Home » vaddera chandidas » Anukshanikam 2
"ఆమె ఫ్రండ్ మండలి గవిరినాయునికి నెయ్యంటే చాల యిష్టం" అని నవ్వాడు రామాచారి.
"వొక్క నెయ్యంటేనేనా డాల్డా కూడానా!"
"డాల్డా, యికనిమిక్స్ జార్జ్ కి యిష్టం!" అన్నాడు రామాచారి.
వఝుల కుచలకుమారి అని వో అమ్మాయి అతని క్లాసే. చేరిన మొదటి వారంలో డాల్డా వనస్పతి ప్రకటన బొమ్మ వున్న కాగితం అట్ట వేసిన యెక్సర్ సైజు నోటు బుక్కు పట్టుకొచ్చేది క్లాసుకి. అందుకు, ఆమెకి ఆ పేరు పెట్టారు.
రామాచారి టీ తాగి చక్కా వెళ్ళిపోయాడు.
"బిల్లు మన మొహాన వేసిపోయాడు" అన్నాడు లెనిన్ బాబు.
"చావనివ్వు. ఎలక్షన్ టైంలో పనికొస్తాడు" అని లేచి, "రావటం లేదా?" అన్నారు కరుణాకర్ రెడ్డి.
"ఆ విశేశ్వర్ తో పనివుంది వొస్తానన్నాడు. వాడికోసం చూస్తున్నాను. అన్నట్లు నువ్వు హిస్టరీ డిపార్ట్ మెంటువైపుకి వెళ్తే శ్రీదేవితో చెప్పు, సాయంత్రం వుండమని" అన్నాడు లెనిన్ బాబు.
శ్రీదేవి, గాయత్రి చెల్లెలు. వీళ్ళ సపోర్టుతో లేడీస్ సెక్రటరీ గా గెలిచింది.
కరుణాకర్ రెడ్డి వెడుతూంటే గుమ్మంలో విశ్వేశ్వర్ యెదురయ్యాడు "మా లెనిన్ బాబు నీకోసమే యెదురుచూస్తున్నాడు" అన్నాడు కరుణాకర్ రెడ్డి.
"జరంత లేటాయె" అని, "ఆప్ జైసా కోయీ-" అని పాడుకుంటూ వొచ్చాడు విశ్వేశ్వర్. కూచుంటూ "హలో కామ్రేడ్" అన్నాడు.
"నేను కామ్రేడ్ నేఁవిఁబోయ్!" అన్నాడు లెనిన్ బాబు.
"లెనిన్ వి కద!"
"మా నాన్నకి నే పుట్టినప్పుడు నా సంగతి తెలియక ఆ పేరుపెట్టాడు నాకు ముఫ్ఫయ్యేళ్ళొచ్చేసరికి ఆయన సరైపోతాడని నా నమ్మకం. సరైపోవటం అంటే రైటైపోవటం. రైటిస్ట్, నాట్ లెఫ్దిస్ట్" అన్నాడు లెనిన్ బాబు.
"సెటైరిస్టంటే" అన్నాడు విశ్వేశ్వర్.
'నీ తలకాయ' అనుకుని, "విశ్వేశ్వర్, సాయంత్రం నాకో చిన్న పని చేసిపెట్టాలి మారెడ్ పల్లిలో-" అంటున్నాడు లెనిన్ బాబు.
"యీవెనింగ్ పిక్చర్ ప్రోగ్రాం వున్నది."
"నీకు సినిమా ప్రోగ్రాం వుండనిదెప్పుడుగానీ-" అని ఆ పని వివరిస్తున్నాడు లెనిన్ బాబు.
విశ్వేశ్వర్, జ్ఞానేశ్వర్ తమ్ముడు. అన్నకిలాగే యితనికి సినిమాలు చూసే పిచ్చి, ఐతే రేసెస్ అలవాటవలేదింకా.
లెనిన్ బాబు కూచున్న టేబిలు దగ్గిరకి సంధ్యావందనం నాగేశ్వరరావు నూకరాజు అప్పలరాజు వొచ్చారు.
"చదువుకోటానికొచ్చారా యిట్లా కేంటీన్ లో కూచోటానికొచ్చారా?" అన్నాడు లెనిన్ బాబు హాస్యంగా.
వీళ్ళుకూడా యూత్ కాంగ్రెస్ వర్గం.
