Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
సంజీవరెడ్డిగారు లేచి నన్ను దగగ్రికి తీసుకుని ఆశీర్వదించారు. మాడపాటివారు కూడా ఆశీర్వదించారు.
తరువాత సభకు విచ్చేసిన ఒక్కొక్క కవికి రాజేశ్వరరావుగారు సన్మానం చేశారు. వారు తమ కవితాగానం చేశారు.
అనంతరం వాద్యబృందం సహితంగా - గాయకులూ రణభేరిలోని కొన్ని కవితలు గానం చేశారు.
అల్లాడి పెంటయ్యగారి కృతజ్ఞతలతో సభ దిగ్విజయంగా ముగిసింది.
తెల్లవారి పత్రికలన్నీ ఈ వార్తను ఫోటోల సహితంగా ప్రముఖంగా ప్రచురించాయి. పత్రికలు 'రణభేరి'ని ప్రశంసిస్తూ సమీక్షలు వ్రాశాయి.
మిత్రులు భీమ్ సేన్ నిర్మల్ హిందీలో రణభేరిని గురించి వ్యాసం వ్రాస్తూ, ఇంత మంచి గ్రంథం హిందీలో కూడా రాలేదన్నారు.
నా ప్రయత్నం ఫలించినందుకు నేను పొంగిపోయాను. రాజేశ్వరరావుగారు నా కృషికి ఎలాంటి ప్రతిఫలమూ చెల్లించలేదు! ప్రభుత్వం పట్టించుకోదు కదా!!
కాలప్రవాహంలో చందా నారాయణ శ్రేష్టిగారి సంపద కరిమింగిన వెలగపండులా కరిగిపోయింది. కడుదీనావస్థలో రాజేశ్వరరావుగారు కన్నుమూశారు. కాలం ఆనాటి వారిని చాలమందిని కబళించింది.
రణరంగం:
భారతదేశం మహత్తరదేశం! ఇది ఎన్ని దాడులను - దండయాత్రలను - దోసిళ్ళను తట్టుకున్నది! ఎన్ని నాగరికతలు, ఎన్ని సంస్కృతులు మారినాయి!! అయినా ఈ దేశం - ఈ ప్రజ - ఈ తాత్త్విక చింతన హిమవదున్నతం అయి నిలిచి ఉంటుంది. ఇక్బాల్ అంటాడు:-
కుచ్ బాత్ హైకి హస్తీ మిటథీ నహీ ఁ హమారీ
సదియోఁరహాహై దుష్మన్ దౌరే జమాఁహమారా!
(వందల ఏళ్ళుగా కాలం మనకు శత్రువై కూచుంది. అయినా ఏదో రహస్యం ఉంది. మన వ్యక్తిత్వం చెరిగిపోవడం అంటూ జరగదు.)
భాష-కులం-మతం-ప్రాంతం లాంటి విషయంలో నిరంతరం పోట్లాడుకుందుము గాక - దేశానికి విపత్తు కలిగినపుడు ఒక్క మనిషిలా ఉద్యమిస్తాం. ఇది విదితం చేయదలచాను. చైనా దండయాత్ర జరిగినపుడు వివిధ భాషలలో వచ్చిన కథలను సేకరించి తెనిగించాలనుకున్నాను. ఆశయం మంచిదే! ఆచరణ? విషయం విన్నవారంతా గొప్పగా ఉందన్నారు. సాయం చేసినవారు లేరు.
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతు రురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్దార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.
ఇది భర్త్రుహరి శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెనిగింపు వంటరిని - దుర్బలున్ని - ఎలాంటి సహాయ సంపదలేనివాణ్ణి అయినా ప్రయత్నం మానలేదు. అన్ని భాషల రచయితలతో విసుగులేకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాను. కథలు సంపాదించగలిగాను. కాని, ఆ భాషలే మనకు తెలియవు.
