Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
సికిందరాబాదు ప్రజలు విలీనాన్ని వ్యతిరేకించారు. ఆందోళన చేశారు. బందులు నిర్వహించారు. సికింద్రాబాదు ఒక సువ్యవస్థిత నగరం - కార్పొరేషను దీనికి బ్రిటిషు సంప్రదాయం కారణం. హైదరాబాదు అవ్యవస్థిత నగరం - కార్పొరేషను.
బల్దియా ఖాయా పీయా చల్దియా
కుఛ్ దియాతొ కర్ధయా వర్నా బల్దియా
కార్పొరేషను తింటుంది. తాగుతుంది. సాగిపోతుంది. లంచం ఇస్తే పనిచేస్తుంది. లేకుంటే ముడి బిగిస్తుంది. అని సామెత. ఇది మొగలాయి సంప్రదాయం.
హైదరాబాదులో కలిసి సికిందరాబాదు కలుషితం అయిపోతుందని ప్రజల భయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు నేతిబీరలో నేయి వంటివారు. రాజకీయ నాయకులు రంగప్రవేశం చేశారు. తెలంగాణకు ఇచ్చినట్లే కొన్ని హామీలు ఇచ్చారు. అంతా పదవుల పంపకం! తొలి మేయర్ సికిందరాబాదునుంచి అవుతాడు. అయిదేళ్ళు సికిందరాబాదు బడ్జెటు వేరే ఉంటుంది లాంటి ఉత్తుత్తి వాగ్దానాలతో రెండు కార్పొరేషన్లను లీనం చేసి ఒకే కార్పోరేషను చేశారు.
చిన్న చేపను పెద్ద చేప మింగడం ప్రకృతి సూత్రం! వాగ్దానాలు చిన్న చేపను కాపాడలేవు. సరిగ్గా అలాగే జరిగింది. సికిందరాబాదులో వసూలుయిన కోట్లకు కోట్లు హైదరాబాదు స్వాహా చేసింది. అందుకు వ్యతిరేకంగా నిరశన వ్రతాలూ - సత్యాగ్రహాలూ జరిగాయి! ఇంతే సంగతులు!!
వాస్తవంగా విలీనం జరిగిందా అంటే అదీలేదు. నగరంగా సికిందరాబాదు వేరు. ఇక్కడి మున్సిపల్ నెంబర్లు వేరు. ఇక్కడి ఆఫీసు వేరు సికిందరాబాదులో ఉన్న ఇంటినెంబరు హైదరాబాదులో ఉంటుంది. అంతేకాదు, హైదరాబాదులోను - సికిందరాబాదు కంటోన్మెంటులోనూ ఒకే నెంబర్లు ఉంటాయి.
హైదరాబాదు అంటేనే హైరానీ - పరేషానీ ఇతర నగరాల్లో నంబర్లను బట్టి ఇళ్ళు దొరుకుతాయి. ఇక్కడ ఇళ్ళూ దొరకవు. నంబర్లూ దొరకవు. ఒకణ్ణి పరేషాన్ చేయాలంటే జంటనగరాల్లో అడ్రసు తెలుసుకొమ్మంటే చాలు! దీనికి తోడు ఉపనగర మునిసిపాలిటీల నంబర్లు!
నామమాత్రపు విలీనపు 34 సంవత్సరాల తరువాత ఇంకా వాస్తవంగా నగరం ఒకటి కాలేదు. ఎహ్ మొగలాయ్ దర్బార్ హై, యహాఁ కామ్ నహీ నామ్ హోతాహై.
రాజకీయం స్వార్ధానికి దగ్గర - వాస్తవానికి అతిదూరం - అందనంతదూరం మొత్తానికి 1960లో వేదప్రకాశ్ దుసాజ్ మేయర్ గా ఒకే కార్పొరేషను ఏర్పడింది. మామూలు ప్రకారం ఉత్సవాలు - జల్సాలు జరిగాయి!
హైదరాబాదు కార్పొరేషను ఆఫీసు ముసీకి ఆవల - పాత పట్నంలో - దారుల్ షిఫాలో ఉండేది. 'దారుల్ షిఫా' అంటే సర్కారీ దవాఖానా ఖులీ ఖుతుబ్ షా కట్టించిన వైద్యశాలవల్ల ఆ వీధికి ఆ పేరు వచ్చింది. శిథిలం అయిన దారుల్ షాఫాకట్టడం ఇంకా ఉంది! అది దాటితే కూలనున్న దేవిడీలు అటుతరువాత 'మీర్ ఆలం మండి' ఆ తరువాత చార్ కమాన్ - గుల్జార్ హౌజ్ అటునుండి చార్ మినార్ షాహ్ అలీబండనుంచి ఫలక్ నుమాకు దారి.
