Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    నవలలో నివేదన భాష వేరు - పాత్రల యాస వేరు కావాలనుకున్నాను. యాసలేని పాత్రలు నిర్జీవములు అవుతాయి. పాత్రలు పలికిన యాస సొగసు పాఠకులు గ్రహిస్తారు. అందువల్ల పాత్రోచిత యాస వాడడానికి నిశ్చయించాను. సంస్కృత నాటకాల్లో పాత్రోచిత భాష ఉంది. శూద్రులు - నీచపాత్రలు స్త్రీలు ప్రాకృతం మాట్లాడుతాయి. తెలుగునాటకాల్లో పాత్రోచిత భాషాప్రయోగం ఉంది.
    
    తెలుగు నవలలో నేను ప్రవేశపెట్టేవరకు పాత్రలకు ఒక యాస - నివేదనకు ఒక భాష వాడబడలేదు. ఈ విషయంలో నేనే ఆద్యున్ని! నవల ఒక ప్రాంతానికి మాత్రం సీమితం కావడం నాకు ఇష్టం లేదు. 'నను కని పెంచినట్టి కరుణామయి  నా తెలంగాణ'ను గురించి సకలాంధ్రలకు తెలియపరచడం నా ధ్యేయం. కావున సాధారణ వాడుకభాషను విషయ నివేదనకు ఉపయోగించడానికి నిశ్చయించాను.
    
    ఒక భాషకు అనేక పలుకుబడులు ఉన్నపుడు ఒక పలుకుబడి సాధారణం అవుతుంది. మనం చదివే ఇంగ్లీషు - హిందీ ఎక్కడా వాడుకలో ఉండదు. ప్రతి భాష ఓ సాధారణ యాసను స్థిరపరచుకుంటుంది. అది అన్ని యాసలవారికీ ఉపాదేయం అవుతుంది. మనం ప్రస్తుతం రచనలలో వాడుతున్న తెలుగు కృష్ణ - గుంటూరు ప్రాంతంలో విద్యావంతులయిన మధ్యతరగతివారు మాట్లాడే భాష. అయితే దీనికీ 'మాలపల్లి' భాషకూ సంబంధంలేదు.
    
    ఏదీ శాశ్వతం కాదు అనేది జీవిత సత్యం అలాగే ఎప్పుడూ సాధారణ భాష ఒకేరకంగా ఉండదు. మార్పు జీవిత వాస్తవం. తొలుత ఉత్తరాంధ్రభాష - తదుపరి గోదావరి భాషనుండి ప్రస్తుతపుది వాడుక భాష అయింది.
    
    ఇంతకూ చెప్పవచ్చేదేమంటే - నా నవలకు ఇతివృత్తం అందరికీ అర్ధం కావాలని విషయ నివేదనకు సాధారణ భాష వాడడానికి నిర్ణయించాను. తెలంగాణం యాస సొగసులు సకలాంధృలు చవిచూడవీలుగా పాత్రలకు తెలంగాణం యాస వాడడానికి నిశ్చయించుకున్నాను.
    
    నాకు అభిమానం ఉంది. దురభిమానం లేదు.
    
    నాకు ఆశ ఉంది. దురాశ లేదు.
    
    ఈ నవలకు నేను ఎన్నుకున్న పాత్రలుగాని - సంఘటనలుగాని కేవలం కల్పితాలు కావు. ఆ కాలమున ఉన్నవే! వాటిని మలచిన తీరు మాత్రం నా స్వంతం నా పాత్రలు - సంఘటనలు సజీవములు కావడానికి కారణం నేను వాటిని చూచాను! వాటి మధ్య మసలాను!! స్పందించాను!!!
    
    ఈ నవలలోని పాత్రలు - పరిసరాలు నా జన్మస్థలం చిన్నగూడూరువి. అక్కడి గడీ - దేష్ముఖ్ రామారెడ్డి - పిచ్చి మంగమ్మ - ఏరు - తామర చెరువు అలాగే నవలలోకి నడిచి వచ్చాయి. అయితే, సంఘటనలన్నీ అక్కడివి కావు. ఎక్కడెక్కడినుంచియో తెచ్చి గుదిగుచ్చినాను.
    
    ఈ నవలా రచనలో నేను ఎవరి విషయంలో ద్వేషం ప్రదర్శించలేదు. నాకు వ్యక్తులమీద ద్వేషం లేదు. ఆ వ్యక్తులను మలచిన సామాజిక పరిస్థితులను ఏవగించుకున్నాను. వ్యక్తి సామాజిక వ్యవస్థకూ - పరిస్థితులకూ బానిస. పూర్తి మంచివాడు కాని, పూర్తి చెడ్డవాడు గాని సృష్టిలో ఉండడు. అందుకే నా పాత్రలకు సమయాన్నిబట్టి లేని మనసు పుట్టుక వస్తుంది - ఉన్న మనసును ఊడ్చుకు పోతుంది!
    
