Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అలాంటి రోజుల్లో ఒక సాయంకాలం. ఆఫీసునుంచి ఇంటికి వచ్చాను. మా చిన్న పిల్లవాడికి జ్వరం. చూద్దామని వచ్చాను. మళ్ళీ పార్టీకి వెళ్ళాలి. మిత్రులు గిరిగారి జీపు వాకిట్లో నిలిచింది.
అప్పుడు ఇద్దరు అపరిచిత వ్యక్తులు ఇంటికి వచ్చారు. వాస్తవంగా నాకు చిరాకు కల్గింది. కాని, సభ్యత గుర్తుకు వచ్చింది. వారికి టీ అందించాను. ప్రసన్నంగానే పలకరించాను.
ఆ వచ్చిన వారిలో ఒకరు మూరుపుడి ప్రభాకరరావుగారు. వారిది విశాఖ వృత్తికి కంట్రాక్టరు రెండోవారు కేశవరావుగారు - ఫిలిం డిస్ట్రిబ్యూటరు.
"చిల్లర దేవుళ్ళు" సినీమా హక్కులు ఎవరికన్నా ఇచ్చారా?" ప్రభాకరరావుగారు అడిగారు.
"ఆత్రేయగారు అడిగారు - ఇప్పటికి ఎవరికీ ఇవ్వలేదు" అన్నాను.
"బతికించారు. మేము ఎంతో ఆశపెట్టుకొని వచ్చాం. మీరు తొందరలో ఉన్నట్లున్నారు. రేపు వస్తాం" అని సమయస్ఫూర్తిగా వెళ్ళిపోయారు.
ఇంతలో గిరిగారు వచ్చారు. వారికి వివరించాను. "సినీమావాళ్ళు వస్తే ఎందుకు పోనిచ్చినవయా!" అని తలబాదుకున్నారు. 'మిత్రులు ఎదురి చూస్తుంటారు, పద' అని ఇద్దరం పార్టీకి వెళ్ళిపోయాం.
మరుసటిరోజు ప్రభాకరరావుగారు వచ్చారు. "చిల్లర దేవుళ్ళు" అభిమానిననీ - పదిహేనుసార్లు చదివాననీ - "I will spend a laks to see Telengana on the screen - మీరు అడిగినంత ఇస్తాను. నాకు హక్కులు ఇవ్వండి" అని ఎలాంటి దాపరికం లేకుండా అడిగారు. అది నాకు నచ్చింది. అయితే, భాయ్ జాన్ ముందు పరిష్కరించుకుందాం అన్నాను. ఏదో సంకోచించినట్లు అంగీకరించారు.
తరువాత చిరంజీవి చెప్పారు. వారిద్దరూ కృష్ణాజిల్లా వారేనట! ఉభయులూ బంధువులట!! వారికి మనస్పర్ధలున్నాయట - మాటల్లేవట - అయినా తమ ఇంటికి వస్తానననం భాయ్ జాన్ కు విస్మయం కలిగించింది!
"భాయ్ జాన్! చూశావా చిల్లర దేవుళ్ళు ప్రభావం?" అన్నారు చిరంజీవి.
ఆ సాయంకాలం నిరభ్యంతరంగా ప్రభాకరరావుగారు - పెద్దలు అంజయ్యగారిని తీసుకొని చిరంజీవి ఇంటికి వచ్చారు! అతిథి సత్కారంలో భాయ్ జాన్ నిష్ణాతులు.
చిరంజీవికి సినీమాలతో సంబంధం ఉంది. వారు చాల సినీమాలకు వ్రాశారు. ప్రభాకరరావుకు విడమర్చి చెప్పారు. పదివేలు ఇమ్మన్నారు. ప్రభాకరరావుగారు వెంటనే అంగీకరించారు. అడ్వాన్సుగా కొంత డబ్బు - పూలూ పండ్లూ ప్రభాకరరావుగారు నాకు అందించారు. నమస్కరించారు. త్వరలో పిక్చర్ ప్రారంభిస్తాం అన్నారు, వెళ్ళారు.
ఆంద్రప్రభవాళ్ళు పనికిరాధని తిప్పిపంపిన నవల ఇది. భాయ్ జాన్ దాన్ని చూడకుంటే వెలికి వచ్చేది కాదు! అలాంటి దానికి సినీమా యోగం పడుతున్నదంటే ఏమనాలి? 'కాలోయం బ్రహ్మ' అంటుంది ఉపనిషత్తు. కాలం కలిసి వస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి! కాలం వ్యతిరేకించినపుడు అన్నీ ఎదురు తిరుగుతాయి!! కాలమే భగవంతుడన్నారు. కాబట్టి ఇది భగవదనుగ్రహమే!!!
