Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
పూజ్యులు - పెద్దలు దేవులపల్లి రామానుజరావుగారు "నిన్నటి యదార్ధము - నేటి చరిత్ర" గా 'చిల్లర దేవుళ్ళు'కు ఒక సుదీర్ఘమైన తొలిపలుకు వ్రాస్తూ 'ఈ నవలలో కేవలము అమానుషమైన పవర్తనేకాక హృదయాహ్లాదకరమైన విషయములు కూడ ఎన్నో ఉన్నవి' అన్నారు.
ఇది Coincidence సహపరిణామం కావచ్చు - 1949లో మా అన్నయ్య దాశరథి తొలి కావ్యసంకలనం 'అగ్నిధార'కు రామానుజరావుగారే తొలిపలుకులు సమకూర్చారు. వారు తరచుగా 'దాశరథి సోదరుల తొలి పుస్తకములకు నేనే తొలి పలుకు సమకూర్చినాను' అని చెపుతుండేవారు. నేను నా 'తొలినవలకు' అని సవరించాల్సి వచ్చేది.
ఎమెస్కోవారు బాపూ ముఖచిత్రంతో అందంగా "చిల్లర దేవుళ్ళు" నవల పుస్తకరూపంలో 1969 డిసెంబరులో ప్రచురించారు. బాపూగారు లోనవేసిన ఒక కంటి కన్నీటిచుక్క రాలనున్న 'వనజ' బొమ్మ కలచివేస్తుంది. వెల రెండు రూపాయలు మాత్రమే కావడంవల్ల పుస్తకం బహుజనాదరణ పొందింది. పత్రికల్లో చాల చక్కని సమీక్షలు వచ్చాయి. పుస్తకాన్ని గురించి ప్రత్యేక వ్యాసాలూ వచ్చాయి. వాటిలో 'సరికొత్త ఆవిష్క్రియ' అన్న ముకురాల రామారెడ్డిగారి వ్యాసం మనసులను కదిలించేట్లుంది.
నవల చదివిన సోదరుడు సి. నారాయణరెడ్డిగారి లేఖ -
"చిల్లరదేవుళ్ళు" ఒక్క బిగిన చదివేశాను. అది నవల కాదు. యదార్ధ జీవితాల రసవత్ చిత్రణం. వాస్తవికత పేరుతో బొమ్మలు తీయడంతోనే ఊరుకోక ఒక సమగ్ర జీవితానికే బొమ్మగీసి చూపావు నీవు ఆ పాత్రలు, ఆ సన్నివేశాలూ, ఆ భిన్న మనస్తత్వాలూ, అన్నిటికీ పూసల్లో దారంలాగా ఉన్న ఆ తెలంగాణా మాండలిక శైలి తెలుగు నవలారంగంలో నీ రచన మైలురాయి."
అయితే సమీక్షకులు చాలామందికి ముగింపులో సారంగపాణి రామారెడ్డిగారి అల్లుడు కావడం నచ్చలేదు. అది సినీమాటిక్ గా ఉందని విమర్శించారు. ప్రచురణకు ముందే భాయ్ జాన్ - చంద్రంగారు - ఎమెస్కో సంపాదకులు వెలిబుచ్చారు. అందుకు నా కారణాలు తెలియపరచాను. అప్పుడు వారు సమాధాన పడ్డారు. మార్పు చేయమని కోరలేదు. ఈ మధ్య కొందరు అసలు నవలను వదిలి, ముగింపును పట్టుకొని - నేను కులాంతర వివాహాలు వ్యతిరేకిని అనుకుంటున్నారు. అందువలన వివరణ:
1. నావి కథానవలలు కావు. ప్రజాజీవన చిత్రణ వాటి ముఖ్య ఉద్దేశం. కథ మాధ్యమం మాత్రమే!
2. 'చిల్లర దేవుళ్ళు' 1938కి పూర్వపు తెలంగాణ ప్రజాజీవిత చిత్రణ. అప్పటికి తెలంగాణలో సంఘసంస్కరణ ఉద్యమం లేదు. కులాంతర వివాహాల ప్రసక్తి లేదు. ఆలాంటప్పుడు వాటిని చేర్చడం వాస్తవానికి విరుద్దం అవుతుంది.
3. నవల మొత్తంలో సారంగపాణి మనసున్న, సంస్కారం గల పాత్ర అతడు నేటి ఆంద్రప్రాంతం అయిన బ్రిటిషిండియా నుంచి వస్తాడు. పెరిగిన వాతావరణాన్ని బట్టి సంస్కారం కలుగుతుంది అని చెప్పడానికి అతను తెలంగాణంవాడు కావడం అవసరం.
