Home » vaddera chandidas » Anukshanikam 2
127
"రామా" అని పిలిచాడు శ్రీపతి.
తలుపు తెరిచి చిర్నవ్వుతో లోపలికి ఆహ్వానించింది. రమాదేవి.
కూచుంటూ , "నన్ను రమ్మంటున్నావని మీ అయన నా రూమ్ కొచ్చి మరీ చెప్పి వెళ్ళారు. యేఁవిఁటి విశేషం?" అన్నాడు శ్రీపతి .
"నాలుగు రోజుల క్రితం మా అక్కా నేనూ మీ వూరు వెళ్ళాం. యివాళ పొద్దుటే మీ వూరి నుండి తిరిగి వచ్చాను. మీవూరి కబుర్లు చెపుదామని కబురంపాను. లేకపోతే మీరు యెప్పుడో వొచ్చినప్పుడు వొచ్చినట్లు --అందుకని" అంది.
"యింతేనా , నే నింకేదో అర్జంటు పనేదైనా వుండి పిలిచావనుకుని పడుతూ లేస్తూ వొచ్చాను యీ మధ్యాహ్నం యేండవేళ!" అని నవ్వాడు.
"విశేషం వుండబట్టే కబురెట్టాను . మీ అమ్మగారూ------"
"మా అమ్మగారూ మా వూరూ అంతా లక్షణంగా వున్నారని చెప్పడాని కన్నమాట!"
'అబ్బ చెప్పనివ్వండి , మీ అమ్మగారు మీకు వొక పెళ్ళి సంబంధం చూశారు -- "అంది.
"వొక్కటేనా!" అని నవ్వాడు.
"పెళ్ళి మాటేత్తగానే అట్లా పరిహాసం లోకి దిగుతారేం బాబూ!"
"వో పాతిక సంబంధాలు చూసి ---వో శుభ దినాన వాళ్ళందర్నీ వరసగా నుంచోబెడితే -- పోనీ కూచోబెడితే - వచ్చిన మేరకీ వాళ్ళలో కొందర్ని సెలక్టు చేసేసుకుంటాను. కొందర్నంటే - చట్టం వోప్పుకోదు కదా -- వెనకటి కాలంలో యీ సదుపాయం వుండేది. సీమ వాడొచ్చి యెగర గొట్టేశాడు."
"చాలా మంచి సంబంధం అంట"
"మరింకేం శుభం . మంచి రోజు చూసి --- యివ్వాళేం రోజు ---" అవి గోడమీది తెలుగు కేలండరు లోకి చూస్తూ . శుక్రవారం డిశంబరు యిరవై యెనిమిది --- డిశంబరూ గిశంబరూ మ్లేచ్చం కదూ -- వూఁ-- మార్గశిరం , ఆఖరి రోజు. అదే నుదుట సాదుబొట్టు లాగా ముచ్చటగా అమావాస్యచుక్క చెడ్డ రోజైతే కూడదు. మంచిరోజైతే గ్రహబలం ప్రతికూలిస్తే చిక్కొస్తుంది. యీ రెంటికి అతీతమైంది అమ్మావస్యచుక్క. అవధవు చుక్క అంత చక్కగానూ వుంటుందికదా. అమావాస్యచుక్కైతే ఆజన్మాంతం పుట్టుమచ్చలాగా చెరక్కుండా చెక్కు చెదరకుండా వుండిపోతుంది."
లోన గదిలో పసిబిడ్డ యేడుపు.
"వోసే బాబు యేడుస్తున్నాడు చూడు" అంది కూచూనే.
"మా అమ్మగారు యిలా అని చెప్పమన్నారా? నీతో మాటల సందర్భంలో అంటే నువ్వు చెబుతున్నావా?" అన్నాడు.
పనిపిల్ల వొచ్చి తీసుకున్నట్లుంది --- యేడుపు ఆగిపోయింది.
"రెండూను మూడో సంగతి వెంటనే వచ్చి వెళ్ళమని చెప్పమని చెప్పారు."
"చీటికి మాటికీ వెళ్ళి రావటం నాకు సరిపడదు. వో చుక్కని చూసి అన్ని యేర్పాట్లు చేసి టెలిగ్రాం యిస్తే ఆ ఘడియకి వెళ్ళి పుస్తె కట్టేసి వొస్తాను" అని నవ్వాడు.
"పల్లెటూరి నాటుపిల్లెం కాదు . సినిమా స్టారులా అందంగా వుంటుందట" అంది.
"సినిమా స్టార్లు అందంగా వుంటారా?"
