Home » vaddera chandidas » Anukshanikam 2
"పారిపోకుండా నేను పట్టుకుంటాలె!' అని చిన్నగా నవ్వింది ఆ స్త్రీ.
ఆ యిద్దరూ నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. టీ షర్టతను కాసేపు ఆగి అడుగులో అడుగు వేస్తున్నాడు. ఆమె చకచకా అడుగులు వేస్తోంది. శ్రీపతివైపుకి.
'దీన్నీ కూడా పోలీస్టేషనుకి తీసుకెళ్తే దాని జాతకంతో పాటు అందరి బతుకులూ బయటపడతాయ్" అనుకుని, ఆమెని పిలిచి చకచకా వెళ్ళి "ఆ వెంటనే నువ్వు ఆటోలోనో రిక్షాలోనో వెళ్ళిపో. అక్కడ ఉండొద్దు" అన్నాడు.
ఆమె శ్రీపతి వైపు చకచకా నడిచి రెండు నిమిషాలలో శ్రీపతికి పక్కగా అడుగులు వేస్తోంది. సన్నగా పొడవుగా వుంది.
ఆ యిద్దరూ వీళ్ళకి కాస్త వెనకగా వున్నారు.
"గుడ్ యీవేనింగ్ మిమ్మల్నేక్కడో చూసినట్లున్నాను" అంది
శ్రీపతి తల రవంత పక్కకి తిప్పి, "క్వయిట్ పోసిబుల్ -- భారత దేశంలో యెక్కడైనా చూసి వుండొచ్చు--- యీ వూర్లో యీ వీధుల్లో నూ చూసి వుండొచ్చు'" అన్నాడు.
"మీరు భలే మాట్లాడతారు. యిప్పుడు గుర్తుస్తోంది. మిమ్మల్నేక్కడ చూసిందీ" అని సన్నగా నవ్వింది.
పక్కకి తిరిగి ఆమె ముఖం వంక చూశాడు. ఆమె కళ్ళలో వ్యాపారపు చవకబారు తళుకు కనిపించింది.
'మీ సంగతేమో గానీ నన్ను యే ఆడదైనా చూడాలంటే యే లంజల కొంపల్లోనో చూసి వుండాలి." అన్నాడు.
'అది అసంభవం. సేర్సీస్ న్యుయియర్ పార్టీ చూశాను" అంది నడుస్తున్నారు.
అబిడ్స్ సెంటరు కి వొచ్చారు. శ్రీపతి నిలుచుని జనాన్ని చూస్తున్నాడు. ఆమె కూడా నిలుచుని పోయి "యెంతో చక్కని సాయంత్రం" అంది.
'చక్కనో బుక్కనో --- యీ సెంటర్లో యీ రద్దీలో సాయంత్రా లెప్పుడూ యిలాగే వుంటాయి " అన్నాడు.
ఆమె చటుక్కున శ్రీపతి చేతుల్ని తన చేతుల్తో గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ కెవ్వు మని అరిచి గింజుకున్నట్లుగా కొద్ది క్షణకాలపు కేక ముద్దూ ముద్దు కేక, గమనించారు కొందరు. కానీ ముంజేతుల దగ్గిర ఆమె శ్రీపతి చేతులు పట్టుకోవటం యెవరూ గమనించలేదు.
ఆ మరుక్షణం ఆ యిద్దరూ అతని పక్కకి వొచ్చారు. కొట్టబోయినట్లుగా చెయ్యి యెత్తాడు వొకతను. రెండో అతను మీదిమీదికి వెళ్ళాడు ---- ఆమెకి మదుగు కల్పిస్తూ.
సిగ్గుతో కుంచించుకు పోయినట్లుగా తల వొంచుకుని వొంగి ------ ఆ పక్కగా వున్న ఆటోలో కూచుంది. అటో డుర్ డుర్ మంటూ కదిలి వెళ్ళిపోయింది.
అటు , కాలేజీ కుర్రాళ్ళద్దరూ గట్టిగా యీల వేశారు. యిటు ముప్పయ్ ఐదేళ్ళకే ముట్లుడిగిన వొకావిడ అసహ్యంగా చూసింది. వొక యువతి ఆర్తిగా వాలు చూపు చూసింది. యింకో యువతి ముఖం చిట్లించుకుంది. వో నడివయసతను ఆసక్తిగా చూస్తున్నాడు. వో ముసలాయన బోసి నోటితో యికిలించాడు.
