Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కందుకూరి - గురజాడలు గొప్ప సంఘసంస్కర్తలు వారిమీద నాకు ఎంతో గౌరవాభిమానాలున్నాయి. కాని ఆంగ్లేయులు మన సంప్రదాయాన్ని అవమానించడానికి - సంప్రదాయాన్ని రూపుమాపడానికి చేసిన మాయకు వారు ఎంత ప్రభావితులయినారో చెప్పడానికి మాత్రమే పై ఉదాహరణలు.
ఆంగ్లేయులు భారత సంప్రదాయాన్ని రూపుమాపే ప్రయత్నంలో భాగంగానే మన మేధావులు - ముఖ్యంగా ప్రగతిశీలురు అనిపించుకునేవారు రామాయణ మహాభారతాలను వేదాంత గ్రంథాలుగా వెలి వేశారు. విమర్శలు చేశారు. ఆ విధంగా ఆ మహాగ్రంథాలకు కొంతకాలం గ్రహణం పట్టించారు. గ్రహణం సూర్య, చంద్రులను మింగలేదు. కప్పి ఉంచగలదు అంతే.
మా అమ్మగారు పరమపదించిన తరువాత వాల్మీకి రామాయణం - మరొకసారి ధ్యానంగా చదివాను. అందువల్ల జ్ఞానోదయం అయింది. రామాయణం వేదాంతం కాదని అర్ధం అయింది. రాముడు పరిపూర్ణ మానవతామూర్తి అని అర్ధం అయింది. వాల్మీకి అత్యద్భుతకావ్యాన్ని సృష్టించిన కవికులగురువునకు గురువు అని అర్ధం అయింది. వాల్మీకికి తెలిసిన ప్రకృతి తత్త్వం - మనవ మనస్తత్వం - సామాజిక స్వరూప స్వభావాలు ఇంతవరకు ఏ రచయితకూ తెలియలేదని అర్ధం అయింది. వాల్మీకి సృష్టించిన కావ్యం - అతను సృష్టించిన పాత్రలు - సంబంధాలు - సన్నివేశాలు - నీతులు - సిద్దాంతాలు - ధర్మాలు మారవలసిన కాలధర్మాలకు ఎదురు తిరిగి నిలిచాయని విదితం అయింది.
"యావత్ స్థాస్యంతి గిరియః సరితశ్చమహీతలే
తావ ద్రామాయన కథాలోకేషు ప్రచారిష్యతి"
(ఈ లోకంలో కొండలూ, నీళ్ళూ ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది) అన్న మహర్షివాక్యం నిత్యసత్యం అయింది.
వాల్మీకి వల్ల ప్రభావితుడుకాని భారతీయ రచయిత ఉండడు. వ్యతిరేకించిన వారు సహితం రామాయణ ప్రభావితులే! ఆ మహర్షి సృష్టించిన కావ్యం ఉండబట్టికదా విమర్శించింది!
"మందః కవియశః ప్రార్ధీ, గమిష్యామపహాస్యతామ్
ప్రాంశులభ్యే ఫలే లోభా, దుద్బాహుర్వి వామనః" అంటాడు కాళిదాసు రఘువంశ కావ్యారంభంలో.
(నేను మందున్ని, వాల్మీకి కనివంటి కీర్తికి పాకులాడుతున్నాను. అపహాస్యం పాలవుతున్నాను. ఆ పండు ఆజానుబాహులకు అందేది. పొట్టివాడు ఫలం అందుకోవడానికి చేతులెత్తి ఎగిరినట్లుంది నా స్థితి)
కాళిదాసు వాల్మీకిని అనుసరించని చోటులేదు. కాళిదాసు కావ్యాల్లో రామాయణ శ్లోకాల ప్రతిరూపాలు అనేకం కనిపిస్తాయి. భాసుడు, భవభూతి మాత్రమే కాక బుద్ధ చరితం రచించిన అశ్వఘోషుడూ వాల్మీకి వల్ల ఎంతో ప్రభావితుడు అయినాడు.
