్లు చక్కబెట్టుకుందాఁవఁని. దీపం ఇప్పటికే కొడికట్టిందనుకో-మంచి వుద్యోగం గాని యేదన్నా పర్మిట్ గానీ సంపాదించాలని వెళ్ళాడు.
    "రాజకీయ వర్గాలవాళ్ళు వాళ్ళకేం యేదోకటి సంపాదించగలరు" అన్నాడు రామ్మూర్తి.
    "ప్రస్తుతం యేక్ రాత్ కా సుల్తాన్ చరణ్ చౌధురి హయాంలో వుల్లిపాయలు కూడా దొరక్క......"
    "అవునయ్యా ఉల్లిపాయలు యేం ధరా యేం ధరా.......మా ఆవిడకి యెక్కువగా వాడే అలవాటు లేకపోబట్టి సరిపోయింది. లేకపోతే నెల బియ్యా, బిల్లు వుల్లిపాయలకి చాలదు" అన్నాడు రామ్మూర్తి.
    "ఫిజిక్స్ డిపార్టుమెంటులో మొన్నేదో గొడవైందని విన్నానని చెప్పావు. అదేం లేదట" అన్నడు శ్రీపతి.
    "అనంత్ యెట్లా వున్నాడిప్పుడు?" అన్నాడు రామ్మూర్తి.
    "పోనీ ఆ విషయం. అబ్బ ఆపరిస్థితి చెప్పను కూడా చెప్పలేను, క్రితంవారమే మద్రాసు వెళ్ళొచ్చాను. గొలుసుల్తో కట్టేసి వుంచారు" అని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు శ్రీపతి.
    
                              134
    
    యీ పందొమ్మిది వందల డెబ్బయ్ తొమ్మిది ఆఖరి నెల ఆఖరి వారాల్లో లోక్ సభ యెన్నిక సంరంభం దేశవ్యాప్తంగా ప్రారంభమయింది.
    వెనుకటిలాగా, క్రితంసారిలాగా - రెండు మూడు దిగ్గజాలు యెన్నికల రణరంగంలోకి దిగి హోరా హోరీ పరస్పరం విషద్రవం తొండాలతో చిమ్మటంకాదు. యీసారి, పాతిక పొట్టేళ్ళు, దేన్ని యేది కుమ్ముతుందో తెలియని అయోమయంలోపడి, పక్కన కనిపించిన దానినో పోటు పొడిచి తనపని తాను చూసుకుంటున్నట్లుగా వుంది పరిస్థితి.
    రెండు కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని కమ్యూనలిస్ట్ పార్టీలు, మూడు నాలుగు ప్రాంతీయ పార్టీలు వంటివి కాక- చరణ్ సింగ్, మొరార్జీ, ఫెర్నాండెజ్, జగ్ జీవన్ రాం, అర్సూ చవాన్, వాజ్ పేయి, యిందిరాగాంధీ తలకో జండా తలకో దారి తలకో మాట-
    దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే అన్నట్లు యీ సారి యెలక్షన్లో అందరూ మహానాయకులే, అన్నీ మహాపార్టీలే.
    లక్షలాది ప్రజలు-ఆటవిక లయాన్విత సంగీతంగా వెలువడిన అత్యధునాతన పాశ్చాత్య మాసపు ఆవేదనల ఖేదమోద ప్రేలాపనలకు భారతదేశ భాషల సినిమా అనుకరణల చప్పిడి మోతల సంగీతంలో వోల లాడిపోతుంటే' కోట్లాది ప్రజలు - నానారకాల యీతిబాధల దారిద్ర్యపు వ్యధల విశ్వన గీతంలో కుంగిపోతూంటే - యెన్నికల కోలాహలపు వడగాల్పుల సంగీతపు మోతకి చెవులు చిల్లులడిపోతున్నాయి.
    యీ పందొమ్మిది వందల ఎనభయ్ కొత్త సంవత్సరం మూడో తేదీన దాదాపు అన్నిచోట్లా, ఆరోతేదీన కొన్ని చోట్లా ఎన్నికలు జరిగాయి. త్రిపురవంటి సంకటపురం మినహాయింపుగా వుండిపోయింది.
    రాయ్ బరేలీ పెట్టిన వాత యింకా గుర్తుండీ, ఐనవాళ్ళంతా ఆపద సమయంలో తప్పుకుని తనకి వైరివర్గాలుగా ఏర్పడితే-ధైర్యం చాలక, యెందుకైనా మంచిదని అక్కడా యిటు మెదక్ నుంచీ నామినేషన్లు దాఖలు చేసింది యిందిరాగాంధీ- యేదెలా వున్నా ఆంద్రప్రదేశ్ లో తన గెలుపు ఖాయం అని.
    రాజకీయ రంగంలో ఢక్కా మొక్కీలు తిన్నవాళ్ళెవరూ తన తరపున లేకపోయినా, ఆత్మ స్థయిర్యంతో, ధైర్యంగా, దీక్షగా, "నేను నేనే: నాకు వోటు వెయ్యండి" అంటూ బయల్దేరింది.
    యేకులాగా వుంటూనే మేకులాగా అవుతూండే సి.ఏ.ఐ., వొరలో పెట్టిన కత్తిలాగా సి.పి.ఐ. మార్క్సిస్టుపార్టీ, మీరేమైనా సరే ముందు మా సంగతి చూడండని అరుస్తూండే ద్రవిడ కజగ ద్వయంలతో పాటు, ముసలి చిరుతలా చరణ్ సింగ్, రాజకీయ హెడ్ మాస్టర్ లా మొరార్జీ, దెబ్బ తిన్న పులిలా పెర్నాండెజ్, తోడేలులా జగ్ జీవన్ రాం, గుంటనక్కల్లా ఆర్సూ చవాన్ లు, పొగరుబోతు గోవులా వాజ్ పేయిల వంటి వాళ్ళు - యెవరి బుద్దులను బట్టి వాళ్ళు, యెవరి శక్తి యుక్తులను బట్టి వారు దేశం కోసం యెన్నికల వ్యూహ వేడుకకి శక్తివంచన లేకుండా ప్రజాసేవ చేశారు.
    యెన్నికలన్నాక-ప్రజలు, మూర్ఖులైనా మూఢులైనా విజ్ఞులైనా వాళ్ళదేకదా తీర్పు! యీసారి ప్రజలతీర్పు - దండించినా దీవించినా మాకు యిందిరమ్మ అభయహస్తమే కావాలన్నారు. క్రితంసారి బాలభానుడు, ప్రిన్స్ ది స్వీట్ బ్రూట్ సంజయున్ని యెడా పెడా వాయించిపంపిన అదే ఆమేథీ యీ సారి అమోఘంగా విజయ సత్కారం సల్పింది.
    యిందిరాగాంధీ- అప్పుడు డబ్భయ్ యేడులో దేశ వ్యాప్తంగా ఘోర పరాజయం పొందుతానని వూహించనట్లే, యిప్పుడీ యెనభయ్ ఆరంభ యెన్నికల్లో దేశవ్యాప్తంగా మహా విజయం సాధించుతానని వూహించలేకపోయింది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.