మనసున్న చోట మార్గానికి కొదువలేదు. హైదరాబాదు విచిత్ర నగరం. ఇక్కడ అన్ని భాషలవాళ్ళూ ఉన్నారు. వారికి సంఘాలున్నాయి. వారికి రచయితలున్నారు. వెదికి వెలికి తీశాను. నిరంతర ప్రయత్నంతో వాటికి హిందీ లేక ఇంగ్లీషు అనువాదాలు చేయించాను.
ఈలోగా ఒక పిడుగు పడింది. 27 మే 1964 న భారతప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పరమపదించారు. నెహ్రూ ప్రధాని మాత్రమేకాదు. మహత్తర మానవతావాది. నవభారత నిర్మాత. ఈనాటి పారిశ్రామిక భారతానికి అతడే ఆవిష్కర్త. అతడు ఆశావాది. శాంతిదూత. అలీనోద్యమ నిర్మాత.
భారతదేశానికి మహాత్ముని అకాల మరణం తఃరువాత ఇదే మరొక దెబ్బ!
"భారతప్రజలనుంచి నాకు లభించిన ప్రేమాభిమానాలు అపారములు. అంతటి అపార అభిమానంలో ఆవగింజంత తీర్చడం కూడా అసాధ్యం. అమూల్యములయిన ప్రేమాభిమానాలను తీర్చడం సాధ్యమా? చాలామందిని భారతీయులు గౌరవించారు. కొందరిని పూజించారు. కాని వారు నన్ను ప్రేమాభిమానాలతో ముంచెత్తారు. నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. నేను చేయకలిగింది భారతప్రజా ఆసలకు ఆశయాలకు అనుగుణంగా - వారి ప్రేమాభిమానాలకు తగినట్లుగా నా శేషజీవితం గడపడమే" అన్నారు నెహ్రూ అందుకు అనుగుణంగా జీవించారు.
నేహ్రూలేని దేశం వెలుగులేని భారతం అయింది. దేశం సాంతం శోకసాగరంలో మునిగిపోయింది. అప్పుడు నాయన మా ఇంట్లో ఉన్నారు. "ఏమిటీ దుఃఖం? ఎవడు చచ్చాడు?" అని సంస్కృతంలో అడిగారు. వారు లౌకికులు కారు. అర్ధం కాలేదు. ఇదొక వెర్రి అనుకున్నారు.
తెల్లవారి నాయన బజారుకాని వెళ్ళారు. తిరిగి వచ్చారు. "ఒక్క దుకాణం లేదు. ఒక్క రిక్షాలేదు. ఇది నిర్బంధం కాదు. స్వచ్చందం. నెహ్రూ నిజంగానే గొప్పవాడు. రంగడూ! భాగవతంలో కృష్ణ నిర్యాణం వలె ఉన్నదిరా! భాగవతంలో పార్ధుడు ధర్మరాజుకు కృష్ణనిర్యాణ వార్త చెపుతాడు. ఆ ఘట్టం చదువు" అన్నారు. చదివాను. ఎన్నటిదో వృత్తాంతం! ఈనాడు మమ్ములను కదలించింది. ఇద్దరమూ కంట తడిపెట్టాం.
క్రితంరోజు సాయంత్రం మా కాలనీలో షామ్యానావేసి నెహ్రూ పటం పెట్టాం. పటానికి పూలదండవేసి దీపం వెలిగించాం. సంతాపవాక్యాలు పలికాం. అదిగో అక్కడ S.B. గిరి అనే కార్మిక నాయకునితో పరిచయం అయింది. వారు మా కాలనీలోనే ఉంటారు. అయినా ఇంతకాలం కలుసుకోలేదు. వారు నెహ్రూ అభిమాని మాత్రమేకాదు - నెహ్రూతో పరిచయం ఉన్నవారు వారితో గంటలు మాట్లాడాను. నాటినుంచి మేము విడదీయరాని మిత్రులం అయినాం.
నెహ్రూ నిదానం నన్ను ఎంతో కృంగదీసింది. నేను భావుకుణ్ణి! భావుకుడు కాకుండా రచయిత - కళాకారుడు కాలేడు! చాలరోజులు కథల అనువాదం అంటుకోలేదు. తరువాత హిందీనుంచి తెలుగు అనువాదాలు కొన్ని నేను చేశాను. కొన్ని చేయించాను. సంకలఅననికి "రణరంగం" అని పేరు పెట్టాను. ఇందులోని రచయితలను - భాషలను పేర్కొంటాను.
