Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    1. ఎక్కువ రచనలు 'ఆంధ్రప్రదేశ్' (ప్రభుత్వ పత్రిక), 'ఆంద్రప్రభ'లలో వచ్చాయి.
    
    2. మహిళలు వ్రాసినవి 'బహుకొద్ది.'
    
    3. 'భారతి'లో ఒక్క కవితా రాలేదు.
    
    సేకరణ కార్యం పూర్తి అయింది. సుమారు 80 మంది కవులు అనుమతిస్తూ వారి వివరాలు - ఫోటోలు పంపారు. కవులు అందరిని గురించిన వివరాలు సిద్దం చేశాం. ఇందుకు సహకరించిన మిత్రులు పేర్లు గుర్తుకు లేవు!
    
    అచ్చు కార్యం ప్రారంభం అయింది. ఉత్తమం అయిన కాగితం మీద అందమైన అచ్చు సమకూర్చారు రాజేశ్వరరావుగారు. కవితల చివరన రచయిత 1. పూర్తిపేరు. 2. చిరునామా. 3. సుపరిచిత భాషలు. 4. రచనలు. 5. వారిని గురించి నేను అనుకున్న పదంతో కవుల పరిచయాలు కూర్చాను.
    
    అనేక విషయాల్లో సాయపడిన మడిపడగ బలరామాచార్యులవారు మంచు కొండమీద నగారా - దాన్ని మ్రోగిస్తున్న యువకుడు గల పలువర్ణ ముఖచిత్రం - ఎంతో సుందరంగా సమకూర్చారు.
    
    ప్రఖ్యాత శిల్పి గులాం జీలానీ - సైనికునికి హారతి ఇచ్చి సాగనంపుతున్న శిల్పం Farewell my heart రాష్ట్రపతి రాధాకృష్ణపండితునికి బహుకరించాడు. దాని ఛాయాచిత్రం 'రణభేరి'లో చేర్చడానికి అనుమతించారు. చేర్చాం.
    
    కేతవరపు రామకోటి శాస్త్రిగారు - కె. ఎస్. సుబ్రహ్మణ్యంగారు - దేవులపల్లి రామానుజరావుగారు తొలిపలుకులు సమకూర్చారు. నేను 'రణభేరి' శీర్షికన సుదీర్ఘ పీఠిక వ్రాశాను. ఆ పరిశీలనాత్మకం అయిన ఈ వ్యాసాన్ని 'పరిశీలన'లో చేర్చడం జరిగింది.
    
    'చరిత్ర పాలకుల చేతి 'మైనపుబొమ్మ' అని నా నమ్మకం. దండయాత్ర అంతం కావచ్చు. రెండు దేశాలు మిత్రులైపోవచ్చు. కాని భారతదేశపు గుండెకు తగిలిన ఈ గాయం భారతదేశం ఉన్నన్నాళ్ళూ ఉండేదే అందుకే తెలుగు కవి జోదులు కురిపించిన కవితా శతఘ్నులను పరిరక్షించడానికి 'రణభేరి'గా కూర్చాను' అన్నాను.
    
    నేను ఆనాడే ఉభయదేశాలు మిత్రులు అవుతాయని అంచనా వేశాను. నా అంచనా వాస్తవం అయింది.
    
    'రణభేరి' అందాల రాశిగా - సాహిత్యపేటికగా - ఆవేశపు అమ్ములపొదిగా సిద్దం అయింది. పుస్తకం అంతటి గొప్ప ఆవిష్కరణ జరగాలని నేను అనుకున్నాను. ప్రచురణకర్తలు సంసిద్దత వ్యక్తపరచారు. ఈ విషయంలో మాకు సహకరించినవారు అప్పటి కౌన్సిలరు అల్లాడి పెంటయ్యగారు.
    
    అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారు ఆవిష్కరించాలని సంకల్పం. వారిని ఆహ్వానించడానికి ఎవరు వెళ్ళాలి అని మీమాంస. నేను వెళ్తానన్నాను. అప్పటికి సంజీవరెడ్డిగారు 'గ్రీన్ లాండ్స్'లో ఉంటున్నారు. వారిని సులభంగానే కలుసుకోగలిగాం. వారికి పుస్తకం అందించాను. వచ్చిన పని చెప్పాను. వారు మురిసిపోయారు. 'ఇంత పని చేసినావు. ఎప్పుడు రమ్మంటావో చెప్పు, వస్తాను' అని ప్రోత్సహించారు. 1963 నవంబర్ 7 వ తేదీన ఆవిష్కరణోత్సవం నిర్ణయించాం.
    
    నేను 'రణభేరి'ని మంచుకొండమీద మాతృదేశ రక్షణకు అసువులు బాసిన అమరవీరులకు అంకితంగా సమర్పించాను:-
    
    "తల్లి పయ్యెద నెవ్వడో తాకెనన్న
    ఓర్వజాలక రణమున కురికినావు
    తుచ్చులను కూల్చి ఒరిగిన దొరవు నీవు
    అందుకొనుమయ్య 'రణభేరి' అంకితమ్ము" అన్నాను.
    
    అమరవీరుల తరపున అంకితం అందుకోవలసిందని అప్పటి గవర్నర్ 'జనరల్ నగేశ్'ను కోరాం. అతను తెలుగువాడు. హైదరాబాదు వాసి. అందుకు వారు ఎంతో సంతసించారు. కాని, సాంకేతిక కారణాలవల్ల సాధ్యపడదు అన్నారు. వారు బ్రిగేడియర్ సయీద్ ను ఆహ్వానించమని సూచించారు. సయీద్ యుద్దంలో పాల్గొన్నారు. అసువులు బాసినట్లు ప్రకటించారు. సయీద్ భార్య - కవయిత్రి తాహరా - శోకగీతం వ్రాసి ప్రకటించింది. అల్లా అనుగ్రహంతో అతడు ప్రాణాలతో బయటపడ్డారు. జనరల్ నగేశ్ ఈ విషయాలు చెప్పి, మేము వస్తున్నామనీ, మా ఆహ్వానం మన్నించమనీ ఫోనులో ఆదేశించారు.
    
    మేము సయీద్ కార్యాలయం చేరుకున్నాం. సయీద్ తాను ఎదురు రావడం మాత్రంకాదు సైనిక లాంఛనాలతో స్వాగతం పలికారు. అమరవీరులను గురించి కవులకు ఉన్న శ్రద్దాసక్తులను తమ అధికారులకు వివరించారు. మమ్ము ఎంతగానో గౌరవించారు. మా ఆహ్వానం మన్నించారు.
    
    అందమైన ఆహ్వానాలు సిద్దం అయినాయి. కవులకు పెద్దలకు - పిన్నలకు - ప్రజలకు పంపడం జరిగింది.
    
    7 నవంబర్ 1963 రానేవచ్చింది. గాంధీభవన్ లోని ప్రకాశం హాలు పెళ్ళికూతురులా ముస్తాబయింది. అరటి బోదెలు - మామిడి తోరణాలు - దీపపంక్తులతో తేజరిల్లింది. సభావేదిక పుష్పగుచ్చలతో రమణీయంగా అలంకరించబడింది.
    
    అలాంటి సభ బహుశః సాహిత్య చరిత్రలో జరిగి ఉండదు. అది సైనికుల - కవుల - ప్రజల సమ్మేళనం. గాంధీభవన ఆవరణలో సైనిక శకటాల సరసన ప్రజల మంత్రుల వాహనాలు! ప్రకాశం హాలులో ఒకప్రక్క సాంతం యూనిఫాంలో సైనికాధికారులు జవానులు ఆసీనులయినారు. మరొక పక్క ప్రజలు పెద్దలు నిండిపోయారు. జనంతో కారిడర్ సహితం నిండిపోయింది. సభకు ఆంద్రపితామహ మాడపాటి హనుమంతరావు విచ్చేశారు.
    
