Home » vaddera chandidas » Anukshanikam 2
ఓ రోజున రవి పాకలో పడక కుర్చీలో నిద్రపోతూండగా విమల ప్రసాద్ లు వొచ్చారు.
కారు చప్పుడికి మెలుకువొచ్చి రెప్పలు విప్పాడు.
లోనకి వొస్తూ, "అక్కడికి వెళ్తే యిక్కడున్నావని చెప్పారు బావా" అంది విమల.
నాడు తను తిరస్కరించినప్పుడు, పెళ్ళికి హాజరవనప్పుడు, వర్కర్ గా ఫ్యాక్టరీ లో పని చేస్తున్నప్పుడు, అసెంబ్లీ యెన్నికైనప్పుడు, మినిస్టరుగా వున్నప్పుడు-నాడూ నేడూ అదే ఆప్యాయత! అని అనుకుని వేదనతో కంపించాడు. ఆమె "బావా" అనే ఆ పిలుపులో యిప్పుడు యిన్నాళ్ళకి యెంతో మాధుర్యం, ప్రేమ కనిపించాయి రవికి.
పరిశీలనగా చూశాడు.
అదే వెంకటగిరి చీరలు, అవే నగలు - అతి స్వల్పంగా అదేరూపు అదే తీరు.
'ఆనాడు పరమ మూర్ఖంగా ప్రవర్తిచ్చానేమో అనిపిస్తోంది' అనుకున్నాడు. ఆ భావనకి ముఖం బాధతో వొదిలింది.
"యేం బావా అట్లా వున్నావు? వొంట్లో బాగాలేదా? యేవండీ మీరు వెళ్ళి డాక్టర్ ని తీసుకురారూ, మా బావకి వొంట్లో బాగా లేదు-చిన్నప్పుడు తనకి తలనొప్పిగా వున్నా జ్వరంగా వున్నా నన్ను అకారణంగా తిట్టేవాడు" అని రవి వంక చూసి, "యేం బావా గుర్తుందా?" అంది.
"మరి వెళ్ళనా?" అన్నాడు ప్రసాద్.
రవి అందుకుని, "అబ్బే లేదండీ నా వొంట్లో బాగానే వుంది. నిద్ర లేచానిప్పుడే. కొంచెం డల్ గా కనిపిస్తున్నానేమో." అన్నాడు.
అంతలో కారులోంచి వాళ్ళ పిల్లలు- ఆడ, మగ- యిద్దరూ వొచ్చారు గెంతుకుంటూ.
ఆ పిల్లనీ పిల్లన్నీ దగ్గిరకి తీసుకున్నాడు రవి. వొళ్ళు యేదో అనిర్వచనీయమైన భావంతో జలదరించింది.
"రేపు సత్యనారాయణ వ్రతం. తప్పకుండా రావాలీ" అంది. అవి, "మా నాన్న లేడులే వూళ్ళో నీకేం అభ్యంతరం వుండక్కర్లా" అంది.
"వుంటే నాకేం విమలా రావటానికి? వున్నా వొస్తా" అన్నాడు.
"నిజం!" అని సంతోషంతో పొంగిపోతూ, "బావా నువ్వు నమ్మవని చెప్పలేదుగానీ నాన్న యెన్నోసార్లు అన్నాడు. పోనీ నేవెళ్ళి పలకరించనా వొకసారి. అదేమన్నా పట్టుదలేమో, కావలసిన వాళ్ళం యెల్లకాలం దేనికీ పట్టింపులు అన్నాడు" అంది.
"మంత్రి పదవి కూడా వూడిపోయి యిట్లా పాకలో పడివుంటేవీళ్ళకి ఆ ఆప్యాయత యింకా వుంది. నాలోనే యేదో లోపం వుందేమో-'అనుకుని "తప్పకుండా వొస్తాను విమలా. ప్రసాద్ గారు మీరు నుంచునేవున్నారు అయ్యో నేను గమనించనేలేదు" అన్నాడు.
"నేనంటే చిన్నప్పటినుంచీ నీతో తిట్లూ చివాట్లూ తిన్న దాన్నికాబట్టి కూర్చోమనకపోయినా కూర్చునాను" అని చిన్నగా నవ్వింది విమల.
ఆ నవ్వు యెంతో సవ్చ్చంగా ప్రవిమలంగా అనిపించింది రవికి.
