Home » vaddera chandidas » Anukshanikam 2
మంటలు జ్వాలలుగా పైకెగిసిపోతున్నాయి. వాటివంక చూస్తున్న అనంత్ రెడ్డి కళ్ళు పొడిగా అవుతున్నాయి.
మంటలు జ్వాలలుగా పైకెగసిపోతున్నాయి. చూస్తూ నుంచున్నాడు శ్రీపతి. యెన్నడూ కంటతదే యెరగని అతనికళ్ళు చిత్లినట్లుగా - అతని బుగ్గల మీదకి కన్నీటి ధారలు.....దేనికి? ఆమె అతనికేమౌతుంది!
అదేరోజు రాత్రికి అనంత్ రెడ్డిని మధ్యాహ్నానికి వొచ్చిన అతని తండ్రి వాళ్ళ వూరు తీసుకెళ్ళాడు. అనంత్ రెడ్డి, తన వెంట - గిటారు, ఆమె రికార్డ్ చేయించుకున్న కేసెట్లూ, ఆమె ఫోటోలు తీసుకొచ్చాడు.
మాట్లాడకుండా పడుకుంటాడు రోజంతా. పలకరించినా పలకడు. తలతోటో చేత్తోటో అవుననో కాదనో మరేదో సూచిస్తాడు. యెప్పుడన్నా వొకటి రెండు మాటలు. ఆమె ఫోటో యెదురుగా కూచుని చూస్తూ కేసెట్స్ పెట్టుకుని వింటూ కూచుంటాడు. ముఖ్యంగా బాలమురళి గావించిన "త్రిపుర సుందరీ నీ దివ్యరూపమును జూడ దనకు దొరికెనమ్మా - మందగమన నీ కటాక్ష బలమో - ముందటి పూజాఫలమో" మళ్ళీ మళ్ళీ రివైండ్ చేస్తూ వింటూనే వుండిపోతున్నాడు. అది, బాలమురళికృష్ణ గానించినదని అతనికి ప్రత్యేకం తెలియదు. అతను వింటున్నది ఆ సంగీతంలోని ఆపాట.
అదివరకు, స్వప్నరాగలీన, కేసెట్స్ పెట్టుకుని వింటున్నప్పుడు తను విని వుంటాడుగానీ ప్రత్యేకం గమనించలేదు. ఐతే స్వప్నరాగలీన; ఆ పాటకోసం కాక, ఆ పాటలోని సంగీతం కోసం- ముఖ్యంగా, బాలమురళి గావించిన ఆ రీతికి -ఆ రికార్డు టేప్ లోకి యెక్కించింది.
పగలూ రాత్రీ-అలా కూచుని అలా వింటూ - యెప్పుడో వో కునుకు ....భోజనం, తింటే నాలుగు మెతుకులు.
అలా వారం రోజులు గడిచాయి.
వో రోజు సాయంత్రం గిటార్ తీసి వాయిస్తున్నాడు. అందులో లీనమై వాయిస్తున్నాడు. వాయిస్తూ వాయిస్తూ సడన్ గా ఆగిపోయి -గిటార్ విసిరికొట్టాడు గుమ్మానికెళ్ళి పగిలింది. విరిగింది. వెంటనే గట్టిగా అరిచాడు. తలుపుల మీద దబదబా బాదుతున్నాడు కొట్టుకుంటున్నాడు, ఛాతీమీద కొట్టు కుంటున్నాడు, పొత్తి కడుపుమీద కొట్టుకుంటున్నాడు.
విని- తండ్రీవాళ్ళూ వొచ్చి పట్టుకుని పడుకోబెట్టారు. అరగంటకి నిద్రపోయాడు.
మానంగా స్తబ్దుగా వుంటాడు. వుండుండి అలా కొట్టుకోవటం మొదలెడతాడు. గట్టిగా అరవటం. వేటినన్నా విరగగొట్టడం. వొక్కోసారి యెదుటి వ్యక్తిని కొడతాడు.
బెంగుళూరులో చూపెట్టారు. చివరికి మద్రాసు కీల్సాక్ లో చేర్పించారు.
133
"యీ పొద్దు పేపర్ చూస్తివా బ్రహ్మానందరెడ్డి యిందిరా కాంగ్రెస్ లో చేరిండు, సిగ్గులే" అన్నాడు వినాయకరావు. వినాయకరావు జీడివేదపారాయణ తమ్ముడు. యెం యే లో చేరాడు యీ సంవత్సరం.
"వాళ్ళందరూ మోఖా చూస్కొని చెయ్యిచ్చెటోళ్ళే చరణ్ సింగ్ తోటి కల్సి మినిస్టరయ్యి వాన్ని ప్రైమ్ మినిస్టర్ని చెయ్యలే" అన్నాడు నిఖిలానందభారతి, తెలుగులో నిఖిలానందభారతి దయానందభారతి తమ్ముడు లా లో చేరాడు.
