Home » vaddera chandidas » Anukshanikam 2



    "మీకిష్టం లేని పని నేను చెయ్యలేను యిదే కాదు మీరు మానేయ్యమంటే డాన్స్ కూడా మానేస్తాను. దయచేసి నన్ను మానాన్నగారికి చెప్పి విడిపించనివ్వండి"
    "వొద్దు వందనా. నేనేదో చేస్తే మీరు తప్పించటం యేఁమిఁటి? నేను చేసినదానికి నేనే బాధ్యత వహించటం గౌరవప్రదం"
    మూడు నిమిషాల మౌనం.
    'అంతే నంటారా?" అంది  తెలుగులో.
    'అంతేగా మరి."
    "ఐ కాంట్ బేర్ దిస్ -- " అంటూ లేచి తల వొంచుకుని భారంగా నడిచింది బయటికి.
    రాత్రి పదకొండున్నర.
    భోజనం తెచ్చి పెడతామన్నారు పోలీసులు. 'ఆకలిగా లేదు. మరో చాయ్ తెచ్చి పెట్టండి ' అన్నాడు.
    పన్నెండింటికీ ఆ బల్ల మీదే పడుకున్నాడు. తల కిందకి వో దుప్పటి మడిచి యిచ్చారు. నిద్రపోయాడు కాసేపటికి.
    చలి. పాత వులేన్ వోవర్ కోటు కప్పారు పోలీసులు.
    వుదయం యెనిమిదింటికి వొచ్చాడు యస్సై. శ్రీపతి యింకా నిద్ర పోతూనే వున్నాడు.
    "వీడేమి రాజాసాబోలె నిద్రపోతున్నాడు నాకాల" అన్నాడు యస్సై.
    అంతలో టెలిఫోను మోగింది. అందుకున్నాడు.
    "యస్సార్ ' అంటూ చటుక్కున లేచి నుంచుని, "యస్సార్-----వున్నాడు సార్-----బాగానే ట్రీట్ చేశారు సార్ రాత్రంతా నేను లేను సార్. నో సార్-----కేస్ -----మర్డర్ --------సార్-------యింకా నిద్ర లేవలేదు సార్. యస్సార్--------అట్లాగే సార్. " అని యింగ్లీషులో మాట్లాడి , ఫోన్ పెట్టేశాడు. చలికాలం ఉదయం యెనిమిది గంటలవేళ ముఖానికి పట్టిన చమట తుడుచుకుని శ్రీపతి దగ్గరికి వెళ్ళి చేత్తో చిన్నగా తట్టి, "ప్లీజ్ గెటప్ సార్" అన్నాడు యస్సై.
    కళ్ళు తెరిచి యస్సై ని చూసి, 'అప్పుడే తెల్లారిందా" అన్నాడు.
    "యెనిమిదిన్నర. లెండి కూర్చోండి. యిట్లా కుర్చీలో " అన్నాడు.
    'యెక్కడో యేదో జరిగినట్లుంది. పోలీసుబుద్ది వొదిలేసి సివిలు మాటలు మొదలెట్టాడు" అనుకుంటూ కుర్చీలో కూచున్నాడు శ్రీపతి.
    'యిక మీరు వెళ్ళొచ్చుసార్" అన్నాడు యింగ్లీషులో.
    "అదెలా? కేసుకదా?"
    "కేసూ లేదు యేమీ లేదు."
    "నడిబజార్లో అంతమంది సమక్షంలో విషయం. కేసు లేకపోతే రేపు ప్రజలు మిమ్మల్ని యేకిపారేస్తారు."
    "కేసేడితే నా వుద్యోగం సాయంత్రానికల్లా ఊడిపోతుంది సార్."
    "యేఁమిఁటి సంగతి?"
    "పైనుండి టెలిఫోన్ ఆర్డర్స్"
    "యెవరు?"
    "పై ఆఫీసరు"
    "యే ఆఫీసరు?"
    "అది కూడా చెప్పటానికి వీల్లెదట"
    "వందన చేయించిందా? వుఁహూఁ, వందన నా మాటకి వ్యతిరేకంగా చెయ్యదు ' అనుకున్నాడు శ్రీపతి.
    "నేరం చేసినప్పుడు శిక్షించటం పోలీసు శాఖవారి కర్తవ్యం" అన్నాడు శ్రీపతి.
