Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    మతవాదంతో ప్రారంభం అయిన ఉద్యమం కమ్యూనిస్టు సాయుధ మహా విప్లవంగా పరాకాష్ట చెందడం తెలంగాణ ప్రత్యేకత - విశిష్టత - విప్లవత.
    
    నరేందర్ జీ కథనాలు విన్న తరువాత రెండు మతాంతరీ కరణాలకు రెండు అధ్యాయాలు విడివిడిగా చేర్చాను. మార్చి, చేర్చి, మరల వ్రాసి శుద్దప్రతి సిద్దం చేశాను. నవలకు 'రాతి మనుషులు' అని పేరు పెట్టాను. ఒక వారపత్రికకు నవలల పోటీకి పంపాను. ఆర్ధికంగా కూడా అవి నాకు అతిక్లిష్టదినాలు. నాకు ఉన్న నమ్మకం వల్ల నవల బహుమతి సాధించగలదు అనుకున్నాను. ఆర్ధికంగా ఆదుకుంటుంది అనుకున్నాను.
    
    'రాతి మనుషులు' టపాలో తిరిగి వచ్చింది. కనీసం సాధారణ ప్రచురణకూ నోచుకోలేదు. నాకు పత్రిక మీద కోపం రాలేదు. నేను మంచి నవల వ్రాయలేకపోయినందుకు బాధపడ్డాను. నవల వ్రాయలేను అని నిర్ణయించుకున్నాను. 'రాతి మనుషులు' కట్టకట్టి మూలకు వేశాను. అప్పటికి మా ఇంట్లో అలమారీ లేదు. అటకమీద వేశాను. మరిచిపోయాను!
    
    అలా ఉండగా నాకు నార్ల చిరంజీవిగారితో పరిచయం అయింది. వారంటే నాకు బాల్యం నుంచి అబిమానం. మేము బాలసంఘంలో వారిపాట 'బాలసంఘ సభ్యులం - భరతమాత బిడ్డలం' పాడాం. వారు మదరాసులో ఉండేవారు. ఆ మధ్యనే హైదరాబాదుకు మారారు. పంజగుట్ట 'హిందీనగర్' లో ఇల్లుకట్టుకుని ఉంటున్నారు.
    
    1966 లో ఆంద్రప్రభ సచిత్రవార పత్రికలో 'భాగ్యనగరం' అనే నాటకం సీరియల్ గా వచ్చింది. అది నార్ల చిరంజీవి రచన. అది గొప్ప నాటకం! చిరంజీవి ఎంతో అందంగా శిల్పీకరించారు. అది చదువుతుంటే ఖులీఖుతుబ్ షాను మురిపించిన భాగమతి నన్ను మురిపించింది. రచయితను కలుసుకోవాలనే ఆతురత ఎక్కువయింది.
    
        "ప్రియురాలు మరణింప
        ప్రియుడు కట్టించె
        కన్నీటి కలపోతగా
        తాజమహలు
        జవరాలి ప్రేమకై
        యువరాజు నిర్మించె
        పన్నీటి కాన్కగా
        భాగ్యనగరమ్ము" అన్నారు చిరంజీవి. వారిని భాగ్యనగరం తాజమహలు కన్నమిన్నగా మురిపించింది! అంత మురిపించనిదే అంతటి మహత్కావ్య ఆవిష్కరణ జరగదు!
    
    భాగ్యనగరం - చిరంజీవి నన్ను అయస్కాంతంగా ఆకర్షిస్తున్నారు. 24 జూలై 1966 ఆదివారంనాడు బయలుదేరాను. తోవలో జోరున వాన, తడిశాను. తిరిగి వెళ్ళదలచలేదు. చిరంజీవి ఇంటికి చేరాను. బెల్లునొక్కాను, వచ్చారు, నమస్కరించాను. పేరు చెప్పాను. "అదిగో చూడండి, బయట పంపుంది. బూట్లు బయట విడువండి. కాళ్ళు కడుక్కుని లోన అడుగుపెట్టండి." అప్రిచయమే లేని నామీద ఈ పదును కొంత బాధ అనిపించింది. అయితె అడుగుపెట్టింతఃరువాత అర్ధం అయింది - ఆ ఇల్లు చిరంజీవి మనసులా - అద్దంలా ఉంది.
    
