Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఇంటర్వ్యూ ముగిసింది. ఆశపెట్టుకోలేదు. కాబట్టి నిరాశ ప్రసక్తి లేదు. ఇల్లు చేరుకోవడానికి బస్టాపు దగ్గర నుంచున్నాను. ఇంకా బస్సు రాలేదు. ఒక బంట్రోతు రామస్వామి - రొప్పుకుంటూ నా దగ్గరకు వచ్చాడు.
"అయ్య రమ్మంటుండు" - నన్ను పిలిచాడు.
"నన్నేనా?"
"అవ్! నిన్నే! అయ్య నీ కొరకే కూకున్నాడు."
నేను వెళ్ళాను. గాడేపల్లి జగన్నాథంగారు ఒక్కరే ఉన్నారు. నన్ను కూర్చోమ్మన్నారు. కూర్చున్నాను.
"You are selected for post" అన్నారు.
అది కలయో! వైష్ణవ మాయయో అనిపించి నేను నిశ్చేష్టున్ని అయినాను. కనీసం కృతజ్ఞత చెప్పలేదు.
"When are you going to join?" - అడిగారు.
నా మీద మరొక పిడుగు పడింది. తడబడ్డాను, తబ్బిబ్బయినాను, జవాబు చెప్పలేకపోయాను.
"సోమవారం వచ్చి, ఆర్డరు తీసుకోండి."
నాకేమీ అర్ధం కావడం లేదు. అయోమయంలో పడిపోయాను. అది వాస్తవమో, కల్పనయో తెలియడం లేదు.
"Now you can go."
అప్పటికి ఈ లోకంలోకి వస్తున్నాను.
నాకు ముఖస్తుతి తెలియదు. 'మీకు చాల చాల కృతజ్ఞతలు' అని బయటపడ్డాను.
"ఉద్యోగం దొరకడం ఇంత సులభమో?" అనుకున్నాను. ఆనందంలో - అప్పటికి పదవసారి వదిలిన సిగరెట్టు - మళ్ళీ కొని కాల్చాను, పీల్చాను డబుల్ డెకర్ లో పైఅంతస్తులో ముందరి సీటులో కూర్చొని ఏవో లోకాల్లోకి వెళ్ళిపోయాను.
అన్నయ్యతో చెపితే, "నీకు కాక ఎవరికి వస్తుందిరా?" అన్నారు.
అప్పటికి నేను చేస్తున్న ఉద్యోగంలో గ్రేడు 55-99 నాకు రానున్న ఉద్యోగపు స్కేలు 140-5-190 వెంటనే నా టీచరు ఉద్యోగానికి రాజీనామా పోస్టులో పంపించాను. సోమవారంనాడు మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళాను. సెక్రటరీ వెంకటపతిరాజుగారు ఆర్డరు చేతికి ఇస్తూ "నీవు చురుకయిన వాడివని - నీలాంటివాడు దొరకడనీ వెంటనే ఆర్డరు ఇమ్మన్నారు చైర్మన్ గారు" అన్నారు తరువాత స్టాండింగ్ కమిటీ ప్రొసీడింగ్స్ లో ఆ విషయం వ్యక్తం అయింది.
నేను ఉద్యోగంలో చేరాను. శలవు పెట్టాను. డోర్నకల్లు వెళ్ళాను. కమల ముమ్మురిసిపోయింది. గ్రామస్తులు - ఉపాధ్యాయులు - విద్యార్ధులు ఆత్మీయం అయిన వీడ్కోలు ఇచ్చారు. స్టేషనుకు గుంపులు గుంపులుగా వచ్చి మమ్ము రైలు ఎక్కించి వీడ్కోలు చెప్పారు. కనులు చెమర్చగా మేము - భౌతికంగా డోర్నకల్లును విడిచాం. డోర్నకల్లుకు సంబంధించిన మరొక విషయం చెప్పి, డోర్నకల్లుకు దూరం అవుతాను.
గండి మల్లన్న - మల్లికార్జునరావు - సిరిపురం కాంగ్రెస్ క్యాంపులో నాతో పని చేశారు. నేను మెట్రిక్ చదువుకోవడానికి డోర్నకల్లులో తావరం ఏర్పరచారు. అభిమానంతో నన్ను టీచరుగా డోర్నకల్లుకు రప్పించారు.
గండి మల్లన్న ఆ తరువాత MLA అయినారు. MP అయినారు. అయినా నన్ను - మా కుటుంబాన్ని మరువలేదు. నేను భారత రచన పూర్తి చేసిన సందర్భంగా 20 జూన్ 1993 ఆదివారం నాడు - గండి మల్లన్న స్వాతంత్ర్య సమరయోధుల సంఘం పక్షాన - మా దంపతులకు ఆదరంగా - ఆత్మీయంగా అట్టహాసంగా సన్మానం చేశారు. నన్ను గుర్తుంచుకున్న జనం తండోపతండాలుగా సభకు వచ్చారు. పండుగ చేసినట్లు మల్లన్న తన ఇంట్లో వందలమందికి భోజనాలు పెట్టారు.
"రంగన్నా! నేను చేస్తున్న చివరి ఫంక్షన్ - నా మనుమరాలి నామకరణానికి రావాలి" అని బ్రతిమిలాడాడు. 19 ఆగస్టు 1994న నేనూ కమలా వెళ్ళాం.
12-9-1994న మా అమ్మాయి ఉదయ ఇంట్లో ఇల్లందులో ఉండనా డోర్నకల్లునుంచి దుర్వార్త - మల్లన్న వెళ్ళిపోయాడు!
మేమంతా డోర్నకల్లు వెళ్ళాం.
