Home » vaddera chandidas » Anukshanikam 2
"ఆయన, ఆయన మిసెస్ బజారు వెళ్ళారట రాగానే చెప్పి పంపుతా మన్నారు. వొక పనిమనిషి వెంటనే బయల్దేరి వొస్తున్నట్లు చెప్పారు" అని ఫోనుచేసి వొచ్చిన నర్స్ చెప్పింది.
వెల్లకిలా పడుకుని పైకి చూస్తూవున్నాడు. అతని కళ్ళ ముందుయేమీ కనిపించటంలేదు. కళ్ళలోంచి నీళ్ళు కారుతూనే వున్నాయి.
అరగంట-
పడుకునే శ్రీపతి చుట్టూ చెయ్యి తిప్పి అతని ముఖం ఆనించాడు అనంత్ రెడ్డి. అతని కళ్ళవెంట నీళ్ళు కారుతూనే వున్నాయి.
శ్రీపతి ఆమెవైపుకి చూడకుండా ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడుతున్నాడు.
రెండు సైడు సీట్ల మధ్య ఖాళీలో నిలువుగా కింద పడుకోబెట్టబోతూంటే-సీటు మీద పడుకోబెట్టమన్నాడు శ్రీపతి.
అనంత్ రెడ్డి కింద కూచుని ఆమె మీద ముఖం ఆనించాడు. అతని కన్నీళ్ళతో చీర తుడుస్తోంది. శ్రీపతి రెండో పక్క సీట్లో కూచుని బయటికి రాలేదు.
అంబులన్స్ బేగంపేటలో అనంత్ రెడ్డి యింటిముందు ఆగింది.
యింట్లో పనిపిల్ల.
చూసి, పక్కవాళ్ళు ఐదారుగురు వొచ్చారు.
కింద యెండుగడ్డి వేసి పడుకోబెట్టాలంటే - శ్రీపతి, పడకగది మంచంమీద పడుకోబెట్టమన్నాడు.
వాళ్ళు వెళ్ళిపోయారు అదోలాగా చూసి
అనంత్ రెడ్డి వున్నట్లుండి చటుక్కున ఆమెను చేతులతోయెత్తి లోన తీసికెళ్ళి మంచంమీద పడుకోబెట్టి, మంచం అంచుమీద కూచుని వొంగి తల దిండుమీద ఆనించుకున్నాడు. కన్నీళ్ళ తో దిండు తడిసిపోయింది.
శ్రీపతి టెలిఫోన్ దగ్గిర కూచుని ఫోన్ నెంబర్లు రాసిన చిన్న పుస్తకం తీసి ఫోన్లు చేస్తున్నాడు.
అంతలో నాగిరెడ్డి దంపతులు వొచ్చారు. ఆస్పత్రికి వెడితే తీసుకెళ్ళి నట్లు తెలిసి, వాళ్ళింటికెడితే అక్కడికి తీసుకురాలేదని తెలిసి యిటు వొచ్చారు.
యెందరికో ఫోన్లు చెయ్యలేదు - ముఖ్యమైన కొద్దిమందికే.
తండ్రి శంకరరెడ్డి పినతండ్రి హరనాధరెడ్డి. ఆ యిళ్ళలో ఆడవాళ్ళు మరికొందరు. అప్పటికప్పుడు కార్లలో బయల్దేరివొచ్చారు తెల్లవారు ఝాముకే.
స్వప్నరాగలీనని, మంచంమీద వెల్లకిలా పాపిట మొదట్లో కుంకుమ, చెమర్చిన నెత్తురు విస్తరించి యెండిన నెత్తుటి చారికలా వుంది. నుదుట కుంకుమ, అప్పుడే చెమర్చిన నెత్తుటి బిందువు బింబంలా విస్తరించి మెరుస్తున్నట్లుగా వుంది. నలిగిపోయిన ఆవపిండి రంగు చీర - ఆ రంగులో చిక్కురొక్కురు యెర్రరంగు గీతలు.
స్వప్నరాగలీన, మౌనశిలా రాగలీనగా పరుండివుంటే; ఆమెకి ఆ పేరు పెట్టిన హరనాధరెడ్డి వెర్రిచూపులు చూస్తూ నుంచున్నాడు.
సెలయేటి జాలులోని యిసకలో కొట్టుకున్న గులకరాళ్ళలోంచి ఆమె గొంతు చిర్నవ్వుతోంది- మౌనంగా.
