Home » vaddera chandidas » Anukshanikam 2



    బస్సు దిగాడు. పబ్లిక్ గార్డెన్ దగ్గిర. లోనకి నడుస్తున్నాడు.

    పచ్చిక మీద వీడవ వో సాయిబ్బు సంసారం.
    --- యీ అసాయిబ్బుకి మదీనా బిల్డింగు పక్కన బట్టల షాపుంది. వాడు పత్నీ వ్రతుడు.... తన ముగ్గురి భార్యల్ని తప్ప మరో ఆడదాన్ని కన్నెత్తి చూడడు అవిగో మూడు బురఖాలు - యీ బురఖా పద్దతి వుండటం వొకందుకు మేలే. నానారకాల అనాకారి ముఖాల్ని చూడకుండా తప్పుతుంది. వోక్కొక్కరికి ముగ్గురేసి చొప్పున తొమ్మిదిమంది --- నవరత్నాలు . కొన్ని అడరత్నాలు కొన్ని మగరత్నాలు. యిందుకే కాబోలు ఆరెస్సెస్ వాళ్ళ గోల -- అటు ఆ పొద పక్కన ఆ కుర్ర జంట - జానా బెత్తా. బెత్తెడు చోటు జానెడు గీటు జానా బెత్తకోసం బారెడు మదుగుచోటు లేదంటే చట్టం పోటు అందుకే పడరానిపాట్లు. యీ గార్డెన్ సూపర్నెంటు బొత్తిగా కామన్ సెన్స్ లేనివాడిలా వున్నాడు. కాస్త పొదరిండ్లలా వుండే టట్లు చెట్లు నాటించితే వాడి సొమ్మేంపోను? కామన్ సెన్సు లేకపోయినా వోవర్ సెన్సు వున్నవాడైవుంటాడు. యేఁవోఁ, వాడి కూరుతో వాడి కొడుకో ఖర్మకాలి వాడి పెళ్ళామో యీ పొదరీళ్లవి వాడుకుంటే , పాపం-----
    "బాబూ పైసా ధర్మం-"
    "దుక్కలా వున్నావు పని చేసుకోలేవూ?" అన్నాడు శ్రీపతి.
    'దొరకకనేబాబూ యింటర్ దాకా చదివీను కూడా. యిలా సిటీ కొచ్చి -- యిక్కడా యే పనీ దొరికింది కాదు. దొంగతనాలకి దిగలేక యిలాగా బతుకు తున్నాను."
    వో ఐదు నోటిచ్చి చక చకా నడుస్తున్నాడు శ్రీపతి.
    ---- ఛ, యీ ప్రభుత్వానికి బుద్దిలేదు, యీ ప్రజలకి బుద్దిలేదు. డజన్ల కొద్దీ పిల్లల్ని యివి పడేస్తున్నారు. ఆపైన గాదికింది పందికొక్కుల ప్రభుత్వం నడుస్తున్నాడు. దారి పక్కన వడలూ చక్కిలాలూ అవీ బుట్టలో పెట్టుకుని అమ్ముకుంటున్న ముసలామె కాలికి శ్రీపతి బూటు తగిలింది.
    'అయ్యో పాపం దెబ్బతగిలిందేమో' అనుకున్నాడు.
    "నీ కాల్మొక్కుతా బాంచన" అని తమ అపరాధం చేసినట్లుగా అంది.
    --పురాతత్వ శాస్త్రుజ్ఞులు శ్రమపడి వెలికి తియ్యాల్సిన అవసరం లేకుండా నిలిచిన తెలంగాణా ఫ్యూడల్ చారిత్రకఅవశేషం. యీ ప్యూడలిజం నవాబ్పాలకులు అబ్బించిన లక్షణం అనుకుంటాను. అన్నిటికీ వొంగి సలాం చెయ్యటం పౌరుల డ్యూటీ. duty, due tea.
    కేంటీన్ లోకి చొరబడి టీ తాగి బయటికి వొచ్చాడు.
    వో జెండా కారు దూసుకుపోయింది రోడ్డు మీద.

    ---- యే మినిష్టరు కారు? గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో చెన్నారెడ్డి గుడు గుడు గుంచంలో చేరాక రవికి కష్టాలు మొదలయ్యాయన్నాడు -  కష్టాలు. మినిష్టర్లు. మినిష్టర్ల కష్టాలు మినిస్టర్లవి - కార్లలో కష్టపడి తిరుగుతూ --- దేశసేవ --- దేశ భక్తులు --- దేశ భుక్తులు ......

