Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే కాకా మరికొన్నింటికి ప్రసిద్ది.
    
    1969 ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు.
    
    1969లో అమెరికన్ వ్యోమ నౌక EAGLE చంద్రుని మీద వాలింది. ఇది మానవజాతి ఇతిహాసంలో మరువరాని రోజు మానవజాతి విజయం సాధించిన రోజు.
    
    మా అన్నయ్య దాశరథి సినీమా పాటలకోసం - 1962లో మకాం హైదరాబాదు నుంచి మద్రాసుకు మార్చారు. "నా కంటిపాపలో నిలిచిపోరా - నీవెంట లోకాల గెలువనీరా" అనే చక్కని పాటతో ప్రారంభించి, సినీమాలకు ఎన్నో - ఎన్నో మంచి పాటలు వ్రాశారు. ముఖ్యంగా వీణపాటలు మధురంగా వ్రాశారు.
    
    అన్నయ్య దాశరథి ఉర్దూలోని గాలిబ్ గీతాలకు సుందరమైన తెలుగు అనువాదం చేశారు. బాపూ బొమ్మల అందాలు సంతరించుకున్న 'గాలిబ్ గీతాలు' 1963లో ఉర్దూ హాలులో రమణీయ గోష్ఠిలో విష్కరించబడింది. ఆ గ్రంథాన్ని అక్కినేని నాగేశ్వరరావుగారికి అంకితం ఇచ్చారు.
    
    "ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము
    నరుడు నరుడగుట దుష్కరము సుమ్ము!"
    
                                  ముఫ్ఫయి రెండు
    
రణభేరి :
    
    మృత్పిండో జలరేఖయా వలయితస్సర్వోప్యయం నన్వణుః
    స్వాంశీకృత్య సఏవసంయుగ సశైరాజ్ఞాం గణైర్భుజ్యతే
    
    ఈ భూమండలం వట్టి మట్టిముద్ద. దానిచుట్టూ నీరుంది. సమస్త సృష్టిలో ఇది ఎంత? అణువంత! దానికోసం యుద్దాలు చేస్తారు రాజులు!! వందలమంది పంచుకుంటారు. పాలిస్తారు!
    
    జీవిత సాగరాన్ని మథించి అందునుంచి వహ్చిన అమృతంతో "సుభాషితము" అందించిన అద్బుతకవి భర్త్రుహరి రచించిన శ్లోకార్ధం అది. భూమిని గురించి తాత్త్వికులు - మేధావులు - కవులు - దార్శనికుల మహర్షుల దృక్పథం అది.
    
    నేల - నీరు - గాలి వంటి ప్రకృతి సంపదలు మానవాళికి - సమస్తప్రాణి జాలానికి - భగవంతుడు ప్రసాదించిన ఎనలేని సంపద. ప్రకృతి తల్లివంటిది. అది వ్యత్యాసం చూపదు. డానికి అందరు సమానమే. ఆమెకు హెచ్చు తచ్చులు, పేదలు ధనికులు - మంచి చెడ్డ వ్యత్యాసాలు లేవు. తల్లి అందరికీ చన్నిస్తుంది.
    
    కొందరు ప్రజలను రక్షించే సాకుతో నేలను ఆక్రమించుకున్నారు. రాజులయినారు. ప్రజలను పీడించినారు. ఈ నేల కోసం యుద్దాలు చేసినారు. ప్రజలను బలి ఇచ్చినారు. ప్రజలు రాజుల దౌర్జన్యాలను సహించలేకపోయినారు. హాహాకారాలు చెలరేగినవి. రక్షణ పేర ఏర్పడిన రాజులు భక్షణ సాగించినారు.
    
    మానవుని రక్షించడానికి - అతనికి శాంతి ప్రసాదించడానికి - రాజులను అదుపులో ఉంచడానికి మతాలు వెలసినవి మతాన్ని పాలకులు గుత్తకొన్నారు. శాంతికోసం ఏర్పడిన మతాలపేర రక్తపు నదులు పారించారు. సామ్రాజ్యాలు ఏర్పరచినారు.
    