1. బెంగాలి - శ్రీమతి ఆశాపూర్ణాదేవి తరువాత వీరికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.
2. ఇంగ్లీషు - శ్రీమతి తపతీముఖర్జీ.
3. గుజరాతీ - డాక్టర్ శ్రీ రమేష్ జానీ
4. హిందీ - శ్రీ కిషన్ చందర్
5. కాశ్మీరీ - శ్రీ రాజేష్ గౌహర్
6. మరాఠీ - శ్రీ బి. డి. భావే
7. పంజాబీ - కర్నల్ నరేందర్ పాల్ సింగ్
8. తమిళం - శ్రీమతి శ్రీప్రియ
9. తెలుగు - దాశరథి రంగాచార్య
10. ఉర్దూ - శ్రీ ఖ్వాజా అహమద్ అబ్బాస్
11. ఒరియా - శ్రీ కాళిందీచరణ పాణిగ్రాహి
ఆవేశంలో - నిరంతర ప్రయత్నంద్వారా - సంకలనం సిద్దం చేయగలిగాను. కాని ప్రచురణ అతికష్టం అయింది. ఒక దశలో ఇంత పరిశ్రమ వృధా అయిపోతుంది అనిపించింది. అచ్చువేయడానికి నాకు ఆర్ధిక స్తోమతలేదు. ప్రభుత్వానికి రాజకీయం తప్ప సాహిత్యం తెలియదు. పైరవీ చాతనవుతే సాహిత్యాన్ని రాజకీయం అనిపించవచ్చు. సాయం సాధించవచ్చు. కాని నాకు అర్ధించడం చేతకాదు. పైరవీ జాడ తెలియదు.
ఇలాంటి సమయాల్లో దైవం సాయం చేస్తాడు. సత్సంకల్పాన్ని భగవంతుడు మెచ్చుతాడు తప్పక అనుగ్రహిస్తాడు. విచిత్రంగా సందెపూడి రామచంద్రరావుగారి పరిచయం అయింది. వారు స్వయంగా కవులు! వారు నా పరిశ్రమ - సాహిత్య ప్రాధాన్యత గ్రహించారు. "రణరంగం" ప్రచురణ బాధ్యత స్వీకరించారు.
మిత్రులు S.B. గిరిగారు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారి 'ప్రశంసోవాక్యాలు' తెచ్చారు. వాటిని పుస్తకంలో చేర్చాం.
'రణరంగం' భారత సమైక్యతకు సంకేతం. భారత నాగరికత - సంస్కృతి - ఆలోచనా విధానం ఒక్కటే అని నిరూపించే గ్రంథం.
'రణరంగం' గ్రంథాన్ని జాతినేత - శాంతిదూత పండిత జవహర్ లాల్ నెహ్రూకు అంకితం ఇచ్చాను.
బహుప్రయాస తరువాత "రణరంగం" 1965లో వెలువడింది. దేశభక్తి ఎంత కఠినం అయిందో అర్ధం అయింది.
దీనికి నేను వ్రాసిన 'పొలికేక' అనే పీఠిక 'పరిశీలన'లో చేర్చడం జరిగింది.
'రణరంగం' సంకలన ప్రయత్నంలో వివిధ రాష్ట్రాల - భాషల రచయితలు ఎంతగానో సహకరించారు. వారంతా ఆయా భాషల్లో ప్రముఖులు. అయినా వారికి నేను ఏమీ ఇవ్వలేకపోయాను. వారి కథలను చేర్చుకోవడానికి వారు సంతోషంగా ఉచితంగా అనుమతించారు.
ఈ గ్రంథ సంకలనంలో శ్రమ - మానసిక వ్యధ తప్ప నాకు ఏమీ లభించలేదు. సందెపూడివారి సాయంవల్ల 'రణరంగం' గ్రంథరూపంలో చూడడమే ఆనందం!





