Home » vaddera chandidas » Anukshanikam 2
సాయంత్రం అయింది.
"స్లీపింగ్ పిల్స్ ఏమన్నా మింగి చచ్చిపొయిండెమో! అని వొకతను అనుమానం వ్యక్తపరిచాడు.
అమాంతం గదిలోకి చొరబడ్డారు నలుగురు.
శ్రీపతి , నిద్రపోతున్న శ్వాస కదలిక.
చేత్తో తట్టి లేపారు.
కళ్ళు తెరిచి, "హలో" అన్నాడు శ్రీపతి.
"యేమి -- యెంత సేపటి నుండీ నిద్ర?"
"నిద్రకి యెంత సేపనేఁవుంది? పడుకుంటే నిద్రొస్తుంది. నిద్రొస్తే పడుకున్నాను. లేపటం దేనికి నిద్రపడితే?" అన్నాడు శ్రీపతి.
ఆరోజు పేపర్లో అబిడ్స్ లో వో యువకుడు వొక యువతిని బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడు -----అని, ఆ వివరాలు పత్రికా విలేఖరి యిచ్చినట్లు వుంది. పోలీసుల ప్రమేయం లేదు ------ శంఖు లో పోయ్యనిదే తీర్ధం కానట్లు పోలీసులు సమాచారం విడుదల చేయ్యనిదే, అధికారికంగా నిజం కాదు. పోలీసుల రికార్డులో ఆసలు అలాంటి సంఘటన జరిగినట్లే లేదు.
రెండు రోజులు గడిచాయి.
మూడో రోజున రత్నాకరరావు వొచ్చాడు. వాళ్ళకి యీ విషయం తెలిసినా వొచ్చి పరామర్శించే విషయం కాదని రాలేదు.
"మీ అమ్మగారికి వొంట్లో బాగాలేదట." అన్నాడు రత్నాకరరావు.
"అలాగా అప్పుడప్పుడు అలాగే అవుతూ వుంటుంది. ఆవిడకి."
"సీరియస్ గా వుందట"
"యేవరొచ్చారు?"
"మాకు టెలిగ్రాం వొచ్చింది. వెంటనే మిమ్మల్ని పంపమని. ప్లీజ్ బట్టలు సర్దుకోండి."
"అవసరం లేదు" అని వున్నపళంగా బయల్దేరాడు శ్రీపతి.
యింటి దగ్గిర చాలా జతల బట్టలు వుంటాయి.
రత్నాకరరావు స్కూటర్ స్టార్ట్ చేశాడు.
"బస్సులో వెడతాను. రైలు వుంటుంది యింకో గంటకి" అని స్కూటర్ మీద కూర్చున్నాడు.
"రమ కూడా వొస్తానంటున్నది " అన్నా
"వేరే పనుంటే సరే. యీ మాత్రానికే ఐతే అనవసరం.
స్కూటర్ ఆగింది.
గుమ్మంలో రమాదేవి. కళ్ళనిండా నీళ్ళు.
శ్రీపతిని చూసి మూతికి పవిటకొంగు అడ్డం పెట్టుకుంది.
ఏదో అనుమానంగా అనిపించి, "టెలిగ్రాం యేది?" అన్నాడు శ్రీపతి.
"తెలిగ్రామా. టేలిగ్రామూ -- రమా యేక్కడ పెట్టావు?" అని వెతికినట్లుగా అటూ యిటూ తిరిగి, "కనిపించటం లేదు. రైలు కి టైం అవుతాంది. టాక్సీ కోసం చెప్పాను ---వొస్తుంది. అదిగో రానే వచ్చింది" అన్నాడు రత్నాకరరావు.
టాక్సీ, రైలు స్టేషను, రైలు.
తెల్లవారుజాముకి విజయవాడలో వున్నారు. శ్రీపతి బస్టాండు కి అటో మాట్లాడుతుంటే, రత్నాకరరావు మధ్యలో ఆడ్డం వొచ్చి టాక్సీ మాట్లాడాడు నేరుగా వూరికి.