భద్రక్క నేనే తోడబుట్టినవాణ్ణి అయినట్లు "అన్నయ్యా! నువ్వు పెట్టిన కట్నాలు థేఉస్కొని పోయిందన్నయ్యా!" అని నన్ను పట్టుకొని వలవల ఏడ్చింది.
"మృత్యోర్మో అమృతం గమయ"
నైనం చిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః
నచైనం క్లేశ యంత్యాపొ నశోషయతి మారుతః
(ఆత్మకు నాశనము లేదు దానిని ఆయుధములు ఛేదింపలేవు. అగ్ని దహించలేదు. నీరు తడువలేదు. గాలి ఎండగొట్టలేదు.)
మార్పులు:
మేము 1957 జూన్ లో డోర్నకల్లు వదిలాం. స్వాతంత్ర్యం వచ్చిన్నాటినుంచి అప్పటికి భారతదేశంలో అనేక మార్పులు వచ్చాయి. భారతదేశ ముఖచిత్రం మారిపోయింది.
1. భారతదేశంలో ఉండిన 500 పైగా సంస్థానాలు విలీనం అయిపోయాయి. వాటి రూపురేఖలు కనిపించలేదు. రాష్ట్రాల పునర్విభజన జరిగింది. A,B, C రాష్ట్రాలు మాయం అయినాయి. రాజప్రముఖులు అంతరించారు. రాష్ట్రాలన్నింటికి సమాన ప్రతిపత్తి కలిగింది.
తరువాత కాలంలో ఫ్రెంచి, బుడతకీచుల అధీనంలో ఉండిన ప్రాంతం కూడా విముక్తం అయింది.
భారతదేశం ఒకే దేశం - దేశానికి ఒకే ప్రభుత్వం - ఒకే పతాకం - ఒకే కరెన్సీ ఏర్పడింది.
ఇందుకు సర్దార్ పటేల్ గారి అలసట ఎరుగని నిరంతర కృషి - వారి దేశభక్తి వారి ప్రజ్ఞాపాటవాలు కారణాలు.
2. భారతదేశంలో ఉండిన అనేక రైల్వేలు - N.S.R, M.S.M, G.I.P వంటివి విలీనం అయి, జాతీయం చేయబడిన ఒకే భారత రైల్వే ఏర్పడింది.
3. దేశానికి ఆహారపదార్ధాల కొరత విపరీతంగా ఉండేది ఆ కొరత తీర్చడానికి హరిత విప్లవం ప్రారంభం అయింది. బక్రానంగల్ - నాగార్జునసాగర్ వంటి అనేక ప్రాజెక్టుల పని ప్రారంభం అయింది.
4. పారిశ్రామికంగా స్వయం సమృద్ధం కావడానికి రష్యావంటి దేశాల సహకారంతో పరిశ్రమలు - సాంకేతిక విజ్ఞానాభివృద్ది కొనసాగింది.
5. అంతకు ముందు ఉండిన అణాలు, పైసలు రద్దయినాయి. దశాంశ పద్దతిలో నయా పైసలు వచ్చాయి. తూనికల్లో - కొలతల్లో దశాంశ పద్దతి ప్రారంభం అయింది.
భారతదేశాన్ని ఆధునిక సైన్సు యుగంలో ప్రవేశపెట్టడానికి మిశ్రమ ఆర్ధిక విధానం ప్రవేశపెట్టి, నిరంతరాయంగా శ్రమించిన ఆదర్శవాది - తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కృషిని భారతజాతి విస్మరించడం అసాధ్యం - అసంభవం.
6. 1957 నాటికి భారతదేశపు జీవనాడులయిన పల్లెల ఆర్ధిక - సామాజిక - సాంకేతిక జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిన జాడలు లేవు. విద్యుత్తు, రవాణా సౌకర్యాలు వారి దరిదాపులకు చేరలేదు. యంత్ర నాగరకత చాయలు కనిపించలేదు. సాంఘిక జీవనంలో ఏ మాత్రం మార్పు జరగలేదు. విద్యారంగంలో ఇసుమంత మార్పు వచ్చింది. అతిశయోక్తి కాదనుకుంటే జండా మారడం తప్ప పల్లెప్రజలకు ఏ మార్పూ తెలియదనడం వాస్తవ సత్యం.
ఇరవయి ఎనిమిది
విపులాచ పృథ్వీ:
సికిందరాబాదు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందిన నగరం. ఆంగ్రేజువారు ఈ నగరాన్ని - బెంగుళూరు వంటి నగరాలవలె - కంటోన్మెంటు ప్రాంతంగా అభివృద్ధి చేశారు. దీని అభివృద్దికి తమిళ ముదలియారులు - క్రైస్తవ మిషినరీలు ఎంతో కృషి చేశారు.
సికిందరాబాదుకు పురాతన చరిత్ర ఉంది. హష్మత్ పేట వద్ద త్రవ్వకాలలో క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల క్రితపు 'కెర్మస్' సమాధులు బయటపడినాయి. అప్పుడే ఇక్కడ జనావాసం ఉందనడానికి ఇది నిదర్శనం.
కుతుబ్ షాహీల కాలంలో "హుసేన్ సాపురా" అనే గ్రామం ఉండేది. ఇబ్రాహింకులీ కుతుబ్ షాకు చేసిన జబ్బు "హుసేన్ షావలీ" అనే ఫకీరు వల్ల నయం అయింది. అతనికి కృతజ్ఞత తెలియపరచడానికి 1562లో 2,5,4,636 రూపాయిల కర్చుతో నిర్మించిందే హుసేన్ సాగర్ "హుసేన్ సాపురా" ఆ వలీపేర వెలసిన గ్రామం.





