Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    దేవులపల్లి రామానుజరావుగారు తెలంగాణలో తెలుగుకోసం - ఆంద్ర సారస్వత పరిషత్తు ద్వారా అనంతమైన సేవ చేశారు. వారు అప్పుడు సాహిత్య అకాడమీ కార్యదర్శి వారికి మా కుటుంబం విషయంలో అభిమానము - ఆప్యాయతా ఉన్నాయి. వారు నా వ్రాతప్రతి అందుకున్నారు. 'కవిగా స్థిరపడుదువు అనుకున్నాను. నవల వ్రాసినావు. మంచి పనిచేసినావు' అని చదవడానికి తీసుకున్నారు.
    
    తఃరువాత వారికోసం బొగ్గులకుంటలోని 'ఆంద్రసారస్వత పరిషత్తు' కార్యాలయానికి వెళ్ళాను. అప్పుడు విప్లవమూర్తి దేవులపల్లి వెంకటేశ్వరరావుగారు వారిముందు కూర్చుని ఉన్నారు. అతి సామాన్యంగా ఉన్నారు. వారిని దర్శించడం నా భాగ్యంగా భావించాను.
    
    రామానుజరావుగారు నన్ను చూచారు. "రావయ్యా రంగాచార్యులూ! నీవు నిస్సందేహముగా గొప్ప నవల వ్రాసినావు ఇది తెలంగాణమునకే కాదు, ఆంద్రజాతికే తలమానికము" అని అత్యంత ఉత్సాహం కనబరచారు. వారు అతిరేకంలో కుర్చీలో ఊగారు. బల్లమీద వ్రేళ్ళు ఆడించారు. "ఇదిగో, రంగాచార్యులు తెలంగాణమునకు మీ అందరికన్న ఎక్కువ సేవ చేసినాడు" అని వెంకటేశ్వరరావుగారితో అన్నారు.
    
    రామానుజరావుగారి మాటలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గుండె నిండి పగిలేట్లుంది. అలాగా ఉండగా వెంకటేశ్వరరావుగారు నా వీపు నిమిరారు 'రామానుజుడు తప్పుచెప్పడు. నిజంగా గొప్పనవల వ్రాసి ఉంటావు' అన్నారు. అప్పుడు న ఆకనులు చెమ్మగిల్లాయి. కన్నీరు బయటపడే దశలో నేను బయటపడ్డాను.
    
    పక్కనున్న హోటలుకు వెళ్ళాను. చాయ్ - టీ - త్రాగాను వెంట వెంట రెండు సిగరెట్లు కాల్చాను ఆఫీసుకు వెళ్ళలేదు! పంజగుట్టలో పడ్డాను. భాయ్ జాన్ జరిగింది విన్నారు. పొంగిపోయారు. నన్ను కౌగలించుకున్నారు. 'ఇది మనం గర్వించదగిన విషయం - దావత్ హోనా' అని "చూశావా నీ మరిది గొప్ప నవల రాశాడు. ఏం వండిపెడతావో పెట్టు" అని వదినతో అన్నారు.
    
    నాగరత్నమ్మ వదిన 'వండనలయదు వేవురు వచ్చిరేని' అని, ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కొత్త వంటకం!
    
    ఆరోజు మరిన్ని వంటకాలు చేసింది. పట్టపగలే పార్టీ! ముందు  విస్కీ - వంటకాలు, నవలమీద నిరంతర చర్చ! అదొక ఊపు!! అది మహదానందం!!!
    
    జహాఁకొ మారా జిగర్ కె గజలోఁనే
    ఔర్ జిగర్ కొ మారా షరాబ్ నె
    
    'జిగర్' గజళ్ళు లోకాన్ని కొట్టేశాయి. మరి మద్యం జిగర్ ను కొట్టేసింది! ('జిగర్' గజల్ చక్రవర్తి)
    
    పీనా న మనాహై న పిలానాహి మనాహై
    పీనె కె బాద్ హోష్ మె ఆనాహి మనాహై
    
    (త్రాగడం తప్పుకాదు త్రాగించడం తప్పుకాదు. త్రాగింతరువాత తెలివితో ఉండడం మాత్రం తప్పు.)
    
    షీషామస్త్, బాదాయ్ మస్తీ, హుస్న్ మస్త్, ఇష్ట్ మస్త్
    ఆజ్ పీనే కా మజా పీకె బహక్ జానేమైహై
    
    (మధువు మత్తు, మబ్బులు మత్తు, అందపు మత్తు, వలపు మత్తు, ఇవాళ తాగడంలో మజా తాగిపడిపోవడంలో ఉంది.)
    
