Home » vaddera chandidas » Anukshanikam 2



    ముందు గదిలోకి వెళ్ళి, "కూర్చోండి వొస్తారు" అని, వెనక్కి తిరగబోతున్న జయంతితో ఆ మాటలు నిన్న సుబ్రహ్మణ్యం అన్న, "అమ్మా నేను సుబ్రహ్మణ్యం అన్నయ్యని, సుబ్రహ్మణ్యం తెలుసుగా. మీ వారూ వాడూ వొకేచోట వుద్యోగం-" అంటున్నాడు.
    "తెలుసు. అలాగా, నమస్కారమండీ" అంది చిర్నవ్వుతో,
    "అమ్మా జరిగిన విషయం-వీళ్ళిద్దరినీ వుద్యోగం నుండి సస్పెండ్ చేశారట. మా వాడికి మతి చాంచల్యం వొచ్చినట్లు అనుమానంగా వుంది. సంగతులు తెలుసుకుందామని వొచ్చీను"
    జయంతి దిగులుగా కుర్చీలో కూచుండిపోయింది.
    రెండు నిమిషాల మౌనం.
    "యెందుకట?"
    "యేదో మిసప్రాప్రియేషన్ ఫోర్జరీ కేసులో వీళ్ళు కుమ్మక్కయ్యారని. వీళ్ళతోపాటు అకౌంటెంట్ ని కూడా సస్పెండ్ చేశారు. బ్యాంకుకి వెళ్ళి యీ సంగతులు తెలుసుకుని వొస్తున్నాను. మా వాడు యేమీ చెప్పే స్థితిలో లేడు. వెర్రినవ్వు నవ్వుతూ వున్నాడు. యిక్కడికి వొస్తే మరికొన్ని సంగతులు తెలుస్తాయేమోనని వొచ్చీను"
    జయంతి నీరసంగా లేచి లోనకి వెళ్ళి, మంచం అంచుమీద కూచుని దుప్పటి ముఖం మీంచి లాగి "వొంట్లో బాగాలేదా?" అంది.
`    మాట్లాడకుండా పడుకున్నాడు కళ్ళు తెరవకుండా.
    "సస్పెండ్ చేశారటగా, దేనికి?" అంది.
    మాట్లాడలేదు.
    "మాట్లాడండీ" అని అతని ముఖానికి అరిచేతులు అద్దింది. రెప్పవిప్పాడు.
    ఆమె కళ్ళలోంచి బొట్లు రెండు మూడు అతని నుదుటిమీద పడ్డాయి.
    వెంకటావధాని భోరుమని యేడ్చేస్తూ పక్కకి వొరిగి ఆమె వొళ్ళో ముఖం పెట్టుకున్నాడు.
    వీపుమీద చెయ్యేసి నోదార్పుగా తడుతూ, "పోన్లెండి గడవకపోదు. బాధపడకండి. కాగా సస్పెన్షనేగా అసలేం జరిగింది చెప్పండి?' అంది.
    "అన్యాయంగా మా యిద్దర్నీ ఆ రోగ్స్ సస్పెండ్ చేశారు జయంతీ" అన్నాడు వెంకటావధాని.
    అంత దిగులులోనూ నవ్వొచ్చింది జయంతికి. నవ్వు  ఆపుకుని "కేసులు దొరక్కపోతే పెళ్ళాం పక్కలో పడుకుని ముక్కుపుడక కాజేసి, వాళ్ళింట్లో ముక్కుపుడక దొంగతనం జరిగిందని కేసు పెడతాడట పోలీసు. పోలీసుద్యోగి కొడుకనిపించుకున్నారు అబద్దాలకి. విషయాలు తెలిసినయ్. లెండి ఆ వొచ్చిన వ్యక్తి సుబ్రహ్మణ్యం గారికి అన్నగారు. బ్యాంకుకి వెళ్ళి సంగతులు తెలుసుకొచ్చారు. గుమ్మంలో తారసపడ్డాం మేమిద్దరం. యిప్పటి కైనా చెప్పండి అసలు విషయం"
    "వాళ్ళ తమ్ముడ్ని అడగొచ్చుగా యిక్కడికి దేనికి?" అన్నాడు.
    "అతనికి మతి చాంచల్యం వొచ్చిందట. అందుకని యిక్కడికి వొచ్చారు. రండి- ముసుగులో గుద్దులాట ఆగా దేనికి!" అని వెంకటావధానిని లేవదీసి బయటకి పట్టుకొచ్చింది.
    కుర్చీలో కూచుని నేలకేసి చూస్తున్నాడు వెంకటావధాని.
    "భుట్టో యీజ్ హ్యాంగ్డ్ - బ్యాంక్ హాలిడే. నేషనల్ హాలిడే. హీ హీ అంటూ వెర్రిగా నవ్వుతున్నాడు మావాడు"
    "పాపం యివాళ భుట్టోని వురితీశారు. ఆ వార్త పేపర్లో వుందిగా" అంది జయంతి.