    తొలిచూపులో వలపు. అది ప్రేమికుల మధ్యనే అనేది కావ్య భాష. మా ఇరువురికీ అలాంటి మైత్రి ఒకే క్షణంలో కుదిరింది. చిరంజీవి పొడి తువ్వాలు అందించారు. నాగరత్నమ్మ వదినగారు గరంగరం చాయ్ ఇచ్చారు. చిరంజీవి అప్పటికే నా రచనలు 'దేవుని పేరిట', 'రణభేరి', ప్రభలో వచ్చిన ఉర్దూ కవితల తెనిగింపు చదివారు.
    
    ఆనాడు గంటల తరబడి ఉర్దూ కవితల గురించి మాట్లాడుకున్నాం. బయట వాన - ముందు విస్కీ - ఉర్దూ కవితల వేడి! ఓహ్! అదొక అనుభూతి! అదొక అదృష్టం!! అది అందరికీ అందదు!!!
    
    నాటినుంచి మేము భాయీ - భాయీలమైనాం. 'భాయ్ జాన్!' అనిపిలుచుకునే వాళ్ళం. అది నాకు అందాల కాలం. మానవతా మూర్తులు ప్రాణమిత్రులు చిరంజీవి - గిరి - నరసింహన్ తో గడిపిన కాలం! ఆ మనుషులు - ఆ పార్టీలు - ఆ మనసులు - ఆ కవితలు! ఆ మైత్రి - ఆ స్నేహం - ఆ దోస్తీ అందరికీ లభించదు! ఎప్పటికీ ఉండదు!! ముగ్గురూ నన్ను విడిచి వెళ్ళిపోయారు! నేడు నేను మాత్రమే మిగిలాను!!
    
    బేఖయిఫ్ జిందగీ హై జియేజారహా హూఁ
    షీషా హై ఖాళీ ఫిర్ భీ పియే జారహా హూఁ
    
    (జీవితం రసహీనం అయింది. అయినా జీవిస్తున్నాను. గ్లాసు ఖాళీగా ఉంది. అయినా తాగేస్తున్నాను.)

    1966 జూలై 24 తరువాత భాయ్ జాన్ ఇంటికి వెళ్ళని రాత్రిలేదు. ఆఫీసునుంచి ఆటే వెళ్ళేవాణ్ణి అక్కాడ సుమారు రోజూ పార్టీలే! అనేకమంది మిత్రులు చర్చలు - ముఖ్యంగా నేను చదివే ఉర్దూ కవిత - అదొక మత్తు, అదొక మైకం, వహ్ ఎక్ నషా హై!
    
    అలా సాగిపోతున్నప్పుడు ఒకనాడు భాయ్ జాన్ తో అన్నాను, నేనొక నవల వ్రాశానని - అది చూడాలని అదీ భయం భయంగానే అన్నాను.
    
    "భాయ్ జాన్ సామాన్య నవల నహీ లిఖ్తే అది గొప్ప నవలే అయ్యుంటుంది అంటే ఉర్దూలో ఏమనాలి?" అడిగారు చిరంజీవి.
    
    మరుసటిరోజు 'రాతి మనుషులు' వ్రాత ప్రతి భయంగానే భాయ్ జాన్ కు అందించాను. ఏవో పనులవల్ల రెండురోజులు అటు వెళ్ళలేకపోయాను. మూడవ సాయంత్రం వెళ్ళాను.
    
    "భాయ్ జాన్! ఎహ్ తో బహుత్ అచ్చీ నవలా హై నిన్నటినుంచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది ఎప్పుడు చెప్పుదామా అని ఎదిరి చూస్తున్నాను. నవలలో మునిగిపోయాననుకో పాత్రలు - సంఘటనలు నన్ను వదలడం లేదు. వనజ - మంజరి - లంబాడి లక్ష్మి మనసులోనే నిలిచిపోయారు. భాయ్ జాన్! నాకు చాల గర్వంగా ఉంది. నా తమ్ముడు ఇంత గొప్ప నవల వ్రాశాడు! తెలంగాణను ఆవిష్కరించాడు" ఇంకేమేమో పొగిడారు. వచ్చిన వాళ్ళందరికీ వివరించి చెప్పారు.
    
    అందంగా ఉన్నావంటే అతివకూ - రచన బాగుందంటే రచయితకూ పొంగిపోయే ఆనందం కలుగుతుంది!
    
