Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ముఫ్ఫయి మూడు
చిల్లర దేవుళ్ళు:
ఒక్కొక్కసారి మనకు స్వాతంత్ర్యం శాపంలా పరిణమించిందేమో అనిపిస్తుంది. మనసు కలుక్కుమంటుంది. బాధ కలుగుతుంది. ఎంచాతంటే - ఆనాటినుంచే మన 'విలువల' పతనం ప్రారంభం అయింది.
స్వాతంత్ర్యం సాధించుకోవడానికి మనం సాగించిన సుమారు ఒక శతాబ్దపు పోరాటం విశిష్టం అయింది. విప్లవాత్మకం అయింది. విస్తృతం అయింది. ప్రపంచ విముక్తి పోరాటాలలో ప్రత్యేక స్థానం సంతరించుకుంది.
మన స్వాతంత్ర్య పోరాటంలో జాతి, మత, కుల, ప్రాంత, భాషా భేదం లేకుండా సంస్థ భారతీయులు పాల్గొన్నారు. ఆ పోరాటం అనేకమంది మహామహులను మహితాత్ములను సృష్టించింది. ఒక్క రాజకీయం కాదు - జీవితంలోని అన్నిరంగాల్లోనూ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మహాపురుషులు జన్మించారు.
మన స్వాతంత్ర్య పోరాట జ్వాలలో జాతి స్వార్ధం - స్వప్రయోజనం - అహంకార మమకారాలను దహించి వేసింది. దేశభక్తి - త్యాగం - బలిదానం లాంటి ఉన్నత విలువల వెలుగులు పరచింది. జీవితంలోని అన్ని రంగాల్లో -వ్యవసాయ, వర్తక, వాణిజ్యాల యుక్తంగా అన్నింటిలోనూ దేశభక్తి కనిపించింది!
మన స్వాతంత్ర్యం పోరాటంలో ఇంతటి మహోన్నత విలువలు పెంచుకోవడానికి కారణం - మనకు లక్ష్యశుద్ది ఉంది. గమ్యం మనకు తెలుసు. పయనం కఠినం. అయినా సాగినాం. గమ్యం - లక్ష్యం చేరుకోగలిగాం.
మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. మన గమ్యం ఆగమ్యం అయింది. లక్ష్యం నిర్లక్ష్యం అయింది. జీవితంలోని అన్ని రంగాలు - దేశభక్తి సహితంగా వ్యక్తి చుట్టు పరిభ్రమించాయి. మనం త్యాగాన్ని త్యాగం చేశాం. స్వార్ధం - స్వప్రయోజనం స్వలాభానికి పట్టం కట్టాం. దేశం నా కోసం బతకాలి అనే సిగ్గులేని నినాదాన్ని ఎలుగెత్తి చాటాం. ఇంతటి దుర్భర పరిస్థితుల్లో పూర్వపు మహోన్నత విలువలు ఊపిరాడక ఆవిరి అయిపోయాయి.
అర్ధం - స్వార్ధం తప్ప అన్యం తెలియని జాతికి వలువలు తప్ప విలువలు తెలియవు! అర్ధం - ఆహ్దికారం అనే ఎండమావుల క్సోం ఉరుకుతున్న జాతి కాళ్ళు విరుగుతున్నాయి!! మనం ఎంత అంధకారంలో ఉన్నామంటే - ముందున్నవి ఎండమావులని ఎరుగలేకున్నాం!!!
స్వాతంత్ర్యం మనకు సమృద్ధిని సంపదను ప్రసాదించింది. ఆర్ధికంగా - పారిశ్రామికంగా - మరెన్నో రంగాల్లో మనం ముందడుగు వేశాం. కాదనలేం కాని మనమూ - మన సంప్రదాయాన్నీ మరిచాం. భాషసహితంగా వెర్రివెలుగు అయిన పాశ్చాత్యుల్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాం.
లక్ష్యం - గమ్యం ఎరుగని భారతయువత 'విలువలు' అనేవాన్ని వెర్రివాడిగా చూస్తున్నారు. స్వాతంత్ర్యం కోసం సర్వం సమర్పించిన వారిని వెక్కిరించే రాజకీయ దివాళా కోరుతనం పట్టం కట్టుకున్నది. మహామహులను మతం - కులం-ప్రాంతం-పార్టీల వారిగా విభజించి దూషించడం భూషించడం చేస్తున్నారు. మహాత్ముని హత్యచేయడం మంచిదనీ - దేశపు అనర్ధాలన్నింటికీ నెహ్రూయే కారణం అనీ అనడం నాగరికత అయిపోయింది!