    అదిగో, అలాంటి మత్తులో భాయ్ జాన్ "చిల్లర దేవుళ్ళు" అన్నారు అది నా తొలినవలకు నామకరణ మహోత్సవం!
    
    ఆ ఊపులో చిరంజీవి అనేక పేర్లు సూచించారు, వ్రాశారు, కొట్టివేశారు. "చిన్న చిన్న రాళ్ళు - చిల్లరదేవుళ్ళు" పల్నాటిని గురించిన శ్రీనాథుని పద్యపాదం. "చిల్లరదేవుళ్ళు" మా ఉభయులకూ - నవలకు - సార్ధకనామం అనిపించింది. స్థిరపరచాం. తరువాత దేవులపల్లి వారి సహితంగా అందరూ "చిల్లరదేవుళ్ళు" పేరు ఆమోదించారు.
    
    పేరు పెట్టడాన్ని గురించి ఏ.జి. గార్డనర్ ఆంగ్లంలో ఒక చక్కని వ్యాసం వ్రాశారు. పేరు పెట్టడమూ ఒక కళయే! అది ఆకాశంనుంచి రాలిన తాజా చినుకులా ఉండాలి. "చిల్లర దేవుళ్ళు" అలాగే అనిపించింది.
    
    మనం కన్న పిల్లల్లో అందమైన వారుంటే అందుకు మన ప్రత్యేక కృషి ఏమీ ఉండదు. అయితే వారు ముద్దు వస్తారు. "చిల్లర దేవుళ్ళు" పాత్రలన్నీ నా సృష్టియే! అయినా వనజ నాకు ముద్దొస్తుంది ఆమె ఎదిగిన తీరు నన్ను చకితుణ్ణి చేస్తుంది. వహ్ ధూల్ కా ఫూల్ హై! ఆమె మట్టిలోని పుష్పం.
    
    'చిల్లర దేవుళ్ళు' రెండు కాపీలు టైపు చేయించాను. భాయ్ జాన్ సలహామేరకు విశాలాంధ్ర ప్రచురణలకు - ఎమెస్కో పాకెట్ బుక్స్ కు పంపించాను.
    
    1969 లో వారి ఇద్దరినుంచీ ఉత్తరాలు వచ్చాయి. విశాలాంధ్ర విజ్ఞాన సమితి పక్షానే అనుకుంటా 'ప్రగతి' అనే ఒక ప్రగతి శీల వారపత్రిక ప్రచురించ తలపెట్టారు. దాని ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకుడు - దేశభక్తుడు - వయోవృద్దుడు - సాహితీవేత్త మద్దుకూరి చంద్రశేఖరరావుగారు సంపాదకులు. 'ప్రగతి' తొలి సంచికనుంచి "చిల్లర దేవుళ్ళు" సీరియల్ గా ప్రచురిస్తామని చంద్రంగారు స్వహస్తంతో ఉత్తరం వ్రాశారు. అది నాకు గర్వకారణం! ఎమెస్కో అధిపతి M.N. రావుగారు పుస్తకంగా ప్రచురిస్తామని వ్రాశారు.
    
    అసలు అచ్చు దుస్తరం అయింది. ఇప్పుడు ఇద్దరు ప్రచురిస్తామంటున్నారు. దీన్నే కాలం అనుకూలించడం అంటాం. కాలం అనుకూలించినపుడు అన్నీ కలిసి వస్తాయి! కాలం వ్యతిరేకించినపుడు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. 'కాలోయం దురక్రమః' అంటాడు వాల్మీకి కాలం అతిక్రమించరానిది!
    
    ఖాయ్ జాన్ సలహామేరకు సీరియల్ గా ప్రచురించమని చంద్రంగారికి సవినయంగా జాబు వ్రాశాను. సీరియల్ ప్రచురణ తరువాత ప్రచురించవలసిందని రావుగారిని కోరాను. వారు అంగీకరించారు.
    
    "చిల్లర దేవుళ్ళు" ప్రగతి వారపత్రికలో 21.3.69 నుంచి 13.6.69 వరకు వరసగా పదమూడు వారాలు సీరియల్ గా వచ్చింది. Coincidence కు సరియైన తెలుగు పదం తెలియదుగాని సరిగ్గా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు 'చిల్లర దేవుళ్ళు' సీరియల్ గా వచ్చింది అయినా, ఎలాంటి ద్వేషకావేషాలు లేకుండా ఇరుప్రాంతాలవారు అభిమానించారు.
    