ఇది ఎవరూ అనుకున్న పరిణామం కాదు అందువల్ల భాయ్ జాన్ పొంగిపోయారు. 'పార్టిహోనా భాయ్ జాన్!' అన్నారు. నేను కాదనలేదు. ఫోనుమీదనే గిరి-డాక్టర్ నరసింహం - ఇతర మిత్రులను పిలిచారు. వదినగారు నాగరత్నమ్మగారు వంటల్లో మునిగిపోయారు.
అది మరుపురాని రేయి! సాధారణంగా రాత్రులే మరుపురానివి అవుతాయి! 'షరాబ్ హో అవుర్ షేర్ నహో యహ్ అనూఖీబాత్ హై' మద్యం ఉండి పద్యం లేకుంట వింత విషయం :-
వస్ల్ కీలాత్ హై బుఝాదో ఇన్ చిరాగోంకో
ఖుషీ కె బజ్మ్ మె క్యాకామ్ హై జల్నెవాలోంకా.
(ఇది వలపులరేయి. దివ్వెలను ఆర్పివేయండి. ఇది ఆనంద హేల. మండేవారితో పని ఏల?)
"కవిత గొప్పగా ఉంది - ఆర్పండి లైట్లను" అన్నారు భాయ్ జాన్ కరెంటు లైట్లు ఆరినవి. కొవ్వొత్తులు వెలిగినవి. గోష్ఠికి ఊపు వచ్చింది. రంగులు ఎగచిమ్మినవి.
జిందగీ మానిందె ముర్గె ఖుష్నుమా
కోయిడాలీ పర్ భైఠా చహచహాయా ఉడ్ గియా!
(జీవితం మురిపేముల మునిగిన పక్షిలాంటిది. కొమ్మమీద వాలుతుంది, కిచకిచమంటుంది, తుర్రుమంటుంది.)
'గొప్పగా చెప్పాడు భాయ్ జాన్! జీవితం కిచకిచమనడం 'తుర్రునమడం! బహుత్ ఖూబ్! బహుత్ ఖూబ్!'
అన్నారు భాయ్ జాన్ కావిలించుకున్నారు! అలా గడిచింది రేయి! అతరు పరిమళంలా ఎగిరిపోయింది!
ఇక్కడ మైత్రి - స్నేహం - దోస్తీని గురించి ఒక ఉదాహరణ వెల్లడించాలి:
అవి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులు. S.B. గిరి తెలంగాణ ప్రజాసమితి స్థాపకుల్లో ఒకరు. చిరంజీవి త్రికరణములా విశాలాంధ్రవాది. అయినా వారి స్నేహంలో ఇసుమంత భేదం రాలేదు.
ఒకనాటి రాత్రి నేను గిరి ఇంట్లో ఉన్నాను. చిరంజీవి ఇంటినుంచి ఫోను వచ్చింది. తెలంగాణవాదులు వారి ఇంటిమీద రాళ్ళు వేస్తున్నారట. 'గురూ! భాయ్ జాన్ ఇంటిమీద రాళ్ళేస్తున్నరట, మనం బైలెళ్ళాలే' అన్నాడు గిరి.
నేను మర్మం తెలుసుకోడానికి అన్నాను - "ఆంధ్రోడే గద ఎయ్యనీ రాళ్ళు" అని.
"అగొ! అట్లనొద్దు. మన భాయ్ జాన్ ఇంటిమీద రాళ్ళు పడితే మనింటిమీద పడినట్లే" అన్నాడు.
ఇద్దరం జీపుమీద పంజగుట్టకు పరిగెత్తాం. వాతావరణం బీభత్సంగా ఉంది. గిరిని చూచారు. రాళ్ళు వేసేవాళ్ళు పారిపోయారు.
గిరి భారీగా ఉంటాడు. గట్టిగా అరిచాడు.
"మల్ల ఈ ఇండ్లమీద ఒక్క రాయిపడ్తే పానాల్తీస్త పంజగుట్ట బొందల గడ్డల పాతిపెడ్తా!" అంతే - మల్ల వాల్లు అటుదిక్కు వచ్చిన్రనుకున్రా?
ఆ రాత్రి అక్కడే గడిపాం. తెల్లవారి ఇల్లు చేరుకున్నాం.
ఆ ఉద్యమం సందర్భంలోనే S.B.గిరిని అరెస్టు చేశారు. రాజమండ్రి జేలుకు పంపించారు.
