Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    తెలంగాణం పలుకు పలుకగల కళాకారులను పిలిపించారు. తెలంగాణంలో పుట్టి పెరిగినవారే యాస పలుక లేకపోయారు! రేడియో-పత్రికలు అంత ప్రభావం వేశాయన్న మాట! స్త్రీపాత్రలకు సంబంధించినంతవరకు రావి భారతి వాణి, L.K. రెడ్డి తప్ప యాస చెప్పగలవారు దొరకలేదు. ఆ ఇద్దరి స్వరాలూ వనజ వయసుకు సరిపోయేట్లు లేవు! వనజ ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.
    
    నేను శారదను వనజ పాత్ర ధరించమన్నాను. 'నవల చదివినప్పుడు వనజ పాత్ర నన్ను అనేకసార్లు ఏడిపించింది. అది నాకు ఇష్టం అయిన పాత్ర. అయితే నాకు పలుకుబడి రాదు. పైగా 'తెలంగాణంవాళ్ళు దొరకలేదా!' అని ప్రత్యేక తెలంగాణీయులు గొడవచేస్తారు' అన్నారు. నేను శారదగారిని వప్పించాను. వారికి నుడికారం నేర్పాను. కళ శారద గొంతులో కాపురం పెట్టింది. ఆమె అద్భుతంగా చెప్పింది.
    
    భానుప్రకాశ్ దొరగానూ - సురమౌళి కరణంగానూ - రావి భారతి దొరసానిగానూ - వాణి L.K. రెడ్డి తాయారుగానూ - శారదా శ్రీనివాసన్ వనజగానూ నటించారు. మిగతా పాత్రలు ముఖ్యంగా పాణి - మంజరి వేసినవాళ్ళపేర్లు గుర్తులేవు.
    
    'చిల్లరదేవుళ్ళు' రేడియో నాటకం నా సమక్షంలో రికార్డయింది. అనేకసార్లు మార్పులు చేర్పులు చేయాల్సివచ్చింది. మూడు రోజులు వరుసగా శ్రమ పడింతరువాత 'చిల్లరదేవుళ్ళు' ఒక రూపం దాల్చారు! వాళ్ళు మొండివాళ్ళండీ! వాళ్ళను దారికి తేవడం కష్టం!!
    
    నాటక ప్రసారానికి తేదీ నిర్ణయం అయింది. కార్యక్రమం ఆకాశవాణిలోనూ 'వాణి'లో ప్రకటించబడింది. ఆనాడు అందరం రేడియోల ముందు కూర్చున్నాం. 'ప్రకటించిన కార్యక్రమానికి బదులు' అని వేరే కార్యక్రమం వచ్చింది. ఆశకు అది అశనిపాతం! ఫోనుకు ఆకాశవాణిలో ఎవరూ అందుబాటులో లేరు. అప్పటికి మిగతా వారికి ఫునులు లేవు. ఫోను LUXURY అయిన రోజులవి!
    
    తెల్లవారి రేడియో స్టేషనుకు వెళ్ళాను. డైరెక్టరు చెప్పింది విన్నాను. చకితుణ్ణి అయినాను. 'నాటకం మొత్తంలో మనసున్న పాత్ర సారంగపాణిది మాత్రమే! అతడు ఆంద్రప్రాంతంవాడు. తెలంగాణలో మనసున్నవాడే లేడా అని ప్రత్యేక తెలంగాణవాదులు అల్లరిచేసే అవకాశం ఉంది. అందువల్ల ఢిల్లీవారు నాటకం ఆపివేయవలసిందని ఆదేశాలు పంపారు' అన్నారు.
    
    డైరెక్టర్ కు అర్ధం చేయించడానికి నా తలప్రాణం తోకకు వచ్చింది. సారంగపాణి తెలంగాణంలో పుట్టాడు. బెజవాడలో బాలుడుగా తప్పిపోయాడు. విద్యాబుద్దులు అక్కడ నేర్చుకున్నాడు. మళ్ళీ తెలంగాణానికే వచ్చాడు. సంస్కారం పెరిగిన వాతావరణం మీద ఆధారపడుతుందని నిరూపించడానికి అలా చేశావని చెప్పాను. ఈ విషయం నవలలోనూ - నాటకంలోనూ స్పష్టంగా ఉందని చూపను. వారికి కొంత అర్ధం అయింది. రికార్డు విన్నారు. డైరెక్టర్ కదా! ఆ సన్నివేశాన్ని మరికాస్త విపులీకరించ మన్నారు. విపులీకరించారు. ఢిల్లీ నుంచి అనుమతి అందింది.
    
