Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    అనుబంధాలు మరణాంతాలు కారాదు!
    అలా అవుతే అది అమానుషం!!
    
    పద్నాలుగో రోజున మా అమ్మాయి సుధకూ, రమాదేవి కొడుకు శ్రీనివాసులుకూ అన్నప్రాశనలు చేశాం.
    
    పదిహేనో నాడు ఉన్న సామాను పంచుకునే ప్రశంస వచ్చింది. మా తాతగారు లక్ష్మణాచార్యులవారి పేరు చెక్కి ఉన్న 'కొప్పెర' మాత్రం నేను తీసుకున్నాను. మిగతా ఇల్లెడు సామాను వాళ్ళే తీసుకున్నారు.
    
    గార్ల వదిలివెళ్ళే రోజు! ఆ ఇల్లు - ఆ పరిసరాలు - ఆ ఊరు వదలడానికి మనస్కరించలేదు. జంగమములు అయినా వాటితో అనుబంధాలు పెంచుకున్నాం. ప్రజలు మమ్ములను ఆత్మీయులుగా చూసుకున్నారు. మనసుకన్న అవసరం మిన్న! కదలక తప్పలేదు.
    
    దారి పొడుగునా కొందరు నమస్కరించారు - కొందరు కుశల ప్రశ్నలు వేశారు కొందరు పాదాభివందనాలు చేశారు. కొందఱు 'ఇంకెందు కొస్తరు లేరి' అని ఆత్మీయ నిష్టూరం పలికారు. అనేక మంది వెంటరాగా స్టేషను చేరుకున్నాం. స్టేషను మాస్టరు కంట తడిపెట్టుకున్నాడు. ఆ తత్తరపాటులో టిక్కెట్లిచ్చాడు. బండికి గంట కొట్టాడు. జండాలు పట్టుకొని బయటికి వచ్చాడు. మేమంతా సిద్దం అయినాం.
    
    ఆ వచ్చింది గూడ్సుబండి!
    
    స్టేషను మాస్టరు సిగ్గుపడిపోయాడు!!
    
    తరువాత పాసింజరు వచ్చింది. అంతమంది ప్రేమ - అభిమానం - ఆత్మీయత అనురాగాల జల్లు గుండెల్లో నింపుకొని రైలెక్కాం.
    
    రైలు సాగింది. అమ్మ చితిస్థలం -వంతెన - పాలేరు - రామాపురం దాటిపోయాయి.
    
    "దేవుడు లేడనే వాడున్నాడు.
    
    అమ్మ లేదనేవాడున్నాడా?" -ఇది తరువాత అన్నయ్య దాశరథి వ్రాసిన సినిమా పాట.
    
                                          ముప్పది
    
వందే వాల్మీకి కోకిలం:
    

    మాది దాశరథి వంశం. దాశరథి అంటే రాముడు. రాముడు అంటే రామాయణం. రామాయణాన్ని గురించి విశిష్టాద్వైతులు - శ్రీవైష్ణవులు - చేసినంత పరిశ్రమ మరొకళ్ళు చేయలేదు. వారు రామాయణానికి నాలుగు వ్యాఖ్యలు వ్రాశారు. రాముణ్ణి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని చేశారు. రాముని గుణగుణాలను కీర్తించారు. రామ కథలో తాము లీనం అయినారు. తమ సిద్దాంత వ్యాప్తికి రామాయణాన్ని వినియోగించుకున్నారు. భక్తజనులకు పరవశం చేశారు.
    
    విశిష్టాద్వైతానికి పన్నెండుగురు ఆళ్వారులు వారిలో కులశేఖరాళ్వార్ ఒకరు. వారు తిరువాన్కూరు రాజ్యానికి ప్రభువులు. వారు తమ రాజ్యాన్ని అనంతపద్మనాభస్వామికి సమర్పించారు. దేశీయ రాజ్యాలు రద్దయ్యేదాకా తిరువాన్కూరు రాజులు - రాజ్యాన్ని అనంత పద్మనాభస్వామి పక్షానే పాలించారు. ఇటీవల నేను తిరువాన్కూరు వెళ్ళినపుడు మాజీ మహారాజు ఉదయానే దేవాలయం ఊడ్చటం చూశాను!
    
    కులశేఖరులకు రామాయణం అంటే అనంతం అయిన శ్రద్దాభక్తులు. వారు రామాయణంలో లీనం అయ్యేవారు. ఒకనాడు శ్రీమద్రామాయణ కాలక్షేపం వింటున్నారు. కథ చెపుతున్న స్వామి 'వంటరి రాముని మీదకు ముప్పదివేలమంది ఖరదూషణ త్రిశిరాదులు ఎత్తివచ్చినారు' అని సాయించినాడు. 'ఏమీ, వంటరి రాముడు ముప్పదివేల మంది రాక్షసులా! మనము సాయమునకు తరలవలెను' అని తన సైన్యాన్ని తీసుకొని సాగారు. అంత లీనం అయిపోయారు కులశేఖరులు అందులో.     
    