ఒక విపరీత పరిణామం కూడా వినిపిస్తున్నది. ఇంగ్లీషువాళ్ళే మంచివాళ్ళని; అలాగే నిజాం నవాబు ఉత్తమ పాలకుడు అనే దశ వచ్చింది. ముసలినక్క నిజామును నెత్తికి ఎత్తుకోవడానికి హైదరాబాదు చతుశ్శతాబ్ది అనే కుట్ర రచించబడింది. ఉస్మానలీఖాను సెక్యులర్ ప్రభువు అని సెమినార్లు జరిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిపినవాళ్ళు ఇంకా జీవించి ఉండగానే ఇది జరుగుతున్నది.
మరొక వింత ధోరణి ఏమంటే - తామే బాగుపడాలనే నేటి తరానికి చరిత్ర తెలియదు. భవిష్యత్తు ఎరుగరు. వర్తమానంలో జీవిస్తారు. ఉస్మానలీఖాన్ 'ఉస్మాన్ సాగర్' - హిమాయత్ సాగర్ - ఉస్మానియా దవాఖానా - హైకోర్టులను నిర్మించిన ఉదార ప్రభువు అని ప్రచారం జరుగుతే, నిజం అని నమ్మేస్థితి ఏర్పడింది.
మన ప్రభుత్వాలు దివాంధములు. వాటికి తమ ఉనికి తప్ప అన్యం తెలియదు. చరిత్ర, సంస్కృతి వారు ఇంకా తెలుసుకోవలసిన విషయాలు. ఆంద్రభాషకోసం ఏర్పడిన ఆంద్రప్రదేశంలో 'ఆంధ్రం' లోపించి ప్రదేశం మిగులుతున్నదని కూడా గమనించలేని కుంభకర్ణ దశ ప్రభుత్వానిది.
తెలంగాణకు ఉజ్వల పోరాట చరిత్ర ఉన్నది. ఇది రాజకీయాల అంధకారంలో కలిసిపోరాదు. దీనిని నవలకు ఎక్కించి భావితరాల వారికి భద్రపరచాలనే సంకల్పం వట్టికోట ఆళ్వార్స్వామికి కలిగింది. వారు 1938కి పూర్వపుప్రజాజీవనం వస్తువుగా 'ప్రజలమనిషి' అనే ఉత్తమ నవల రచించారు. ప్రచురించారు. వారి ప్రణాళికలో తరువాతి నవల 'గంగు." గంగు రచన జరుగుతుండగానే 1961 లో ఆళ్వార్ స్వామిగారు పరమపదించారు. గంగు రచనతో నాకు సన్నిహిత సంబంధం ఉండింది. నవల మధ్యలోనే నిలిచిపోవడం నాకు బాధ అనిపించింది. ఆళ్వార్ స్వామి వదిలిపోయిన శేషకార్యాన్ని ఎవరయినా పూర్తి చేస్తారు అని ఎదురు చూచాను.
ఆళ్వార్ స్వామి మిగిల్చిపోయిన నవల రచన సామాన్యం అయింది కాదు. నిజాం నాటి తెలంగాణ పరిస్థితులు తెలిసి ఉండాలి. తాత్త్విక అవగాహనా కావాలి. కళారూపం ఇచ్చే ప్రజ్ఞాపాటవాలు కావాలి. నిజాం కాలంనాటి తెలంగాణ జీవితాన్ని నవలలుగా రచించే కార్యం ఎవరూ చేపట్టినట్లు కనిపించలేదు. నేనుకూడ పూనుకోకుంటే 'జన్మజన్మాలబూజు నిజాంరాజు' ధర్మప్రభువుగా చలామణీ అవుతాడని భయం. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో నేను నవల వ్రాయడానికి పూనుకోవలసి వచ్చింది.
ఆళ్వార్ స్వామి 'ప్రజలమనిషి' నవలను 'భయం భయంగా వెలువరిస్తున్నాను' అన్నారు. నవల గురించి నాకూ అలాంటి భయమే ఉంది. నవల ఒక సామాజిక ప్రక్రియ. ఇది ఒక మహత్తర కళారూపం. మొత్తం సమాజాన్ని తనలో ఇముడ్చుకునే శక్తి నవలకు ఉంది. అలాంటి ప్రక్రియను చేపట్టడం నాకు సాధ్యపడుతుంది అనుకోలేదు. అయితే ఈ బాధ్యత నామీద పడింది. వదులుకునేట్లూ లేదు.
నవలా రచనకు సిద్దం అయినాను. అనేక నవలలు ఆంగ్లం - హిందీ - ఉర్దూ - తెలుగు చదివాను. నవలా రచనను గురించి ఆంగ్లంలో పుస్తకాలు చదివాను. ఇతివృత్తం - పాత్రలు అధ్యయనం చేశాను. నవలా రచనను గురించి ఒక అవగాహనకు వచ్చాను.