    నా పాత్రలను మలచిన తీరుకు రామాయణ - అధ్యయన రచనలు కారణం అనుకుంటాను. వాల్మీకి తన పాత్రలను మలచలేదు. సృష్టించినాడు. వాటికి వంక లేదు! శబరిని సృష్టించిన వాల్మీకియే మంథరను సృష్టించినాడు.
    
    కాల్పనిక రచయితలందరూ ముందు రామాయణం - అధ్యయనం చేస్తే శిల్పనైపుణ్యం అర్ధం అవుతుంది.
    
    కథ చెప్పడం మాత్రం కాదు - నాటి వింత పరిస్థితులను తెలియపరచడం నా లక్ష్యం. పాత్రలు - సంఘటనలద్వారా చెప్పలేని వివరాలకు మాడపాటి హనుమంతరావుగారిని ప్రవేశపెట్టాను. నిజమై నిలిచి ఉన్న వ్యక్తులను పాత్రలుగా వాడుకోవడం కూడా బహుశః నేనే చేశానేమో! ఒకే సన్నివేశంలో అన్ని వివరాలు తెలియపరచడానికి వేరే మార్గం లేదు. ఆంద్రపితామహుని ఇంటర్ వ్యూ కథాగమనానికి కొంత అడ్డంకి అని తెలిసికూడా చేర్చాను. అందుకు కారణం ఉద్యమచరిత్రను తెలియపరచాలనే నా ఆవేదన - ఆవేశం మాత్రమే. వాస్తవంగా అదే "నిన్నటి యదార్ధము - నేటి చరిత్ర"కు ప్రాణప్రదం.
    
    ఆ విధంగా సకల సామగ్రి సమకూర్చుకున్నాను. రచనకు ఉపక్రమించాను. 13-10-1964 న ప్రారంభించిన రచన 10-11-1964 న ముగించాను. వ్రాసింది మరల - మరల చదివాను. నాకెందుకో అసంపూర్ణం - అసంతృప్తి అనిపించింది. కొన్ని సంశయాలు ఏర్పడ్డాయి. లోపాలు అనిపించాయి. వాస్తవంగా లోపం లేనిది ఉండదు. సాధ్యమైనన్ని తక్కువ లోపాలు ఉండాలని ప్రయత్నం.
    
    వ్రాతప్రతి తీసుకొని ట్రూపు బజారులోని 'ఆంద్రకుటీరం' చేరుకున్నాను.  మాడపాటి హనుమంతరావు వారికి నేనంటే వాత్సల్యం. వారు వింటానన్నారు. కాని నవల సాంతం వినిపించడం సమంజసం కాదు. వారు వయోవృద్దులు. కార్యవ్యగ్రులు. వారికీ సారంగపాణి ఇంటర్ వ్యూ - మతాంతరీకరణం వినిపించాను.
    
    హనుమంతరావుగారు అది వింటూ ఎక్కెక్కి ఏడ్చారు. వారి స్థితిని చూచి నాకు భయం అయింది. న అవాలన ఏదో లోపం జరిగింది అనుకున్నాను. చదవడం ఆపేశాను.  ఆంద్రపితామహులు కన్నీరు అరికట్టలేకపోయారు. లోపలికి వెళ్ళారు. ముఖం కడుక్కున్నారు. తువ్వాలుతో తుడుచుకుంటూ వచ్చారు.
    
    "రంగాచార్లూ! మతాంతరీకరణము కన్నులకు కట్టినట్లుగా వ్రాసినావు. మంగళ సూత్రము తెంపి మతము మార్చిన అనేక దృశ్యములు నా కనుల ముందు కదలాడినవి. ఏడుపు వచ్చినది. మతాంతరీకరణముతో నాకు అంతగా సంబంధము లేదు. నీవు 'నరేందర్ జీ'ని కలుసుకొనుము. నేనుకూడ చెప్పెదను" అన్నారు.
    
