Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అది ఒక అపూర్వ సమ్మేళనం! బ్లూ - వైట్ కాలర్ వ్యత్యాసం అంతరించింది. స్వీపరు పక్కన క్లర్కు - పాకీవాని పక్క సూపర్వైజరు కూర్చున్నారు. అనంత జనవాహిని! వివిధ పతకాలు!! వేదిక మీద అన్ని పార్టీలవాళ్ళు!!!
"హమ్ సబ్ మజ్దూర్ హైఁ ఏక్ కలమ్ కా మజ్దూర్ - ఏక్ కామ్ కా మజ్దూర్" అని ఆవేశపూరితంగా గంటమాట్లాడిన నేను-
"ఉఠోమేరే దున్యాకె గరీబోఁకొ జగాదో
ఖాకో ఉమ్రాకె దరో దీవార్ హలాదో"
అనే ఇఖ్బాల్ నజమ్ తో ముగించాను. సభ సుదీర్ఘ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.
మిగతా వక్తలు కూడా శ్రామిక సమైక్యత గురించీ - లోకంలో శ్రామికులకు అసాధ్యమైంది లేదనీ ఎంతో ఉద్రేకంగా మాట్లాడారు. సభనుంచి తరలిన శ్రామికులు తాము లోకాలను జయించగలమన్న ధీమాతో సాగిపోయారు.
ప్రభుత్వం ప్రజలది. ప్రభుత్వ యంత్రాంగం బూజుపట్టిన సామ్రాజ్యవాదపుది. వారు ఉద్యమాలను గమనించరు. గుర్తించరు. పరీక్షల తేదీ ప్రకటించారు. పరీక్షలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చాం. కొందరు ఉద్యోగులు సచివాలయం నుంచి దిగుమతి అయిన అధికారిమీద దౌర్జన్యం జరిపారు. కమీష్నర్ నన్ను అడిగారు. "ఉద్యోగుల ఆగ్రహం అవధులు దాటుతున్నది. అదుపులో ఉంచడం సాధ్యపడేటట్లు లేదు. పరీక్షలు ఉపసంహరించండి" అన్నాను.
"మీరు కమ్యూనిస్టులా?" కమీషనర్ అడిగారు.
"మీరు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు" అని వచ్చేశాను.
పరీక్షలకు ఒకే ఒక దరఖాస్తు వచ్చింది! అతడు కూడా తెల్లవారి ఉపసంహరించుకున్నాడు!!
గోవిందసింగ్ న అసీతుకు వచ్చి నన్ను అభినందించాడు - "తహరీక్ చలానాహైతో ఆప్ సే సీఖ్నాహై" (ఉద్యమం నిర్వహించడం మీ దగ్గర నేర్చుకోవాలి) అన్నాడు కమీషనర్ మా సమైక్యతను గురించి ఆ సంవత్సరపు అడ్మినిస్ట్రేషన్ రిపోర్టులో రికార్డు చేశారు.
పరీక్షలు రద్దయినాయి. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు వచ్చాయి. నన్ను శిక్షించామానుకుని అనువాద కార్యం నుంచి ఇంజనీరింగ్ సూపర్నెంటుగా బదిలీ చేశారు. అది నాకు కార్మికులకు సాయపడడానికి పనికి వచ్చింది. అక్కడే నిజాం మీద బాంబు వేసిన వాళ్ళల్లో ఒకడయిన జగదీశ్, ఒక మంచి ఉర్దూ కవి అమ్జర్ కమిటీ పదవుల్లో కనిపించారు. వారికి సాధ్యం అయినంత సాయం చేశాను. నాకు వాల్యుయేషను ఆఫీసరుగా ప్రమోషను ఇచ్చి, తిరుపతికి పోస్టింగ్ ఇచ్చారు. వెళ్ళలేదు.
M.L. ఆచార్య - అఖిల భారత మున్సిపల్ కార్పొరేషను శ్రామిక సంఘాల సమావేశం జరపాలని ప్రతిపాదించారు. అందరం ఆమోదించాం. అందరూ అత్యంత ఉత్సాహంలో ఉన్నారు. గోవిందసింగ్ సంఘం తప్ప మిగతా కార్మిక సంఘాలు సహకరించాయి.
