Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    అప్పుడు నాకు విశ్వనాథ పులిగా కనిపించలేదు. నిష్కపటి - నిగర్వి - నిజాయితీగల కవిసమ్రాట్టుగా దర్శనం ఇచ్చారు.
    
    "కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం    
    ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం."
    
    "సముద్రమివరత్నాఢ్యం" అన్న రామాయణంలోకి దూకగలుగుతే అనేక రత్నాలు లభిస్తాయి. అయితే సత్తా కావలి అందుకు. అదిలేక రామాయణం నిండా రాళ్ళే అని - ఆ మధ్య ఒక రామాయణం వచ్చింది. అప్పుడు రామాయణాన్ని గూర్చిన లౌకిక వాస్తవాలు తెలియపరచదలచాను. అంతకుముందు నా దగ్గర ఉండిన రామాయణంలో వ్యాఖ్యలు చేర్చాను. దానికి చేర్చిన 64 పేజీల పీఠికలో అనేక కొత్తకోణాలు చూపాను. "భ్రమలకు దూరంగా, వాస్తవానికి దగ్గరగా, రాగద్వేషాలకు అతీతంగా, సందేశానికి అనుగుణంగా వ్యాఖ్యానించడం విమర్శకుని కర్తవ్యం" అని, వివాహ వ్యవస్థమీద విశ్వాసం లేనివారు రామాయణం  చదవడంగని విమర్శించడంగాని చేయరాదు అన్నాను. ఇది 'సీతా చరితం' పేర 1979 లో నవయుగ బుక్ సెంటర్, విజయవాడ వారిచే ప్రచురించబడింది. దీనిని బమ్మెర పోతనామాత్యునికి అంకితం ఇచ్చాను.
    
    ఆంద్రప్రభ సచిత్రవారపత్రిక హైదరాబాదు తరలి వచ్చింది. అప్పుడు విద్వాన్ విశ్వంగారి ఆదేశం మేరకు నవలల పోటీకి న్యాయనిర్ణేతగా కొన్ని సంవత్సరాలు వ్యవహరించాను. ఆ సందర్భంలో విశ్వం - ఎల్లోరా గారలతో చర్చల సందర్భంగా రామాయణ ప్రసక్తి వచ్చింది. రామాయణంలో స్త్రీ, పురుష పాత్రలమీద - రామాయణంలో అందాలు అని వ్యాసాలు వ్రాయమన్నారు. సీత చరిత్రలో స్త్రీ పాత్రలు పూర్తిగానూ రామాయణ పురుషులపై కొన్ని వ్యాసాలు వ్రాశాను. వాటికి మంచి ఆదరణ లభించింది. అవి కన్నడంలో అనువదించబడి - ప్రచురించబడినాయి.
    
    "సాహిత్యము, సాహిత్య ప్రక్రియలు, వ్యాసుడు, వాల్మీకి, భారవి, కాళిదాసు, శ్రీశ్రీ, గురజాడ.... ఆనాటి వేదంకాలంనుండి ఈనాటి వచనగేయకాలం వరకూ - ఇలా అనర్గళంగా సాగుతూంది రంగాచార్యుల ఉపన్యాసం. అది నిర్ఘరి. అద్వితీయ వాగ్ఝరి. అయితే అటువంటి అభిప్రాయ వెల్లువలు అందరికీ అంది సాహిత్య జిజ్ఞాసులలో అనుశీలనకు, పరిశోధకులకు దారితీసేట్లు" ముప్పది సంవత్సరాలు వ్రాసిన నా సాహిత్య వ్యాసాలను కూర్చి మిత్రులు పొన్నాల సాందీప్ 'పరిశీలన'పేర 1983లో ఒక గ్రంథం ప్రచురించారు. అందులో రాయాయణ పాత్రలను గురించిన వ్యాసాలు చేర్చారు.
    
    1994లో 'Ramayana - The ever fresh human poem' అని ఒక పుస్తకం ఆంగ్లంలో వ్రాశాను. 'సర్వకాల సర్వావస్థల్లో రామాయణం మానవాళిని ఆదుకుంటుంది'. అని నిరూపించాను.
    