    మద్దుకూరి చంద్రశేఖరరావుగారు 2.3.1970న వ్రాసినలేఖలో "మేధావులు ముఖ్యంగా తెలంగాణా మాండలిక పదాలను వ్యవహారికభాషను అవగాహన చేసుకున్నవారంతా గొప్పగా ఉందన్నారు. తరం క్రిందటిరోజుల్లో తెలంగాణా గ్రామీణ జీవితాన్ని ప్రతిభావంతంగా చిత్రించినందుకు రచయితను అభినందించారు" అన్నారు.
    
    డి. రామలింగంగారు ఇలా వ్రాశారు.
    
    "తెలంగాణా ఫ్యూడల్ వ్యవస్థలోని social life ను మీరు చాలా వాస్తవంగా depict చేశారు. నా దృష్టిలో ఇది ప్రజలమనిషి కన్న ఉత్తమమైన నవల. ముందెప్పుడైనా మీ నవల social history of Andhra  వ్రాసేవారికి ఎంతో బాగా ఉపకరిస్తుందనుకుంటాను"
    
    మహీధర రామమోహనరావుగారు:-
    
    "తెలంగాణా గ్రామజీవితం, అక్కడ రాజకీయాలు, సామాజిక - సంప్రదాయాలు, ఆర్ధిక పరిస్థితులు, భాష చక్కగా ఉన్నాయి. నవల చదివిస్తూంది. పాఠకుణ్ణి ఆకట్టుకుంటుంది, అభివాదనలు."
    
    ప్రగతిలో సీరియల్ కావడం ప్రారంభం అయిన మరుసటివారం నుంచే పాఠకుల నుండి ప్రశంసలు ప్రారంభం అయినాయి.
    
    "చిల్లర దేవుళ్ళు నవలా ప్రచురణ సకాలంలో ఎత్తుకోవడం గమనార్హం. తెలంగాణా నాయకత్వం ఎలా ఉందో చూపడానికి, దాని పునాదులు ఇలాంటివని చూసిన రచయిత ధన్యుడు. జాతి చరిత్రకు దర్పణం పట్టిందీ నవల. అయితే, చివరి అధ్యాయంలో సినీమా ధోరణిలో దిగిపోయింది. పాణి జన్మరహస్యం విడతీయకుండా ఉంటే బావుండును" ఉషశ్రీ - విజయవాడ.
    
    "ప్రపంచ సాహిత్యంలో అత్యున్నతస్థాయిని అందుకున్న టాల్ స్టాయ్ విరచిత నవజీవనం - Ressurection తరువాత మరల అంతటి కళాత్మక శిల్పాన్ని అందుకుంటే అది "చిల్లరదేవుళ్ళు" నవలకే దొరుకుతుంది. అత్యున్నతస్థాయిలో వెలువడుతున్న "చిల్లర దేవుళ్ళు" తెలుగుభాషకు ప్రపంచ స్థాయిలో సముచితస్థానాన్ని సంపాదించి పెట్టడమేకాకుండా, మున్ముందు పరిఢవిల్లే రచయితలకు ఒక గీటు రాయిగా పనిచేసి అభ్యుదయకర, విప్లవాత్మక మార్పులను సాహిత్యంలో ప్రవేశపెట్టగలదని విశ్వసిస్తున్నాను" - అ. చంద్రయ్య, రూర్కెలా.
    
    ఇలాంటి అనేక ఉత్తరాలు వచ్చాయి. అవికాక వ్యక్తులు వ్యక్తిగతంగా నామీద కురిపించిన అభినందన పరంపర నన్ను ఊపిరి పీల్చనివ్వలేదు.
    
    "చిల్లర దేవుళ్ళు" నవలను 'నిజాం నిరంకుశపాలనలో ఊరూ పేరూ మాసిన ఆంద్రజాతికి ఒక తీరూ తెన్నూ కల్పించిన ఆంద్రపితామహ' పద్మభూషణ శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారికి అంకితంగా సమర్పించాను. అప్పటుకి వారు జీవించి ఉన్నారు.
    
    నవల సీరియల్ గా రావడం పూర్తిఅయి వారికి అంకితం ఇచ్చిన వాక్యాలు ప్రగతిలో ప్రచురణ జరిగినపుడు వారు జీవించి ఉన్నారు. 11 నవంబరు 1970 న వారు పరమపదించారు. వారిని గురించి నేను వ్రాసిన "ఆంద్రపితామహ" వ్యాసం 15-11-70 నాటి విశాలాంధ్రలో వచ్చింది. దాన్ని "పరిశీలన"లో చేర్చాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.