సుమారు ఒక సంవత్సరం నిరంతరప్రయత్నం చేశాం. అన్ని కార్పొరేషన్ల శ్రామిక సంఘాలతో పాత్రావ్యవహారం నడిపారు. సుమారు అన్ని కార్పొరేషన్లవారూ ఆమోదం తెలిపారు.
సరాయ్ నాంపల్లిలో సమావేశం జరిగింది. సుమారు మూడువందలమంది ప్రతినిధులు వచ్చారు. కలిసి మాట్లాడడంతో ఎన్నో విషయాలు తెలిశాయి. చర్చల్లో ఎంతో ఉత్సాహం వెల్లి విరిసింది.
బొంబాయి నుంచి 'గోలే' అనే ఒక కాంగ్రెస్ కార్మిక నాయకుడు వచ్చాడు. ఈ జరుగుతున్నది అతనికి నచ్చలేదు. మిరియాలు నమిలినట్లున్నది. విచ్చిన్నం చేయడానికి యత్నించాడు. అడ్డంకులు కల్పించాడు. సాగలేదు. గోవిందసింగ్ ను ఆశ్రయించాడు. గోవిందసింగ్ - గోలే లోథీవాడి గూండాలతో దాడి చేయించమన్నారని వర్తమానం అందింది. మేము లారీలలో కార్మికులను రప్పించాం. వారు లాఠీలు పట్టుకుని ఎలాంటి అవకాశాన్నయినా ఎదిరించడానికి సిద్దపడ్డారు. గోవిందసింగ్ గూండాలు కార్మికశక్తిని చూచారు. జంకారు. పలాయనం చిత్తగించారు!
ఆ సమావేశంలో అఖిల భారత మున్సిపల్ కార్పొరేషన్ కార్మిక సంఘాల సమాఖ్య ఏర్పడింది. నా సాహిత్య కృషి కుంటుపడుతుందని - నేను సెక్రటరీ జనరల్ గా ఉండడానికి అంగీకరించలేదు. ఈటూరి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ అయినారు. కమీష్నర్ పదవి తప్ప మిగతా అన్ని పదవులూ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని సమాఖ్య తీర్మానించింది. దాన్ననుసరించి నిరంతర పోరాటం జరిపింతరువాత - తొలివిడతగా - తొలి గెజిటెడ్ పదవులను - ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషను పరిధిలోనికి తెచ్చింది. అందును అనుసరించి నాకు అసిస్టెంట్ కమీషనర్ ప్రమోషను వచ్చింది.
1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రళయం సృష్టించింది. తెలంగాణ NGOలు 70 రోజులకు పైగా సమ్మె చేశారు. విద్యార్ధులు - విద్యుత్తు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. NGO నాయకులు మున్సిపల్ ఉద్యోగులను - కార్మికులను సమ్మెలో దించడానికి అనేక వత్తిళ్ళు తెచ్చారు. నేను వారికి రెండు విషయాలు స్పష్టంచేశాను. 1.కార్మికులు రాజకీయ కారణాలకు సమ్మె చేయడం నాకు ఇష్టం లేదు 2. నిరవధిక సమ్మెలు విజయవంతంకావు. వారు నన్ను "ఆంద్రవాణ్ణి" అని తిట్టిపోయారు.
కార్పొరేషను కార్మిక సంఘాల స్థితి ఎలా ఉందంటే - మా యూనియన్ సమ్మె చేస్తేనే మిగతావారు సమ్మె చేసేట్లున్నారు! గోవిందసింగ్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నిర్వహిస్తున్న ప్రజాసమితి నాయకుడు అయినాడు MLC గా ఎన్నిక అయినాడు. అతను తన యూనియన్ తో సమ్మె చేయించడానికి శతథా ప్రయత్నించాడు. 'రంగాచారయ్య యూనియన్ చేస్తేనే మేం చేస్తం" అన్నాడు కార్మికులు.
కార్పొరేషను మేయరు - కౌన్సిలర్లు కూడా ప్రత్యేక తెలంగాణవాదులే. వారు నా మీద వత్తిడి తెచ్చారు. "మున్సిపల్ కార్మికుల సమ్మె NGOల సమ్మె లాంటిది కాదు. నగర పారిశుధ్యం, ఆరోగ్యం దెబ్బ తింటుంది. నగరంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. తెలంగాణ ప్రజలకే హాని జరుగుతుంది" అని వివరించారు. వారు అర్ధం చేసుకోలేదు. ఇంతమంది ప్రత్యేక తెలంగాణ వాదులుండి కార్పొరేషనులో సమ్మె జరగడం లేదంటే వారికీ తలవంపులుగా ఉంది.
