Home » vaddera chandidas » Anukshanikam 2



    "వో" అంది.
    పావుగంటలో బయల్దేరారు. అతని దగ్గిరున్న మూడు గిటార్ లలో చిన్నది తీసి భుజానికి తగిలించుకున్నాడు.
    కారు వేగంగా పోతోంది.
    వూరు దాటింది కారు. చుట్టూ మైదానాలు, బీడుభూములు.
    "యెటు వెళ్దాం" అన్నాడు.
    "యెటనేఁవుంది? పోనీండి యెక్కడన్నా కూచోవాలనిపిస్తే కూచుందాం లేకపోతే యిలా వెళ్ళి అలా తిరిగి వొచ్చేద్దాం" అంది.
    కారు వేగంగా పోతోంది.
    పావుగంట.
    దారిలో సడన్ గా రోడ్డుమీదకి కోడెదూడ వొస్తే దాన్ని తప్పించటం కోసం స్టీరింగ్ గిర్రున తిప్పుతూ బ్రేక్ నొక్కాడు.
    బలమైన కుదుపు రోడ్డువారగా ఆగింది కారు రోడ్డు అవతల పెద్ద గొయ్యి.
    ముందుకి తూలి డాష్ బోర్డు మీద వాలింది. చేతులు ఆనించబట్టి యెక్కడా దెబ్బ తగలలేదు. అరిచేతులు నొప్పిగా వొత్తుకున్నాయి. మోచేతులు పట్టినట్లుగా అమ్మాయి.
    "చేతులు ఆనించక పోయివుంటే తల తగిలివుంటే చచ్చిపోయి వుందును యీపాటికి" అని చిన్నగా నవ్వింది.
    ఆమె మూతి మీద అరిచెయ్యి అన్నాడు.
    "నే చచ్చిపోతే యేం చేస్తారు?" అంది.
    "నేనూ చచ్చిపోతాను"
    "అబ్బ మీ మాట కాదు. నేను చచ్చిపోతే నన్నేం చేస్తారూ అని. నాతో పాటు ఆ పెయింటింగ్ కూడా దహనం చెయ్యండి" అంది.
    "విశ్వలీన" చిత్రలేఖనాన్ని, చక్కని కొయ్యచట్రం చేయించి పడక గదిలో గోడకు తగిలించి, తెర అమర్చింది. రాత్రి పడుకునేటప్పుడు తెర తొలగిస్తుంది. వుదయం లేస్తూనే తెర వేపేస్తుంది.
    "యింత చల్లనివేళ చావు కబుర్లు దేనికి?" అన్నాడు.
    "అవునవును. మళ్ళీ యీ కారు స్టార్టు చేసేలోగా నేను చచ్చిపోతే" అన్నాడు అనంత్ రెడ్డి.
    "షటప్" అంది కోపంగా అసహనంగా.
    వొక నిమిషం ఆగి. "స్వప్నా, ఆ మాటకి నీకు అంతకోపం వచ్చి నదే, మరి నేనేమనాలి నిన్ను?" అన్నాడు నిదానంగా.
    "లెంపలు వాయించాలి. యింకా కోపం వొస్తే మంచి ముద్దొకటివ్వాలి" అని చిర్నవ్వింది.
    ఆనవ్వు సవ్వడికి అతని గుండె జలతరంగణిలా చలించింది.
    కారు స్టార్టుచేసి రివర్స్ గేరులో కొద్దిగా వెనక్కు పోనిచ్చి, రోడ్డు మీదకి తిప్పుకుని- వేగంగా పోతున్నాడు.
    "మీరు అంత వేగంగా వెడుతూంటే యివన్నీ నాకు సరిగా కనిపించకుండా తప్పించుకుని పారిపోతున్నాయి" అంది.
    తృప్తిగా నవ్వి, వేగం తగ్గించాడు.
    కారు సాగిపోతోంది.
    "అటు వెళ్ళి కూచుందామా?" అంది వేలితో చూపెడుతూ.
    "వో" అని వేగం తగ్గించి రోడ్డువారగా ఆపాడు.
    దిగి నడుస్తూంది.