ఆగిన కార్లు ఆటోలు స్కూటర్లు రిక్షాలు సైకిళ్ళూ-----
"యెవరామె?" అన్నారు వొకరెవరో.
"యేవరైతేనేం పాపం. పరువు పోయిందిగా. సిగ్గుతో కుంగిపోయింది పాపం" అన్నాడు వొకతను.
"యిదింకా బావుంది. నాకీ పాపిష్టి కీర్తి అంటగడుతున్నారా" అన్నాడు శ్రీపతి. పదిమంది పకపకా నవ్వారు.
'యిందులో ఏదో తిరకాసు గొడవుంది. అదేవిత్తో యెవరు పురమాయించారో ' అని అనుకుని తన చుట్టూ పరికించాడు.
యెవరూ అనుమానించాల్సినట్లుగా అనిపించలేదు అతనికి. అప్పటికి వాళ్ళు జారుకున్నారు.
'ఆడకూతురి పరువూ మానం తీసేశాడు. తన్నండి పట్టుకుని" అంటూ వో నడివయసతను వొచ్చాడు ముందుకి.
"తన్నటానికి నువ్వెవడివి? యీ దేశానికి ప్రభుత్వం వుంది. రాజ్యాంగం వుంది. యంత్రాంగం వుంది. పోలీసులున్నారు. లాఠీలున్నాయి. తుపాకులున్నాయి. కోర్టులున్నాయి." అన్నాడు శ్రీపతి.
"అయన పెండమేమొ" అన్నాడు వో యువకుడు కొంటెగా.
"పెండ్లామయితే మాత్రం చౌరస్తాల ముద్దు పెట్టుకుంటారు?"
"గల్లీల పెట్టుకోవచ్చునా?" అన్నాడు యింకోకతను.
"గల్లీల కూడా పెట్టుకోరాదు. యింట పెట్టుకొవాల"
"యింట్ల యాడంటే అడ పెట్టుకోవచ్చునా?"
"యింట్ల మంది వుంటే, బెడ్ రూంల పెట్టుకొవాల"
"యేమి , బయట పెట్టుకుంటే యేమి? బయటయితే చేదుగుంటదా ముద్దు?"
"ము. ము- ముద్దంటే చేదా" అని పాట అందుకున్నాడు వొకతను.
అవతలకి జారుకున్న ఆ యిద్దరూ -- పోలీసులకి చెప్పి పంపించారు. అప్పటికి టీ షర్టతను కారు నడుపుకొచ్చాడు. దాన్లో కూచున్నారు. వెళ్ళి పోయింది.
యిద్దరు పోలీసులోచ్చారు. వొకతను పొట్టిగా గుబురు మీసాలు రెండో అతను పొడవుగా గద్దముక్కు.
పొడవుగా వున్న పోలీసు శ్రీపతి చెయ్యి బట్టుకుని, "చలోరే పోలీస్ నాకా కొ" అన్నాడు.
"ముందు చెయ్యి విడుస్తావా ముక్కు పచ్చడి చెయ్యనా" అని రెండో చెయ్యి పిడికిలి బిగించాడు , శ్రీపతి.
"చలో చలో ఆంధ్రాపాలా హోతో తుమ్ తెలంగాణా సాలీ" అన్నాడు శ్రీపతి.
ఆ మాటలు అర్ధమైన వాళ్ళు ఫక్కున నవ్వారు.
గుబురు మీసాల పోలీసు గుర్రుగా చూశాడు చెయ్యి పట్టుకుని నుంచున్న గద్దముక్కు పోలీసు నవ్వు ఆపుకుంటూ "బక్వాష్ మత్ కర్" అనిచేయ్యి గుంజాడు..
"చెయ్యి విడుస్తావా లేదా?" అన్నాడు శ్రీపతి.
పోలీసు చెయ్యి విడవలేదు. శ్రీపతి చెయ్యి పైకి లేచి, పిడికిలి పోలీసు ముక్కు మీద బలంగా తగిలింది.
"నీ యవ్వ చస్తిరా" అని చెయ్యి వోదిలేశాడు. ముక్కుకి చెయ్యి అన్చుకున్నాడు. ముక్కు నుంచి రక్తం చెమర్చినది.