చీకటి వొడిలో కేరింతలాడే వెలుగు పాపలా ఆమెకళ్ళు, వాలిన రెప్పల కింది నుంచి కాటుకలా మెరుస్తున్నాయి.
తూర్పు సముద్రపుటలలోంచి లేచి, పడమటి పర్వత పానుపుల మీదికి జారి పరున్న సూర్యబింబంలా పవళించి వుంది.
విషయం తెలియకపోతే - ఆమె ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు దీర్ఘనిద్ర.
వొంటిన నగలేమీ లేవు, నల్లపూసల సూత్రాలు తప్ప.
బ్రాహ్మలు పంచాంగం చూస్తున్నారు, దహన సంస్కారానికి. శనివారం వుదయం బహుళ పాడ్యమి రేవతీ నక్షత్రం. పనికొచ్చినా పనికిరాక పోయినా రోజంతా ఘడియలు తప్పవు.
వాళ్ళకి అభ్యంతరం లేకపోతే - ఆమెని నేలమీద పెట్టవొద్దనీ కర్రలతో పాడె కట్టవొద్దనీ స్మశానంలో కాకుండా పచ్చికబయలులో దహనం సంస్కారం జరిపించామనీ శ్రీపతి అన్నాడు.
ఆ మాటలు వింటూనే హరనాధరెడ్డి కళ్ళు మెరిశాయి. అన్న శంకర రెడ్డికి చెబుతూంటే వుత్తరీయంతో కళ్ళు వొత్తుకుంటూ, "మీ యిష్టం" అన్నాడు చిన్నగా. బ్రాహ్మలకి చెబితే- బాగా గిట్టుబాటు అవుతుందని పర్లేదన్నారు. అవసరాన్నిబట్టి, శాస్త్రంలో దేనికైనా సదుపాయం చూడగలవాళ్ళు.
వున్నట్లుండి అనంతరెడ్డి బయటికి నడిచి వొక కారులో కూర్చున్నాడు అర్ధంకాక అతని వొంక చూస్తున్న వాళ్ళతో, కారు పోనిమ్మన్నట్లుగా చేత్తో సూచించాడు. నాగిరెడ్డి, వాళ్ళ డ్రైవర్ని కూచోమన్నాడు మరొకతనూ కూచున్నాడు.
కారు సాగిపోతోంది.
"మోజంజాహి మార్కెట్ కి" అన్నాడు అనంత్ రెడ్డి.
మార్కెట్లో పువ్వులదుకాణాల్లో వున్న పువ్వులన్నీ వెనకగా బుట్టల్లో స్టాకువున్న పువ్వులన్నీ కారులో పెట్టించాడు అనంత్ రెడ్డి.
కారు యింటికి తిరిగివొచ్చింది. బుట్టలు లోనకి తెమ్మని చేత్తో సూచించాడు.
రకరకాల పువ్వులు దోసిలితో తీసి ఆమె మీద పోస్తున్నాడు అనంత్ రెడ్డి. పువ్వులతో పాటు కళ్ళలోంచి నీళ్ళు వరుతున్నాయి, రాలి.
శ్రీపతి గంధం చక్కల చిత్రికపొట్టు తెప్పించాడు.
గంటసేపు.
కార్లు బయల్దేరాయి. ఆమె తండ్రి, పింతండ్రులిద్దరు, మరోనలుగురు శ్రీపతి. బ్రాహ్మలు.
అనంత్ రెడ్డి కూర్చోబోతూ, ఆగి-లోనకి వెళ్ళి "విశ్వలీన" చిత్ర లేఖనం చంకన పెట్టుకొచ్చాడు, దానికున్న తెరతోపాటు.
వూరిబయట పచ్చికబయలు.
అనంత్ రెడ్డి ఆమెను చేతులమీద యెత్తుకుని నడుస్తున్నాడు. కన్నీళ్ళు రాలి ఆమె మీద పడుతున్నాయి,
పచ్చికమీద శ్రీపతి పేర్పించిన గంధపు చిత్రికపొట్టుమీద-ఆమెను వెల్లకిలా పడుకోబెట్టాడు అనంత్ రెడ్డి. "విశ్వలీన" చిత్రలేఖనం తీసుకొచ్చి ఆమె పక్షం మీద బోర్లా పెట్టారు.
చితి పేర్చుకున్నారు.
యెటో చూస్తూ నిలుచున్నాడు శ్రీపతి.
బ్రాహ్మలు అనంత్ రెడ్డి చేత తలకొరివి పెట్టించాడు.
ఐదు నిమిషాలు.



