Home » vaddera chandidas » Anukshanikam 2
అన్న మెకానికల్ డిప్లొమా చదివి, రూర్కీలో వుద్యోగం. పెళ్ళాం పిల్లలతో అక్కడ వుంటారు. యెప్పుడో రెండు మూడేళ్ళకొకసారి వొచ్చిచూసి పోతుంటాడు. రెండో అన్నకి వూళ్ళోనే ఉద్యోగం-యు.డి.సి.యిద్దరు ఆడపిల్లలు శాంతకి వొకఆడపిల్లల సుబ్రహ్మణ్యం చెల్లెళ్ళు యిద్దరుతమ్ముళ్ళు యిద్దరుచదువుకుంటున్నారు. ఆపిల్లలు వీళ్ళిద్దరిగదుల్లోకూచుని చదువుకుంటూ వుంటారు. రాత్రుళ్ళు మాత్రం హాల్లో తల్లీ తండ్రీ ఆ నలుగురు పిల్లలూ చాపలు పరుచుకుని పడుతుంటారు. వాళ్ళకి తోడు మనమరాళ్ళు చేరుతూంటారు.
శాంత, తలుపు తెరిచింది.
వీధిలో సుబ్రహ్మణ్యం ఆ రిక్షా దిగుతున్నాడు. పొద్దుట వెడితే సాయంత్రం గాని రాడు. మధ్యాహ్నానికి టిఫినుబాక్సు పట్టికెడతాడు.
రిక్షా దిగి, తెల్ల యూనిఫారం బట్టల్లో వున్న బ్యాంకు ఫ్యూనుని కావిలించుకున్నాడు, సుబ్రహ్మణ్యం. ఫ్యూను విడిపించుకుని కలవరపడ్డాడు. సుబ్రహ్మణ్యం రిక్షా అతనికి షేక్ హ్యాండ్ యివ్వబోయాడు. అతనురెండు చేతులూ హ్యాండిల్ మీదవేసి వింతగా చూస్తోంటే అతడుంజెయ్యి పట్టుకుని వూపాడు.
ఫ్యూను రిక్షాలో కూచున్నాడు. రిక్షా కదిలింది.
రిక్షాకి సెల్యూట్ చేస్తూ, "హీఁహీఁ" అన్నాడు సుబ్రహ్మణ్యం.
గిరుక్కున వెనక్కి తిరిగి, గుమ్మంలో శాంతని చూసి "హీఁహీ" అంటూ యన్ సి.సి. షెరేడ్ లా అడుగులువేస్తూ, "భట్టో యీజ్ హ్యాంగ్డ్ హీఁహీఁ" అని చంకలోని దినపత్రిక తీసి వూపాడు. ఆ వెర్రినవ్వు అర్ధంకాక అయోమయంగా చూస్తోంది, శాంత.
"హీఁహీఁ భుట్టో యీజ్ హ్యాంగ్డ్!" అని శాంత భుజంమీద వేళ్ళతో తట్టి "హీఁహీఁ" అన్నాడు.
భర్త చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెడుతూ, "భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి కదండి?" అంది.
"హీఁహీఁ భుట్టో యీజ్ హ్యాంగ్డ్. వెనకెప్పుడో ప్రధాని. మిలటరీ జనరల్ జియా కుర్చీ లాగేసుక్కూచున్నాడు. భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హీఁహీఁ" అని పత్రిక ఆమె మీదికి విసిరాడు.
"అయ్యో పాపం వురితీశారా!"- అంది శాంత.
"హీఁహీఁ......"
ఆ వెర్రి నవ్వు అర్ధం కానట్లుగా చూస్తూ, "బ్యాంకు లేదండీ? అందుకని సెలవిచ్చారా" అంది.
"భట్టో యీజ్ హ్యాంగ్డ్ హాలిడే హాలిడే హీఁహీఁ...." అంటున్నాడు.
తలుపు దగ్గిరికి వేసి, "మేంటండీ ఆ నవ్వు?" అంది.
