Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
వాస్తవంగా రచనలమీద నా ఆర్జన అతి కొద్ది అయినా కమల నాకు అన్నివిధాల సహకరించింది. ఆమె సహకారం లేకుంటే రచన సాధ్యం అయ్యేదికాదు.
టేబుల్ ముందుకు వెళ్ళేవరకు భయంభయంగా ఉండేది. ఎవరో ముందుకు నెట్టినట్లు కూర్చునేవాణ్ణి. రామాయణం చూచి రచన ప్రారంభిస్తే ఉత్సాహం వచ్చేది. ఎంత జటిలమయిన సమస్య అయినా వెలుగు చిమ్మినట్లు పరిష్కారం అయ్యేది. ఆఫీసుకు వెళ్తూనే రచన నిరంతరం సాగించాను. ఒక్కొక్క కాండ అయిపోతుంటే ఏదో బరువు దిగినట్లూ - ఒక కార్యం నెరవేరినట్లూ అనిపించేది. సుందరకాండ వ్స్తవంగా సుందరమైంది. దానిలో సుందరివంటి ఆకర్షణ ఉంటుంది. మనం సుందరివెంట వెర్రిగా సాగిపోతూనే ఉంటాం.
రచనలో మాత్రమే కాదు - కాండముల విభజన విషయంలోనూ వాల్మీకి తన కళాపటిమను ప్రదర్శించాడు. బాలకాండలో జనక దశరథుల కుటుంబాలు కలుస్తాయి. అయోధ్యలో దశరథుని కుటుంబం మాత్రం ఉంటుంది. అరణ్యంలో సీతారామలక్ష్మణులుంటారు. కిష్కింధలో రామలక్ష్మణులు మాత్రమే ఉంటారు. సుందరలో కేవలం సీత ఉంటుంది. యుద్దకాండ చివరన అంతా కలుస్తారు.
వాల్మీకి అయోధ్య నుంచి కిష్కింధవరకు స్థలాల పేర్లుపెట్టాడు. సుందరకాండ సాంతం లంకలో జరుగుతుంది. అయినా అది వాల్మీకిని మురిపించింది. అందుకే 'సుందర' అయింది.
రామాయణ రచన పూర్తి చేయడైకి నాకున్న శక్తిస్తోమతలు చాలినాయి అనుకోను. భగవంతుడు రాముడుగా నాకు శక్తిసామర్ద్యాలు ప్రసాదించాడు అనుకుంటాను. మొత్తంమీద రామాయణ రచన పూర్తి అయింది.
ప్రచురణ రచనకు ప్రాణం వంటిది. రచన ప్రచురణ జరిగి ప్రజలకు అంది ప్రశంసలు పొందినపుడే రచయితకు తృప్తి.
ప్రచురణను గురించి తెలుసుకోవడానికి కొంత వెనక్కు వెళ్ళాలి. 1960లో నన్ను కదిలించినవాడు వివేకానందుడు. అతడు అందని ఆధ్యాత్మికచింతనను మానవసేవకు జోడించినాడు. సకల మత సామ్యతను గురించి ప్రవచించినాడు వివేకానందుడు వెలుగు పుంజమును వెల్లడించాడు.
రామకృష్ణ పరమహంస పాదంనుంచి నరేంద్రుని మానసంలోనికి ప్రవహించిన శక్తి అద్భుతం - ఆశ్చర్యకరం! ఆ శక్తియే నరేంద్రునకు బలప్రదాత!
శక్తిని ప్రసరింపచేయటానికి పరమహంస కావాలి! శంకర భగవత్పాదులవలె - వివేకానందుడు తన స్వల్పకాలపు ఆయుష్యంలో భారతీయులకే కాదు - లోకాలకు వెలుగు చూపాడు.
వివేకానందుని జీవిత సంగ్రహం బాలలకోసం రచించాను. దాన్ని కొండా శంకరయ్యవాళ్ళు ప్రచురించారు. నాకు యాభయిరూపాయిలు ఇచ్చారు.
కాళిదాసు నా మీద ఎంతో ప్రభావం చేశాడు. వారి మూడు నాటకాలు శాకుంతలం - మాళవికాగ్నిమిత్రం - ఊర్వశీవిక్రయం - పిల్లలకోసం పుస్తకాలు వ్రాశాను. ప్రచురణ కర్త దొరకలేదు. రచనకు మెచ్చి మడిపడగ బలరామాచార్యులవారు బొమ్మలు వేశారు. బొమ్మల సహితంగా శిర్నాం సత్యనారాయణగారికి చూపాను. వారు స్పందంచారు. నాకు పబ్బా శంకరయ్యగారిని పరిచయం చేశారు.
