Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నేను మాట్లాడుతూ - ఇంతటి మహత్కార్యం ముఫ్ఫాయిమూడేళ్ళ నాకు అసాధ్యం అన్నాను. ఇది భగవత్ప్రేరణ - భగవదనుగ్రహం వల్లనే జరిగింది. వ్రాయించిన రాముడు కనిపించనందున నాకు సన్మానం జరుగుతున్నది అన్నాను. రాముడు ప్రసాదించిన శ్రీమద్రామాయణ శిశువును శంకరయ్యకు అమ్ముకున్న అపచారం చేశాను. ఈ అంకితసభ భద్రాద్రిలో జరుగుతే బాగుండేది అనే వ్యధ వ్యక్తపరచాను.
దివాకర్లవారు చమత్కరించి పరిష్కరించారు. 'రంగాచార్యులు ఇంకా చిన్నవాడు. మరింత మంది కావ్యకన్యకలను కనగలవాడు. ఈ బిడ్డను శంకరయ్యకు దత్తత ఇచ్కాననుకోవాలి. ఈ శ్రీమద్రామాయణ అంకిత, ఆవిష్కరణలు జరిగిన చోటనే భద్రాద్రి రాముడు ఉంటాడు'
దివాకర్ల చమత్క్రుతిని సభ కరతాళ ధ్వనులతో ఆమోదించింది.
శంకరయ్యగారు నాకు శాలువా కప్పి, ఫలపుష్పాదులు ఇచ్చి సత్కరించారు.
సభ విజయవంతంగా ముగిసింది.
పెద్దలెల్లరు మమ్ము ఆశీర్వదించారు.
సభకు కమలా - పిల్లలూ వచ్చారు. అందరం ఇంటికి తిరిగి వచ్చాం. ఆ రాత్రి పండుగ చేసుకున్నాం. ఆ సంబరం అక్షరాలకు అందనిది.
తెల్లవారి అన్ని పత్రికలూ శ్రీమద్రామాయణ ఆవిష్కరణ వార్త ప్రముఖంగా ప్రచురించాయి.
పబ్బా శంకరయ్యగారు నాకు వేయిరూపాయల పారితోషికం ఇచ్చారు. ఆనాటి దాని వెల పన్నెండు రూపాయిలు. ఆ రామాయణానికి వచ్చిన ప్రచారంతో నేను 'రామాయణ రంగాచార్య' అయినాను. శ్రీరామావారు ముప్పది సంవత్సారాలనుంచి రామాయణాన్ని పునర్ముద్రిస్తు నేటికీ అందుబాటులో ఉంచారు. అది విశేషం!
నవ్యాంధ్ర కళాకేంద్రం - సీతాఫల్ మండివారు నా రామాయణ ఉపన్యాసాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అవి కొన్ని వారాలు సాగేయి. రాయప్రోలు - దివాకర్ల - ఉత్పల -ఉషశ్రీ వంటివారు సభలకు అధ్యక్షత వహించారు. రామాయణ ఉపన్యాసాలు పూర్తి అయినాయి. ఆ కేంద్రనిర్వాహకులు చలపతిరావుగారు నాకు సన్మానం సంకల్పించారు.
28 ఏప్రెల్ 1963 పత్రికలో "దాశరథి రంగాచార్యకు విశ్వనాథ సన్మానం" అనే వార్త చూచి అవాక్కయినాను. విశ్వనాథ పండిత ప్రకాండులు. కవితా కిరీటి. నవలా సామ్రాట్టు. పొగరు శ్రీనాథుని అంతటిది. గర్వం వారికి అలంకారం. అయితే వారు మరొకరిని మెచ్చరు. సభలో సహితం తిట్టడానికి వెనుకంజవేయరు. వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్నారు. వారు మరొక రామాయణం మెచ్చరు. నేను వారి ముందు బచ్చాగాణ్ణి. ఇది సన్మానం కాదు, అవమానం అనుకుని బాధపడ్డాను. ఇంతలో చలపతిరావుగారు ఆహ్వానం పట్టుకొని వచ్చారు. వారికి ఇవ్వన్నీ చెప్పాను. ఆ 'మహానుభావుడు సభకు రాకున్నా తిడ్తాడు. వచ్చీ తిట్లు పడాల్సిందే' అని విసుక్కున్నాను.