అతని కుర్చీకి అటుగా చాపమీద కూచునివుంది.
ప్రసాద్, వొక అడుగు అటువేసి మంచం అంచుమీద కూర్చున్నాడు.
మరి కొద్దిసేపు కబుర్లు. రాములు వెళ్ళి కాఫీ కలిపి తెచ్చియిచ్చాడు.
వాళ్ళకి రాములుతెలుసు. గంగితో పెళ్ళి, యెమ్మెల్యే అవటం, మినిస్టర్లవటం-వీటి వేటికీ యెవరి యేలక్షణాలకి అంటకుండా-నాటికీ నేటికీ అదే ఫ్యాక్టరీలో అదే పనిచేస్తూ, వొండుకుని తినివుంటాడనీ రవి అంటే యీ నాటికీ అతనికి వొకలాంటి గౌరవం అభిమానం అనీ.
"నువ్వుకూడా రావాలి రాములూ" అని చెప్పారు-విమల, ప్రసాద్ యిద్దరూ.
వెళ్ళిపోయారు.
రవి అలాగే పడుకుని కనురెప్పలు వాల్చాడు. కళ్ళలోంచి చెమ్మవుబికింది.
రాములు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు.
అరగంటసేపు అలాగే పడుకుని లేచాడు రవి.
గుడిశ బయటికి వొచ్చి కాసేపు అటూ యిటూ మొక్కల్లో తిరిగాడు.
పూలమొక్కల్లో నడుస్తూ-
గులాబీ మొక్కలు-యెదగకుండా అట్లాగే వుండిపోయి గుంటపూలు పూసే నల్లగులాబీ మొక్కలు.
చెయ్యి గడ్డంకేసి రుద్దుకున్నాడు.
రెండు నిమిషాలు వాటి వంక చూస్తూ నుంచున్నాడు.
చటుక్కున వొంగి వాటిని పట్టుకుని బలంగా పీకి అవతలికివిసిరాడు.
ముళ్ళు గుచ్చుకుని అరిచేతుల్లో అక్కడక్కడ నెత్తురు చెమర్చింది.
వొచ్చి కుర్చీలో కూచున్నాడు.
చేతులవొంక చూసుకుంటూ, కుడి చూపుడు వేలితో యెడమ అరిచేతిలో చెమర్చిన నెత్తుటి బొట్లమీద రాశాడు. యెడమ చూపుడు వేలితో కుడి అరచేతిలో చెమర్చిన నెత్తుటి బొట్లమీద రాశాడు. రెండు అరిచేతులూ వొకదానికొకటి ఆనించి జరిపి తెరచి చూసుకున్నాడు. చేతుల్లోని గీతలలో స్థిరపడింది నెత్తురు. వెనక్కి వొరిగి కనురెప్పలు వాల్చాడు.
పది నిమిషాలు.
చేత్తో గడ్డం రుద్దుకున్నాడు. లేచాడు.
బయటికి వెళ్ళి పీకేసిన ఆ గులాబీ మొక్కలు తెచ్చి యధాస్థానంలో నాటి కుదురు చేశాడు రవి.
132
అప్పటిదాకా లేబొరేటరీలో పనిచేసి యింటి కొచ్చిన అనంత్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళి స్నానిస్తుండగా, "ప్లజంట్ గా వుంది. యీవెనింగ్ అట్లా యెటైనా పోతే-" అనిపించింది.
ముస్తాబై వొచ్చి ఆ మాట అన్నాడు స్వప్నరాగలినతో.
పేము కుర్చీలో ఆమె. ఆమె పక్కన వున్న బల్లమీది టేప్ రికార్డర్ లోంచి శుద్ధ ధన్యాసి రాగం-వయొలిన్.
ఆ లోపల్నుంచే "వూఁ" అంది, వయొలీన స్వప్నంరాగలీన.
"యే లోకంలో వున్నావు స్వప్నా! సంగీతం వుంటే మరింకేం అక్లర్లేదు" అని మళ్ళీ చెప్పాడు.
"వెడదామంటారా?" అంది నిదానంగా.
"వూఁ. యెంత ప్లజంట్ గా వుందో చూడు యీ సాయంత్రం? వెళ్దామా" అన్నాడు.



