Home » vaddera chandidas » Anukshanikam 2
"మగని తాన యేమిట్కి పండుకోవు?" అని అరిచాడు శేషావతారం.
"అనిపించక" అంది.
"మగడు తన తాన పండుకోమంటే వండుకోవాల. వద్దంటే వూకోవాల. యేమి చెప్తే అది చెయ్యాల" అన్నాడు శేషావతారం.
"యేం చెప్తే అది చెయ్యాలా? తన దగ్గిరేనా నీలాంటి వెధవ దగ్గిర పడుకోమని చెప్పినా వినాలా?" అంది.
"షటప్" అన్నాడు శేషావతారం.
"యూ షటప్" అంది.
"ఐ విల్ రేవ్ యు" అన్నాడు కోపంగా శేషావతారం.
"ఐ విల్ ఆల్సో రేప్ యూ" అంది కోపంగా.
"విల్ యు ఆల్సో రేప్ మి?" అన్నాడు కూర్మావతారం
"హౌకెన్ ఐ! యు ఆర్ యె వుమన్" అని నవ్వింది.
చిన్న బుచ్చుకున్నాడు కూర్మావతారం
"మీ అమ్మా నాన్నల తాన వండుకుంటవా?" అన్నాడు శేషావతారం.
"పడుకుంటా. నీదగ్గిర కూడా పడుకుంటా. అమ్మల దగ్గిర నాన్నల దగ్గిర అక్కల దగ్గిర చెల్లెళ్ళదగ్గిర అన్నల దగ్గిర తమ్ముళ్ళ దగ్గిర మరదళ్ళ దగ్గిర బావలదగ్గిర మొగుళ్ళ దగ్గిర నీ దగ్గిర పడుకుంటా" అని పిడికిళ్ళు బిగించింది ఫిట్ నొచ్చింది
శేషావతారం ఆమె పిడికిళ్ళు పట్టుకున్నాడు. విదిల్చి కొట్టింది శేషావతారం బుగ్గకి తగిలి కందింది. నొప్పెడుతోంది శేషావతారానికి.
'దీని యవ్వా' అనుకుని, "చూడమ్మా యిప్పుడు నీకెట్లనిపిస్తున్నది అన్నాడు శేషావతారం.
ఆమె పలకలేదు.
వొంగి ఆమె అరికాల్లో చక్కలిగిలి పెట్టి "హీఁ హీ" అన్నాడు కూర్మావతారం.
ఆమె పలకలేదు.
"ఫూల్ ఆమెకు బదులు నువ్వు నగుతవేం?" అని అరిచాడు శేషావతారం.
"ఫూల్ ఆమెకు బదులు నువ్వు బిగుస్కోని పోతవేం?" అని నవ్వాడు కూర్మావతారం.
"యూ పూల్స్" అంది ఫిట్ విడుతూన్న ఆమె.
సంతోషంతో చిందువేసి శేషావతారం, కూర్మావతారం చెవిలో, "యీ కేస్ మబ్బోలె విడిపాయె-షి యీజ్ ఫ్రిజిడ్" అన్నాడు.
"యిడియట్. ఫ్రిజిడిటీకి ఫిట్పోస్తాయిర?" అన్నాడు కూర్మావతారం.
"వుయ్ విల్ సెండ్ హెర్ ఫర్ టుడే" అన్నాడు శేషావతారం.
యిలా రకరకాలుగా మతి సరిగా లేక వొచ్చే, వీళ్ళ పేషెంట్స్ తో వీళ్ళూ కలిసిపోయి నానా గొడవా చేస్తుంటారు. వీళ్ళ గొడవకి కొందరు పేషెంట్సు యాదృచ్చికంగా బాగయిపోతారు. కొందరు, నాలుగు రాళ్ళు విసిరితే వొక రాయి తగిలినట్లుగా బాగవుతారు. కొందరు, మళ్ళీ తిరిగి వొస్తుంటారు.