నిజాం కాలంనాటి పరిస్థితులు - నామీద ముద్రవేసినవికాక, మరికొన్నింటిని సేకరించాను. తొలివిడతగా 1938కి పూర్వపు తెలంగాణా జన జీవితాన్ని ఒక నవలగా రచించాలనుకున్నాను.
1938 తెలంగాణ జనజీవిత చరిత్రలో ఒక మైలురాయి. అప్పటివరకు తెలంగాణంలో రాజకీయ పార్టీలేదు. అదే సంవత్సరం హైదరబాదు స్టేట్ కాంగ్రెస్ ఏర్పరచే ప్రయత్నం జరిగింది. స్టేట్ కాంగ్రెస్ ఇంకా రూపుదిద్దుకోకముందే నిజాం దాన్ని నిషేధించాడు. ఇంకా అస్థిత్వమే ఏర్పడని సంస్థను నిషేధించిన ఘనత నిజాం నవాబుకే దక్కుతుంది. అతనికి ప్రజలన్నా ప్రజా ఉద్యమం అన్నా హడల్ 'సూర్యుడు ఉదయించకుండా నిలుపగలను' అనుకున్న మూర్ఖశిఖామణి - నిశీధి నిబిడాంధకారాన్ని అరుణోదయం చీల్చి చెండాడగలదని ఎరుగని దివాంధుడు మీర్ ఉస్మానలీఖాన్!
'ప్రజల మనిషి'లో ఆళ్వార్ స్వామి చిత్రించిన కాలమూ ఇదే. ఆళ్వార్ స్వామి నిలిచిపోయిన దగ్గరినుంచి కొనసాగించదలచలేదు. అది నాకు సాధ్యం కాకపోవచ్చు. వారు తమకు అనువైన పాత్రలను మలచుకున్నారు. ఇతివృత్తం ఒక్కటే అయినా దృక్కోణాలు మారవచ్చు. నేను ఎవరికీ ప్రతిబింబం కాదలచలేదు. నా మార్గం నేను మలచుకోదలచాను.
చాల శ్రమించి పాత్రలను సిద్దం చేసుకున్నాను. ఆనాటి పరిస్థితులను అర్ధం చేసుకున్నాను. అవి వరుసగా నాముందు సాగిపోయాయి. నాటి ఉద్యమం లేని పోరాటాన్ని తలచుకున్నాను. ఒక నేపథ్యం సిద్దం చేసుకున్నాను.
నవలను ఏ తెలుగు యాసలో రచించాలి? తెలుగుభాష సాంతం ఒకటే. 'మాండలికం' అనేది మనం అరువు తెచ్చుకున్న పదం. భాష ఏ ప్రాంతంలోనూ మారదు - కొన్ని పదాలు తప్ప యాసమాత్రమే ఒక్కొక్క ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. రాజకీయ హద్దుల్లో యాసను కుదించడం దోసిలితో సముద్రాన్ని పట్టడం వంటిది. ఆంగ్రేజుల పుణ్యమా అని ఆంద్రదేశం మూడుగా చీలింది. ఆంద్ర - తెలంగాణ - రాయలసీమలు ఏ విధంగానూ యూనిట్లు కావు. ఆంద్రలో యాస సాంతం ఒకటి కాదు. ఉత్తరాంధ్రము - గోదావరి - కృష్ణ - పలనాడుల యాస వేరు. అట్లే మహబూబ్ నగర్ - ఆదిలాబాద్ - కరీంనగర్ - వరంగల్లు - ఖమ్మం యాసలు వేరు. రాయలసీమలో కడప - అనంతపురం - చిత్తూరు యాసలు వేరు. అంతేకాదు, కులాలు - వృత్తులు - వర్గాలనుబట్టికూడా యాస మారుతుంది. కాబట్టి యాసకు రాజకీయపు హద్దులు ఏర్పరచడం విజ్ఞతకాదు!
నవలను పూర్తిగా యాసలో - మాండలికంలో నిర్మించడం నాకు ఇష్టం లేదు. తెలంగాణం - తెలంగాణ మాండలికం నా ప్రాణ సమాన అభిమానములు. నాది అభిమానమే కాని దురభిమానం కాదు. రాజకీయ లభి నా లక్ష్యం కాదు. అసలు ఏ లబ్దికోసమూ నేను రచనలు చేయలేదు! ఒక ఉన్నత లక్ష్యసాధనమే నా పరమ లక్ష్యం.