    నరేందర్ జీ ఆర్యసమాజం వారు. కాచీగూడ చౌరస్తా దగ్గరి ఆర్యసమాజం కార్యాలయంలో ఉంటాను. వారి దగ్గరికి వెళ్ళాను. పరిచయం చేసుకున్నాను. హనుమంతరావుగారు నన్ను గురించి ప్రస్తావించారని నరేందర్ జీ చెప్పారు. ఆర్యసమాజం వారు హిందీనే తమ భాషగా గుర్తించారు. నరేందర్ జీకి తెలుగురాదు. నేను వ్రాసింది తెలుగులో చదివి హిందీలో అనువదించి చెప్పాను. వారు శ్రద్దగా విన్నారు. ఇలాంటి గ్రంథాలు అవసరం అన్నారు. వారు తమ అనుభవాలను పూసగ్రుచ్చినట్లు చెప్పారు. అవి విని నేను ఆశ్చర్యచకితుణ్ణి అయినాను. వారు కొన్ని సవరణలు సూచించారు. వారు సూచించిన సవరణలు చేశాను. అంతేకాదు, హనుమంతరావుగారినివలె నవలలో నరేందర్ జీని ప్రవేశపెట్టాను.
    
    నిజాం నవాబు - మతాంతరీకరణకు ఒక ప్రభుత్వశఖానే ఏర్పరచాడు. బహుద్దూర్ యార్ జంగ్ ద్వారా మతాంతరీకరణ ఒక ఉద్యమంగా సాగించాడు. ఆ రోజుల్లో 'ఆర్యసమాజం' మతాంతరీకరణను గట్టిగా ఎదిరించింది. ఉత్తరభారతం నుంచి సహితం కార్యకర్తలను దింపింది. నిజాం నవాబు ముస్లిములుగా మతం మార్చినవైర్ని 'శుద్ది' చేసి మళ్ళీ హిందువులుగా మార్చారు. ఆ ఉద్యమానికి 'నరేందర్ జీ' నాయకత్వం వహించారు. ఎంతో కృషి చేశారు. నిజాంను ఎదిరించడం సామాన్యం కాదు. అదీ 1938కి పూర్వం!
    
    గ్రామాల్లో నరేందర్ జీకి దొరలు, పటేల్ పట్వారీలు సహకరించేవారు కాదు. ప్రభుత్వ భయంతో కనీసం వస్తఃయ్ కల్పించేవారు కాదు. అందును గురించి నరేందర్ జీ చెప్పిన సంఘటనలు వింటే ఆవేశ కావేషాలు కలుగుతాయి. కాలం గతించింది. అది కూడా అర్ధం కాదు.
    
    ప్రభుత్వాన్ని సంతోషపరచడానికి పేర్లు సహితం తురక పేర్లు పెట్టుకునేవారు. మహబూబ్ రెడ్డిగారు తమ గ్రామంలో దగ్గరుండి హరిజనులను తురకలుగా మార్పించారు. వారి దగ్గరికి నరేందర్ జీ వెళ్ళారు. హిందూమత ఔన్నత్యాన్ని గురించి ఉపన్యసించారు. రెడ్డిగారి బుర్రకు ఎక్కలేదు. మతం మార్చిన హరిజనుడు దొరవారి పక్కకుర్చీలో కూర్చున్నాడు. తానే సర్కారును అన్నాడు.
    
    మహబూబ్ రెడ్డిగారికి అప్పుడు 'హిందూమతం' అర్ధం అయింది. తురకలయిన హరిజనులను హిందువులుగా మార్చడానికి అంగీకరించారు. కాని గప్ చుప్ గా జరగాలనీ సర్కారుకు తెలియకుండా జరగాలనీ - తమ ప్రమేయం ఉన్నట్లు తెలియరాదనీ నరేందర్ జీని హెచ్చరించారు.
    
    వాస్తవంగా 'పావనం' చేసి శుద్దికార్యక్రమం నిర్వహించాలి. నరేందర్ జీకి గ్రామంలో అ ఆమాత్రం సహకారం లభించలేదు. వారు హరిజన వాడకు చేరుకున్నారు. హరిజనులతోనే ఉన్నారు. తిన్నారు. పన్నారు. వారికి హిందూమతపు గొప్పదనాన్ని గురించి వివరించారు. వారిని మళ్ళీ స్వమతంలోకి రావడానికి వప్పించారు! హరిజనులు తమకు లభించిన అవకాశాలను వదులుకునేట్లు చేయడం సామాన్యం కాదు. నరేందర్ జీ మంత్రాలు చదివారు. వారివద్ద ఉన్న 'గండిపేట' నీటినే 'గంగాజలం' అని వారిమీద చల్లారు. వారిని మాతృమతంలోకి మార్చారు. ఇలాంటివి వారు ఇంకెన్నో చెప్పారు!
    
    హైదరాబాదు రాజ్యంలో తొలి ఉద్యమం ఆర్యసమాజ ఉద్యమమే! ఆ రోజుల్లో ఆర్యసమాజంలో ప్రభావం కానివారు అరుదు. నేను బాలుడిగా ప్రభావితున్ని అయినాను. ఆనాటి వారు - ఈనాడు ఏ పార్టీలో ఉన్నా - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆర్యసమాజ ప్రభావితులు అయ్యుంటారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.