సుబ్రహ్మణ్యాన్ని లోనకి తీసుకురమ్మన్నారు. తీసుకెళ్ళారు. శేషావతారం వాళ్ళిద్దర్నీ ముందు గదిలోకి తీసుకొచ్చి వివరాలు అడుగుతున్నాడు.
"నీ పేరేమ్టి?" అన్నాడు కూర్మావతారం.
"భుట్టో"
"భుట్టోను వురి తీసిన్రు కదా?"
"అవును నన్ను యివాళ పొద్దునే వురి తీయించాడు జియా."
"వురి తీసినంక యీడికెట్లోస్తివి?"
"నేను రాలేదు. నా ప్రేతం వొచ్చింది."
"నువ్వు ప్రేతానివా?"
"భుట్టో ప్రేతాన్ని భుట్టో యీజ్ హ్యాంగ్డ్. హీఁ హిఁ" అని సుబ్రహ్మణ్యం నవ్వుతూంటె.
కూర్మావతారం, "హీఁ హిఁ, ఫన్నీ. వెరీ ఫన్నీ హీ హి" అన్నాడు.
"హీఁ హిఁ. నిన్నెప్పుడు హ్యాంగ్ చేశారు?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"హీఁ హిఁ. నన్ను హ్యాంగ్ చెయ్యలే."
"హిఁ. హిఁ. ఫన్నీ. వెరీ ఫన్నీ. హ్యాంగ్ చెయ్యకపోతే ప్రేతాని.
"నేను ప్రేతాన్నా?" అన్నాడు కూర్మావతారం.
"ప్రేతానివే నీకు నువ్వు కనిపించవు. అద్దంలో చూసుకో. ప్రేతాలు అద్దంలో కనిపించవు. నా కళ్ళతో చూడు కనిపిస్తావు. నువ్వు ప్రేతానివి. హిఁ. హిఁ నీ పేరేంటి?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"కూర్మావతారం"
"హిఁ. హిఁ. కూర్మ ప్రేతం. నేను భుట్టో ప్రేతం. మనిద్దరం నేస్తాలం" అని కూర్మావతారం చెయ్యి అందుకుని షేక్ హ్యాండిచ్చాడు సుబ్రహ్మణ్యం.
అంతలో శేషావతారం వొచ్చాడు.
"వీడెవడు?" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"ఆయన శేషావతారం" అన్నాడు కూర్మావతారం.
"పాఁవుఁ- పాఁవుఁ కాటు వేస్తుంది కాటువేసినా వురితీసినా వొకటే రెంటికీ చచ్చిపోతారు. పోరా శేషావతార్!" అన్నాడు సుబ్రహ్మణ్యం.
శేషావతారానికి మండుకొచ్చి, "నువ్వె పోరా" అని అరిచాడు.
"పాఁవుఁ పోతుందా? ప్రేతం పోతుందా? వొరే కూర్మం కర్ర పట్రా. యీ పాఁవుఁగాణ్ని పచ్చడి పచ్చడిగా చేద్దాం" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"హిఁ. హిఁ." అన్నాడు కూర్మావతారం.
కూర్మావతారం వంక చూసి, "షటప్" అన్నాడు శేషావతారం.
"హిఁ. హిఁ" అన్నాడు సుబ్రహ్మణ్యం.
"యు ఆల్సో షటప్" అని సుబ్రహ్మణ్యాన్ని అన్నాడు శేషావతారం.
"వోరి పాఁవుఁగా-" అని యెగిరి శేషావతారం చంకన కూచున్నాడు, సుబ్రహ్మణ్యం.
ఆ బరువుకీ వూపుకీ కిందికి వొరిగాడు శేషావతారం. వకరి ప్రక్కన వకరు పడ్డారు.
"హిఁ హిఁ" అంటున్నాడు కూర్మావతారం.
"షటప్" అన్నారు శేషావతారం, సుబ్రహ్మణ్యంలు వొకేసారి.
"అట్లనే" అని మూతి మీద చెయ్యి వేసుకుని వాళ్ళ పక్కన కూచుని, "మనం దోస్తులం భుట్టోభాయ్ నిన్ను కదా యెట్ల



