Home » vaddera chandidas » Anukshanikam 2



    అతని కళ్ళలో నీటి పొర
    కొన్ని క్షణాల మౌనం
    "ఆనాడు నువ్వు నన్ను ప్రేమించని నాడు మూర్ఖుడినని అనుకున్నాను ఆ పనీ యీ పనీ చేసుకుని బతుకుతున్ననాడు కూలి వెధవ అన్నాను నలుగురితో -- కానీ అప్పుడంతా నువ్వంటే చాలా గౌరవం నాకు. నువ్వు డ్రస్సు మార్చి అసెంబ్లీకి వెళ్ళినాక పతనం అయినాక నీ మీద గౌరవం పోయింది. మాకు బాగా ఆస్తి వుందనీ అందంగా వుంటాననీ నాకు గర్వమే కావొచ్చు. ఆ గర్వం లోకం దగ్గిర. నీకే బుద్దుండి వుంటే నాకు యే బోయ్ ఫ్రెండూ వుండకపోను. నేను నా చవట బోయ్ ఫ్రెండ్స్ తో గడుపుతాను గానీ నీలాంటి పతనమైన వాడితో కాదు. నాక్కావాల్సిన రవి యేనాడో చచ్చిపోయాడు."
    ఆమె బిళ్ళ నిండా నీళ్ళు గొంతు పూడుకుపోయింది. చకచకా నడిచి గది బయటికి వెళ్ళిపోయింది.
    ఐదు నిమిషాలు
    వంటరిగా కూర్చున్నాడు.
    వొంట్లో, లేచి నిలుచునే సత్తువ ఉన్నట్లుగా కూడా అనిపించలేదు.
    మరో ఐదు నిమిషాలు.
    బట్టలు వేసుకున్నాడు.
    లేచి బయటికి వొచ్చాడు.
    డ్రైవరు, తలపు తెరిచాడు. కూచున్నాడు. తలుపు మూసుకుంది. కారు కదిలింది.
    సీటుపై అంచుమీద తల ఆనించాడు.
    పావుగంట
    కారు ఆగింది తలుపు తెరచుకుంది.
    యింట్లోకి నడిచాడు. మెట్లేక్కాడు తన పడకగది తలపు వేసుకుని ఫ్రిజ్ తెరిచి స్కాచ్ విస్కీ సీసా తెచ్చుకుని సోఫాలో వోరిగాడు.
    గొంతు వెంట విస్కీ, కళ్ళ వెంట నీళ్ళు.
    కళ్ళు ---- మూసుకుంటూ  తెరుచుకుంటూ కొన్ని గంటలు గడిచాయి.
    టెలిఫోను మోగింది.
    అందుకోలేదు.
    మోగుతూనే వుంది.
    అందుకున్నాడు.
    అవతలి నుంచి , "హలో రవీసాబ్! నేను లోకేష్ ని. మంచిగున్నరా? మిమ్ముల చూసి చాల దినాలాయే..... ..... ....." అంటూ ఆప్యాయంగా వుత్సాహంగా చెప్పుకుపోతున్న లోకేష్ గొంతు.

