Home » vaddera chandidas » Anukshanikam 2



                               130
    
    శ్రీపతి, స్కైలాబ్ ఆస్ట్రేలియా భూభాగంమీద కూలినవివరాలు చదువుతూండగా వుత్తరాలొచ్చాయి. వాటిలో వొకటి రంగారెడ్డి దగ్గిర్నుంచి-శుభలేఖతో పాటు, తన పెళ్ళికి తప్పకుండా రావాలని ప్రత్యేకం వుత్తరం రాశాడు యింగ్లీషు. చివర్న, "యింగ్లీష్ నాకు మంచిగొస్తదని కాదు. తెలుగు అంత గూడ రాదు. ఇందుకోసం యింగ్లీష్ ల రాస్తి" అని తెలుగులో జోడించాడు.
    రంగారెడ్డి రెండు నెలలక్రితం సిటీకి వొచ్చినప్పుడు, ప్రత్యేకం శ్రీపతిని వెదుక్కుంటూ హాస్టలికి వొచ్చాడు.
    కాసేపు అవీ యివీ మాట్లాడి, "యీ రండ ముండలంటె మనసైత లేదు. యిట్లయితె హెల్త్ గూడ యెన్ని దినాలుంటది. పెండ్లి చేస్కుంటే యెట్లుంటందంటరు శ్రీపతిగారు?" అన్నారు రంగారెడ్డి.
    "నాకు పెళ్ళి కాలేదుగా యెలావుండేదీ చెప్పటానికి"
    "మజాక్ అనుడు కాదు సీరియస్ గా ఆలోచన చేస్తున్న. పెండ్లి చేస్కొని మంచిగ పెండ్లంతోటి వుండిపోతె మేలుకాదు? యేమిట్కి గలీజు రండముండలెస్క తిర్గుడు"
    "అనిపిస్తే చేసుకోగూడదవీ లేదు"
    "కానీ వొక ప్రోబ్లం వున్నాది, అది మీరు సాల్వ్ చేసిపెడ్తరేమో నని ఆశపడ్తున్న"
    "నేనా? యేఁవిఁటి?"
    "నా కిప్పుడు ముప్పయ్యేండ్లొచ్చె. యిరువై పాతికేండ్లామెను చేస్కొంటే, ఆమె కన్యగా వుండి వుంటదా అంతకాలం?"
    "మనం వున్నాఁవాఁ?"
    "అదేగద నా సమస్య. అందుకోసం మెచ్యూర్ కాని పిల్లను చేస్కోవాల."
    "రజస్వల కాకపోవటం అంటే చట్ట ప్రకారం వివాహ వయసు వొచ్చి వుండే అవకాశం లేదు. అది నేరం అవుతుంది."
    "ఆ ముచ్చట కాదు. దానికేమి యెక్కువ వయసు చెప్తం వూరమనవడిగెటోడెవడు"
    "మరింకేం? వో పదిపన్నెండేళ్ళ పిల్లనిచూసి చేసుకోండి" అన్నాడు శ్రీపతి.
    "చేస్కోవచ్చుగానీ - అంత చిన్నా మెను చేస్కొంటే- ఆమెకు ముఫ్ఫయ్ ఐదేండ్లంట్ల వొచ్చెటప్పట్కి నేను ముసలోన్నై పోత గద! యిప్పటికె మస్తు పోటెన్సీ స్పెండ్ చేసిన. అప్పుడామె యెవనితోనన్న తిర్గితే.
    'అవసరం తీరాలిగా. మనకి సాధ్యపడనప్పుడు యేం చేస్తాం"!
    "సొంత పెండ్లం అట్లా తిర్గితే యెట్ల? ఫెయిత్ ఫుల్ గ వుండాల. దీనికి పరిష్కారం యేమన్న చెప్పండి" అన్నాడు రంగారెడ్డి.
    "దీన్ని పేరడాక్సికల్ పోయింట్ గా చెప్పొచ్చు. మన వయసుకి తగిన యువతిని చేసుకుంటే కన్యగా వుండి వుండదేమోననే యిది. అనుమనం పెనుభూతం. పోనీ రజస్వలవని చిన్నపిల్లని చేసుకుంటే ఆమె మాంచి ప్రౌఢగా వుండే వేళకి మనం ముసలివాళ్ళ ఐపోయి- యెప్పుడో అమావాస్యకో, పౌర్నమికో, యెప్పుడన్నా తెల్లవారు జామున పైరుగాలికి తప్ప యేం చెయ్యలేని స్థితి" అన్నాడు శ్రీపతి.