పబ్బా శంకరయ్యగారు ఆత్మవిశ్వాసం - పట్టుదల - నిరంతర కృషితో పైకి వస్తున్నవారు. వారు శ్రీరామా బుక్ డిపో స్థాపించి పుస్తక ప్రచురణ చేస్తున్నారు. వారికి సాహిత్యంతో పరిచయం లేకున్నా పండితులు సాహితీమూర్తులతో పరిచయాలు మాత్రమేకాక సంబంధాలున్నాయి. శంకరయ్యగారు స్నేహశీలి వారు వయసులో పెద్దవారు. అయినా మా మైత్రి కొనసాగుతున్నది.
శ్రీరామా బుక్ డిపోవారు నేను రచించిన కాళిదాసు నాటకత్రయం అందంగా ముద్రించి ప్రచురించారు. వారు మూడు పుస్తకాలకు నూటయాభయి ఇచ్చారు. రచన నేను వ్యాపారంగా సాగించడం లేదు. ఆర్దికంగా ఆలోచించను. నలుగురికి అందడం నా లక్ష్యం.
'జనరంగం' అని నేను వ్రాసిన శతకాన్ని శిర్నాం సత్యనారాయణగారు తమ స్వంత డబ్బుతో ప్రచురింపచేశారు. శిర్నాం వదాన్యులు. మేయర్ పదవి అధిష్టించారు. కాని వారికి గుర్రప్పందాల వ్యసనం ఉండేది. అప్పులపాలయి సకుటుంబంగా ఆత్మహత్యలు చేసుకున్నారు!
నేను వ్రాసిన రామాయణం వ్రాత ప్రతిని పబ్బా శంకరయ్యగారికి ఇచ్చాను. వారు ప్రచురిస్తామని మాట ఇవ్వలేదు. కాని చూస్తాం అన్నారు. నా వయసు దృష్ట్యా నేను రామాయణం వ్రాయగలనని వారికి నమ్మకం కలుగలేదు. వారు దానిని పండితులకు చూపారు. వారు ఆమోదించినట్లున్నారు. ప్రచురిస్తామన్నారు. కాని వారు ప్రచురిస్తామన్న తీరుకు నేను వ్రాసింది సరిపోదు అని ణా కనిపించింది. నేను క్రౌన్ సైజులో మూడు, నాలుగు వందల పేజీలు వచ్చేట్లు వ్రాశాను. దాన్నే అన్ని పేజీలు వచ్చేట్లు రాయల్ సైజులో ఎడం ఎడంగా వేస్తామన్నారు. నాకు అది ఇష్టం కాలేదు. రాయల్ సైజుకు సరిపోయ్యేట్లు మళ్ళీ వ్రాస్తానన్నాను. శంకరయ్యగారు అయిష్టంగానే వ్రాత ప్రతి నాకు ఇచ్చారు. త్వరగా కావాలి, అచ్చు ప్రారంభిస్తాను అన్నారు శంకరయ్యగారు. ప్రచురణ కర్త లభించడం అదృష్టం - సంతోషకరం అయింది. వ్రాసిందే మళ్ళీ వ్రాయడం అంటే విసుగు కాదు - ఉత్సాహం కలిగింది. అది రామాయణం మరి! అభిగీత మిదం గీతం!!
శ్రీమద్రామాయణ రచన 12-1-63న ప్రారంభించాను. తెల్లవారుజామున లేచి కప్పు వేడి చాయ్ త్రాగి - ఒక సిగరెట్టు ఊది వ్రాయడానికి కూర్చునేవాణ్ణి. ఇదివరకువలె భయం కలిగేది కాదు. టేబుల్ ముందు కూర్చుంటే ఏదో ఆవేశం - ఆనందం - ఉత్సాహం కలిగేవి. రామాయణంలో లీనం అయ్యేవాణ్ణి. ఒక సమాధిస్థ దశ. మరేదీ తెలియదు. సముద్రమివరత్నాఢ్యం అయిన రామాయణమే. రచన నిరాటంకంగా గంగా స్రవంతివలె సాగుతున్నది. ఆయా సన్నివేశాలనుబట్టి ఆవేశం - ఆగ్రహం - దుఃఖం - ఆర్ద్రత! అది అనిర్వచనీయ అనుభూతి!
వాల్మీకి మానవ మనస్తత్వ జ్ఞానం అపూర్వం! అయోధ్య కల్లోలం పాఠకున్ని కల్లోలితం చేస్తుంది. వెంటనే అరణ్యంలో మనసుకు ఉల్లాసం కలిగించే రమణీయం అయిన గంగానది వర్ణన! అద్భుతం!!
రామాయణ రచనలో ఆయా ఘట్టాల్లో వివరణలు - వ్యాఖ్యలు అననుఇచ్చాను. సాగర మథనాన్ని చెప్పినపుడు రాక్షసులు శ్రామికులు - దేవతలు యజమానులు - ఉభయుల ప్రయత్నమున పుట్టిన అమృతం రాక్షసులకు దక్కలేదు. ఫలితం నేటికీ శ్రామికులకు దక్కడం లేదని వివరించాను. ఇలాంటి అనేక వివరణలు ఇచ్చాను.