    
                              126
    
    భుజాన  తువ్వాలు వేసుకుని స్నానించటానికి వెడితే వొక్క బాత్రూమూ ఖాళీ లేకపోవటంతో హాల్లోకి వొచ్చాడు శ్రీపతి. బల్ల మీద దినపత్రికలు.
    పతాక శీర్షిక. సభా హక్కులను భంగపరిచిన నేరానికి లోక్ సభ, యిందిరా గాంధీని సభ సభ్యత్వం నుంచి బహిష్కరించి కారాగారవాసం విధించిందని.
    ఆతిధ్యం తిహార్ జైలులో.
    చూసి --- పత్రిక తీసి చదవకుండా ముందు మెట్ల మీదకి అడుగులు వేశాడు శ్రీపతి.
    --ఐదు వందల గురివిందల లోక్ సభా వేదిక నలంకరించిన మేడి పళ్ళు సాధించిన ఘనకార్యం. ఆపాటి కుంటిసాకు యెవరి విషయంలో దొరకదు! చిక్ మగ్ లూరు నుంచి గెలిచి తను పార్లమెంటు లో కాలుపెట్టిన పదిరోజుల్లోగా కెలికి కెలికి యీ పాయింటు లాగారు. బోనులో సింహం లాగా ---సింహమా------సివంగా ------పాపం ఆడకూతురు వొక్కతే యేలక్షన్లో రాత్రీ పగలూ చిక్ మగ్లూరున పడిందని అంటే ఆడది కాదురా అన్నారుగా ---సింహమే మరి మూడొంతుల పార్లమెంటు సభ్యులు యెప్పుడో అప్పుడు ఆ సింహం ముందు ఆడవేషం కట్టిన వాళ్ళే -- చిక్ మగ్ లూరు జనతా యేలక్షన్ ప్రచారం ఫార్స్ ---- పాపం ఆ జనతా అభ్యర్ధి ఆ వీరేంద్ర వుత్తమబ్బు --- ఐతే ఏం, యెందరు లేరు! దేశంలో వున్న నాయకులందరూ ---- ఎమర్జెన్సీ రాక్షసినీ కనికరించకండి అని ప్రచారం. జార్జ్ ఫెర్నాండేజ్ , పొట్ట కూటి కోసం బొంబాయి తరలి వెళ్లాను గానీ నా అసలు వూరు కర్నాటకే అనీ, వుక్కు ఫ్యాక్టరీ మీకే అర్సు నాకు అక్కర్లే ధన్నా కూడా బలవంతంగా యిచ్చేటంత బలంగా చెప్పి అదీ చాలదెమోనని వుక్కు మంత్రి బిజూతో కూడా చెప్పించి ---- తోడికోడళ్ళ సాధింపులా ఎమర్జెన్సీ ఘాతుకాలంటూ వైన వైనంగా చెప్పుకుంటూ పోయాడు -----డైనమైట్ జెయిలు కక్షల వల్ల కావచ్చు. ఏమర్జన్సీ'లో పోలీసులు పెట్టిన హింసలు ప్రభుత్వాధికారులుపెట్టిన బాధలు, పండకుండా వుండపోయినా పొలాలు, చెట్లు నాటించినందుకు , జనాభా పెంచవద్దన్నందుకు, యెన్నిటినో ---- అన్నిటిలోని సవాలక్ష లోసుగులకు శిక్షగా గెలిపించకండి ----- గెలిపిస్తే పార్లమెంటు లో ఆ పాతకి కాలుపెడితే దేశం నాశనమైపోతుంది -----అని మొరార్జీలు చరణ్ లు వొచ్చి ఎమర్జన్సీ బురదంతా ఆమె నెత్తిన పోస్తే నిప్పులు కుమ్మరిస్తే పెడజల్లితే పితూరీల్లాగా చిన్నం చితకా అన్నీ వల్లిస్తే అరిస్తే మొరిగితే , కరిస్తే --------తొణక్కుండా బెణక్కుండా గాయపడిన పులిలా కాదంటే , వో మేకని ఆరగించి బయల్దేరిన పులిలా ------ఎమర్జన్సీ లో కొన్ని పొరపాట్లు జరిగి వుండొచ్చు . అసలీ ఎమర్జన్సీ యెందుకు పెట్టాల్సోచ్చింది? ప్రజల వల్ల కాదు వీళ్ళవల్లనెగా -------- అంటూ వంటరిగా ఎవరినీ తిట్టి పొయ్యకుండా తను చెప్పాల్సిన ముక్కలు చెప్పినందుకు అన్నట్లుగా ప్రజలు గెలిపిస్తే -----మహావీరులంతా బిక్క మొహలేశారు. గోసాయి చిట్కా లాంటి మెలికితో సింహాన్ని జెయిలులో పెట్టనైతే పెట్టారు గానీ ---- యీ గుంట నక్కలు లోక్ సభ స్మశానంలో ...... ....... .........




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.