Home » vaddera chandidas » Anukshanikam 2
"కాని మన పెద్దవాండ్లు మనం బత్కినంత కాలం బత్కరుగద! వాండ్లు చచ్చిపోయినంక యెవర్ని తిట్టాల?"
"మన పిల్లల్ని"
"మన పోరళ్ళను అడ్తె వూకుంటరు! వుల్టా దబాయిస్తరు. మమ్మల్నెవరు కనమన్నరు? మేమడిగితిమా! అని అంటే చప్పుడు చెయ్యక నోరు మూసుకోవాల"
"యిదీ కాదంటే సిసలైన పరిష్కారం వొకటుంది, చెబుతాను. అది ప్రయత్నించి చూడండి, మీ వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూశాక పెళ్ళి చూపులయ్యాక బాగా నచ్చిన వాళ్ళని సెలక్టు చేసుకుని పెట్టుకుని వొక్కొక్కరి పేరున - రూపాయి బిళ్ళతో టాస్ వెయ్యి. చిత్తుపడినా వొద్దు. బొత్తుపడినా వొద్దు. యెందుకంటే, చిత్తుపడితే వెనకకాలంలో, బొత్తు పడితే ముందుకాలంలో, విశేషానుభావం వుండే మనిషి అవిభావిద్దాం. అలా బొమ్మో బొరుసో కాక కాయిన్ గోడుమీద నిలిచి డొల్లుకుంటూ పోతే-పండగనాడు కూడా పాత మొగుడేనా అన్నట్లు యెప్పుడన్నా జస్ట్ సింప్లీ ఫర్ యెక్స్ ట్రా మెరిటల్ యెక్స్ పీరియన్సెస్ పేక్-వో పై చూపు చేసేదని....అలాంటి కేసు ఐతే బాగా కట్నం వొస్తే వొప్పుకొని సర్దుకుపోవచ్చు. కాయిన్ గోడు మీద పడి నిలిచి, డొల్లి పోకుండా పడిపోతే నిఖార్సయిన సరుకు అని నిర్దారించుకో వొచ్చు. ఛీ అన్నా ఛా అన్నా తిట్టినా కొట్టినా విడవకుండా పట్టుకుమండిపోతుంది, యెటూ కన్నెత్తి చూడకుండా"
"ఆఁ గిది మంచిగా కొడ్తున్నది. యీ అకేషన్ ల హోటల్ కి పోయి మంచిగ బిర్యానీ తిని-పీన్మకు-బ్లాక్ బెల్ట్ జోన్ చూద్దం పదండి" అన్నాడు రంగారెడ్డి ఉత్సాహంగా.
ఆ తరవాత వూరెళ్ళాక పెళ్ళిచూపులకి వొప్పుకున్నాడు. నచ్చిన వాళ్ళ వివరాలు పుట్టినప్పటినుంచి వాళ్ళ బతుకంతా వివరాలన్నీ తెలుసుకుని చివరిగా సెలక్ట్ ఐన వాళ్ళ గురించి "లెట్ మీ నాట్ బి రెస్పాన్సిబుల్; లెట్ ది కాయిన్ బి రెస్పాన్సిబుల్" అని టాస్ వేస్తూపోయారు.
తమాషాగా- తనకి అన్ని రకాలగానూ బాగా నచ్చిన సంబంధం గురించి టాస్ వేసినప్పుడు కాయిన్ గోడుమీదనిలిచి యెటూ డొల్లిపోకుండా పడింది.
"కాయిన్ యీజ్ రైట్. ఐయామ్ రైట్. లెట్ ది ఫేట్ ఆల్బో బి రైట్" అనుకుని ఆ సంబంధం ఖారపరచమన్నాడు.
అలా జరిగి-పెళ్ళి శుభలేఖలు అచ్చు అయ్యి యీరోజు ఆ శుభలేఖ రంగారెడ్డి వుత్తరాన్ని వెంటబెట్టుకుని శ్రీపతి దగ్గిరికి చేరింది.
131
"జయప్రకాష్ నారాయన్ చచ్చిపోయిండట" అంటూ ఆరోజు దినపత్రిక తీసుకొచ్చాడు, రాములు
రాంనగర్ పాకలో పడకకుర్చీలో కూచుని కళ్ళు మూసుకుని వున్న రని, రెప్పలు విప్పి నిర్లిప్తంగా చూసి పత్రిక అందుకుని చూస్తున్నాడు.
రెండు నెలల క్రితం రవికి మంత్రివర్గం నుంచి వుద్వాసన చెప్పాడు ముఖ్యమంత్రి. ఆ స్థానంలో గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాడు. ఐతే కార్మిక మంత్రిత్వశాఖ మరొకరికి మార్చి ఆ శాఖ గోవర్ధనరెడ్డికి యిచ్చాడు.
యిది జరిగిన రోజున బచ్చుగంగారామూ మిగతా అనుచరులూ సమావేశమై పరిస్థితి చర్చించారు. "యెందుకోసం యిట్ల చేసిండోయెక్స్ ప్లనేషన్ యిమ్మనాల" అని తీర్మానించారు. అప్పుడు నళినిచెప్పిన దగ్గిర్నుంచి లోకేష్ తన మద్దతు రవికే అందిస్తున్నాడు-అనుచరుడుగా చేరకపోయినా.