హైదరాబాదు ఉత్తరదేశంనుంచి వచ్చిన హిందువులు - ఇక్కడి ముసల్మానులకు తెలుగురాదు. ఇప్పటికీ తెలుగు నేర్వరు. ఆంద్రప్రాంతంనుంచి వచ్చినవారు ఉర్దూ పొడి పదాలు నేర్చారుతప్ప వారు తెలుగు నేర్వలేదు! తెలుగువారి రాజధానిలో తెలుగుకోసం గాలించవలసిన దుస్థితి!
హైదరాబాదు కార్పొరేషను అప్పటి అధికారుల్లో తెలుగేతరులు ఎక్కువ. వారిలో చాలామందికి తెలుగు ద్వేషం. అలాంటి వాళ్ళల్లో ఒకడు 'బేలేరాం కపూర్.' అతడు పంజాబీ, కార్పొరేషనులో అసిస్టెంట్ సెక్రటరీ, కౌన్సిల్ సమావేశాలు - కమిటీల సమావేశాలు నిర్వహిస్తాడు. ఉర్దూలో సమావేశాల కార్యక్రమాలను - తీర్మానాలను వ్రాస్తాడు.
కపూర్ మస్కా కొట్టడంలో మొనగాడు కమీష్నర్ మంచి ఫోనువస్తే లేచినుంచొని సలాం చేసిగాని మాట్లాడడు! ఎవరినీ నొప్పించడు. తిట్టినా పడ్తాడు. అందరినీ లొంగదీసుకుంటాడు. అతనికి తెలుగంటే అస్సలు పడదు. హైదరాబాదు కార్పొరేషనులో - విలీనానికి ముందే - ఇద్దరు తెలుగు అనువాదకులను నియమించారు. యాడాది దాటినా వారికి పని కల్పించలేదు. స్థానం చూపలేదు. తెలుగు అక్షరం వ్రాయనీయలేదు. ఈ పరిస్థితిలో సికిందరాబాదు హైదరాబాదులో కలిసింది.
విలీనం వల్ల కదలాల్సింది. సమావేశాలు నిర్వహించే సెక్రటరీ సెక్షను మాత్రమే. నేను ఆ సెక్షనువాన్నే నేను తెలుగు అభిమానిని అని కపూర్ గ్రహించాడు. నన్ను సాధ్యమైనంత కాలం సికిందరాబాదులో ఉంచడానికి ప్రయత్నించాడు. సికిందరాబాదు కౌన్సిలర్ల వత్తిడి పెరగడంతో - విధిలేక హైదరాబాదు రప్పించాడు. నాకు అనువాదం పనికాక ఆఫీసు పని వప్పచెప్పాడు.
తెలుగు ద్వేషం సహించడం నాకు సాధ్యపడలేదు. కపూర్ తో ఘర్షణ పడ్డాను. అతడు వ్యతిరేకించడు. లొంగుతాడు. కొడ్తే పదేవాన్ని మనం ఏమీ చేయలేం. కపూర్ కాదనడు. కానివ్వడు. గత్యంతరం లేక అన్యమార్గం అవలంబించాల్సి వచ్చింది. హైదరాబాదు అనువాదకులు మాధవరావు - వెంకట కిషన్ రావుతో కలిసి కౌన్సిలర్లలో తెలుగువారిని కలుసుకున్నాం. పరిస్థితి వివరించాం. తెలుగును కాపాడడానికి కపూర్ మీద వత్తిడి తేవలసిందని కోరాం. తెలుగు కౌన్సిలర్లు సికిందరాబాదువారు ఎక్కువమంది. వారికి మా వాదన నచ్చింది. వారు వాస్తవంగా వత్తిడి తెచ్చారు. తెలుగు అనువాదం లేకుంటే కమిటీలకు హాజరు కామని బెదిరించారు. కపూర్ సికింద్రాబాదు, హైద్రాబాదు భేదాలు తెచ్చాడు.
కపూర్ అవతారం మార్చాడు. హిందీ కౌన్సిలర్లను ఎగదోశాడు. వారు హిందీ అనువాదం కావాలన్నారు. హిందీ అనువాదకులను నియమించి అనువాదం జరిగేవరకు తెలుగు వాయిదా వేయించాడు.
స్వాతంత్ర్యం వచ్చింతరువాత protest - అసమ్మతి కరువయింది. దొరతనం వారి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడడం ఎక్కువయింది. తెలుగు కౌన్సిలర్లను సైతం కపూర్ లొంగదీసుకున్నాడు.