    "సాబ్ మమల్న చంపకన్రి" అన్నాడు యస్సై తెలుగులో ప్రాధేయపడుతున్నట్లుగా "
    "అందునా నేను లా స్టూడెంటుని. చట్టాన్ని అతిక్రమించినప్పుడు స్వయంగా శిక్షకి సిద్దపడాలి" ఆన్నాడు శ్రీపతి.
    కానిస్టేబు తెచ్చిన టీ అందుకుని , "పుచుకోండి సార్" అని శ్రీపతి ముందు పెట్టాడు.
    శ్రీపతి టీ తాగుతూ , "టీ పుచ్చుకోవతంలో దోషం లేదు. కాగా, లాకప్ లో వున్నప్పుడు అన్న పానాదులు పోలీసువారే చూడాల్సి వుంటుంది." అన్నాడు.    
    మరి కొంచెం సేపు యస్సైని ఏడిపించి , బయటకొచ్చి బస్సెక్కి తిన్నగా హాస్టల్ కి వొచ్చాడు.
    "వొదిలేసిన్రా? యెట్ల? లంచమిస్తివా?"
    "వెళ్ళమని బతిమిలాడారు పోనంటే లంచమిచ్చేలాగా వున్నారు. లంచం పట్టటం చేతకాక వుట్టిగానే వొచ్చేశాను " అన్నాడు.
    స్నానించి ----- గదిలో దుప్పటి కప్పుకుని పడుకున్నాడు నిద్ర పట్టేసింది.
    నిన్న సాయంత్రపు వార్త ఆ రాత్రి తొమ్మిదింటికీ తెలిసింది . స్వప్న రాగ లీనకి. తెలిసిన గంటన్నరకి వాళ్ళ పినతండ్రి నాగిరెడ్డికి ఫోను చేసి, "బాబాయ్ నాకో చిన్న పని చేసిపెడతారూ?" అంది.
    "చెప్పు తల్లీ. యేనాడూ నోరు తెరిచి యిది కావాలి అని నన్నే కాదు యెవరినీ అడగలేదు నువ్వు. ఏం కావాలో చెప్పు తల్లీ' అన్నాడు నాగిరెడ్డి.
    "నువ్వు చాలా నియమంగా రూల్స్ పాటిస్తావనీ నాకు తెలుసు. కానీ యిది నాకు తప్పనిసరి విషయం. పోలీస్ డిపార్ట్ మెంట్ తో పని. మీకు నచ్చకపోవచ్చు. మంచి చెడుల ప్రసక్తి కాదు. వొక వ్యక్తీ పోలీస్టేషన్లో వున్నాడు వొదిలేయ్యమనాలి."
    "నేరాన్ని బట్టి వుంటుందిగా? సాధ్యం కానిదైతే యేమీ చెయ్యలేం-----"
    "సాధ్యం కానిదెం కాదు. అతను వొక స్త్రీని అబిడ్స్ సెంటర్ లో ముద్దు పెట్టుకున్నాడు. పోలీస్టేషన్లో వున్నాడు.
    "ఆమె కేసు పెడితే -------"
    "ఆమె కేసు పెడితే వేరే సంగతి పెట్టరు మన సమాజంలో" అంది .
    "ఎవరమ్మా అతను. మెంటల్ కేసా?"
    "కాదు మా యిద్దరికీ బాగా సన్నిహితంగా తెలుసు. వివరాలు తెలియవు కాని అతను అపహాస్యంగా ప్రవర్తించడని పూర్తీ నమ్మకం. పోలీస్టేషన్లో కూడా యెవరు చెప్పించిందీ తెలియకూడదు. కేవలం పై అధికారి నుంచీ ఆర్డర్స్ వొచ్చాయి - అని మాత్రమే చెప్పాలి. సాధ్యపడుతుందా బాబాయ్?" అంది.
    "వెరీ సింపుల్ కానీ చాలా ఫన్నీగా వుంది. ఆ స్త్రీ కూడా సీన్లో వుండనప్పుడు పెద్ద సమస్య కాదులే" అన్నాడు నాగిరెడ్డి.
    శ్రీపతి నిద్రపోతూనే వున్నాడు వొంటి గంట.
    జనం ------తలుపు తీసి శ్రీపతి నిద్రపోవటం చూసి మళ్ళీ తలుపు దగ్గిరికి లాగి పోయారు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.