మా ఉద్యోగులు కూడ ఆవేశకావేషాల్లో ఉన్నారు. సమ్మె జరిగి తీరాలన్నారు. నన్ను 'ఆంధ్రోడు' అన్నారు. కావాలంటే రాజీనామా చేస్తా - సమ్మె చేసుకోండి అన్నాను.
ప్రజా సమితి నాయకులూ S.B. గిరి, బద్రీ విశాల్ పిట్టీ నా దగ్గరకు వచ్చారు. "తెలంగాణం తగలబడుతున్నది. మీరు సమ్మె చేయమంటే ఎలా?" అన్నారు ఉర్దూలో నేనూ వారూ చాలాసేపు వాదించుకున్నాం. తుదకు కార్మికుల మహాసభ ఏర్పాటు చేయడానికి అంగీకరించాను.
1969 జూలైలో ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో కార్పొరేషను ఉద్యోగుల సదస్సు జరిగింది. మేయర్ కుమార్ నాయక్ అధ్యక్షత వహించారు. సభాస్థలి నిండిపోయింది. జనం రోడ్డుమీద నుంచున్నారు. చాల ఆవేశపూరితం అయిన ఉపన్యాసాలు జరిగాయి. వేదిక నుంచి - జనం నుంచి సమ్మె చేయాలనే నినాదాలు వచ్చాయి. నన్ను మాట్లాడమన్నారు. 'ప్రజల ఆరోగ్యం విషయమయిన బాధతప్ప సమ్మె చేయడానికి నాకు అభ్యంతరం లేదు. రేపు కార్యవర్గ సమావేశంలో నిర్ణయిస్తాం' అన్నాను. సభ ముగిసింది.
తెల్లవారి కార్యవర్గం సమావేశం అయింది. ముందు ఒక వారం మాత్రం సమ్మె చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ దమన నీతి దృష్ట్యా కార్యవర్గ సభ్యులంతా అరెస్టు అవుతారు అనుకున్నాం. అందరి కుటుంబాల పరిస్థితి తెలుసుకొని సాయం చేయడానికి డబ్బిచ్చి, ఒక్కొక్కరిని నియమించాం. ప్రభుత్వం బలప్రయోగం చేస్తే చేయవలసిన దాన్ని గురించి నిర్ణయించాం. సమ్మె నిర్ణయం ప్రకటించాం.
వారం రోజులు సమ్మె సంపూర్ణంగా జరిగింది. కమీషనరు కారు కూడా ప్రవేశించకుండా గేటుకు రోడ్ రోలర్ అడ్డం పెట్టారు. కారు బయటపెట్టి కమీషనరు దుమ్ములోంచి రావలసివచ్చింది. తలుపు తాళం తీసి తానే దుమ్ము దులుపుకున్నాడు.
సమ్మె వలన నగరంలో చెత్తగుట్టలు - ఈగలు - దోమలు పెరిగాయి. నగరంలోని భయంకర పరిస్థితి గురించి పత్రికలు వార్తలు - ఫోటోలు ప్రచురించాయి. నల్లకుంటలో కొందరికి కలరా సోకింది.
ఈ పరిస్థితుల్లో కార్యవర్గం సమావేశం అయింది. తెలంగాణ నాయకులూ కూడా హాజరయినారు. సమ్మె పొడిగించవలసిందని వత్తిడి తెచ్చారు. "జీవితాలతో చెలగాటం ఆడదలచుకున్నా - కాటిమీద పేలాలు వేపుకోదలచినా నాకు ప్రమేయం లేదు" అని లేచివెళ్ళిపోయాను. అందరూ నావెంట వచ్చారు. బ్రతిమిలాడారు. సమ్మె విరమించడానికి నిర్ణయించారు.
ఈ నిర్ణయం అందరికీ సంతోషం కలిగించలేదు. నామీద చాలామంది ఆడిపోసుకున్నారు! నాకు స్వప్రయోజనం లేదు. అందువల్ల ఎవరికీ లొంగలేదు.
సాహిత్య వ్యాసంగం వదులుకోలేక 1971లో సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవిని వదులుకున్నాను.