వాల్మీకి రాముణ్ణి మానవమాత్రునిగానే సృష్టించాడు. రామునిలో - మానవులలోని బలములు - బలహీనతలూ అన్నీ కల్పించాడు. ఆదర్శమానవునికి ఉండే లక్షణాలు - ఆత్మవిశ్వాసం - దృఢసంకల్పం - నిరంతరయత్నం - ప్రేమాభిమానాలు కొల్లలుగా కల్పించాడు.
"దైవసంపాదితో దోషామానుషేణ మయాజితః" - దైవం కల్పించిన దోషాన్ని మనిషిగా నేను జయించాను అంటాడు రాముడు. 'ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం' - నేను మనిషిని - రాముణ్ణి - దశరథుని కొడుకును అంటాడు.
రామాయణం మానవగాధ. ఒక ఆదర్శపురుషుని - ఒక ఆదర్శనారీమణి కథ. రామాయణం 'సీతాయాశ్చరితం మహత్'-అది సీత కథ. వాల్మీకికి సీత అతి ప్రియం అయిన పాత్ర. సీత యోనిజ కావడం సహితం వాల్మీకికి సహించలేదు. ఆమెను అయోనిజను చేశాడు. ఆమెతోనే అనేక ముత్యాల మాటలు అనిపించాడు. రామాయణం సాకల్యంగా అధ్యయనం చేసినవారు సీత విషయంలో ఆదరం - అభిమానం - భక్తి పెంచుకుంటారు. వాల్మీకి స్త్రీ పాత్రలను మలిచిన తీరు అపూర్వం. రామాయణ కథ ఒక ఒక మలుపుకు మంథర -మరొక మలుపుకు శూర్పణఖ కారకులు. తార తన చాకచక్యంతోనూ - శబరి తన భక్తిభావంతోనూ మనసు మురిపిస్తారు.
కుటుంబం ఈనాటి వంటి క్లిష్టదశలో ఉన్నపుడే వాల్మీకి రామాయణం రచించాడు. దశరథునకు బహు భార్యలు - ముసలితనంలో వయసుపెళ్ళాం. ఆమెకు లొంగి అతడు తెచ్చిన అనర్ధాలు చెప్పాడు. వాల్మీకి బహుభార్యత్వానికీ - వార్ధక్యవివాహాలకు వ్యతిరేకి.
ఏకపతీత్వం - ఏకపత్నీత్వం తొలిసారి ప్రతిపాదించి, కుటుంబ క్షేమానికి, సామాజిక ప్రగతికి ఇది అవసరం అని చెప్పిన సాంఘిక శాస్త్రజ్ఞుడు వాల్మీకి.
"అనన్యా రాఘవేదాహం - భాస్కరేణ ప్రభాయథా"
రాముడు నేను - సూర్యుడు వెలుగువలె - వేరుకాము అంటుంది సీత. విచ్చిన్నమై - మృగ్యంకానున్న - కుటుంబం వ్యవస్థ ఉన్న నేటి దశలో రామాయణ సందేశం అమృతప్రాయం!
వాలి సుగ్రీవులు - రావణ విభీషణుల వంటి అన్నదమ్ములున్న నాటి-నేటి-రేపటి సమాజాల్లో రామలక్ష్మణ భరతశత్రుఘ్నులవంటి సోదరభావం ఆదర్శం.
"అగ్నిసంయోగవద్దేతు శస్త్రసంయోగ ఉచ్యతే" -అగ్నివంటిది ఆయుధం. అది ఉండడమే అనర్ధం అని నిరస్త్రీ కరణను ఆనాడు దర్శించినవాడు వాల్మీకి.
వాల్మీకి రాముడు - మానవ మాత్రుడయినా భారతీయులు అతణ్ణి భగవానుడుగా భావించారు. సత్పురుషులను భగవంతునిగా పూజించడం మానవనైజం. గౌతమబుద్దుడు మహావీర వర్ధమానుడు - క్రీస్తు - మహాత్ముడు - అందరూ అలాగే భగవంతులు అయినారు.
