Home » vaddera chandidas » Anukshanikam 2
జనంలో ------- కొందరు విస్తుపోతూ కొందరు కోపంగా కొందరు అసహ్యంగా కొందరు దుగ్దగా మరికొందరు మెచ్చుకోలుగా కొందరు యిర్ష్యగా కొందరు చీదరింపుగా -- చూస్తున్నారు.
జనానికి అవతల వున్న గుర్లింగం, శ్రీపతి దగ్గిరికి రావటానికి ప్రయత్నించాడు గానీ వీలుపడలేదు.
గంజిపెట్టిన కాకీరంగు బెల్ బాటం, నిక్కర్ల పోలీసులు, కాకి చొక్కాల తెల్ల ప్యాంట్ల పోలీసులు ---
"నాకా మే లేజావ్" అన్నాడు తెల్లప్యాంటు పోలీసు.
'చలో" అని చెయ్యి పట్టుకోబోయిన కానిస్టేబుల్ ని విదిలించి, "పదండి' అన్నాడు శ్రీపతి.
పోలీస్ స్టేషను.
బెంచి మీద కూచున్నాడు శ్రీపతి.
'అడకూకుండు నేలమీద" అన్నాడు వో కానిస్టేబుల్.
"నువ్వు కూర్చో అక్కడ" అన్నాడు శ్రీపతి.
"నేనేమిట్కి కూకుండాల?"
"నేను మాత్రం యెందుకు కూచోవాలి నేలమీద"
"ఎమిట్కో, జరంత అగు యేరికైతది. యస్సై సాబ్ రాంగనె నీకు లగ్గం శురూ ఐతది."
"మీ యస్సై యేడి?"
"యస్సై సాబ్ అనాల. లేకుంటే ..... .... ..."
"అదేం కక్కుర్తి ? మగవాడ్ని"
అంతలో మోటారు సైకిలు వొచ్చి ఆగిన మోత. యస్సై లోనకి వొచ్చాడు.
పోలీస్ సెల్యూట్ చేసి, "సాబ్ , యిగో , యే హార్రామ్ కా బచ్చా అప్ కొ గాలిఁయా దేగయ్" అన్నాడు.
గుబురు మీసాల పోలీసు, వాన్ని ముక్కుమీద కొట్టిండు " అన్నాడు.
"యీజ్ యిట్ సో?" అన్నాడు.
"యే సంగతి?" అన్నాడు శ్రీపతి.
"వాన్ని ముక్కు మీద కొడ్తివా? అదేమి, నెత్తురు గూడ వొస్తున్నది" అన్నాడు యస్సై.
"కాలు జారి బొక్క బోర్లా పడిముక్కు చితికినా నేత్తురోస్తుంది. కాని నేనే కొట్టాను."
"పోలీసుని కొడితే నేరమని తెలుసా?" అన్నాడు యస్సై యింగ్లీషులో.
"వాడు ,ముందు నేరం చేస్తే నేను నేరం చేశాను.
"యేమి నేరం చేసిండు?"
"పారిపోతున్న దొంగని పట్టుకున్నట్లు పట్టుకుని బూతులు కూశాడు. అందుకు కొట్టాను."
"ఐనా తన్న కూడదు. లా వుంది" అన్నాడు యస్సై యింగ్లీషులో.
"లా పోలీసులకి కూడా వుంటుంది."
టెలిఫోను మోగింది. యస్సై అందుకుని, "మర్దరా? యాడ----- వొస్తున్న " అని ఫోను పెట్టేసి. "ఫోర్ నాట్ త్రీ , టు ధర్టీటూ , మీరూ రాన్రి రిక్షాలో" అని అడ్రసు చెప్పి వడివడిగా బయటకు వెళ్ళి మోటార్ బైక్ స్టార్టు చేశాడు వొక కానిస్టేబుని వెనకాల కూచోబెట్టుకుని.
పోలీస్టేషనులో యిద్దరు పోలీసులున్నారు. బయట తుపాకీ పుచ్చుకుని వున్నతను కాక.
మూడు గంటలు గడిచాయి.
పదింబావు
ఆ సెంటరులో అప్పుడు శ్రీపతి తెలిసిన వాళ్ళు నలుగురైదుగురు వున్నారు. యెంత సిటీ ఐనా రెండగంటల వ్యవధిలో వూరంతా పాకిపోయింది వార్త-- టెలీఫోన్లలో బస్సుల్లో ----శ్రీపతి బాగా తెలిసిన వాళ్ళందరికీ తెలిసింది.
'అబ్బాయ్ పోలీవెంకటసాఁవీఁ-----" అన్నాడు శ్రీపతి.
"యేమి దిల్లగిగున్నదా?" అన్నాడు వొచ్చి.
పదినోటు తీసిచ్చి, "నాకు టీ పట్రా, నువ్వు బిరియానీ తిను" అన్నాడు.
"హిఁహిఁ" అని యికిలించాడు.
గంటసేపు గడిచింది.
కారు ఆగిన చప్పుడు.
కారులోంచి వందన దిగింది. చకచకా లోనకి నడిచింది. ఆమెని చూస్తె, కానిస్టేబుకి అటకాయించే ధైర్యం చిక్కలేదు"
లోనకి వచ్చింది . కుర్చీలో కూచుంది.
రెండు నిమిషాల మౌనం.
"యందుకట్ల చేసిన్రు?" అంది, బాధగా చూస్తూ.
"యేఁవోఁ తెలియదు. అనిపించింది."
"నలుగురూ యేమనుకుంటారు! శ్రీపతిగారు యిట్లా ---- అని చెప్పుకుంటుంటే నేను ------' అని యింగ్లీషులో అంటూ ఆగిపోయింది. ఆమె కళ్ళలో తడి.
"వున్నమాట అనుకోవటంలో విశేషవెఁవుంది?" అన్నాడు.
వొక నిమిషం మౌనం.
"వీళ్ళు కోర్టులో కేసు పెడతారు. జైలు శిక్ష పడుతుంది" అంది.
'అవును పడుతుంది. చేసిన పనికి ప్రతి చర్య వుంటుందిగా --- తాను చేసిన పని తనవరకే పరిమితం కానప్పుడు -- చట్టం ఆమోదించని అంశం అయితే అంతేగా మరి"
"తెలిసి యెందుకు చేశారు నడివీధిలో! ఆమె పరువు మాటేట్లావున్నా ----మీరు ------యెంతో విలువైన మీరు. నేను భరించలేకుండా వున్నాను. అబ్బా అసలెందుకు చేశారిట్లా?"
"యెందుకూ కాదు. వూరికే ------చెయ్యాలనిపించింది ఆ క్షణాన"
"క్షణికోద్రేకానికి లొంగిపోయి ------తరవాత"
"క్షణికొద్రేకమూ లేదు. దేర్ఘోద్రేకమూ లేదు. ఫన్నీ . కోర్టులో తెలుస్తుందిలే . రిగ్రేట్ దేనికి?"
"జైలు శిక్ష"
"పడనీ"
"నేను మా నాన్నగారికి చెప్పి విడిపించుతాను"
"నా కిష్టం లేదు"
"శిక్ష పడటం యిష్టమా?"
'అదీకాదు."
"మరి?"
"యెవరూ యేమీ చెయ్యక్కరలేదు. యిందులో మీరు కల్పించుకోవటం నాకిష్టం లేదు"



