Home » vaddera chandidas » Anukshanikam 2
"పోనీండి" అన్నాడు శ్రీపతి.
శ్రీపతికి ---- వాళ్ళ తాత ఆస్తిలో సగం, తండ్రి ఆస్తిలో సగం వుంది. అదనంగా యిప్పుడు తల్లి పేర వున్న ఆస్తి అంతా వొస్తుంది.
"చేయ్యకూడదనే నమ్మకం వుందా?" అన్నాడు వొకతను.
"అదీ లేదు" అన్నాడు శ్రీపతి.
"ఐతే చెయ్యకూడదనేం లేదుగా. మేం అడుగుతున్నామని చెయ్యి, ఆవిడకి తలకొరివి యెవరైనా పెడతారు. బోలెడు ఆస్తి వొస్తుందనైనా కానీ, కన్నకొడుకుతో తలకొరివి పెట్టించుకోలేకపోతే ఆవిడకి --------"
నడుస్తున్నారు, స్మశానం చేరుకున్నారు.
తలకొరివి పెట్టాడు.
గంట సేపు
అందరూ తిరుగు ముఖం పట్టారు.
శ్రీపతి అక్కడే కూర్చున్నాడు. మధ్యాహ్నపు టేండ. యెండలో కూచుని కాలిన చిటికేసి చూస్తున్నాడు.
లేచాడు, వొంగి గుప్పెట నిండా బూడిద తీశాడు. చెయ్యి తెరిచాడు. "వుఫ్" అని నిదానంగా ఊదుతున్నాడు. బూడిద యెగిరి గాలిలో కలిసి పోతోంది. చేతిలో బూడిద ఐపోయింది. వుత్త చేతులో రేఖలు కనిపిస్తున్నాయి.
చూపుడు వేలు కణుపు మడిచి పెదవి మీద నొక్కుంటూ యేటో చూస్తున్నాడు, చూపు ---దూరాన భూమీ ఆకాశం కలిసిన చోట నిలిచింది.
128
తలుపు చప్పుడు వినిపించి , తియ్యటానికి వొచ్చింది శాంత అదే చప్పుడు విన్న ఆమె తోటికోడలు, సుబ్రహ్మణ్యం అన్న భార్య కూడా వొచ్చి , శాంతని చూసి, మూతి విరుచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ యింటికి రెండు గదులు. మధ్యలో హాలు. వెనుక వంట గది. సుబ్రహ్మణ్యం అక్కకి చాలాకాలం వెనక పెళ్ళయి వెళ్ళిపోయింది. వొక అన్న మెకానికల్ డిప్లామా చదివి , రూర్కీలో వుద్యోగం. పెళ్ళాం పిల్లలతో అక్కడ వుంటాడు. యెప్పుడో రెండు మూడేళ్ళ కొకసారి వొచ్చి చూసి పొతుంతాడు. రెండో అన్నకి వూళ్ళోనే వుద్యోగం---- యు.డి.సి యిద్దరు ఆడపిల్లలు. శాంతకి వొక ఆడపిల్ల. సుబ్రహ్మణ్యం చెల్లెళ్ళు యిద్దరు, తమ్ముళ్ళూ యిద్దరూ చదువుకుంటున్నారు. ఆ పిల్లలు వీళ్ళద్దరిగదుల్లో కూచుని చదువుకుంటూ వుంటారు. రాత్రుళ్ళు మాత్రం హల్లో తల్లీ తండ్రీ ఆ నలుగురు పిల్లలూ చాపలు పరుచుకుని పడుకుంటారు. వాళ్ళకి తోడు మనుమరాళ్ళూ చేరుతుంటారు'.
శాంత, తలుపు తెరిచింది.
వీధిలో సుబ్రహ్మణ్యం రిక్షా దిగుతున్నాడు. పొద్దుట వెడితే సాయంత్రం గాని రాడు. మధ్యాహ్ననికి టిఫిను బాక్సు పట్టి కెడతాడు.
రిక్షా దిగి, తెల్ల యూనిఫారం బట్టల్లో వున్న బ్యాంకు ఫ్యునుని కావలించుకున్నాడు సుబ్రహ్మణ్యం. ఫ్యూను విడిపించుకుని కలవరపడ్డాడు. సుబ్రహ్మణ్యం రిక్షా అతనికి షేక్ హ్యాండ్ యివ్వబోయాడు. అతను రెండు చేతులూ హ్యాండిల్ మీద వేసి వింతగా చూస్తోంటే ఆటను ముంజెయ్యి పట్టుకుని వూపాడు'.
ఫ్యూన్ రిక్షాలో కూచున్నాడు. రిక్షా కదిలింది.
రిక్షాకి సెల్యూట్ చేస్తూ "హీఁహీఁ" అన్నాడు సుబ్రహ్మణ్యం.
గిరుక్కున వెనక్కి తిరిగి గుమ్మంలో శాంతని చూసి "హీఁహీ" అంటూ యన్.సి.సి. పెరేడ్ లా అడుగులు వేస్తూ , "భుట్టో యీజ్ హ్యాంగ్ద్ద్ హీఁహీఁ" అని చంకలోని దినపత్రిక తీసి వూపాడు. ఆ వెర్రినవ్వు అర్ధం కాక అయోమయంగా చూస్తోంది శాంత.
"హీఁహీఁ భుట్టో యీజ్ హ్యాంగ్ద్ద్!" అని శాంత భుజం మీద వేళ్ళతో తట్టి "హీఁహీఁ" అన్నాడు.
భర్త చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెడుతూ "భుట్టో పాకిస్తాన్ ప్రధానమంత్రి కదండీ?" అంది.
"హీఁహీఁ భుట్టో యిజ్ హ్యాంగ్ద్ద్ . వెనకెప్పుడో ప్రధాని. మిలటరీ జనరల్ జియా కుర్చీ లాగేసుకూచున్నాడు. భుట్టో యిజ్ హ్యంగ్ద్ద్ హీఁహీఁ" అని పత్రిక ఆమె మీదికి విసిరాడు.
'అయ్యో పాపం వురితీశారా?" అంది శాంత.