రాముని భగవానునిచేసే ఆవేశంలో అనేక అవాల్మీకములు వచ్చాయి. అద్భుతాలు ఆశ్చర్యాలు కల్పించాయి. వాల్మీకి అహల్య బండకాదు. శబరి ఎంగిలిపళ్ళు పెట్టదు - రావణుడు సీతను నేల పెళ్లగించి తీసుకుపోడు - రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించడు. అవాల్మీకముల వ్యాప్తివలన వాల్మీకానికి గ్రహణం పట్టింది!
అయితే తులసీరామాయణం ఔత్తరాహులను సంఘటితపరచడానికి ఎంతో ఉపకరించింది.
శ్రీమద్రామాయణం అధ్యయనం పూర్తిచేశాను. అయితే రామాయణం నన్ను వెన్నంటింది. వదల్లేదు. రామాయణ పాత్రలు - సంఘటనలు - సన్నివేశాలు - వర్ణనలు - సామాజిక సందేశాలు నాలో ఆవర్తనం అవుతున్నాయి. ఒక ఉత్తమ కావ్యలక్షణం అదే అది మనసుకు పట్టుకుంటుంది. వేధిస్తుంది. ఆలోచింపచేస్తుంది. రామాయణం నన్ను ఏం చేయమంటూందో అర్ధం కాలేదు. అవగతం కాలేదు.
అప్పుడు నాకు అనిపించింది - రామాయణ వాస్తవాలను వివరించాలి. రామాయణం కావ్యం ఇది మానవ గాధ. దేశకాలాలతో నిమిత్తం లేకుండా సకల మానవ కళ్యాణసందేశాలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ప్రజలకు తెలియపర్చాలి. అందుకు రచయిత చేయగలిగే పని రచన. వాల్మీకిని అనుసరించి ఒక సంక్షిప్త రామాయణం -అ ఆధునిక పాఠకుడు చదివి పరిశీలించగల రీతిలో - రచించాలనిపించింది.
రామాయణం - సామాన్యం కాదు. అది రచించే శక్తి స్తోమతలు నాకున్నా యనిపించలేదు. కాళిదాసువంటివాళ్ళే వెనకా ముందాడారు. అప్పటికి నేనింక చిన్నవాణ్ని. మూడు పదులు దాటినవాణ్ణి వ్రాయగలనా? ఈ భయంతో కొన్నాళ్ళు గడిచాయి.
ఏదో శక్తి నన్ను ప్రోత్సహిస్తున్నది ప్రేరేపిస్తున్నది. ముందుకు తోస్తున్నది. అది రామాయణ శక్తి కావచ్చు. దైవప్రేరణ కావచ్చు. కలం పట్టక తప్పలేదు. భగవంతుని మీద భారం వేశాను. రచన ప్రారంభించాను.
రచన ప్రారంభించాను కాని భయం, సముద్రంలో పడి ఈదలేకపోతున్నట్లు మహారణ్యంలో తప్పిపోయి మార్గం కనుగొనలేకపోయినట్లు - జనసందోహంలో ఇరుక్కుపోయి బయటికి రాలేనట్లు అనిపించేది.
రచనకు టేబుల్ ముందు కూర్చుంటే అవన్నీ విడిపోయి మార్గం కనిపించినట్లు అంధకారం విడిపోయి, వెలుగు ప్రసరించినట్లూ అనిపించేది. తెల్లవారు జామున వ్రాశాను. వాతావరణం ప్రశాంతంగా ఉండేది. కమల ణా మనసెరిగి, చాయ్ అందించేది. చాయ్, సిగరెట్టు ఉత్సాహం కలిగించేవి. రచన నాకు తెలియకుండానే అలా సాగిపోయేది. రచన సాగడానికి ముఖ్యం అయినవి సంకల్పం - స్పందన - ఆర్తి.
కమల పిల్లల సాయంతో ఇంటిపనులు సమస్తం చూచుకునేది. నామీద భారం పడనిచ్చేది కాదు. వచ్చిన డబ్బు సాంతం ఆమెకు ఇచ్చేవాణ్ణి చాలకుంటే అడిగేది. అప్పోసప్పో చేసేవాణ్ణి కాని ఇంట్లో ఎవరూ వ్రాస్తున్నందుకు గునిసేవారు కారు.