అయ్యా! ఇది ఆంద్రప్రదేశం ఏర్పడింతరువాత రాజధాని నగరపాలికలోని స్థితి! నేను తెలుగు రాష్ట్రంలో తెలుగుకు జరుగుతున్న అవమానం సహించలేకపోయాను. సచివాలయాన్ని ఆశ్రయించక తప్పలేదు.
"ఎహ్ హై సెక్రటేరియట్
యహాఁకార్రవాయ్యాఁలేట్
యహాఁహో తేహర్ అర్మాఁభేఁట్"
'ఇది సెక్రటేరియటు - ఇక్కడ కేసులు లేటు - సర్వకోరికల బలివేటు' అనే సత్యం చెప్పినవాడు సర్వర్ డండా!
ఇక్కడ ఎంతటివాడయినా గుమాస్తాకు లోకువే! ఓపిగ్గా నిరంతరం తిరిగాం. తుదకు మంత్రి సంజీవయ్యగారిని కలుసుకుంటేగాని పని కాలేదు.
బేలేరాం కపూర్ కు నిజామాబాదు బదిలీ అయింది! ట్రాన్సుఫర్ ఆర్డరు - అనుకోకుండా - చేతికి అందిన్నాడు కపూర్ మా ముందు - నిజంగా కన్నీరు కార్చి ఏడ్చాడు! రక్షించమని బ్రతిమిలాడాడు. తాను తెలుగు వ్యతిరేకిని కానన్నాడు. పదవిని కాపాడుకోవడానికి ఉర్దూను ఆశ్రయించా నన్నాడు. నిజామాబాదులో తాను నెగ్గలేనన్నాడు. వాస్తవంగా నాకు జాలి కలిగింది. కాని బాణం సాగిపోయింది!
కపూర్ వెళ్ళిపోగానే కార్యక్రమాలు ఇంగ్లీషులో రికార్డు చేయడం ప్రారంభం అయింది. తెలుగుతోపాటు హిందీ అనువాదాలు కూడా అందించడం జరిగింది.
ఆంగ్రేజువాడు ఏర్పరచిన బ్యూరోక్రసీలో ఆంగ్రేజు డిసిప్లిన్ అంతరించింది. ఒక్క గుమాస్తా వేసిన ముడిని విప్పడానికి ఏళ్లతరబడి తిరగాల్సివస్తుంది. తెలుగుకోసం ఏర్పడిన రాష్ట్రంలో ఒక చిన్న అధికారి చెరనుండి తెలుగును విడిపించడానికి ఇంతటి మహాయత్నం అవసరం అయింది.
నేను హైదరాబాదు చేరుకోవడంవల్ల వ్యక్తిగతంగా నాకు కొన్ని ప్రయోజనాలు చేకూరాయి:
1. విశాల పరిధిలో ప్రవేశించాను. వివిధ నాగరికతలు - వివిధ భాషలు - వివిధ సంస్కృతులతో పరిచయం - సాన్నిహిత్యం ఏర్పడింది.
2. పాతబస్తీ, కూలుతున్న డివిడీలు - కన్నుమూస్తున్న నవాబుల జీవితం - పాత నాగరికత జాడ విడువని బస్తీలు - పురాతన పరిమళం వదలని పత్తర్ ఘట్టీ ముత్యాల దుకాణాలు - మతం వాసన వదల్లేక జరుగుతున్న రాజకీయ కల్లోలాల మధ్య మత సహజీవనం నన్ను ఎంతగానో ఆకర్షించాయి.
3. కార్పొరేషను కార్యాలయంలో మంచి గ్రంథాలయం ఉండేది. ఉర్దూ, తెలుగు, హిందీ పుస్తకాలు అనేకం ఉండేవి. పురాతన 'భారతి' ప్రతులు ఉండేవి. అది నాకు ఒక విందు. ఉర్దూ కవిత్వపు సొగసులు ఇక్కడే అర్ధం అయినాయి.
4. అన్ని పార్టీలు - భాషల కౌన్సిలర్లు నన్ను అభిమానించారు. ఒకళ్ళిద్దరు కమ్యూనిస్టు కౌన్సిలర్లు పార్టీ ప్రభావితం చేసింది. కమ్యూనిస్టులు ప్రజలను వదిలి - వాదాలను ఆశ్రయించింతరువాత - ముస్లిములను మత పార్టీలు ఆక్రమించాయి. ఇప్పటికీ హైదరాబాదు ఉర్దూ కవులు, రచయితల్లో ఎక్కువ మంది ప్రగతి శీలురు.





