Home » vaddera chandidas » Anukshanikam 2



    శ్రీపతి బాత్రూంలోంచి బయటికొచ్చాడు.
    "యిందిరా గాంధిని లోక సభ నుంచి బహిష్కరించి జైల్లో పెట్టారు యీ క్రూక్స్ " అన్నాడు వొకతను.
    "యేం, పెడితే?" అన్నాడు శ్రీపతి.
    కారిడార్ లో నడుస్తున్నాడు.
    "యీ రాక్షసికి తగిన శిక్ష. బయటికి గెంటి జైల్లో కి నెట్టారు."
    "ఆ మాత్రానికే దేనికి?" అన్నాడు శ్రీపతి.
    గదిలోకి వెళ్ళి ప్యాంటూ స్లాకూ వేసుకున్నాడు. బయటికొచ్చాడు.
    ఆకూ చెప్పులతో సన్నగా గీచిన గడ్డంతో వొకతను ------
    యిప్పుడు పాంకోళ్ళు బూట్లు మాసిన గెడ్డం ఫ్యాషనైతే యితగాడేవరో పాపం ------అనుకుంటున్నాడు శ్రీపతి.
    తెలుగు దినపత్రిక తిరగేస్తున్నాడు.
    విద్యా ప్రమాణాలు పెంచాలి -----రాష్ట్ర గవర్నర్ వుద్భోధ
    -----అచ్చు తప్పు పడి విద్యా ప్రయాణాలు పెంచాలని అని వుండాల్సింది అబ్బరహం. కమీటీలకు కాన్పరెన్సులకీ తిరుగుళ్ళు -----యివన్నీ దేనికి యేలినవారు చెన్నారెడ్డిగారు అన్ని యునివర్సీటిలకీ వొకే సిలబస్ వుండాలంటే బుర్రలూపుతున్నారు. వైన్ చాన్సలర్లు యేకగ్రీవంగా. వేరువేరు సిలబస్ లుండాలంటేనూ అలాగే బుర్రలూపుతారు అసలు సిలబసే వోద్దన్నా బుర్రలూపుతారు. బుర్రలూపటానిక్కాకపొతే కుర్చీల్లో దేనిక్కూచుంటారు! మర్రివారి నిరంకుశ పాలనకు ------తులాభారం మర్రి చెట్టుకి --------ఆఫీసులు రాత్రుళ్ళే పనిచెయ్యాలన్నా, అధికారులూ, గుమాస్తాలూ బుర్రలూపుతారు. బుర్రలూపే జాతి , కానీ బుర్రలున్నాయా అసలు ------బుర్ర వుంటే బుర్రలేందుకు వూపుతారు----
    "హలో శ్రీపతి డైనింగ్ హాలుకి వొస్తున్నారా?"
    "ఆ" అన్నాడు శ్రీపతి.
    ---తనూ బుర్ర ఊపాడు. లేకపోతే రాననాలి, రాననాల ------రానంటే భుక్తి -----తనూ యీ జాతిలో వాడిగా -----భుక్తి . భుక్తి కోసం బుర్రలూపటం. భుక్తి కోసం కాదు ------పదవుల కోసం . బుర్రలూపే పదవుల కోసం బుర్రలూపే పదవుల్లో దూరి .....
    డైనింగ్ హాలు.-----
    "యిందిరా గాంధీ వర్క్ యిజ్ వోవర్"
    "నో. జనతా వర్క్ యిజ్ వోవర్.