"హీఁహీఁ. భట్టో యీజ్ హ్యాంగ్ హీఁహీఁ"
"యేంటండీ ఆ వెర్రి నవ్వు?" అంది తమరుకుంటున్నట్లుగా.
"షటప్. వెర్రినవ్వా నీమొహం. భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హీఁహీఁ" అంటున్నాడు.
గది బయటికొచ్చి తలుపు దగ్గరికి వేసింది. హాల్లోంచి వంటింట్లోకి వెడుతున్న తోటికోడలిని చూసి, అత్తకి చెప్పాలని వొచ్చిన శాంత, మళ్ళీ గదిలోపలికి వొచ్చి తలుపు దగ్గరికి వేసింది.
"భుట్టో యీజ్ హ్యాంగ్డ్, హీఁహీఁ-హీఁహీఁ"
"సెలవురదా-సినిమాకి వెళ్దాం సాయంత్రం" అంది.
"హీఁహీఁ. భుట్టో యీజ్ హ్యాంగ్డ్. సినిమా. హీఁహీఁ!" అంటున్నాడు.
ముందు గుమ్మం తెరిచిన చప్పుడయ్యి గది తలుపు తెరిచి చూసింది. యింటర్ చదువుతున్న మరిగి లోనకి పిలిచింది. అతను వొచ్చాడు.
"భుట్టో యీజ్ హ్యాంగ్డ్ కాలేజీక్కూడా హాలిడేనా! దేశానిక్కూడా హాలిడే హీహి" అని చిందులేస్తున్నాడు.
"యేఁవిఁటండీ ఆ వెర్రి నవ్వు?" అని చెయ్యి పట్టుకుని మంచం దగ్గిరకి తీసికెళ్ళబోతే, బిర్ర బిగుసుకుని నుంచున్నాడు. శాంత కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆమె మరిది రెండో చెయ్యి పట్టుకున్నాడు. యిద్దరూ కలిసి మంచం మీద పడుకోబెట్టారు.
"భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హాలిడే. బ్యాంక్ హాలిడే. కాలేజీ హాలిడే. నేషనల్ హాలిడే. హాలిడే-హీఁహీఁహీఁ!" అంటున్నాడు.
"శాంతొదినా" అని మరిది పక్కకి పిలిచి యేమిటని అడిగితే రిక్షా రావటం దగ్గిర్నుంచి విషయం చెప్పింది.
"భుట్టో యీజ్ హ్యాంగ్డ్. నేషనల్ హాలిడే-" అంటూ లేవబోతూంటే, యిద్దరూ పరుగున వెళ్ళిపడుకోబెట్టారు.
శాంత అతని నుదుటిమీద అరిచెయ్యి అద్దింది. అతని తమ్ముడు ఛాతీ మీద అరిచెయ్యి వేశాడు.
ఐదు నిమిషాలు
సుబ్రహ్మణ్యం నిద్రోయేశాడు.
"యేం జరిగిందో అసలు-ఆ బ్యాంకు ప్యూను తీసుకొచ్చిన వాడు యేం చెప్పకుండా పోయిచచ్చాడు-"అంటోంది
ప్లాక్ జేబులోంచి కనిపిస్తున్న కాగితం వంక చూసి, తీశాడు అతని తమ్ముడు. చదివి, "శాంతొదినా, సుబ్బన్నయ్యని వుద్యోగంలో నుండి సస్పెండ్ చేసేరు" అన్నాడు.
శాంత వొణికిపోయింది చిన్నగా యేడుస్తోంది. అసలే తోటికోడలితో పొసగటం లేదు. యిప్పుడు తన మొగుడికి ఉద్యోగం కూడా లేకపోతే తనని మరీ చులకనచేసి పారేస్తుందనీ, ఆ వెర్రి నవ్వు యేమిటో అర్ధంకాక అయిమయంలోనూ యేడ్చేస్తోంది.
"బాబూ నువ్వెళ్ళి మావఁయ్యగారిని పిలుచుకురా" అంది. మరిది వెళ్ళాడు.