4. మంజరి పాణిని మనసున్నవానిగా ప్రేమించింది. ప్రేమకు కుల, మతాల ప్రసక్తి లేదని నిరూపించింది అతడు ఆమెకు బావకావడం యాదృచ్చికం.
5. 'చిల్లర దేవుళ్ళు' ప్రేమకథ కాదు పెళ్ళి 'చిల్లర దేవుళ్ళు' నవల ప్రధానాంశం కాదు.
6. నేను మానవతా వాదిని నాకు కుల, మత, ప్రాంత, దేశ సరిహద్దులమీద
సహితం నమ్మకం లేదు. ఇది నా రచనల్లో అవగతం అవుతుంది.
"చిల్లర దేవుళ్ళు" ఆ రోజుల్లో సాహిత్యవర్గాల్లో చర్చనీయాంశం అయింది. నోరి నరసింహశాస్తిగారు మా అన్నయ్యతో 'మీ తమ్ముడు గొప్ప నవల వ్రాశాడు. అకాడమీ అవార్డు దానికి అందకుండా అనేకమంది అడ్డంకులు తెస్తున్నారు. మీ తమ్మునికి అన్యాయం జరుగుతుందని బాధగా ఉంది' అన్నారట. "మా తమ్ముడు అవార్డులు, గివార్డులకు బాధపడేవాడు కాడు. మీరు బాధ మానండి" అన్నాట్ట మా అన్నయ్య వారు చెపితే నాకు తెలిసింది.
ఒక సాహిత్యసభలో బోయి భీమన్నగారు కనిపించారు. "రంగాచార్లూ! తెలుగువాడవై చెడ్డావయ్యా! 'చిల్లర దేవుళ్ళు' నోబెల్ ప్రైజు రావలసిన నవల" అన్నారు. ఇంతలో మా అన్నయ్య వచ్చి 'మా తమ్ముడు' అని పరిచయం చేశారు. అందుకు భీమన్నగారు "దాశరథీ! మీ తమ్ముణ్ణి నీవు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి నాలుగు రోజులుపోతే నిన్ను రంగాచార్యుల అన్నగా పరిచయం చేయాల్సి వస్తుంది. అతను అంతగా ఎదుగుతున్నాడు" అన్నారు.
1970 డిసెంబరు 3 వ తేదీన ఆకాశవాణి తెలుగు వార్తల్లో "చిల్లర దేవుళ్ళు" కు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమి బహుమతి ప్రకటించినట్లు వచ్చింది. అప్పుడు వానమామలై వరదాచార్యులవారు మా ఇంట్లో ఉన్నారు. మేమందరం ఎంతో సంతోషించాం.
ఆ రోజుల్లో అకాడమీ అవార్డు రావడం సామాన్యం కాదు. ఆకాశవాణి ఢిల్లీ నుంచి వచ్చే ఆంగ్లవార్తల సహితంగా అన్నింటిలో ప్రసారం చేసింది. పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అనేకమంది అభివందన సందేశాలు పంపారు.
ఆ సంవత్సరం అనేకమంది పెద్దలతోపాటు నాకు బహుమతి రావడం అదృష్టం గర్వకారణం 1970-71 లో కథానికకు మలలది రామకృష్ణశాస్త్రిగారికి, 2. సాహిత్య విమర్శకు తిరుమల రామచంద్రగారికి, 3. కవితకు కుందుర్తి ఆంజనేయులుగారికి 4. నాటకంకు మోదుకూరి జాన్సన్ గారికి లభించాయి.
చిల్లరదేవుళ్ళు బహుమతి ప్రత్యేకతలు:
1. రచయిత వయసులో చిన్న.
2. తొలి నవలకే బహుమతి.
3. ప్రచురించిన సంవత్సరమే బహుమతి.
అవార్డు రావడంతో భాయ్ జాన్ పొంగిపోయారు. ఉప్పొంగిపోయారు. ఆ రాత్రి మంచి పార్టీ ఏర్పాటు చేశారు. మిత్రులు ఎస్. బి. గిరి, నరసింహన్ తోపాటు అనేకమంది మితరులు పాల్గొన్నారు. ఆనందపు గడియలు రెక్కలు వచ్చి ఎగిరాయి. అర్దరాత్రి అయింది. తేదీ మారింది తెలియలేదు.