    "చిల్లర దేవుళ్ళు" నాటకం 19 జూలై 1971 సోమవారం రాత్రి తొలిసారి ప్రసారం అయింది. నేను - హరి - రమణరావు 'ద్వారక' హోటల్ గదిలో నషాలో విన్నాం. నాటకం మొదలు కావడమే సరికొత్తగా డప్పుల వాద్యాలతో మొదలయింది. విరామ వాద్యం సహితం డప్పులదే! కళాకారులు పాత్రలకు - పలుకుబడికీ ప్రాణం పోశారు. శారద-వనజగా నవలలోంచి నడిచి వచ్చినట్లుంది. చివరి సీనులో "దొరసానీ! దొర చచ్చిండు" అన్న శారద స్వరం ఇప్పటికీ నా మనసులో కదలాడుతుంది!
    
    "చిల్లరదేవుళ్ళు" రేడియో నాటకం బహుప్రశంస లందింది. వందల ఉత్తరాలు వచ్చాయి! తెలంగాణ ప్రజాజీవితము - ప్రజల భాష శ్రోతలకు అవగతం అయింది. అవి వారిని కదిలించాయి. నన్ను కదిలించిన ఒక సంఘటన వివరిస్తాను:
    
    'సాహితీమిత్రబృందం' వార్షికోత్సవ సందర్భంగా నన్ను సన్మానించడానికి వేముల వాడకు ఆహ్వానించారు. 14 ఆగస్టు 1971 శనివారం వేములవాడ చేరుకున్నాను. వేములవాడ శిథిలమవుతున్న నాగరికతకు సాక్షీభూతంగా నిలిచింది. మట్టిగోడల రెండంతస్థుల ఇళ్ళు - కూలుతున్న గోడల విశాల ఆవరణలు గతకాలపు సంస్కృతికి కూలుతున్న సాక్ష్యాలు భీమేశ్వరాలయము - భీమ కవి ఎంతో ప్రసిద్దులు. రాజేశ్వరాలయంలో ఒక దర్గా సహితంగా వైష్ణవాలయాలు ఉండడం విశేషం. ఇది ఒకనాటి చోళుల రాజధాని అని చెప్పుకుంటారు. కన్నడంలో భారతం రచించిన పంప-రన్న వేములవాడవారట!
    
    వేములవాడలో చొప్పకట్ల చంద్రమౌలిగారి ఇంట్లో నాకు వసతి ఏర్పాటు చేశారు. లాంతర్ల - కందిళ్ళ - వెలుగులో చాయ్ తాగుతూ మిత్రులం సాహిత్యచర్చ జరుపుకున్నాం.
    
    "ఆ అయ్య వచ్చిండట - ఏడి?"
    
    అని ఇద్దరు శ్రామికులు - అంటే జీతగాళ్ళు - దర్వాజాలో నిలబడి అడిగారు.
    
    "ఏ అయ్య?" చొప్పకట్లవారు అడిగారు.
    
    "అదేనండి, రేడియోల నాటకం రాసిండు చూడుండి - గాయిన."
    
    నాలో ఒక విద్యుత్తరంగం వ్యాపించింది. ఇంత సామాన్యులు నా నాటకం విన్నారు!
    
    చొప్పకట్లవారు నన్ను చూపారు. వాళ్ళిద్దరూ వచ్చి నా కాళ్ళమీద పడ్డారు.
    
    "ఏం రాసిన వుండి! ఏం రాసిన వుండి! దొరల బండారం ఎల్లబెట్టినవ్! కళ్ళకు కళ్ళబడెటట్లు రాసిన వుండి! ఆ దొరలు పోయిన్రనుకుంటున్రా! ఉన్నారండి. ఇంకా గట్లనే తరముతాండ్రుండి. మీ కాల్మొక్తం, బాంచెనయితం - ఇంకా రాయున్రి, ఇంకా రాయున్రి" అన్నారు. వారి స్వరంలో ఆవేదన - ఆతురత - ఆప్యాయత ఏరులై పారేయి!
    
    వారి మాటలు నన్ను అచేతనున్ని చేశాయి! లిప్తపాటు హృదయస్పందన నిలిచినట్లయింది, వత్శావంగా నోబెల్ బహుమతి వచ్చినా ఇంతటి పరమానందం - పరమానుభూతి - పరమచేతన కలిగి ఉండకపోవును! అనుభూతి పదాలకు అందడం లేదు!
    
