Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
రెండవ ఆసఫ్జా నిజామలీఖానుతో జరిగిన వప్పందం ప్రకారం ఈ ప్రాంతం ఆంగ్లేయులకు అర్పితం అయింది. వారు అక్కడ బ్రిటిషు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి రెసిడెంట్ సెడన్ హాం అప్పటి మూడవ ఆసఫ్జా సికిందర్ జాహ్ పేర 'సికిందరాబాదు' అని నామకరణం చేయాలనుకున్నాడు. నవాబు అనుమతి కోరుతూ 1806లో ఒకలేఖ వ్రాశారు. నవాబు అందుకు అంగీకరిస్తూ ఫారసీలో ఫర్మాను జారీ చేశాడు. దాని తెలుగు సారాంశం:-
"అల్లా అనుగ్రహంవల్ల ఈ ప్రాంతం ఆంగ్రేజుల
సైనిక తావరం, అయింది. మన ఉభయ ప్రభు
త్వాల నడుమగల సామరస్య చిహ్నంగా ఈ
ప్రనతానికి 'సికిందరాబాదు' నామము అంగీ
కరించనైనది. భవిష్యత్తులో సహితము ఈ
నగరం ఈ నామముననే ప్రసిద్ది చెందగలదు."
1946లో రెండిషను ప్రకారం నిజాంకు అప్పగించేవరకు బ్రిటిషువారి పాలనలోనే సికిందరాబాదు ఉండేది. సైనిక స్థావరం కాబట్టి పాటకజనం 'లష్కర్' అంటారు. లష్కర్ అంటే సైన్యం. సాధారణ ప్రజకు హైదరాబాదు పట్నం - సికిందరాబాదు "లష్కర్".
1951 మున్సిపల్ కార్పొరేషను చట్టం ప్రకారం సికిందరాబాదుకు - హైదరాబాదుకు వేరువేరు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడినాయి.
సికిందరాబాదు తెలుగుకు - హైదరాబాదు ఉర్దూకు ప్రాతినిధ్యం వహించేవి. సికిందరాబాదు కార్పొరేషను వ్యవహారాలు ఇంగ్లీషులో జరిగేవి. ఆంద్రభాషాభిమానంగల S.R. వేంకటేశంగారు మేయర్ అయినారు. అప్పుడు వారు కమిటీల ప్రొసీడింగ్స్ తెలుగులో అనువదింపచేయడానికి తీర్మానించారు. అనువాదక పదవికల్పించారు. నేను ఆ పదవిలో నియమించబడినపుడు వారు మేయరుగా లేరు.
మేము సికిందరాబాదు చేరుకునేవరకు మా మామగారు అత్తగారు వారి పిల్లలు మళ్ళీ సికిందరాబాదు చేరుకున్నారు. వారు మా కోసం బట్టల బజారులో నెలకు 30 రూపాయిల అద్దెకు ఒక రెండు గదుల ఇల్లు ఏర్పరచారు. అందులో రెండు కరెంటు బల్బులుండేవి. నల్లా లేదు, బావి ఉండేది, మనుషులు ఎత్తిపోసే పాయికానా ఉండేది. మేము హుసేన్ సాగర్ వడ్డుకు బహిర్భూమికి వెళ్ళేవాళ్ళం. రాష్ట్రపతి రోడ్డు మీదినుంచి 7B బస్సు ఒకటి మాత్రమే మారేడుపల్లికి వెళ్ళేది. ఆ రోజుల్లో నయాపుల్ తరువాత - యూనివర్శిటీ రోడ్డుకు RTC బస్సులు ఉండేవి కావు.
కార్పొరేషనులో నా పని కమిటీల కార్యక్రమాల అనువాదం మాత్రమేకాదు. మేము వచ్చినప్పుడు నగరంలో తీవ్రం అయిన 'ఫ్లూ' వ్యాపించింది. దాని నివారణను గురించిన ఆంగ్ల కరపత్రాన్ని - ఉద్యోగ ధర్మంలో - తొలిసారి అనువదించాను. నగరానికి ప్రముఖులు వచ్చినపుడు స్వాగత పత్రం ఇంగ్లీషులో తయారయ్యేది. వాటిని తెలుగు చేసే బాధ్యతకూడా నాదే.
ప్రముఖులకు పౌరసన్మానాలు జరిగినపుడు హైదరాబాదు మేయరు ఉర్దూలోనూ, సికిందరాబాదు మేయరు తెలుగులోనూ సన్మాన పత్రాలు చదవాలి. అయితే సికిందరాబాదు మేయర్లు అంగ్రేజి చదివేవారు. వారికి తెలుగు చదవడం వచ్చేది కాదు. మేయర్లలో కొందరికి తెలుగు చదవడం నేర్పాను. నాకు నెహ్రూ - రాధాకృష్ణన్ - రాజేంద్రప్రసాద్ - తొలి మహిళావ్యోమగామి వెలంతినా తెరష్కోవాలకు సమర్పించిన సన్మాన పత్రాలను తెనిగించే అదృష్టం కలిగింది.