    వెంకటావథాని చెప్పటం తిక్కిరి బిక్కిరిగా మొదలెట్టినా, కాసేపటికి పోలీసు కధనం రీతిలో చెప్పుకుపోతున్నాడు.
    వింటున్నారు. మధ్యలో ప్రశ్నలు వెయ్యకుండా.
    వివరాలివి; గుండు శఠగోపం, చెరుకూరి వెంకటేశ్వరరావు అవి వుస్మానియా పూర్వ విద్యార్ధులు- యెం.యె తప్పి, నిరుద్యోగులుగా వుంటూ బ్యాంకులను మోసగించటం ప్రారంభించారు. వాళ్ళతో వీళ్ళకి పరిచయం ఐంది. ఆ ప్రలోభానికి లొంగి, వెంకటావధాని సుబ్రహ్మణ్యంలు వాళ్ళ అకౌంటెంట్ నికలుపుకుని దొంగచెక్కులు, డ్రాఫ్ట్ లూ క్యాషుచేయిస్తూ వొచ్చారు. చెక్కులు చాలా పెద్దపెద్ద వ్యాపార సంస్థలకి సంబంధించినవి.
    మొన్నటిరోజున వొక యాభయ్ వేల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ విషయంలో అనుమానం వొచ్చి- ఆ సంస్థకి ఫోనుచేసి, అలాంటి డ్రాఫ్ట్ వాళ్ళు యివ్వలేదని తెలుసుకుని, గప్ చిప్ గా యింకా రికార్డు తిరగేసి అదే వ్యక్తులు క్యాషు చేసుకున్న మరికొన్ని డ్రాఫ్టులు చెక్కులు తనిఖీ చెయ్యగా అనీ ఫోర్జరీ అని తెలిసి..... రాత్రి శఠగోపాన్నీ వెంకటేశ్వరరావునీ పోలీసులతో అరెస్ట్ చేయించి యీ వుదయం ముగ్గురికీ సస్పెన్సన్ ఆర్డర్స్ యిచ్చారట. కేసు ఫైనలైజ్ అయ్యాక వుద్యోగంనుంచి తొలగిస్తారట.
    "మంచిది వొస్తానమ్మా" అని సుబ్రహ్మణ్యం అన్న లేవబోతే, "కాఫీ తీసుకు వెళ్దురు వుండండి కాస్త" అంది జయంతి.
    "యిది కాఫీలూ ఆతిధ్యాలూ యిచ్చే పుచ్చుకునే సమయమా? నువ్వెంతో వుత్తమురాలిలా యోగ్యురాలిలా వున్నావు. అన్నట్లు వుద్యోగమా?" అన్నాడు సుబ్రహ్మణ్యం అన్న.
    "అవునండీ యిండియన్ బ్యాంకులో క్లర్కుగా చేస్తున్నాను" అంది.
    "ఆ పని చేసే అవకాశం నీకూవుంది. బుద్ధినిబట్టి జాతకాలు వుంటయ్" అని అతను అంటూంటే, వెంకటావధానికి తన కాలు సంగతి గుర్తొచ్చింది.
    సుబ్రహ్మణ్యం అన్న, యింటికి తిరిగొచ్చి జరిగిన సంగతులన్నీ వివరించాడు.
    "హారి వీడి కడుపుడకా" అన్నాడు తండ్రి శాయోజీరావు.
    "చిన్నప్పటినుండి వుత్త వెర్రి సన్యాసి. చెడు సావాసాలకి పోయి పాడైపోయి వుంటాడు. వాడి కై వాడికి పుట్టిన బుద్దికాదిది" అంది తల్లి.
    "పెళ్ళానికి చంద్రహారాలు చేయించాలనిపించి వుంటుంది" అంది శాంత తోటికోడలు.
    ఆ మాట యెవరూ విననట్లుగా వుండిపోయారు,
    "వొరే సుబ్బా, గుండు శఠగోపం తెలుసురా?" అన్నాడు సుబ్రహ్మణ్యం అన్న.
    "హిఁహిఁ గుండుభుట్టోనా? గుండు భుట్టోకి గుండు తీసేశారు వురేసి వురి వురి -హ్యాంగింగ్. హిఁహిఁ"
    శాయోజీరావు వెళ్ళి అతనికి తెలిసిన డాక్టర్ని తీసుకొచ్చాడు. వొచ్చి పరిశీలించి, "యిది మెంటల్ కేసండి యెర్రగడ్డ హాస్పిటల్ లో చూపెట్టండి" అని సలహా యిచ్చాడు.
    "యివాళ అష్టమి అందుకే యీ కష్టం వొచ్చిపడింది" అందిశాంత.
    "రేపునవమి. అందునా శ్రీరామనవమి. పుణ్యదినం. కష్టాలు తొలగి పోతయ్ లే చెల్లెమ్మా బాధపడకు" అంది శాంత తోటికోడలు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.