    నీలం సంజీవరెడ్డిగారు కారు దిగగానే నన్ను గురించి అడిగారు. నన్ను వెంటపెట్టుకొని హాలులో ప్రవేశించి ఆసీనులయినారు. నన్ను ఎంతో మెచ్చుకున్నారు.
    
    సభకు కమల - పిల్లలు వచ్చారు.
    
    ప్రచురణకర్త చందా రాజేశ్వరరావుగారు పరిశ్రమల శాఖామాత్యులను అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానించారు. తరువాత ఆవిష్కర్తగా ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిగారిని, వక్తలుగా సమాచారశాఖామాత్యులు పి.వి. నరసింహారావుగారిని, రవాణాశాఖామాత్యులు బి. వి. గురుమూర్తిగారిని ఆహ్వానించారు. కృతి అందుకోవడానికి బ్రిగేడియర్ సయీద్ ను, కృతికర్తను నన్ను, అల్లాడి పెంటయ్యగారిని ఆహ్వానించారు.

                              
    
    కరతాళధ్వనుల మధ్య అందరూ వేదికను అలంకరించారు. ప్రచురణకర్తలు అందరికి పూలమాలలు వేసి సత్కరించారు. అధ్యక్షులు తొలి భాషణం తరువాత ఆవిష్కరించవలసిందిగా సంజీవరెడ్డిగారిని కోరారు.
    
    సభ సుదీర్ఘకరతాళ ధ్వనుల మధ్య సంజీవరెడ్డిగారు 'రణభేరి'ని ఆవిష్కరించారు. ప్రచురణకర్తల పక్షాన నాకు పూలదండవేసి, శాలువ కప్పి సన్మానిమ్చారు. వారి ఉపన్యాసంలో నన్ను మెచ్చుకుంటూ యువరచయితలు ఇలాంటి దేశభక్తి కార్యాలు చేయాలనీ ఉద్భోధించారు. 'వంద ఉపన్యాసాలు ఒక కవితకు సరిరావని, వంద రాజకీయాలు ఒక కవికి సరిరావనీ' అన్నారు.
    
    పి.వి. నరసింహారావుగారు - బి.ఎ. గురుమూర్తిగారు నన్నూ నా ప్రయత్నాన్నీ ప్రశంసించి, దేశభక్తి కవితలు రావాలని ఆశించారు.
    
    నేను ప్రచురణకర్తకు పూలదండవేసి సత్కరించాను. తఃరువాత బ్రిగేడియర్ సయీద్ పూలమాల వేయడానికి - వారు పొడవు కాబట్టి - వారు వంగవలసి వచ్చింది. సయీద్ కు నేను అంకితం అందించినపుడూ, ఆంగ్లంలో అంకిత వాక్యాలు చదివినపుడూ, సైనికులు లేచినుంచుని కరతాళ ధ్వనులు చేసి తమ సంతోషం వ్యక్తపరచారు.
    
    "అమరవీరులను స్మరించే ఇలాంటి ఉత్సవాలు సైనికులు మరిన్ని త్యాగాలు చేయడానికి ఉపకరిస్తాయి" అన్నారు రుద్దకంఠంలో బ్రిగేడియర్ సయీద్.
    
    నేను ఉపన్యసించాను. జాగృతం చేసేది కవిత - మేల్కొలిపేవాడు కవి అన్నాను. దేశరక్షణ ఒక్క సైనికుల బాధ్యత కాదు - కవుల సహితంగా సకల ప్రజానీకం బాధ్యత అన్నాను. నా అంకితం పద్యాలు అందరిని కదిలించినాయి. అందరితోపాటు సైనికులు కూడా చప్పట్లు కొట్టారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.