కూర్చున్నారు అరగంట.
బంగాళా ముందు టాక్సీ ఆగింది.
దిగారు.
ముఖాలు చూసి ముందుకు చూస్తూ లోనకి వెళ్ళాడు శ్రీపతి.
బయటా యింటి నిండా జనం నిశ్శబ్ధం.
యెవరో శ్రీపతి చెయ్యి పట్టుకుని మెట్లెక్కి అతని తల్లి గదిలోకి --
మంచం మీద తల్లి --- శాలువా కప్పి వుంది.
తీసికెళ్ళినతను బావురుమన్నాడు.
యేడెనిమిది ,మంది పైకి వొచ్చారు అంతలో.
స్టూలు మీద మౌనంగా కూచున్నాడు శ్రీపతి.
"మొన్నటిదాకా బాగానే వున్నారు. నిన్న సడన్ గా పడిపోయారు -"
శ్రీపతి మౌనంగా వున్నాడు.
"డాక్టర్లు హార్ట్ ఎటాక్ అన్నారు"
రెండు నిమిషాల మౌనం.
"విని భరించలేనిదేదో వినో, తెలుసుకునో వుంటారు -------అన్నారు డాక్టర్లు.
శ్రీపతికి అర్ధం అయింది.
పోలీసుల నుంచి తప్పించిన వాళ్ళు యీవిడ నుంచి తప్పించలేకపోయారు --అనుకున్నాడు శ్రీపతి.
శ్రీపతి ముఖంలో పైకి యే భావమూ కనిపించటం లేదు యెవరికీ.
అంత నిబ్బరంగా యెట్లా వున్నాడా ----- అని ఆశ్చర్యపోతున్నారు కొందరు. రాతిగుండె ------ అనుకున్నారు కొందరు. అసలు, తల్లి అంటే యెప్పుడూ పెద్ద యిది లేదు ---- అనుకున్నారు కొందరు. తల్లీ కొడుకుల మధ్య పెద్ద అనుబంధం లేదు ------- అనుకున్నారు కొందరు.
శ్రీపతి మౌనంగా కిందికి దిగి వొచ్చి తన గదిలోకి వెళ్ళాడు. కుర్చీలో కూచుని ; తల, వెనక అంచు మీద ఆనించి రెప్పలు వాల్చాడు .
పాదాల అలికిడి.
అలాగే వున్నాడు.
"యిట్లా సడన్ గా యెందుకు జరిగిందో గ్రహించారనుకుంటాను"
రెప్పలు విప్పాడు. రమాదేవి. దిగులుగా చూస్తోంది. బుగ్గల మీద యెండిన కన్నీటి చారికలు.
"నిన్న మొన్నటి బీరకాయబీచు సంబంధం యీ మెకెందు కంత యిది ఆవిడ పొతే" అనుకున్నాడు.
రెండు నిమిషాల మౌనం.
రమాదేవి బయటికి వెళ్ళింది.
దహన సంస్కారం యేర్పాట్లు జరిగాయి. గంధపు చెక్కలు కూడా చేర్చారు.
మేనమామ వొచ్చి "పద" అన్నాడు. శ్రీపతి లేచాడు.
బయటికొచ్చాడు.
కుండ పుచ్చుకోమన్నారు.
"నాకు వీటిలో నమ్మకం లేదు. దహనం యెవరైనా చెయ్యొచ్చు తోడ బుట్టినవాడివి -- మీరు మరీ సమానంగా సన్నిహితులు " అన్నాడు శ్రీపతి.
అందరూ విస్మయంతో అవాక్కపోయారు.
"పుత్రుడే చెయ్యాలి" అన్నాడు వొకతను.
"నాకు నమ్మకం లేనప్పుడు యెవరు చేస్తే యేఁవుంది?"
"చెయ్యకపోతే ఆ ఆస్తి వారసత్వం హక్కు తలకొరివి పెట్టిన వాళ్ళకి పోతుంది."