    మంత్రులకు ఏమీ అర్ధం కాలేదు. రాజు ఎక్కడికి వెళ్తాడు? సైన్యం ఎక్కడికి పోతుంది? వారు రామ కథ చెపుతున్న స్వామిని ఆశ్రయించారు. స్వామి 'ఒక్కడే ధర్మాత్ముడగు రాముడు ముప్పది వేలమంది రాక్షులను కూల్చినాడు.
    
    తతస్తుతం రాక్షస సంఘమర్దనం
    సభాజ్యమానం ముదితైర్మహర్షిభిః
    పునః పరిష్వజన శశిప్రభాననా
    బభూవ హృష్ణా జనకాత్మజా తదా
    
    రాముడు సమస్త రాక్షసులను సంహరించినాడు. మహర్షులు సంతసించినారు. అలాంటి రాముణ్ణి చంద్రముఖి సీత చూచింది. ఆనందపరవశ అయింది. రాముని మరల కౌగలించుకున్నది, అని చెప్పారు.
    
    అది విని కులశేఖరుడు సైన్యాన్ని మరలించాడు. రాముడు గెలిచినందుకు తిరువనంతపురంలో ఉత్సవాలు చేశాడు.
    
    రామాయణంలో అంత బలం ఉంది. అయితే అది గ్రహంచగలవారికే తాదాత్మ్యత! మా వంశంలో రామాయణ అధ్యయన పరిశీలనలు ఎంతో జరిగాయి. మా తాతలు భద్రాచలవాసులు. వారు ఆ రామునే ఆశ్రయించినవారు. నా బాల్యంలో మా నాయన - ఖమ్మంలో - రామాయణం కాలక్షేపం సాయించేవారు. రామాయణ గ్రంథం తీసికెళ్ళడానికి ఒక భక్తుడు వచ్చేవారు. ఒకనాడు నేనే రామాయణం తెస్తానన్నాను. బరువుంటుంది వద్దన్నారు నాయన. వినలేదు. తలమీద పెట్టుకుని కాలక్షేప స్థలానికి మోసుకుని వెళ్లాను. 'మా రంగడు రామాయణం మోయగలిగినాడు' అన్నారు నాయన ఆనాటి శ్రోతలతో! రామాయణం మోయడం సామాన్యం కాదు. అయితే, రామాయణంలో కొంత కృషి చేయగలిగాను.
    
    అంత చిన్నతనంలోనూ రామాయణ కథ నన్ను ఆకర్షించింది. అంత సులభంగా అంత అందంగా రామాయణం చెప్పారు నాయన. వారి పాండిత్యం మీదా వారి వివరణ మీదా నాకు ఎంతో విశ్వాసం. అందుకే నాయన మమ్ములను ఎన్ని ఇక్కట్లు పాలు చేసినా నేను వారిని గౌరవించాను. వారు అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చేవారు. కమలా, నేనూ వారిని ఆదరించాం.
    
    అతి చిన్నతనంలోనే రామాయణం నామీద ఎంతో ప్రభావం వేసింది. అయితే ఉద్యమకాలంలో కమ్యూనిస్టు ప్రభావంలోకి వచ్చాను. సంప్రదాయంలోంచే సాహిత్యమూ కళలూ ఆవిర్భవిస్తాయనే మార్క్స్ మాటలు కమ్యూనిస్టులకు అర్ధం కాలేదు. రామాయణాన్ని మత గ్రంథంగా - రాముని పేర దోపిడీ జరుగుతున్నట్లుగా భావించాం. రామాయణం విషయంలో కొంత విముఖత ఏర్పరచుకున్న మాట వాస్తవం.
    
    భారతదేశంమీద దండెత్తి గెలిచినవారు ఆంగ్లేయులు మాత్రం కాదు. ముస్లిములకు ముందు వచ్చినవారంతా భారత సంప్రదాయానికి ముగ్ధులు అయినారు. భారతీయులు అయినారు. అలగ్జాండర్ సైతం భారత నాగరికతకు ముగ్ధుడు అయినాడు. కొంత భారత మూల్యాన్ని గ్రీకుకు చేరవేశాడు. కొంత గ్రీకు నాగరికతను భారతదేశానికి చేర్చాడు. గ్రీకును పారసీలో యూనాన్ అంటారు. ఈనాటి యూనానీవైద్యవిధానం ఆనాడు వచ్చిందే గ్రీకు శిల్పశాస్త్రం సైతం మనమీద ఎంతో ప్రభావం వేసింది.
    