    తన బిడ్డ బాగుందంటే తల్లి పొంగినట్లు నేనూ పొంగిపోయాను.
    
    "నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
    ప్పురవిడె మాత్మ కింపయిన భోజన ముయ్యెల మంచమొప్పు త
    ప్పరయు రసజ్ఞ లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్
    దొరకిన గాక యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే?"
    
    అన్నారు మనుచరిత్రము అణు అమృతగుళిక ఆంధ్రులకు అందించిన ఆంద్రకవి తాపితామహ అల్లసాని పెద్దన.
    
    అలాంటి అవకాశాలు మహారాజులను ఆశ్రయించిన అల్లసాని వంటివారికి సాధ్యం. రసిక శిఖామణి శ్రీకృష్ణదేవరాయలు ఎదురైనచో దనమదకరీంద్రము నిల్పి కేలూత యొసగి ఎక్కించుకొనియె - అటువంటి రాజులు అరుదు.
    
    రచన సాగిస్తున్నప్పుడు అంతకు మించిన భోగాలు చవిచూచిన అన్నగారు ఆత్రేయ! సినీమా రచనలో ఉన్నప్పుడు అన్నగారు మహారాజు వారికి తెల్ల ఏనుగు కావాలన్నా దిగేది! 'లేఖక పాఠకోత్తముల్' అన్నాడే అల్లసాని - అది అక్కడ చూశాను. ఆత్రేయగారు చెపుతుంటే వ్రాసేవారు మంచివాక్యం పడగానే మురిసిపోయేవారు. అన్నగారు అదొక విశేషంగా నవ్వేవారు. తరువాత మరింత అందమైన సంభాషణ వచ్చేది.
    
    అలాంటివి ప్రజా రచయితలకు లభించవు - వారు ఆశించరు. 'ఉన్నవ' వారు మాలపల్లి నవల జెలులో రచించారు. ప్రేమ్ చంద్ 'మైఁ కలమ్ కా మజ్దూర్ హూఁ' నేను కలం కూలిని అన్నాడు. అన్ని పుటలు వ్రాస్తేగాని అన్నం తినేవాడు కాడు. ప్రజారచయితలను ప్రజలు ఆదరించరు. ప్రభుత్వం పట్టించుకోదు! అయినావారు రచనలు చేస్తూనే ఉంటారు! వారి స్పందన ఆవేశం అలాంటిది!
    
    నేను 'నిరుపహతిస్థలంబు' ఆశించలేదు. ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితుల్లో "రాతి మనుషులు" రచించాను. నాలోని ఆవేదన, ఆవేశం, స్పందన నాతో రచన చేయించాను. మహాకావ్యాలూ - మహాకార్యాలూ క్లిష్టపరిస్థితుల్లోనే ఉద్భవిస్తాయని నా నమ్మకం. అయితే కనీసం 'పాఠకోత్తముల్' ఉంటే రచయితకు ప్రోత్సాహం ఉత్సాహం కలిగిస్తారు. అలాంటి ఉత్సాహం భాయ్ జాన్ చిరంజీవినుండి నాకు లభించింది. అదీ అదృష్టం. అది లేకుంటే "చిల్లరదేవుళ్ళు" వెలుగు చూసేదికాదు. ఆంద్రజాతికి ఒక మంచి నవల లభించకుండాపోయేది!
    
    "భాయ్ జాన్! నేను నీ రచనా శిల్పంలో కొట్టుకుపోయాను. నీవు చూపించే తెలంగాణం అనుకున్నాను.  నీ పాత్రలు మాట్లాడిందే తెలంగాణ భాష అనుకున్నాను. వాస్తవంగా తెలంగాణం విషయాల్లో అనుభవం ఉన్నవారు చూడడం మంచిది. దేవులపల్లి రామానుజరావుగారికి ఇచ్చి చదివించు" అని సూచించారు.
    
    భాయ్ జాన్ సూచన నాకు విసుగనిపించలేదు. వన్నె తెచ్చేదిగా అనిపించింది.  సుర్బ్ రూ హోతా హై ఇన్నాఁ ఠోకరే ఖానే కి బాద్ - రాంగ్ లాతీ హై సోనా పత్థరపె ఘిస్నీకెబాద్ - దెబ్బలు తింటేనే నరుడు మొనగాడు అవుతాడు. రాతిమీద రాస్తేనే బంగారం వన్నె పెరుగుతుంది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.