"మీతో యేది మాట్లాడానన్నా కష్టమే బాబూ"
"లేదు రమా. తెలియక అడుగుతున్నాను. సినిమాస్టార్లని నేనెప్పుడూ చూడలేదు. వాళ్ళు పొద్దున్నే మంచం మీంచి లేవగానే ------"
రమాదేవి లోపలికి వెళ్లి ఫ్రిజ్ తెరిచి జ్యూస్ కలుపుకొచ్చింది ------ రెండు గ్లాసులు.
"ఐతే యెప్పుడు వెళుతున్నారు?" అంది.
వో గుక్క వేసి, "తురక నగరంలో వుంటున్నాను కాబట్టి అమావాస్యే శ్రేష్ఠమైన " రోజు. కానీ ముందు యీ శరీరాన్ని శుద్ధి పరచటం భావ్యం. డిల్లీ పట్నం వెళ్ళి యూరిన్ ధేరఫి చేయిస్తాను. ప్రస్తుతం అది మొరార్జీ రాజౌషదం." అని లేవబోయాడు.
"కూర్చోండి వెళ్దురులే"
"నీకు నిద్ర చెరుపు నాకు సిటీలో నాలుగింటికో మహా మిడతగాణ్ణి కలుసు కోవాల్సిన పని వుంది. పని నాక్కాదు వాడికి" అని బయటికి వొచ్చాడు శ్రీపతి.
నడుస్తున్నాడు.
"హలో శ్రీపతి"
"హలో చక్రధరం"
...హలో వక్రధరం -----వీడు ఆ మింగుడు ప్రొఫెసర్ గాడి వంపుడుగాడు. క్రితం నెల స్టూడెంట్లు ఆ మింగుడు గాడ్ని బెదిరించినప్పుడు తన్నారని సాక్ష్యం యిచ్చాడు. ఆ ప్రొఫెసర్ కంటే వీడింకా ఘోరమైన వాడు అందుకే వీడికి లెక్చరరుద్యోగం యిప్పించాడు. అసలు, బెదిరించాల్సింది ......బెదిరించటం కాదు, చితకతన్నాసింది వీడని....
బస్సెక్కాడు . ఖాళీగా వుంది.
---ఖాళీ బస్సు యెండు టాకులా నడుస్తుంది. పదేళ్ళు కాపురం చేస్తే అందరూ యెండ టాకులే- ---
కోఠీలో బస్సు దిగి మరో బస్సెక్కాడు.
--- ఆ కడుపుతూనవృద్ద పడుచు --- మెనో పాన్జల్ ప్రేగ్నన్సీ ప్రెగ్నెంట్ బై ప్రెగ్నెంట్ విత్ ------ ప్రెగ్నెంట్ -----వాడెవడో వెనక సీట్లో వగ్రవాదుల నినాదాల తుపాకులు పేలుస్తున్నాడు యెవడు?
వెనక్కి తిరిగి చూశాడు.
------యెవడో రాధాపతి , ఎవడికి తెలుసు. యేదో శాస్త్రీయ సాహిత్యం అంటూ వివరిస్తున్నాడు. శాస్త్రీయం అంటే సైంటిఫిక్ అని కాబోలు. శాస్త్రీయ అవగాహన --- మార్క్సిస్టు అవగాహన . శాస్త్రీయం అంటే మార్క్సియన్. మార్క్సియన్ కానిది ఆశాస్త్రీయం. బుగిలిన అరిస్టాటిల్ సిల్లోజిజం సిల్లీ జిజం పిల్లజిజం చిల్లరిజం బస్సు కండక్టర్ల చిల్లరిజం చిల్లరజం-----నాన్ మార్క్సియన్ ఫిజిక్సూ సోషియాలజీ హిస్టరీ గట్రా అన్నీ అశాస్త్రీయం! అసలు , సాహిత్యం సైంటిఫికేఁవిఁటి? కనీసం సిస్టమేటిక్ కూడా కాదు అలా అని ఖేయోటిక్ అనార్కికూ కాదు ------ స్పోంటెనియస్ .....క్రియేటివ్ స్పోన్ టేవిటీ సాహిత్యాన్ని సిస్టమేటిగ్గా సైంటిఫిక్గా పరిశీలించి విశ్లేషించి అవగాహన చేసుకోవటం వేరే సంగతి. అసలు సాహిత్యానికి కావాల్సింది, అనుభూతించటం. అనుభూతించాక పరిశీలించి విశ్లేషించి డొక్కచించి డోలు కొట్టొచ్చు . చక్కదిద్ది గుళికలివొచ్చు ------యితగాడేవరో చాలా పెద్ద పెద్ద పేర్లు జారోదులు తున్నాడు నేమ్ డ్రాపింగ్ లా ----- ------