    "మరి దీనికి సొల్యూషన్ యేమిటి?"
    "దీనికి పూసే సొల్యూషనింకా తయారైనట్లు లేదు" అని చిన్నగా నవ్వి, "రజస్వలకాని పిల్లనిచేసుకుని మనకి పటుత్వంపోయి ఆమె ప్రౌఢగా వున్నప్పుడు ఆమెకు విడాకులిచ్చి మరో రజస్వల కాని పిల్లని చేసుకుంటే సరి!"
    "అప్పుడు గూడ సమస్యనే గద? మెచ్యూర్ కాంగనే కోర్కె మొదలవుతది"
    "అందుకే మన పూర్వీకులు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు, మీ పదహారేళ్ళప్పుడు పదకొండేళ్ళ పిల్లతో పెళ్ళి చేసివుంటే యీ సమస్య వుండకపోను గద!" అన్నాడు శ్రీపతి నవ్వు ఆపుకుంటూ.
    "మా అమ్మకు నాయనకు అంత గూడ  జ్ఞానం లేకపాయె. అప్పుడే పెండ్లి చేసుంటే నేనీ రండ మండలతోటి తిర్గకనే పోదు. ధూ గలీజ్ ముండలు.
    "ఆలస్యంగా జ్ఞానోదయం ఐతే కష్టం"
    "పెళ్ళంటూ చేసుకోకపోతే అసలు యీ సమస్యే రాదుకదా?"
    "కాని అవుసరం తీరెడిదెట్ల? యింక గూడ కొన్నెండ్లు అవుసరం వుంటదిగద! కాంగ పెండ్లాం పిల్లలు వుండాలగద? యిగో యీ పోరడు యీ సోరి సింగిరెడ్డి రంగారెడ్డి పిల్లలు అని చెప్పుకుంటేనేగద మనం బతికుండెడిది? లేకుంటే చచ్చిపోంగనే మననెవరు యేమిట్కి తలుస్తరు?"
    అందుకే సంతానం కలగనివాళ్ళు  యే సత్రవో గుడో బడో యేదో కట్టిస్తుంటారు వాళ్ళపేర."
    "రాయి రప్పలు విడ్దల లెక్కవుతారు, కాంగ మన సొంత పిల్ల లంటే ఆనందంగుంటది గద"
    "మాచకమ్మ అని రజస్వలనని పెద్దవాళ్ళుంటారు. వాళ్ళని చేసుకో వొచ్చు"
    "చేస్కున్నంక రజస్వలైతరా?"
    "వాళ్ళు యెప్పటికీ అనరు. అయ్యేవాళ్లైతే యెప్పుడో అయ్యేవాళ్ళు"
    "గిదింక మంచి జోక్! యీ సిటీల మస్తుమంది వున్నరు హిజ్ డాలు వాండ్లే మేయికద" అని నవ్వాడు రంగారెడ్డి.
    "నూటికీ కోటికీ వో ఫ్రిజ్ డ్ వుండొచ్చు. అసలు సెక్సు కోర్కె వుండదు. అలాంటి స్త్రీని చూసి చేసుకోవటం వొక మార్గం"
    "అంత గూడ కోర్కెలేకుంటే చేస్కున్నంక దగ్గరకు చేరనిస్తదా?"
    'వుఁహుఁ దగ్గిరికెడితే గాడిద తన్నినట్లు తంతుంది" అని నవ్వాడు
    "యివన్ని చూస్తె సన్యాసం పుచ్చుకోవాలన్నట్లా యేమి?"
    "దేనికుండే బాధలు దానికుంటాయి. సన్యాసం బాధలు సన్యాసి కుంటాయి. మరోమార్గం - వో కొండముచ్చు లాంటిదాన్ని చూసి చేసుకోవటం"
    "అసుమంటి దాన్కి చేస్కుంటే తాకబుద్ది కాదుగద! మర్ల రండ ముండలెస్క తిర్గాల!"
    "కాదంటే, మీ పెద్దవాళ్ళకి వొదిలెయ్. పెళ్ళిచూపులు కూడా వొద్దు. అన్నీ వాళ్ళమీదకి నెట్టి తిట్టి తప్పుకుంటూ వుండొచ్చు, దేనికీ మన పూచీ వుండదు"




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.