అరగంటకి సుబ్రహ్మణ్యం నిద్ర లేచాడు. లేస్తూనే "భుట్టో యీజ్ హ్యాంగ్డ్ బై మార్నింగ్ యాజ్ హి గాట్ అప్. హీఁహీఁ" అన్నాడు.
"యేవండీ మీ వుద్యోగం"
"వూ నా వుద్యోగం?"
"మిమ్మల్ని వుద్యోగం నుంచి తీసేశారా?" అంది.
"నాకు వుద్యోగమేంటే పిచ్చి మొహమా! ప్రైమినిస్టరు భుట్టో వుద్యోగం చేస్తాడటే, ఫూల్ భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హీఁహీఁ"
మరో అరగంట.
సుబ్రహ్మణ్యం తండ్రి శాయోజీరావు వొచ్చాడు.
యిదేమిటో అర్ధంకాక శాంత తోటికోడలు తమ గది గుమ్మంలో నుంచుని మరిదిని పిలిచింది చేత్తో 'ఆగు చెప్తా' అన్నట్లుగా చెయ్యివూపి గదిలోకి అతను వొచ్చాడు.
"రండి నాన్నగారూ విన్నారా యీ వార్త. భుట్టో యీజ్ హ్యాంగ్ భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హీహీ"
సస్పెన్షన్ సంగతి కొడుకు చెప్పగా విని దిగులుతో వొచ్చిన శాయోజీరావు సుబ్రహ్మణ్యాన్ని అలా చూసి, చిన్న కొడుకుతో. "హోటలు కెళ్ళి పెద్దాడికి ఫోను చెయ్యి వెంటనే రమ్మని" అన్నాడు.
అంతలో అతని తల్లి గదిలోకి వొచ్చింది
"అమ్మా భుట్టో యీజ్ హ్యాంగ్డ్ అంటే నీకు తెలియదు కదూ భుట్టోని వురితీశారు. హీహీ" అన్నాడు.
కాసేపటికి పెద్ద కొడుకు వొచ్చాడు
"అన్నయ్యా భుట్టో యీజ్ హ్యాంగ్డ్ హీహీ"
పెద్దకొడుకుకి సస్పెన్షన్ కాగితం చూపెట్టి, "వెంటనే బ్యాంకుకివెళ్ళి అసలేం జరిగిందో తెలుసుకురా" అన్నాడు శాయోజీరావు.
అతను వెళ్ళాడు. వెడుతూం భార్య సైగ చేస్తే వాళ్ళ గది గుమ్మం లోకి వెళ్ళగానే యేమిటని అడిగితే విషయం చెప్పాడు.
వెంటనే గదిలోకి వొచ్చి విచారం నటిస్తూ, "శాంతా యేం చేస్తావమ్మా నీరాత అట్లా వుంది" అంది.
సుబ్రహ్మణ్యం అన్న బ్యాంకుకి వెళ్ళి సంగతులు తెలుసుకుని వెంకటావధాని యింటి అడ్రసు అడిగి అక్కడికి వెళ్ళాడు. యివన్నీ తెలుసుకుని యిల్లు వెతుక్కుంటూ వెళ్ళేసరికి - అప్పుడే బయటినుంచి గుమ్మంలోకి వొచ్చిన జయంతి యితనినిచూసి, "యెవరు కావాలండీ?" అంది.
"వెంకటావధానిగారు."
తలుపుతట్టింది-
తెరుచుకోలేదు.
"యేవండీ" అని పిలిచింది.
తలుపు తెరిచి గిరుక్కున తిరిగి, కర్రకాలు టిక్కు టిక్కు మని పిస్తూ లోనకి వెళ్ళి పడుకున్నాడు ముసుగెట్టుకుని.
లోనకి వెళ్ళి "మీ కోసం యెవరో వొచ్చారు" అంది.
వెంకటావధాని మాట్లాడలేదు
"మిమ్మల్నేనండీ యింటికి మనిషి వొస్తే"
"పొమ్మను"