    'వందే రామాయణార్ణవం' రామాయణ మహా సాగరానికి నమస్కరించడం తప్ప పారం ఎరాగటం దుస్తరం!
    
    నేను రచించిన శ్రీమద్రామాయణం తెలుగువారి ఆదరాభిమానాలు అందుకుంది. అందువల్ల పబ్బా శంకరయ్యగారు నన్ను 'శ్రీమద్భాగవతము' రచించమని కోరారు. అప్పుడు నేను అప్పులలో కూరుకొని ఉన్నాను. పిల్లలు పెరుగుతున్నారు. ఆదాయం చాలడం లేదు. అప్పు చేసి రెండు గదులు కట్టి అద్దెకు ఇచ్చాను.
    
    అలాంటి దశలో భాగవతం రచించాల్సి వచ్చింది. అది మంచిదయింది. రచనలో నేను మునిగిపోతాను. కష్టాలు మరిచిపోతాను.
    
    బమ్మెర పోతన భాగవతాన్ని సంస్కృతాన్ని మించిన మందార మకరందంగా రచించాడు. అతడు రామభక్తుడు, కృష్ణ కథను అత్యంత సుందరంగా మలచాడు. చిన్ని కృష్ణుని లీలలలో అతడు అమృతం నింపాడు.
    
    పలికెడిది భాగవతమట
    పలికించు విభుండు రామభద్రుండట నే
    బలికిన భవహర మగునట
    పలికెద వేరొండు గాథ బలుకగనేలా? అన్నాడు. పోతన భక్తిపారవశ్యంలో భాగవతం రచించాడు. పోతన జీవితగాథను ఒక మహాకావ్యంగా రచించారు అభినవ పోతన వానమామలై వరదాచార్యులవారు.
    
    భాగవతం శాంతి సందేశాన్ని అందిస్తుంది. ప్రథమ ప్రపంచ సంగ్రామం తరువాత లీగ్ ఆఫ్ నేషన్స్, ద్వితీయ సంగ్రామం తరువాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వలె అనంత రక్తపాతం జరిగిన మహా భారత సంగ్రామం తరువాత వ్యాసమహర్షి వెలయించిన శాంతి సందేశం శ్రీమద్భాగవతం.
    
    శ్రీమద్భాగవతం జ్ఞానం కలిగిస్తుంది. శాంతి ప్రసాదిస్తుంది. వెలుగుబాటలు చూపుతుంది. అలసిన మనసుకు విశ్రాంతిఐ ఇస్తుంది. అనేక జీవిత సత్యాలను బోధిస్తుంది. నరుడు పరిపూర్ణ మానవుడయి, దైవత్వం దగ్గరకు చేరుకోవడానికి ఉపకరిస్తుంది.
    
    నేను సంస్కృత భాగవతాన్ని అనుసరించాను. కాని గజేంద్రమోక్షం - రుక్మిణీ కళ్యాణంలాంటి వాటిలో పోతన తేనియలు చవి చూపించాను.
    
    పెక్కు ఇక్కట్లలో భాగవతం ప్రశాంతత కలుగచేసింది. భక్తి కలిగించింది. రచించిన శ్రీమద్భాగవతాన్ని యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అంకితం సమర్పించాను.
    
    చీర బాలుడు దుష్టుని చీల్చినాడు    
    తెలుగు దేవర సింగన వెలుగువేల్పు    
    చిత్తమందలి దుష్టుని చీల్చుమంచు    
    యాదగిరి సామికిత్తు నే నంకితమ్ము.
    
    1966 జూన్ 11 పరాభవ జ్యేష్ట కృష్ణ అష్టమి -శనివారంనాడు భాగవత రచన పూర్తి చేశాను. శ్రీమద్భాగవతం సహితంగా పిల్లల పుస్తకాలు 1. వేంకటేశ్వర మహాత్మ్యము 2. గౌతమ బుద్దుడు 3. బాలచంద్రుడు 4. చంద్రగుప్తుడు 5. భారతం 6. రామాయణం శంకరయ్యగారికి ఇచ్చాను. వారు నాకు పద్దెనిమిదివందలు ఇచ్చినట్లు గుర్తు.
    
