Home » vaddera chandidas » Anukshanikam 2
"యిప్పుడు కుక్క మాంసమైనా లాగేసెయ్యగలను" అని పకపకా నవ్వి రెండు ముక్కలు నోట్లో వేసుకుని చప్పరించి నమిలి, విస్కీ వో గుక్క వేశాడు అతను.
"మన రాఁవఁరాజుది పెద్ద పట్టులే. ఆడికి కోడి మొత్తం లేకపోతే అనదు."
మళ్ళీ రాజకీయాల కబుర్లు. ప్రస్తుత ప్రభుత్వం నుంచి గత వెంగళ్రావు ప్రభుత్వం కబుర్లు మాట్లాడుతున్నారు.
శ్రీపతి గ్లాసులో మొదటి రౌండ్ పోసిందే అలా వుండిపోయింది. నామమాత్రంగా వో గుక్క వేస్తున్నాడు అప్పుడప్పుడు.
"మన జిల్లా హరిజన మంత్రిని పీకించేసేయ్యాలి.... కొమ్ములోచ్చినయ్. కోటా యేడిసింది కాబట్టి చేసేది లేదు. యింకో హరిజనుడికి యిప్పించుదాం. మనకి బాగా పనికొచ్చే వాడినేవర్నన్నా చూడాలి" అన్నాడు బాపినీడు.
"కాలం మారిపోయిందిరా బాబు -----యిప్పుడు అళ్ళు మన మాటినేటట్టు లేరు. అళ్ళ మాట మనఁవిఁనాలన్నట్టుగా వుంది" అన్నాడు కోరా ఖద్దరు బట్టలతను.
శ్రీపతి గ్లాసు లో పోసింది పోసినట్టుగానే వుంది.
అందరూ లేచారు.
"ప్రభుత్వం పొదుపు ఉద్యమం చేపట్టింది. యేదీ వేస్టు చెయ్యకూడదు. అందునా తీర్ధం. దేవుడు క్షమించడు" అని వొకతను వొంగి శ్రీపతి వొదిలేసిన గ్లాసు అందుకుని గటగటా తాగేశాడు.
అందరూ బయటికొచ్చారు. కార్లో బయల్దేరారు. శ్రీపతి తనకి పనుందని వుండిపోయాడు అక్కడే. "మంచిది యీసారొచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం' అని బాపినీడు కారు స్టార్టు చేశాడు.
యేమరాల్ద్ హోటలు సందు దాటి రోడ్డుమీదకి వొచ్చి చైనీస్ రెస్టారాఁ పక్కన నుంచున్నాడు శ్రీపతి.
యెదురుగా మూల మీద సినిమా బోర్డులు.
--- యీ బాపినీడుకి కొన్ని సినిమా పంపిణీసంస్థల్లో వాటాలున్నాయిభ భూములున్నాయి. ఆ పైన రాజకీయం బ్రోకరింగుంది. మా భూములు వీడి చుట్టానికే కౌలు కిచ్చి నందువల్ల మహా యిది వొలకబోస్తుంటాడు....ఆ అమ్మడు ఆ వాల్ పోస్టర్లు మీద మహా వొగలు పోతోంది --- మరికాస్త బట్ట కప్పుకుంటే ఏం పోయింది? లేదూ ఆ కాస్త తీసేస్తే ఏం పోయింది? రాఖీ అమితాబ్ కస్మేవాదే-- వయసు పిలిచింది --- వయసు పిలుస్తుంది --- వయసు లక్షణమే అంత - మల్లెపువ్వు -- ప్యాసాని అంతకంటే హ=ఘోరంగా ఖూనీ చెయ్యటం యింకేవరికీ సాధ్యం కాదు. ఆ కవి ఆ గురుదత్తే వుండాలి. వేశ్య ఆ వహీదానే వుండాలి. ఆ దాసు అరసగుల్లా మాలాసిన్హానే వుండాలి. ఆ సినిమా అలాగే తియ్యాలి. ఆ పాటలు అలాగే వుండాలి. కాదంటే యింకా బాగా తీసి బోరు కొట్టించా వొచ్చు.....
"హలో శ్రీపతి"
"హలో మునిరెడ్డి , ఎప్పుడోచ్చావు? రిసెర్చి వెలిగిస్తున్నావుగా తిరుపతిలో -- కాలేజీ లేదూ?"