చలపతిరావుగారు - పాపం - చిన్నబుచ్చుకున్నారు. 'మీకు మహాకవితో సన్మానం చేయింతామనుకున్నాను. ఇవన్నీ ఆలోచించలేదు. మన్నించండి' అన్నారు.
సాయంత్రం శంకరయ్యగారు కారులో తీసికెళ్ళారు. మా అమ్మాయి ఉదయ వెంట వచ్చింది. వైశాఖ సాయంత్రం. వేసవిని గురించి కాళిదాసు 'దివసాంత రమ్యాణి' అన్నాడు. డాబామీద సభ. జనం బాగా వచ్చారు. చంద్రుడు ఉదయించాడు, వెన్నెల విరబోస్తున్నాడు.
నేను సభలో కూర్చున్నాను. భయంగా ఉంది. ఇంకా విశ్వనాథ రాలేదు. వారు వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. పులి వచ్చినట్టూ - పులి పంజాల సవ్వడి వినిపిస్తున్నట్లూ అనిపించింది. వారు డాబా మీదికి వచ్చారు. పులిని చూచినట్లనిపించింది. బెదిరినట్లు లేచి నుంచున్నాను. వారికి చూపు మందగించింది. కనిపించదు. నన్ను గురించి అడిగారు. నా దగ్గరికి వచ్చారు. పులి వచ్చినట్లనిపించింది. వారు ణ చేయి పట్టుకున్నారు. పులి పట్టుకున్నట్లనిపించింది. నన్ను కూర్చుండపెట్టారు. వారు కూర్చున్నారు.
"చిన్నవాడివే! రామాయణం వ్రాశావూ!" అన్నారు. పులిపంజా కొట్టినట్లయింది!
"అవును గురువుగారూ!" అన్నాను.
"గురువును చేసుకున్నావూ! సరే, పుస్తకం తెచ్చావా?"
మరొక పంజా పడింది. గ్రంథం అందించాను.
"ఏదో చిన్న పుస్తకం అనుకున్నాను. బృహద్గ్రంథమే వ్రాసినావే!"
అది పొగడ్తయో, తెగడ్తయో అర్ధం కాలేదు.
"పేజీకి ఎన్ని లైన్లున్నవి - లెక్కపెట్టి చెప్పు"
లెక్కపెట్టి చెప్పాను.
'ఎందుకడిగానూ అంటే కొందరు కొద్దిగ వ్రాసి లైన్లు ఎడం వేసి ఉద్గ్రంథం వ్రాసినామనిపించుకుంటారు. నీవు అట్లు చేయలేదు. ఉద్ర్గ్రంథమునే వ్రాసినావు."
ఆ బాణం ఎటు సంధించింది అర్ధం కాలేదు. విశ్వనాథ నశ్యం పీల్చారు. తుపుక్కు, తుపుక్కుమన్నారు. అడిగారు - "ఇంతకూ వాడు - ఆ దాశరథి నీకేమౌతాడు?"
"అన్నయ్య అవుతాడు" గురువుగారూ అనబోయి మాట మ్రింగాను.
"ఓహో! వాడు నీకు అన్నయగునా! వాడి వల్ల నువ్వేమన్నా Eclipse అవుతున్నావా?"
"నాకు ప్రతిభమీద విశ్వాసం. ఎవరి ప్రతిభనుబట్టి వారు రాణిస్తారు" అన్నాను.