    మరల శాంతి కరువు - మానవుని తహతహ - మేధావుల నిరంతర తపన మతపు పెత్తనాన్ని కూలద్రోసింది. రాజులను అంతమొందించింది. ప్రజలదే అధికారం అనే నినాదంతో ప్రజాస్వామ్యం అవతరించింది. ప్రజాస్వామ్యమే సామ్రాజ్య విస్తరణకు రెండు ప్రపంచ యుద్దాలు చేసింది. లక్షల అమాయక ప్రజను హతమార్చి, ఓడినవాని నేల చెక్కలను - ప్రజలను - ప్రాణహీన పదార్ధాలవలె పంచుకుంది.
    
    మార్క్స్ మహాశయుడు ప్రవచించిన సోషలిస్టు సిద్దాంతం శ్రామికులకు, శాంతికి పరంధామం కావలసింది. సిద్దాంతం పేర స్టాలిన్ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నినాదంలో తప్ప - చంగీజ్ ఖానుకు - స్టాలిన్ కు తేడా కనిపించలేదు.
    
    చైనాదేశం చారిత్రకంగా భారతదేశానికి మిత్రదేశం భారతదేశం బుద్ధ భగవానునికి జన్మనిచ్చింది. చైనా బౌద్దాన్ని ఆవలంబించింది. రెండు దేశాలు శాంతి కాముకములు. చైనాలో జాతీయ పోరాటం సాగించిన సన్యట్ సేన్ను భారతదేశం బలపరచింది. విదేశీమూకలను ఎదిరించే చైనా సమరంలో భారత డాక్టరు కొట్నిస్ ప్రాణాలర్పించాడు.
    
    చాంగ్ - కై - షేక్ కు వ్యతిరేకంగా మావో మహాశయుడు సాగించిన మహత్తర సోషలిస్టు పోరాటాన్ని భారతదేశం బలపరచింది. భారతప్రజ గ్రేట్ మార్చ్ తో కూడిన పోరాటాలను - అద్భుతం అయినవానిగా అవలోకించింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. చైనా విముక్తం అయింది. కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. భారత ప్రభుత్వం - ప్రజా - ఆ ప్రభుత్వానికి నివాళులు అర్పించింది.
    
    అప్పటి భారతప్రధానికి అనంతం అయిన చారిత్రక అవగాహన ఉంది. అతడు బుద్దుని - బౌద్దాన్ని - అశోకుని అనంతంగా అభిమానించాడు. అతనికి శాంతి కాముకం అయిన చైనామీద అనేక ఆశలున్నాయి. మరిన్ని ఆశలు పెంచుకున్నాడు. ఉభయదేశాలు అంగీకరించిన 'పంచశీల' ద్వారా ప్రపంచ శాంతి కలలు కన్నాడు జవహర్ లాల్ నెహ్రూ.
    
    సామ్రాజ్య కాంక్షకు సిద్దాంతాలతో సంబంధం లేదు. మావో టిబెట్టును ఆక్రమించుకున్నాడు. దేశం సాంతం నెహ్రూను ఎదిరించింది. నెహ్రూ ఆదర్శవాది. అతడు కలల బేహారి. అతడు శాంతికపోతం చేతపట్టినాడు. టిబెట్ ఆక్రమణ సహజపరిణామం అన్నాడు.
    
    భారతదేశం - భారతప్రజ - భారతప్రధాని సహితంగా అందరు చైనాను మిత్రదేశంగా విశ్వసించారు. బౌద్ధంతో కూడిన సోషలిజం దండయాత్ర చేయదు అనుకున్నారు. ప్రమత్తంగా ఉన్నాం. నా వరకు నేను దండయాత్ర చేయగలదని ఊహించలేదు. టిబెట్టు విషయంలో నెహ్రూ విధానం సరియైంది అని నమ్మాను. చైనా - మావో విషయంలో నాకు అనంతం అయిన అడ్మిరేషన్!
    
    చైనా భారతదేశానికి - భారతప్రజకు - చారెడు నేల చెక్కకోసం - మిత్రద్రోహం చేసింది. 1962 అక్టోబర్ 20న 'దేవతాత్మ' అయిన హిమాలయంమీద దాడిచేసి, యుద్ధం ప్రకటించింది! తొలుత భారతదేశం - ప్రజ - ప్రభుత్వం చకితములు అయినవి. ఆశ్చర్యంలో మునిగాయి. కాని మిన్నకుండలేదు.
    