    నీలోఫర్ ఆస్పత్రి పక్క సందులో వో యింటి తలుపు తట్టాడు తెరుచుకుంది.
    రావోయ్ శ్రీపతి నీ కోసమే చూస్తున్నాను. యింతాలిశ్యం చేశావేం" అని ఆహ్వానించాడు సూరపనేని బాపినీడు.
    బాపినీడుకి నలభయ్ ఐదేళ్ళుంటాయి. బాపినీడుది శ్రీపతిదీ వొకే వూరు. యిటీవల ఆస్తి మరింత పెరిగాక రాజకీయాల్లోకి దిగి తెర వెనక రాజకీయాల్లో చేరాడు. రాజకీయ తార్పుడు పని. అసెంబ్లీ సభ్యుల క్రయ విక్రయాల పనిలో వున్నాడు. ప్రత్యేకం చెప్పకపోతే పదిశాతం కమీషను. సందర్భాన్ని బట్టి ముప్పయ్ శాతం కూడా పుచ్చుకుంటూ వుంటాడు. "సి.యం యేవడైతే మనకెందుకు? మన యిల్లు మనం చక్కబెట్టుకోవాలి గానీ, కుర్చీ యెక్కి నానా చావూ చావటం తెలివితక్కువతనం" అంటుంటాడు'.
    "రావోయ్ శ్రీపతీ" అన్నట్లుగా అనిపించి శ్రీపతి నవ్వుకున్నాడు.
    --- శ్రీమతైతే చీకూ చింతా వుండదు. మొగుడు తెస్తే వుడకెయ్యటం కడుపు చేస్తే కనటం .......చస్తే ముండ మొయ్యటం ....
    "యెంటో పరధ్యానంగా వున్నట్లున్నావు కూర్చో. నేను రాత్రికి మనూరే'ల్తున్నాను. మీ అమ్మగారికేఁవన్నా చెపుతావా? మొన్న వొకసారి దివాణాని కెళ్తే , నిన్ను చూసి క్షేమసఁవాఁచారాలు తెలుసుకోమని చెప్పారు" అన్నాడు. మనిషి యెక్కడికో బయల్దేరుతున్న తొందరలో వున్నట్లున్నాడు.
    "హోటల్ యేమరాల్ద్ లో కాస్త పనుంది. రా వెళదాం. కారులో మాట్లాడుకోవచ్చు."
    బయల్దేరారు.
    కూచున్నాడు. బాపినీడు కారు స్టార్టు చేస్తూ , "యింకా యెన్నాళ్ళుంటావ్ పెళ్ళీ పెటాకులు లేకుండా!" అన్నాడు.
    "నీ కూతుర్నిచ్చి చేసేదాకా."
    'అది యింకో నాలుగేళ్ళన్నా ముందు పుట్టుంటే అట్టాగే యిద్దును. కానీ ---డబ్బంటే యియ్యగలను కానీ ----మీ అమ్మగారికి కావల్సినవి యెక్కడ నుండి తెచ్చేది!" అని నవ్వాడు.
    "వీడు ఆంబోతు వీడి కూతురు చీంబోతు అవుతుంది.' అనుకుని నవ్వు కున్నాడు శ్రీపతి.
    కారు హోటల్ యేమరల్ద్ ముందు ఆగింది.
    లోనకి వెళ్ళారు. మొదటి అంతస్థులో గది. ఐదారుగురు కూచుని వున్నారు. వాళ్ళెవరూ శ్రీపతికి తెలియదు. శ్రీపతి వాళ్ళకి తెలియదు.
    బాపినీడు పరిచయం చెయ్యలేదు.
    అప్పటికే ---సీసా , గ్లాసులు -- సామాగ్రి అంతా సిద్దపరిచి వుంది.
    "యింతాలిశ్యం చెత్తే యెట్ట? మల్లీ సాయింత్రం యేడు గంటల బస్సులో యెల్లాలన్నావుగా?" అన్నాడు వో కోరా రంగు ఖద్దరు పంచా చొక్కా తువ్వాలతను.
    గ్లాసులో విస్కీ పోసి, సోడాతో  నింపుతున్నారు.
    మీరిది పుచ్చుకుంటారా? మీ బ్రాండేదో తెలీదు" అన్నాడువొకతను శ్రీపతితో.
    "యేదైనా పర్లేదు. కంపెనీ కోసం, అంతే." అన్నాడు శ్రీపతి.
    రాజకీయం విషయాలు మాట్లాడుతున్నారు. సి.యం యింత సంపాదించాడు, ఫలానా మంత్రి యింత సంపాదించాడు, ఫలానా మంత్రి ఫలానా దాన్ని వుంచుకున్నాడు వంటి కబుర్లు.
    "శాస్త్రీ తింటావుగా కోడిమాఁవసవేఁ" అన్నాడు బాపీనీడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.