    మనది కుసంస్కారం! వాళ్ళ పేర్లు మరచాను. కాని, మూర్తులు మనసులో మసలుతున్నారు. వారు అంతరాత్రి బావికాడ దొరపొలానికి కాపుండి విన్నారట! ఒక రచన ఆ స్థాయికి అందిందంటే రచయితకు ఇంకా కావలసిందేముంటుందండీ?
    
    భాయ్ జాన్ చిరంజీవి మల్లెల మనసులో - తమ జీవితానికి సంబంధించిన - ఒక ఆరని మంట చేరింది. రోగగ్రస్తు లయినారు. చికిత్సకని గుంటూరు వెళ్తూ - 'భాగ్యనగరం' నాకు అప్పగించి వెళ్ళారు. మళ్ళీ రాలేదు! 16-10-71 న వారు పరమపదించారని వార్త అందింది. నేను జబ్బున పడ్డాను.
    
    "మనసు మనసు కలిసినట్టి    
    మధురక్షణ మొకటెచాలు!
    ఆ నిమిషం దొరకడమే
    అరుదుకదా జీవితాన!!
    జీవితాన తెరలు దించి
    ఎటకో నేనేగు వేళ
    అందని పిలుపేదో విని    
    చిందిన కన్నీరొక్కటి చాలు!!!"
    
    అన్నారు భాయ్ జాన్. నేను వ్రాసిన 'చిందిన కన్నీరు' అనే వ్యాసం వారి సంతాప సభలో అందరి కన్నీరు చిందింపచేసింది.
    
    భాయ్ జాన్ నాకు వప్పగించిన 'భాగ్యనగరం' అచ్చు వేయించి ప్రచురించాను. అందులో "చిరంజీవి! చిరంజీవి!! చిరంజీవ!!!" అనే వ్యాసం చేర్చాను.
    
    బాధ ఏమీ అంటే "చిల్లర దేవుళ్ళు" నాటకం విషయం చెప్పుకోవడానికి భాయ్ జాన్ - నార్ల చిరంజీవి అందుబాటులో లేరు!
    
    ఒకనాడు ఆత్రేయగారితో గోష్ఠి "చిల్లర దేవుళ్ళు" చర్చ అన్నగారు పగలబడి నవ్వుతారు. ఆత్రేయ నవ్వితే వాళ్ళంతా నవ్వుతుంది. ఆనాటి గోష్ఠిలో హరి - చిరంజీవి కూడా ఉన్నట్లు గుర్తు. అన్నగారు నవ్వారు. 'రంగన్నా! అందరూ చిరంజీవి కూడా ఉన్నట్లు గుర్తు. అన్నగారు నవ్వారు. 'రంగన్నా! అందరూ బాగుందంటే అసూయగా ఉందోయ్! బాగు లేదందామంటే పాయంట్లు లేవు' అన్నారు. "అన్నగారూ! చిల్లర దేవుళ్ళు లోపాలు నేను చెపుతా వ్రాయండి" అన్నాను. "నలుగురూ తంతారు" అని మళ్ళీ నవ్వి "సినిమా హక్కులు ఇవ్వరాదూ! సినీమా తీస్తా" అని మళ్ళీ నవ్వి. "రంగన్నా! అన్నను మించిన తమ్ముడివి అనిపించుకున్నావు. సరే, ఒక ఉర్దూ కవిత విసురు" అన్నారు సిగరెట్టు వెలిగిస్తూ.
            
    షేర్ భీ ఎక్ షరాబ్ హై అయ్ దిల్    
    హుష్యారి ఉస్ కీ మస్తీ హై అయ్ దిల్
    (పద్మమ్ము కూడ ఒక మద్యమ్ముసుమ్ము
    చురుకుదనమ్ము దాని మైకమ్ము నమ్ము)
    
    తెలుగు అనువాదం సహితంగా వినిపించాను.
    
    సంచలన చిత్రం:
    
    అవి నాకు అకాడమీ అవార్డు వచ్చిన రోజులు. అభిమానులు అనడం నాకు ఇష్టం ఉండదు - మిత్రులు ఎందరో ఎన్నో విధాల సత్కరించారు. సన్మానించారు. పార్టీలు ఇచ్చారు. విరామం లేకుండా చేశారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.