వ్రాసింది మళ్ళీ చూడలేదు. నేను వ్రాసి ఆఫీసుకు వెళ్ళేవాణ్ణి. ఆఫీసుకు ఎన్నడూ ఆలస్యంగా వెళ్ళలేదు. విధి నిర్వహణలో ప్రమత్తత - అలసత్వం చూపలేదు. నేను వెళ్ళింతరువాత శంకరయ్య మనిషి వచ్చి వ్రాసిన కాగితాలు తీసికెళ్ళేవాడు. వెనుక వ్రాసింది చూచే వీలులేదు. అయినా రామాయణ రచనా స్రవంతి అనాయాసంగా - ఆనందభరితంగా సాగుతున్నది.
రామాయణ రచన సాగుతున్నప్పుడు నాయన వచ్చారు. ఒకనాడు నేను వ్రాసి పెట్టింది - బహుశః సుందరకాండలో సీతను రావణుడు బెదిరించిన ఘట్టం - చదివారు. సాయంత్రం నేను ఇంటికి వచ్చింతరువాత అన్నారు:
"రంగడూ! నీమీద వాల్మీకి ఆవేశించినాడు. అట్లుకాకున్న ఈ రచన అసాధ్యం."
నాయన రామాయణంలో నిష్ణాతులు! వారు అలా అంటే నేను పొంగిపోయాను. ఉప్పొంగిపోయాను. తబ్బిబ్బు అయినాను. అదొక అనిర్వచనీయ అనుభూతి! చాల కొద్దిమందికి అలాంటి క్షణాలు లభ్యం అవుతాయి! 'పలికించెడివాడు రామభద్రుండట' అనే విశ్వాసం దృఢపడింది.
పబ్బా శంకరయ్యగారు శ్రీమద్రామాయణ ముద్రణాకార్యం 4-2-63ణ ప్రారంభించి, 26-3-63న ముగించాడు. వాడు శ్రద్దగలవారు. శ్రద్దగా అందంగా అచ్చువేశారు. లోనిబొమ్మలు - ముఖపత్రపు పంచవర్ణ పట్టాభిషేక చిత్రం మడిపడగ బలరామాచార్యులవారు వేశారు.
శ్రీమద్రామాయణ గ్రంథం సుందరంగా సిద్దం అయింది. శ్రీ మద్రామాయణాన్ని భద్రాద్రి రామునకు అంకితం ఇచ్చాను.
నీ కథ నీకే అంకితము; నీవు నరావళిలోన ఉత్తమ
శ్లోకుడవై యుగాలయిననున్ వసివాడవు జ్ఞాపకాలలో
లోకము నిన్ను దేవుడని లోతుగ చూడదు; నాదు గుండెకున్
తాకెదు మానవాగ్రణిగ దాశరథీ కరుణాపయోనిధీ!
శంకరయ్యగారు శోభకృత్ ఉగాది 26-3-63 మంగళవారంనాడు, బూరుగు మహదేవ్ హాలులో, శ్రీమద్రామాయణ ఆవిష్కరణోత్సవం ఏర్పాటుచేశారు. శంకరయ్యవదాన్యులు. వితరణ శీలి. సంప్రదాయ వేది. ప్రతి సంవత్సరం వారి దుకాణంలో ఉగాదినాడు ఉదయం సరస్వతీపూజ జరుగుతుంది. కవులను, పండితులను - సాహితీవేత్తలను పిలిచి, ఫలములు పంచాంగం అందిస్తారు. ఉగాది సాయంత్రం పంచాంగ శ్రవణం, పండిత సత్కార కార్యక్రమం ఏర్పరుస్తారు.
ఆ సంప్రదాయాన్ని అనుసరించే శ్రీమద్రామాయణ ఆవిష్కరణ సభ ఏర్పాటయింది. అది సుసాయంత్రం. సభాస్థలి జనంతో నిండిపోయింది. విద్వాంసులు - స్ఫురద్రూపులు తెన్నేటి విశ్వనాథంగారు అధ్యక్షత వహించి - సభికుల కరతాళధ్వనుల మధ్య - నేను రచించిన శ్రీమద్రామాయణం ఆవిష్కరించారు.
సభలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ - దివాకర్ల వేంకటావధాని - దీపాల పిచ్చయ్యశాస్త్రి - ఉత్పల సత్యనారాయణాచార్యులు - ఇల్లిందల సరస్వతీదేవి - యశోదారెడ్డిగారల వంటి సాహిత్య దిగ్గజాలు నా రామాయణ రచనను - శైలిని - వివరణను శ్లాఘిస్తే నాకు సిగ్గనిపించింది.