    ----పాపం. యిందిరమ్మ పనై పోయిందనేదానికి యింగ్లీషు కాబోలు! యింగ్లీషు ,మాట్లాడటమే రాదెం? యెలా వొస్తుంది? నేర్చుకుంటేగా? నేర్చుకోదలిస్తే ప్రభుత్వం నేర్చుకొనివ్వదు తెలుగు నేర్చుకోండి. గ్రాడ్యుయేషన్ దాకా తెలుగు , అక్కడి నుంచి అమాంతం యింగ్లీషులో దిగండి. అప్పుడది హిబ్రూ భాషలాగా అనిపిస్తుంది. యింగ్లీషు రాదు. తెలుగూ రాదు. తెలుగు ---------తెలుగు మడికారం----- తెలుగు ------కొన్ని మడికా  బొత్తిగా బాగనిపించవు ----కాలం మారిపొయిందేమో ----తెలుగుతనం తెలుగు పలుకు బళ్ళు ----తెలుగు పలుకు బడేక్కేడ ---డిల్లీ పాదుషాల పలుకుబడే ----- తెలుగుతనం లేదంటారా యీ నగరంలో ----యిలాంటి పంచకూళ్ళ కషాయం లాంటి , జనతా పార్టీ అంతటి పంచకూళ్ళ కషాయం లాంటి యీ సూడో మెట్రోపాలిటన్ సిటీలో యెక్కడ నుంచి వొస్తుంది? తెలుగుతనం పల్లెటూళ్ళలోనే అంతరించిపోయింది. పల్లెటూళ్ళలో సినిమా తపం సినిమా మడికారం సినిమా తెలుగు సాహిత్యం లోనూ లేదు. గ్రామీణ వాతావరణ సాహిత్యంలోనే లేకపోతే నాన్ రూరల్ నాన్ అర్బన్ నబర్బన్ మనుషులతో తెలుగు మడికారం ఉంటేనా సాహిత్యంలో వుండటానికి! వుంటే అన్ రియలిస్టిక్ అవుతుంది. రియలిస్టిక్ సాహిత్యం - సాహిత్యం రియాలిటీ యెలా అవుతుంది డబ్బా కెమేరాతో బొమ్మలాగితే రియాలిటీ వుంటుంది ---- సోషలిస్ రియలిజం  మార్క్సిస్తురియలిజం -- నక్సలిస్టు రియలిజం ----మార్క్సిజం లెనినిజం---- నిజం , మార్క్స్ లెనిజం --- మోహన్ --- యేక్కడున్నావు మోహన్ ---అంత మౌనంగా -- పాతిక వందల సంవత్సరాలనాడు సిద్దార్దుడిలాగే వెళ్ళి పోయి వుంటాడు - తప్పకుండా నీ అరుణ కబురంపి వుంటుంది - అరుణంతే - అరుణంటే గాయత్రి. గాయత్రి యెలాగో మెలాయించుకుని యెక్కడో తను కలలుగనే కలావని లోకి -- రెండు కలల సీనులన్నా - పంచ రంగుల రొచ్చు సీన్లు పెట్టకుండా సినిమా బొమ్మ తయారవదు. మన అంకినీడు నాలుగేట్టాడు. ఐనా నలుగు పిండి ఐపోయాడు. ఆ పిల్ల నలుగు పిండి వాడదు. యింపోర్టేడ్ సబ్బిళ్ళ వాడుతుంది. జీవేల్రీ వాడుతుంది, వీణ్ణి వాడు తుంది.... ....

    "వుయ్ విల్ గో అన్ స్త్రయిక్ యేగేన్త్స్ యిందిరాగాంధీస్ అరెస్ట్ " అన్నాడు సుధాకర్
    "ఆకారణంగా అల్లర్లు మొదలేట్టితే మిమ్మల్నీ చెన్నారెడ్డినీ కూడా తిహార్ విహార యాత్రకి తీసుకెళ్తారు, మావాళ్ళు" అన్నాడు కులశేఖర రావు.
    "షటప్ , పీపుల్ ఆర్ అన్ హెర్ సైడ్" అన్నాడు సుధాకర్.
    "దక్షిణాదిలోనేగా . అదీ రెండు రాష్రాలు . తమిళనాడు ద్రవిడ నాడు, ఎవరిదీ కాదు. తెలుగువాళ్ళూ కన్నడ వాళ్ళు వుట్టి బడుద్దాయిలు. అందుకే వీళ్ళిద్దరికీ వొకలాంటి లిపీ భాషా వుంది. దేశం అంతటా దేవభాష దాని ఆధునిక రూపమైన హిందీ భాష"
    "అరెస్సేన్ కా పాలా చుప్ రహో"
    "ఏం కూశావురా బోని కలిరిచేస్తాను"
    ప్లేట్లు యెగిరాయి.
    కలబడ్డారు యిద్దరూ. నలుగురు ఐదుగురు - గుంపు.
    ---కలబడిన వాళ్ళేరీ / గుంపే కనిపిస్తోంది -- యిద్దరూ కలిసి  వొమెన్ సినిమా వుదయ మాటకి యెంచక్కా చెట్టాపట్టాలేసుకెళ్ళి పోయి వుంటారీపాటికి. గుంపు మిగిలింది. కాలేజీల మూత రెండ్రోజూలో నాల్రోజులో - వెర్రి గుంపు - మన గుంపింకా మేలు. వుత్త వెర్రి గుంపు. పడమటి గుంపు మరీ అధ్వానం - అందుకే రీస్ట్ మన్న్ లోన్లీ క్రవుడఁటూ వాపోతున్నాడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.