31 జనవరి 1971 ఆదివారం సాయంత్రం ఆంద్ర సారస్వత పరిషత్తు ప్రాంగణంలో బహుమాన ప్రధాన సభ జరిగింది. వేదికమీద ఆ సంవత్సరపు విశిష్ఠసభత్వాలు అందుకున్న సాహితీపితామహులు 1. త్రిపూరారిభట్ల వీరరాఘవస్వామి, 2. డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య, 3. దువ్వూరి వెంకటరమణశాస్త్రి, 4. వానమామలై వరదాచార్యులవార్లు బహుమతులు అందుకోవలసిన మేము ఆసీనులం అయినాం. అకాడమీ అధ్యక్షులు - ఉత్తరప్రదేశ్ గవర్నరు బెజవాడ గోపాలరెడ్డిగారు బహుమాన ప్రధానం చేశారు.
నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ 'ఈ గౌరవం నాదికాదు తెలంగాణ జనజీవితానిది' అన్నాను. తెలంగాణం సాహిత్యానికి సారవంతం అనీ, రచయితలు ఆ జీవితాన్ని భద్రపరచాలనీ విన్నవించాను.
సభ ముగిసింది. అనేకమంది మితుర్లు కౌగలించుకున్నారు. అభినందించారు. నాటి ఆత్మీయత అక్షరానికి అందదు.
అవార్డు వచ్చింది. ఆ సందర్భంగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఆకాశవాణి వారు. అదే నేను ఆకాశవాణి స్టూడియోలో తొలిసారి అడుగుపెట్టడం. దివి వెంకట్రామయ్యగారు యువకులు వారు ఇంటర్వ్యూ చేశారు. ఇంకా రికార్డింగ్ మొదలుకాలేదు. వెంకటరామయ్యగారు 'చిల్లర దేవుళ్ళు' గురించి నిర్విరామంగా మాట్లాడారు. నా నవల నచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాను. వారికి చురుకు కోపం వచ్చింది. "ఇది మీ నవలేమిటి? మా అందరి నవల" అన్నారు. నా నవల మీద అంతటి అభిమానాన్ని తట్టుకోలేకపోయాను. గొంతు పూడింది! కనులు చెమ్మగిల్లాయి!! తరవాత సర్దుకున్నాను. సుదీర్ఘ ఇంటర్వ్యూ రికార్డయింది. తెలంగాణను గురించి - నవలను గురించి ఆసక్తి కలిగించే అనేక ప్రశ్నలు అడిగారు. వనజ పాత్రను మలచడం గురించి అడిగారు.
నా చిన్నతనంలో చినగూడూరులో - మా యింటి ప్రక్కన అమృతపాణి ఉండేది. ఆమె కూతురు నాతో ఆడుకునేది. ఆమె ఆటకు రావడం చప్పున మానేసింది. కారణం రజస్వల కావడం. తరవాత ఒకనాడు గడీనుంచి మనుషులు వచ్చారు - ఆమెను తీసికెళ్ళడానికి ఆమె నిరాకరించింది, ఏడ్చింది, మొత్తుకున్నది, దాగింది. అయినా సాగలేదు. గడీ మనుషులు - ఆమెను, గింజుకుంటుండగా పట్టుకుపోయారు. అంత బాల్యంలోనూ నాకు అదెందుకో అమానుషం అనిపించింది. ఆమె నా మనసులో నిలిచిపోయింది. నా మనసునుంచి వనజగా అవతరించింది! ఆమెమీద నాకు ఉండిన అపార సానుభూతి వనజను అంతటి అంతస్తుకు పెంచేటట్లు చేసింది.
తెలంగాణ పరిస్థితులు వివరించిన ఆ రేడియో ఇంటర్వ్యూకు ఎంతో స్పందన వచ్చింది. అనేక మనసులు కరిగాయి! అనేక ఉత్తరాలు వచ్చాయి!! కలకాలపు పరిచయం ఉన్నా భాయ్ జాన్ కంట తడిపెట్టారు!!!
ఆకాశవాణి వారు 'చిల్లర దేవుళ్ళు' నాటకంగా ప్రసారం చేస్తామన్నారు. తెలంగాణ మాండలికపు తొలినాటకం అది! నవలను నాటకీకరించి ఇచ్చాను. ఈ విషయంలో 'హరి' నాకు కొంత సహకరించారు. శారదా శ్రీనివాసన్ నాటకం నిర్వహిస్తున్నారు. వారికి మాండలికం కొత్త. నేను పూర్తి సహకారం అందించాను.