"జాయ్ జాన్! గిరిని అరెస్టు చేయకుండాల్సింది" అన్నారు చిరంజీవి.
"తెలంగాణవాడు అరెస్టయినాడు. మీకెందుకు దిగులు?" అన్నాను.
"అలా అనొద్దు బాయిజాన్! గిరిని అరెస్టు చేసినా మనను అరెస్టు చేసినా ఒకటే" అని ఎంతో బాధపడ్డారు చిరంజీవి.
గిరి విడుదలయివచ్చాడు. వారికి స్వాగతం పలుకడానికి అశేష ప్రజానీకం సికిందరాబాదు స్టేషనువద్ద కూడింది. ఆ గుంపులోంచి దూసుకుపోయి తొలిగా గిరిని ఆలింగనం చేసుకున్నవాడు నార్ల చిరంజీవి!
ఇదండీ అనుబంధం! ఇదండీ మానవత్వం! మానవుడు ఈనాడు వదులుకో వలసినవి ఇరుకు గోడల సంకుచితత్వాలు! అవలంబించాల్సింది గోడలు కూలిన విశాల మానవత్వం! మానవ జాతికి ప్రేమను మించిన సందేశం లేదు!
ప్రభాకరరావుగారు మళ్ళీ కనిపించారు. నేను ఇల్లు కడ్తుంటే కొంత డబ్బిచ్చారు. నేను విశాఖ వెళ్ళి వచ్చాను. కాని మళ్ళీ పిక్చర్ విషయం మాట్లాడలేదు.
వారు అక్కినేని నాగేశ్వరరావుగారితో పిక్చర్ తీయసంకల్పించారు. నాగేశ్వరరావు గారు చెంపదెబ్బతినే హీరోగా నటించనన్నారట. అందువల్ల ప్రభాకరరావుగారు విరమించినట్లున్నారు.
ఈలోగా T. కృష్ణగారు పిక్టర్ తీస్తానని ముందుకు వచ్చారు. ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి.
1974 జూలై ఆరవతేదీ శనివారంనాడు నాకు అల్సర్ తీసివేయడానికి కడుపు ఆపరేషను చేశారు. నేను థియేటర్లో ఉన్నాను. అన్నయ్య, కమల సహితంగా పిల్లలంతా ఏడ్చారట. 14 ఆహ్దివరంనాడు డిశ్చార్జి చేశారు. నన్ను కుర్చీమీద కూర్చోబెట్టి సాంబశివరావు వగైరా మిత్రులు పైఅంతస్థుకు ఎత్తుకొని వచ్చారు.
నేను మంచంలో ఉండగా T. మాధవరావుగారు వచ్చారు. అప్పటికి వారు దర్శకత్వం వహించిన పిక్చర్లు ఏవో వచ్చాయి. వారు డబ్బు పట్టుకొని "చిల్లర దేవుళ్ళు" హక్కులకోసం వచ్చారు. 'ఖైదీ బాబాయి తీసిన T. కృష్ణ మాకు బంధువు వైర్కి తప్ప మీకు ఇవ్వను' అని కచ్చితంగా చెప్పాను. మాధవరావుగారు నన్ను వదల్లేదు. కృష్ణనుంచి ఉత్తరం తెస్తామన్నారు. నేను వప్పుకోలేదు.
మాధవరావుగారు కొంతడబ్బు నా పడకమీద పెట్టారు. 'ఆలోచించుకోండి. టీ తాగి వస్తా' అని వెళ్ళారు. కమల ఇదంతా కనిపెడ్తున్నది, వచ్చింది. పక్కన కూర్చుంది. 'ఇంట్లో ఇప్పుడు రూపాయి లేదు. పిల్ల పెండ్లి చేసినం, ఇల్లు కట్టినం, ఇంటిచుట్టు అప్పులే ఉన్నాయి. మీరు ఎవరినీ అడగరు. ఇంటికి వచ్చినోన్ని వెళ్ళగొట్టడం ఏం న్యాయం? కృష్ణ దగ్గరినుంచి ఉత్తరం తెస్తనంటున్నాడు గదా, వప్పుకోండి' అని డబ్బు తీసుకుంది.
ఆడవాళ్ళు వాస్తవికంగా ఆలోచిస్తారు! మనం ఒక్కోసారి వాస్తవాలు కనిపిస్తున్నా చూడలేం. కమల సలహాను కాదనలేకపోయాను. మాధవరావు తెలివైనవాడు, అనుకున్నది సాధించాడు, సంతోషంగా సాగిపోయాడు.