    మత కరవాలం చేతబట్టి వచ్చిన ముస్లిం విజేతలు సహితం భారత నాగరికతకు తాత్త్వికతకు - సంప్రదాయానికి ముగ్దులు అయినారు. మన సంప్రదాయం నుంచే సూఫీ సిద్దాంతాన్ని ఏర్పరచుకున్నారు. ముస్లిముల వేషభాషలు భారతీయులను ప్రభావితం చేసింది వాస్తవం. కాని భారతీయుల మౌలిక చింతనలో మార్పు రాలేదు. పైగా మెరుగులు దిద్దుకున్నది. శంకరుని అద్వైతం - రామానుజుని విశిష్టాద్వైతం, చైతన్య ప్రభు మధురభక్తి - బసవేశ్వరుడు, బిజ్జలుని వీరశైవం ముస్లిముల పాలనలోనే వెలిశాయి. తులసీదాస్ రామచరిత్ర మానసం రచించి ఉత్తర భారతాన్ని ప్రభావితం చేసింది ముస్లిముల పాలనలోనే! సూరదాస్ - మీరా - త్యాగరాజు - రామదాసు - వీరందరి భక్తి ప్రవచనాలు ముస్లిముల కాలంలోనే జరిగాయి. అయితే ఔరంగజేబు - మీర్ ఉస్మాన్ వంటివారు - భారత సంప్రదాయానికి అనను కాని - హిందూమతానికి నష్టం కలిగించడానికి ప్రయత్నించిన విషయం చారిత్రక సత్యం.
    
    యూనాన్ మిస్రో రోమా
    సబ్ మిట్ గయె జహాఁమే
    అబ్ తక్ మగర్ హై బాకీ
    నామో నిశాఁ హమారా
    
    (గ్రీకు, ఈజిప్టు, రోము నాగరికతలన్నీ మంట కలిశాయి. కాని నేటివరకూ మన పేరు ప్రఖ్యాతులు నిలిచి ఉన్నాయి) అంటాడు ఇక్బాల్ మహాకవి.
    
    ఆంగ్లేయులు మాత్రం ఈ దేశపు సంస్కృతీ సంప్రదాయాలను ధ్వంసం చేయడానికి వచ్చారు. వారు ఆనాటి మేధావులకు భారథ సంప్రదాయం మీద విరక్తిమాత్రం కాదు - ద్వేషం కలిగించారు. వారు సంప్రదాయాలే ఉత్తమములు అని మన నరనరాల్లోకి ఎక్కించారు. బ్రహ్మసమాజం ఆంగ్లప్రభావంతో వచ్చిందే! మనకు విగ్రహారాధన బౌద్దులనుంచి వచ్చింది. రామాయణం, భారతాల్లో విగ్రహారాధన లేదు. దేవాలయం లేదు. ఆలాంటప్పుడు పాలకుల సంస్కృతికి లొంగి, విగ్రహారాధన ఏదో పాపం అన్నట్లు బ్రహ్మ సమాజ మదేల? క్రైస్తవులలో రోమన్ కేథలిక్కులు విగ్రహారాధకులే!
    
    చాదస్తులు, అన్నిమతాల్లో - కులాల్లో - సిద్దాంతాల్లో ఉంటారు. మావో చాదస్తం చైనాలో ఎంతవరకు పోయిందో మనకు తెలుసు! ప్రోటెస్టెంట్లు వ్యతిరేకించేదాకా క్రైస్తవ మతాచార్యుల క్రూర కృత్యాలు మనకు తెలియనివి కావు. అలాగే వేయేళ్ళ పరాయిపాలనలో మతాధిపతులు కొన్ని దురాచారాలు కల్పించిన మాట నిజం. వాటిని పారద్రోలవలసిన ఆవశ్యకత ఉంది. కాని అది చేయాల్సింది పరాయి పాలకులను స్తుతించడానికీ - సంతోషపెట్టడానికీ - మన సంప్రదాయాలను మంట కలపడానికీ కాదు. వీరేశలింగంగారు మృతశిశువును పూడ్చడానికి పాలకుల సంప్రదాయపు శవపేటిక ఉపయోగించారు. గురజాడవారు సంస్కృతం మీద ఎంత ద్వేషం కలిగించారంటే - ప్రమాణం చేయడానికి సహితం ఆంగ్లగ్రంథం కావలసి వచ్చింది!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.