విశ్వనాథ నా వీపు నిమిరారు. "ఎందుకడిగానూ అంటే మా తమ్ముడున్నాడు వెంకటేశ్వర్లు - నాకంటే ప్రతిభావంతుడు - నావల్ల రాణించలేకపోతున్నాడు. అదిగో, పిలుస్తున్నారు పదవేదిక మీదికి" అని తీసికెళ్ళారు.
వేదికమీద మేమిద్దరమే. వెన్నెల విరియబూసింది. లైట్లు లేవు. మైకు కూడా ఉన్నట్లు గుర్తులేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. గురువుగారు నన్ను మాట్లాడమన్నారు. అదే నన్ను వారికి తెలియపర్చుకునే అవకాశం. వారు సనాతనులని నాకు తెలుసు. వారి మార్గం నేను ఎరుగుదును. అయినా ణా మార్గం నేను వదల్లేదు. రాముడు నరుడనీ - ఆదర్శ పురుషుడనీ చెప్పాను. వాల్మీకిలేక ఎందరు రాములు కాలగర్భంలో కలసిపోయారో! వాల్మీకి మహర్షివలన రాముడు నేటికీ నిలిచివున్నాడు అని నిర్భయంగా 90 నిముషాలు రామాయణ ఉపన్యాసం చేశాను.
విశ్వనాథవారు నశ్యం పీలుస్తూ, తుపుక్కుమంటూ ణా ఉపన్యాసం శ్రద్దగా విన్నారు. నేను గురువుగారి తిట్లకు సంసిద్దుడనై కూర్చున్నాను.
"రంగాచార్యులకు సన్మానం ఎప్పుడు చేయవలెను?" అడిగారు. 'తరవాత' అని చలపతిరావు చెప్పారు. "ఎందుకూ! ఇప్పుడే చేస్తాను, శాలవా తెండి" అన్నారు.
పూలదండవేసి, శాలువా కప్పి, సభ కరతాళ ధ్వనులమధ్య కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు - నిండు చంద్రుని సాక్షిగా నన్ను సన్మానించారు.
అది జీవితంలో మరుపురాని - మరువలేని వసంత హేల.
విశ్వనాథవారు గంటన్నర మాట్లాడారు. నన్ను తెగడలేదు. తిట్టలేదు. వారి సిద్దాంతంతో రామాయణాన్ని విశదీకరించారు.
"రంగాచార్యులు చెప్పిన దానితో దేనితోను నేను ఏకీభవించను. రాముడు పరాత్పరుడని - రాముని కరుణా కటాక్షం వల్లనే వాల్మీకి రామాయణ రచన చేయగలిగినాడని నమ్ముదును. అట్లయినను రామాయణమును గురించి రంగాచార్యులు చేసిన వంటి పరిశ్రమ అవసరమైవున్నది" అన్న విశ్వనాథవాణి విని సభ ఆశ్చర్యమున మునిగి సుదీర్ఘ కరతాళధ్వనులు చేసినది.
సభ విజయవంతంగా ముగిసింది. అనేకమంది నన్ను అభినందించారు. గురువుగారికి పాదాభివందనం చేశాను. సుమారు అంతా వెళ్ళిపోయారు.
విశ్వనాథవారు నన్ను ఆలింగనం చేసుకున్నారు. చెవిలో అడిగారు "రంగాచార్లూ! నీకు రామాయణం ఏమయినా అర్ధం అయిందా?" అని.
"గురువుగారూ! నాకేమీ అర్ధం కాలేదు" అనే వాస్తవాన్ని తెలియపరచాను.
'ముఫ్ఫయ్యేళ్ళు చదివిన ముండావాణ్ణి నాకే అర్ధం కాలేదు. నీకేమర్ధం అవుతుందీ!"
అని భుజంమీద చేయివేసి మెట్లు దింపారు. నా వెంట మా ఇంటికి వచ్చారు. కమలనూ పిల్లలనూ ఆశీర్వదించారు.