    1969 శ్రీమద్భాగవతము ప్రచురించారు. ఆవిష్కరణ సభ జరుపలేదు. ఆ తరువాత శ్రీ వేంకటేశ్వర మహాత్య్మము ప్రచురించినారు. శ్రీమద్భాగవతము సహితం ప్రజాదరణ పొందింది. మూడవ ముద్రణ జరిగి, అందుబాటులో ఉంది.
    
    మిగిలిన పుస్తకాలు వెలుగు చూడలేదు. నేను కొండా శంకరయ్యకు పిల్లలకోసము, వయోజనులకోసము గాంధీ నెహ్రూ జీవితాలు నాలుగు పుస్తకాలు వ్రాసి ఇచ్చాను. వయోజనులకుగాను 'మహాత్ముడు' ప్రచురించారు. మిగతావి పోగొట్టారు. మరొక ప్రచురణకర్తకు పిల్లలకోసం 1. ప్రహ్లాదుడు 2. మార్కండేయుడు 3. ధృవుడు 4. జ్ఞాన సంబంధి వ్రాసి ఇచ్చాను. అవి కూడా అచ్చు నోచుకోలేదు. వాటి వ్రాత ప్రతులు లేవు. వెలుగు చూడలేదు. ఇది రచయితకు బాధ కలిగించే విషయం.
    
    "యస్యాం వైశ్రూయమాణాయాం కృష్ణే పరమ పూరుషే
    భక్తిరుత్పద్యతే పుంస శ్సోకమోహ భయాపహా"
    
    భాగవత సంహిత చదివితే పరమ పురుషుడయిన శ్రీకృష్ణ భగవానుని మీద భక్తి జనిస్తుంది. మానవుల శోక, మోహ, భయములను పోగొడుతుంది.
    
                                  ముఫ్ఫయి ఒక్కటి
    

రెండు నగరాలు - ఒక కార్పొరేషను:
    

    1959లో ననుకుంటా - ఒకసారి నెహ్రూగారు హైదరాబాదు వచ్చారు. ప్రధానికి పౌరసన్మానం జరిగింది. హైదరాబాదు - సికిందరాబాదుల ఉభయ మేయర్లు రెండు పూలదండలు వేశారు. ఉర్దూ - తెలుగు రెండు భాషల్లో ఇద్దరు సన్మానపత్రాలు చదివారు. నెహ్రూగారికి - ఎందుకో - అది నచ్చలేదు. "ఒక్క నగరానికి ఇద్దరు మేయర్లా?" అన్నారు.
    
    జవహర్ లాల్ నెహ్రూ భారతప్రధాని మాత్రం కారు - వారు ఆధునిక భారత నిర్మాత, సోషలిస్టు, మంచి చారిత్రక దృక్పథం కలవారు అనడానికి వారి 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' సాక్ష్యం. అయితే వారికి అతి విశ్వాసం. తాను చెప్పిందే సత్యం అని నమ్మకం. అది కాదంటే పిచ్చికోపం! మైకులు నేలక్కొడ్తారు. పుస్తకాలు - కాగిహాలు విసిరికొడ్తారు. ధుమధుమ లాడ్తారు. వారిని శాంతపరచడం వారి కూతురు - ఇందిరాగాంధీకి మాత్రం సాధ్యం అయ్యేది. అందుకే మేహ్రూకు ఎవరూ ఎదురు చెప్పరు. అతను అన్నది చెల్లాలి. అందుకే అన్నాను:-
    
    ఒక్కడేలు కలముందిరాదన్నారు
    పెక్కురేలు యుగము వచ్చెననిరి
    ఎప్పుడయిన రాజ్యమేలువా డొక్కడే
    విశ్వజనులవాణి వినర రంగ!
    
    సాంస్కృతికంగా ఉభయ నగరాలకు - చారిత్రక నేపథ్యంలో ఎంతో అంతరం ఉంది. అది చెప్పగలవారు లేరు. నెహ్రూను కాదనలేక ఉభయ నగరాల కార్పొరేషన్లను విలీనం చేసే చట్టం చేశారు. అప్పుడు సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి - సంజీవయ్యగారు స్థానిక పరిపాలనామాత్యులు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.