"క్లోజ్ చేసినారు. పేపర్లో దూడలేదా?" అన్నాడు మునిరెడ్డి
'అవును చూశాను. స్టూడెంట్లు తన్నుకున్నారా? యిక్కడి స్టూడెంట్ల లాగా పరస్పరం యెదురుపడి తన్నుకుంటే బావుటుంది , కిరాయి రౌడీలతో వాళ్ళని వీళ్ళూ వీళ్ళని వాళ్ళూ తన్నించటం రాణింపుగా వుండదు, విలువగా వుండదు...
"రా, టిఫిన్ చేద్దాం. ఆకలిగా వున్నది. అన్నపూర్నకి పోదామా లేక -"
"యెదురుగా తాజ్ కనిపిస్తున్నదిగా పద దాన్లోకి" అన్నాడు శ్రీపతి. వెళ్ళారు తాజ్ లోకి.
శ్రీపతి యేమీ తిననన్నాడు.
"నీవు లా లో చేరినావటకదా ?" అన్నాడు మునిరెడ్డి.
"అవును!"
"ప్రాక్టీసు చేస్తావా?" అన్నాడు. భుజాని కున్న ఫోంలెదర్ బ్యాగ్ పక్క కుర్చీలో పెడుతూ.
"వెనకటి సబ్జక్టుల ప్రాక్టీసులు పూర్తయ్యాక"
"ఎవరేవరేమి చేస్తున్నారు?' అన్నాడు మునిరెడ్డి.
శ్రీపతి , కొందరి గురించి చెప్పాడు.
మునిరెడ్డి తినటం ముగించాడు.
"ప్రైవేట్ కంపెనీలో యింటర్య్వు వుంటే వోచ్చినాను!
"దేన్లో?"
చెప్పాడు.
"యిస్తే రిసెర్చేం చేస్తావు?"
"వొదిలేస్తా"
కాఫీ --- రెండు కప్పులు
"పెయింటింగ్ నేర్చినావటకదా?"
"నేర్చలేదు. నేర్చబోయి మానేశాను."
"యీసారి వొచ్చినప్పుడు నీ పెయింటింగ్స్ చూస్తాను. యేడుగంటల బస్సులో విజయవాడ పోవాలి. అక్కడ పని వున్నది. రేపు తిరుపతిలో అక్కడ నుండి పోతాను." అని లేచాడు మునిరెడ్డి.
ఆరు గంటలు.
బయతికొచ్చారు. మునిరెడ్డి రిక్షా యేక్కాడు.
శ్రీపతి యెడమవైపుకి తిరిగి, కాలిబాట మీద నడుస్తూ జనాన్ని చూస్తూ ఆగుతూ--- నడుస్తూ--
వో కారులోంచి శ్రీపతిని చూసిన వొకతను -- బుర్రలో ఆలోచన మెరవగా కారు ఆపించాడు అందులో వొక స్త్రీ , యిద్దరు మగవాళ్ళు వున్నారు.
కాలిబాట మీద తాపీగా నడుస్తున్న శ్రీపతిని చూపెట్టి వాళ్ళు చెయ్యాల్సిన పని చెప్పాడు.
అతను-- వెనక చిన్న పిల్లని యెత్తుకుపోబోయిన యిద్దరిలో టీ షర్టతను. ఆ తరవాత వాళ్ళు శ్రీపతి ఎక్కడన్నా తారసపడతాడేమోనని చూశారు, అప్పుడప్పుడు గుర్తొచ్చి, వాళ్ళు సూర్యమహల్ ముఠాలో వాళ్ళు, వాళ్ళది దాన్లో మూడో తరగతి స్థాయి.
ఆ తరువాత ఆరు నెలలకు వో సందర్భంలో అరెస్టయ్యారు, మరో యిద్దరితో. ఆ సూటతను తప్పించుకు పారిపోయి బొంబాయిలో బ్రాంచిలో పనిచెయ్యటం ప్రారంభించాడు. మిగతావాళ్ళు శిక్ష ముగిసిన మీదట యేడేనిమిది నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు.
అందరూ కారు దిగారు.
"నువ్వు రావా?" అన్నాడు వొకతను
"నన్ను చూస్తె వాడు పరుగో పరుగు" అని పకపకా నవ్వాడు , టీ షర్టతను.