    గిరిమేల్కొన్నది, పురిమేల్కొన్నది
    గిరిగుహలో కేసరి మేల్కొన్నది
    గిరిపుర వనముల ధర మేల్కొన్నది.
    నరనారీ సంతతి మేల్కొన్నది (దాశరథి)
    
    భారతదేశం అనిష్టంగా అమెరికా సాయం అర్ధించాల్సి వచ్చింది. ఏ యుద్ధం అయినా కలకాలం సాగదు! నిలిచింది.
    
    రాతికాలంనుంచి రాకెటు కాలందాకా - వేషాల మార్పుతో - సామ్రాజ్య కాంక్ష రావణకాష్టంలా - తగలబడుతుండడానికి కారణం ఏమి? ఒకింత ఆలోచించిన మన తాత్త్వికులు నిర్వహించిన అహంకార, మమకారాలే కారణం అనిపిస్తుంది. మన మహర్షులు కలలుగన్న 'వసుదైవ కుటుంబకం' పాలకుల చెవికి ఎక్కడపోవడం కారణం అనిపిస్తుంది. 'మా విద్విషావహె' మేము ద్వేషించుకొనము. 'మాగృధః కశ్యచిద్దనం' మరొకరి ధనమును దొంగిలించకు అను ఉపనిషద్వాక్యములు చెవిటికి శంఖధ్వని కావడమే మూల కారణం అనిపిస్తుంది.
    
    ఆదర్శానికి ఆచరణకు నింగికి నేలకు ఉన్నంత అంతరం.
    
    వాస్తవానికి వస్తే నా దేశంమీద పరదేశ దండయాత్రను - సమస్త ప్రజానీకంతో నేనూ సహించలేకపోయాను. కమ్యూనిస్టుల మీనమేషాలు కాదు, నా దేశం, నా ప్రభుత్వం చెప్పింది నిజం అని నమ్మాను. కంటికి కనిపించేదానికి సాక్ష్యం అక్కరలేదు.
    
    దేశం సాంతం - వర్ణ, వర్గ, భాష, ప్రాంత, లింగభేదాలు విడిచి - ఎగబడిన వేళ నేను మిన్నకుండలేదు. దేశభక్తిలో ఎన్నడూ వెనుకాడలేదు. ప్రాణాలు అర్పించడానికి సిద్దం అయినాను. ఆ ప్రాణాలు దక్కినవి అందువల్లనే ఇది వ్రాయగలుగుతున్నాను.
    
    భారతదేశం సాగించిన ఈ మహా సమరంలో కాలం యోధులు కవితాగ్నులు కురిపించారు. వారి కవితలను కూర్చి "రణభేరి"గా ఒక సంకలనం ప్రచురించాలనుకున్నాను. రచనకు ప్రాణం ప్రచురణ. చందా నారాయణ శ్రేష్టి యజమాని - మిత్రులు రాజేశ్వరరావుగారు ప్రచురణ భారం వహించడానికి సంసిద్ధులు అయినారు. వారు ఎంతో భారం వహించారు.
    
    కవులు రచించి ప్రచురించిన కవితలు సేకరించడం ప్రారంభించారు. సంకలనం కోసం కొత్తగా వ్రాయించదలచలేదు. ఆగ్రహంలో - ఆవేశంలో కవులు కురిపించిన అగ్గిగోళాలను సేకరించాలనుకున్నాను. పత్రికల్లో - అంతకుముందు - ప్రచురించబడిన వాటిని వెలికి తీశాను. ఇందుకు గ్రంథాలయాలు - కొందరు మిత్రులు ఎంతగానో సాయం చేశారు. ఇదొక యజ్ఞం ఒక్కరితో సాధ్యం అయ్యే పనికాదు. సుమారు నూరుగురు కవుల కవితలను సేకరించి ఎన్నుకున్నాను.
    
    "అస్త్యుత్తరస్యాం దిశిదేవతాత్మా
    హిమాలయోనామ నగాధిరాజః" అనే కాళిదాసు శ్లోకంతో ప్రారంభించి ఒక లేఖ సిద్దం చేశాను. ఆ లేఖలో -  సంకలనంలో కవితలు చేర్చడానికి కవుల అనుమతి అర్ధించాను. కొందరిని వ్యక్తిగా కలిశాను. వారు నా ప్రయత్నాన్ని శ్లాఘించారు. అనుమతించారు. మరికొన్ని కవితలు అందించారు. మిగిలినవారు ఉత్తరాలద్వారా అనుమతించారు. మెచ్చారు.
    
    ఆ సందర్భంలో నా దృష్టికి వచ్చిన విషయాలు:




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.