"చదువుకోటానికి పుస్తకాలెక్కడ? అన్ని పుస్తకాలూ ఆ శోభ లైబ్రరీనుండీ లెక్చరర్లని మెప్పించీ పట్టుకుపోయింది!" అన్నాడు అప్పల రాజు.
శోభారాణి నశిని చెల్లెలు. చదువంటే చాలా ఆసక్తి. బాగా చదువు తుంది. మంచి మార్కులొస్తాయి.
నలుగురైదుగురు వొచ్చి పక్కబల్లల దగ్గిర కూచ్చున్నారు.
అందులో తెలుగు రీసెర్చి స్కాలర్ వీరభద్రరావు. "చెన్నాపట్నం చిన్నదాన్ని చైనా బజారులో వున్నదాన్ని-" అని ప్రారంభించాడు అతని ప్రక్కన కూచున్న చెరుకూరిరామశర్మ. "అడగనా చెప్పనా" అంటూ ప్రారంభించాడు.
అంతలో సుధాకర్ వొచ్చాడు "హలో" అంటూ లెనిన్ బాబు కూర్చున్న బల్లదగ్గిరికి.
"యేం, గురువుగారూ, తమరి దర్శనమే అపురూపమైపోయింది!" అన్నాడు లెనిన్ బాబు.
"వూర్లో లేను. నేను చెప్పిన పని చేస్తినా మైడియర్ బాబూ లెనిన్ అన్నాడు సుధాకర్, సుధాకర్ లా లో చేరాడు.
అవతల బల్ల దగ్గిర వీరభద్రరావు, "పాల డిపోమీదుగా.....అట్టట్ట.....వొస్తే మా యిల్లు- అక్కడే-అక్కడే అక్కడే వుంది-" అని పాడుతున్నాడు ఉత్సాహంగా. అతని పక్క కుర్చీలో కూచునివున్న పర్వతనేని రామినీడు. "సింగవూరు సింగారి వయసు పొంగు వయ్యారి రాజమండ్రి కోడలుగా రానుందీ...." అని ప్ర్రారంభించాడు.
"యెక్కడ స్వామీ, నీకేం పని పురమాయించి వూరుకున్నావు. వాడొక పట్టాన దొరుకుతాడా!" అన్నాడు లెనిన్ బాబు.
అంతలో లోపలికి వొచ్చిన శ్రీపతిని చూసి, చెయ్యెత్తి రండిసార్" అన్నాడు సుధాకర్.
శ్రీపతి, లా ఆఖరి సంవత్సరం.
"యేం సుధాకర్, నువ్విక్కడే మువ్వన్నెల లెనిన్ తో ముచ్చట లాడుతూ కూచుంటే. అక్కడ లా కాలేజీ తగలడిపోతోంది. పరమేశ్వరుడు నీమీద మూడో కన్ను తెరిచాడు లా కాలేజీలో దర్శనమిచ్చి!" అన్నాడు శ్రీపతి.
"ఆ పోరన్నెపుడో దొర్కబట్టుకొని బొక్కలిర్గదంత. నాసంగతెర్కలేనట్లున్నది నాన్కి! ఆ పొద్దే తన్ని వుందును. మధ్యలో మిమ్మల్ని చూసి వూర్కుంటి" అన్నాడు సుధాకర్.
"పోనివ్వయ్యా. వ్యక్తిగత ద్వేషం గర్హనీయమే అనుకో" అన్నాడు శ్రీపతి.
"హలో శ్రీపతీ, నీకోసం మీ కాలేజీకి కబురెట్టాను" అంటూ వొచ్చాడు రామూర్తి కూడా పొలిటికల్ సైన్స్ కుక్కుటేశ్వరరావు-అతనిప్పుడు రీడర్.
లెనిన్ బాబు, "గుడ్ మార్నింగ్ సార్" అన్నాడు, తన లెక్చరర్ రామూర్తితో. "కులాసా?" అన్నాడు రామ్మూర్తి పలకరింపుగా.
"పనున్నది పోతన్నం" అని లేచాడు సుధాకర్. అతనితోపాటు లెనిన్ బాబు మిగతా యిద్దరూ లేచారు.
"మీ ఖలీల్ ము సఫా యేమంటున్నాడు?" అన్నాడు శ్రీపతి.
"చార్ మినార్ వెళ్ళి వొక అత్తరు సీసా కొనితెచ్చి యిద్డామనకుంటున్నా"
నవ్వాడు రామ్మూర్తి.
కుక్కుటేశ్వరరావు మౌనంగా కూర్చున్నాడు.