"వాడు చరణ్ అందరికంటే బిట్రేయర్ ట్రెయిటర్. జనతాని చీల్చినది వాడేగద!" అన్నాడు యింద్రసేనారెడ్డి. యింద్రసేనారెడ్డి గోవర్ధన్ రెడ్డి తమ్ముడు. యం.యె లో చేరాడు.
"వానికంటే గొప్పోడు బాబూ జగ్ జీవన్ కా సాలా. వాడు మంచిగుంటే చరణ్ సింగ్ యెట్లా మినిస్ట్రీ ఫాం చేసును." అన్నాడు వినాయక రావు.
"అది రాష్ట్రపతి మేజిక్. యిందిరనడిగిండు. ఆమె సపోర్టు లేదు. జగ్ జీవన్ ని అడిగిండు. వాని సపోర్టు లేదు. జన తా సపోర్టు లేదు. యింకెవరి సపోర్టు వున్నది? చవాన్ బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ సపోర్టు. అంతకే మెజారిటీ యెట్లొస్తది? నిన్ను ప్రైమ్ మినిస్టర్ని చేస్త-ఆ తర్వాత పార్లమెంట్ లో బలం ప్రూవ్ చేస్కో అంటడా రాష్ట్రపతి! వాడు రాష్ట్రపతేనా! చరణ్ సాలా సంజీవ్ రెడ్డి మామకు పదిర్ వయ్ లక్షలైన యిచ్చి వుంటడు. లక్షల పైకం మింగేటప్పటికి-అంతరాత్మ లోపలికెళ్ళి కూతపెట్టింది. అదెట్ల చెప్తే అలా చేస్తున్న-అని వొర్లుతున్నడు. ధూసిగ్గులే!" అన్నాడు యింద్రసేనారెడ్డి.
"లోపలి రెల్లి అంతరాత్మ ఆస్మా కూత అరువైతొమ్మిదిల యింది రమ్మ కడుపుల ళురూ అయ్యెనని మా అన్న చెప్పిండు" అన్నాడు నిఖిలా నంద భారతి.
"వాడు కరుణాకర్ రెడ్డో వొస్తున్నడు అటునుండి. వూర్కో అన్నాడు వినాయకరావు.
"ఢర్ నే కా క్యా? వూ ఖాడ్ తె క్యా!" అన్నాడు నిఖిలానంద భారతి.
"చలో పోదాం" అన్నాడు యింద్రసేనారెడ్డి.
అటునుంచి వొస్తున్నారు కాకాని లెనిన్ బాబు, కొండా కరుణాకర్ రెడ్డి.
"హలో మిత్రోఁ!" సంకర ధ్వనింపు పలకరింపుగా అన్నాడు కరుణాకర్ రెడ్డి వాళ్ళని చూసి. కరుణాకర్ రెడ్డి మోహన్ రెడ్డి తమ్ముడు. యీసంవత్సరం యేమ్మెసీలో చేరాడు.
వాళ్ళు బయటికి నడిచారు.
లెనిన్ బాబు, కరుణాకర్ రెడ్డి, కుర్చీలు జరుపుకుని కూచున్నారు.
"యీ నా కొడుకులు గిలగిల్లాడి చస్తున్నారు. నాలుగు పార్టీల జనతా యెనిమిది చక్కలుగా పగిలింది!" అన్నాడు లెనిన్ బాబు సంతోషంగా. లెనిన్ బాబు విజయవాడలో బియ్యే చదివి, యీ సంవత్సరం యిక్కడ యెం. యె. సోషియాలజీలో చేరాడు.
"లా కాలేజీలోనూ యిక్కడా మనమే గెలిపిస్తమని- యేదొక ప్రెటెక్ట్స్ తోటి స్ట్రైక్ చెయ్యాలని చూస్తున్నారు వెధవలు" అన్నాడు కరుణా కర్ రెడ్డి.
"వొచ్చే జనరల్ ఎలక్షన్ల తర్వాత వీళ్ళనో పట్టుపట్టాలి" అన్నాడు లెనిన్ బాబు.
వడ్డాది రామాచారి వొచ్చి వీళ్ళని చూసి, "హలో అంటూ వొచ్చి కూచ్భున్నాడు. అతను యెం.యే పొలిటికల్ సైన్స్ లో చేరాడు.
"యేం రామాచారి యేమిటి విశేషాలు?" అన్నాడు కరుణాకర్ రెడ్డి.
"చాయ్ తాగుదామని వచ్చాను" అన్నాడు రామాచారి.
"అది వొక విశేషమేనా? తాగు చాయ్ కాకపోతే వో పావు బాటిల్ బ్రాందీ తాగు. వొంటికి మంచిది-మందు కదా!" అని నవ్వి, "మీ క్లాస్ మేట్ ఆ నేతి శ్రీరంజని యేమంటోంది? నెయ్యి నీకు చాలా యిష్టం అనుకుంటాను!" అన్నాడు లెనిన్ బాబు.