చివరికి ఢిల్లీ వెళ్ళి యిందిరాగాంధీకి జరిగిన అన్యాయం గురించి వివరించాలని అందరూ కలిసి తీర్మానించారు. యీ మధ్యకాలంలో రవికి ఆమెతో పరిచయం యేర్పడింది గానీ బాగా దగ్గిరగా తెలియదు. అందరూ కలిసి వెళ్ళారు. "బలప్రదర్శనకా! వీళ్ళంతా దేనికి? వాళ్ళని పంపేసి విషయం నువ్వె చెప్పు." అంది. వివరించాడు రవి. "మీ ముఖ్య మంత్రితో మాట్లాడతాను. మంత్రి పదవే ముఖ్యంకాదు. కొందరు కొన్నాళ్ళుంటారు. మరికొందరు కొన్నాళ్ళుంటారు. యిప్పుడు నాకు యే పదవి వుంది?" అని అంది.
తిరిగి వొచ్చారు. "యీమె కర్నాటక ఆంధ్రా సపోర్టు తోటి బత్కుతున్నది. అందుకోసం వీన్కి బలం మస్తుగున్నది. యేమి చెప్తే అది చేసే లెక్కలేదు. ఆమె కూడ యెట్లంటే అట్లా చెప్పజాలదు. వీనికేమో పైసతప్ప వేరేదేన్తోటిపనిలేదు. వాడుగోవర్ధన్ మస్తుకమాయించి యిస్తున్నడు. కాంట్రాక్టర్ల తాన లాఖోం రూపయేఁ చందాలు వసూలుజేసి యిస్తున్నడు. మనం గూడ ఆమెకే సపోర్టు."
రవికి ఆ నేర్పు లేదు. యిప్పుడు యే నేర్పూ లేదు. ఆర్ధిక శాస్త్రపఠనం యేనాడో ఆగిపోయింది. మంత్రి పదవి అధికార హోదాలు సన్మానాలు వంటివి తప్ప అతని మనసును కదల్చగలిగేవి మరింకేమీ లేవు.
యిప్పటికీ తన నియోజకవర్గంలో బాగా పలుకుబడి వుంది. అతనిని మంత్రి పదవి నుంచి తప్పించినందుకు అతని వోటర్లు ముఖ్యమంత్రిని దూషిస్తూవుంటారు. అంతవరకు సంతృప్తేగానీ, యింతస్వల్పమైన బ్రతుకుఅసహనంగా అనిపిస్తూ వుంటోంది. ప్రజల పనులు చేయించి పెడుతూనే వున్నాడు కానీ పూర్వపు వుత్సాహం, వుద్వేగం లేవు.
యిక్కడ వుండి పోయినరోజున రాములే వొండిపెడతాడు, రవికి. అతను యెలాగూ వొండుకు తింటాడు. రవివుంటే ప్రత్యేకంగా వంటచేస్తూంటాడు. మొదట్లో, యింటి నుంచి క్యారియరు పంపిస్తే వొద్దని చెప్పాడు. అప్పుడప్పుడు అక్కడా వుంటూంటాడు.
గంగికి కూడా ఆదాయం తగ్గింది - రవి మంత్రిపదవి పోవటం తోనూ, అతని నిర్లిప్తత వల్లా-ఐనా ఇప్పటికే వున్న స్థితి వల్లా పరిచయాలూ ఆబ్లిగేషన్లవల్లా తానుగా కొన్ని పనులు చేయించగలదు లాభం లేకుండా యే పనీ చేయించిపెట్టదు యెవరికీ ఆ పైన కొన్ని సంస్థలలో షేర్స్ వున్నాయి. కొన్ని వ్యాపారాలున్నాయి. బ్యాంకు బ్యాలన్సూ వుంది. పదిశాతం కుర్రాళ్ళమీదఖర్చుపెడుతుంది. గడిచిపోతోంది. ఐతే రవి మంత్రిగా వున్నప్పటి హోదా దర్జా ఆ యిది లేదని గిజగిజ లాడిపోతూ వుంటుంది. వొక్కోసారి.
రవి, వొక్కోక్షణంలో భరించలేనట్లుగా పిచ్చెక్కినట్లుగా ఐపోతుంటాడు. యేదొక సమస్య గురించి కార్మికుల్ని రెచ్చగొట్టి గొడవచేయిస్తుంటాడు తాను బయటపడకుండా. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గోవర్ధన్ రెడ్డి వుత్తరాలు రాయించాడు. రవి, పార్టీకి పార్టీ నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని. ముఖ్యమంత్రి వొకసారి స్వయంగా వార్నింగిచ్చి, అవసరం ఐతే యిందిరాగాంధీ మందలింపు కూడా తప్పదని వాయించాడు, రవిని.
"వీడు యెట్లంటే అట్ల నడుస్తున్నదిప్పుడు. మార్నింగ్ ఆఫీసులు పెట్టినా వొన్ వే ట్రాఫిక్ లు పెట్టినా యేమి చెవినగూడ యెదురులేక నడుస్తున్నది వీని మాట" అని దుగ్దగా అనుకుంటూ వుంటారు గంగారాంవాళ్ళు, అప్పుడప్పుడు.