    అతను తాళాలు జేబులో వేసుకుని గిటార్ భుజానికి తగిలించుకుని అడుగులు వేస్తూ వొచ్చి ఆమెను కలుసుకున్నాడు.
    నడుస్తున్నారు.
    గుట్టలు, లోయలలాంటి యెత్తుపల్లాలు పొదలు, గడ్డి.
    అటు దూరంగా-అడివి, కొండలు.
    యేపుగా పెరిగిన పచ్చగడ్డి యెగుడు దిగుడుగా .... అంటకత్తె రేసిన లాన్ లా కాక, సిసలైన ప్రకృతిలా వుంది.
    ఆ పచ్చగడ్డిలో అటూ యిటూ అటూ నడుస్తున్నారు.
    వొకచోట కూచునిపోయింది.
    అతను అటూ యిటూ అడుగులు వేస్తూ, ఆమె వొంక చూస్తూ- ఆవపిండి రంగు చీర. ఆ రంగులో -పండిన ఆకులో వీనెల్లా, అడవిబో చిక్కురొక్కురుగా చెట్ల మీద అన్ని వైపులనుంచీ పాకిన తీగల్లా, చిక్కు రొక్కురుగా పడిన దారాల్లా, యెర్రని గీతల చిక్కురొక్కురు గజిబిజి ఎర్రరంగు గీతలు, అదే రంగు బ్లౌజు.
    పచ్చగడ్డిలో కూచుని; చుట్టూ-ఆ రంగులను చూస్తూ, ఆధ్వనులను వింటూ, ఆ సౌరభాలను పీలుస్తూ-
    వెల్లకిలా పడుకుంది. బొక్కబోర్లా పడుకుంది. యిటుపక్కకి వొత్తిగిలి పడుకుంది. అటు పక్కకి వొత్తిగిలి పడుకుంది.
    గిటార్ వాయించమంది.
    వాయిస్తున్నాడు.
    వింటూ ప్రయాణిస్తోంది-
    కాని గిటార్ కొంతదూరమే వెడుతుంది. ఆపై వయొలిన్ లోంచి సితార్ లోంచి మహాద్గాత్రంలోంచి వీణలోంచి లోతుకి - సర్వదిక్కుల లోలోతులకి ప్రయాణించే స్పందనా స్తిత్వం-
    ఆపమన్నట్లు చేత్తో  సూచించింది.
    అతను గిటార్ అక్కడ గడ్డిమీద పెట్టి, ఆమె పక్కన కూచున్నాడు.
    ఆమె యెడమ చేతిని అందుకుని వేళ్ళమీద పెదవులు అద్దాడు. అటు వొంగి పాదాలమీద ముద్దు పెట్టుకున్నాడు. అటు వొంగి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.
    యింద్రచావ ధనుర్వీణ మీటుతున్న రసనాద సౌదర్యంలా, ఆమె. మబ్బుల వైభవాణ్ణి తగ్గిస్తూ యెర్రని పడమటి ఆకాశం, రంగురంగుల మైపూతలు పూసుకుని వింత సొగసులు పోతోంది.
    నీలం ఆకాశానికీ పచ్చని కొండలకీ మధ్యగా- కిందికి రాలి పడుతున్న నిప్పు మందారంలా, సూర్యబింబం.
    అన్ని దిక్కులా నుంచీ, చీకటి వెలుగులోకి వ్యాపిస్తూంటే, ఆ వెలుగు చీకటిని మెరిపిస్తూంటే.....అసురసంధ్య అవధరించింది.
    ఆ అసురసంధ్య నుదుట కుంకుమ బొట్టులా, వినీలాకాశపు నీలి కమలనాభ గర్భంలోంచి వుద్భవించిన చంద్రబింబం చిర్నవ్వితే, యింకా తడి ఆరని బట్టలెరగని యిప్పుడే పుట్టిన పసిబాలగా, అంతకుముందెరగని వింతగాలి వొత్తిడికి సంతోషం పట్టలేక కెవ్వుమని నవ్వితే, పుడమితల్లి పరవశించిపోతోంది. ఆ పరమశింపుకి పొంగి పొరలిన స్తన్యం, సమస్త ప్రాణికోటిలో జీవధారగా ప్రవహిస్తోంది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.