ఇవికాక కొందరికి చాటు రచనలు చేయాల్సివచ్చేది. ఒక సందర్భంలో ఒక డిప్యూటీ మేయరుకు ఉపన్యాసం వ్రాసి ఇచ్చాను. వారు 'ఎరుగుదురు' ను 'ఏరుగుదురు' అని చదివారు. సభికులు గొల్లున నవ్వారు. డిప్యూటీ మేయరుకు ఏమీ అర్ధం కాలేదు.
"అయిన అట్లనే రాసిండు నన్నేం చేయమంటారు?" అని కాగితం చూపించాడు.
ఉపసంఘపు ప్రొసీడింగ్స్ అనువాదంలో 'అత్యవసర' అనే పదం వాడాను. ఒక సభ్యుడు 'ఏందయ్యా, ఈన హత్యలు చేస్తుండు' అని అడిగారు. నన్ను కమిటీకి పిలిపించారు. నేను వివరించాను. ఆనాటి నుంచి తప్పులు ఉన్నా అడగడం మానేశారు. ఇలాంటివి మరి కొన్ని జరిగాయి!
ఆంద్ర ప్రదేశంలో తెలుగుకు పట్టిన దుర్గతికి బాధపడ్డాను. సికింద్రాబాదు తెలుగుమీద నాకున్న విశ్వాసం విరిగిపోయింది. ఇది ప్రజల తప్పు ఏమాత్రం కాదు. రాజకీయ దుష్టత్వం! నిజాం నవాబు హైదరాబాదును పాకిస్తాన్ చేశాడు. పాకిస్తాన్ లో ఒక హైదరాబాదు ఉంది. జోష్ మాలీహాబాదీ అనే ఉర్దూకవి హరాబ్ కే నషేమే పాకిస్తాన్ హైదరాబాదుకు ప్రయాణమై - అవిభక్తభారతంలో - దక్కన్ హైదరాబాదుకు చేరుకున్నాడు. చిరాగలీ గల్లీ - ఆసిఫీ నగర్ - అబిడ్ రోడ్ బయటివారికి పాకిస్తాన్ పేర్లలగే ఉంటాయి. అలాగే ఆంగ్లేయులు సికిందరాబాదును ఇంగ్లండు చేశారు. జేమ్స్ స్ట్రీట్ - ఆక్స్ ఫర్డ్ స్టీట్ - సెంట్ బార్టన్ రోడ్డు ఇంగ్లండును తలపిస్తాయి.
ఆంగ్రేజు అభిమానులకు తెలుగు రుచి చూపిమ్చాలనుకున్నాను. ఆఫీసులో సాంస్క్రుతిక కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నాను. అప్పటి మేయర్ శిర్నాం సత్యనారాయణగారు - గాడేపల్లి జగన్నాథంగారు - వెంకటపతి రాజుగారు నాకు సాయం చేయడానికి అంగీకరించారు. సిబ్బంది నుంచికూడా మంచి ప్రతిస్పందన వచ్చింది. అయితే కమీషనర్ అనుమతి కావాలి.
కమీషనర్ ధర్మరాజ్ మాథుర్ మంచివాడు. నిజాయితీ, పరిపాలనా పాటవం గల కాయస్తు. కాయస్తులు ఉత్తరదేశంనుంచి వలస వచ్చినవారు ముస్లిం వేషభాషలు గల హిందువులు వారికి ఉర్దూ తప్ప అన్యభాష రాదు, నేర్వరు. మహారచయిత ప్రేమ్ చంద్, తొలి రాష్ట్రపతి రాజేందర్ పర్షాద్ కాయస్తులు. ధర్మరాజ్ మాథుర్ కొంత గొణిగారు. గానా బజానాలో పని చెడిపోతుందన్నారు. అయితే మేయర్ మాట కాదనలేకపోయారు.
రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా సికిందరాబాదు మున్సిపల్ కార్పొరేషను ఆవరణలో ఆంద్ర సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఒక నాటిక నేను వ్రాసిన బుర్రకథ - కవితలు - ముషాయిరా అందరిని అలరించాయి, మురిపించాయి. తెలుగు తీయదనం చవి చూపించాయి. పెద్దలు ప్రముఖులు - వట్టికోట ఆళ్వార్ స్వామి సహితంగా - అందరూ నన్ను అభినందించారు. తరువాత చాలాసార్లు కవి సమ్మేళనాలు - మిగతా కార్యక్రమాలు నిర్వహించాం.
వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణా ప్రజా ఉద్యమానికి - ప్రజా సాహిత్యానికి ఊపిరి వంటివారు. వారు కమల పక్షంగా మాకు బంధువు. మా అత్తవారిది అడ్లూరు. వారిది అక్కడికి దగ్గరలోని మాధారం. రెండు నల్లగొండ జిల్లాలోనివే. ఆళ్వార్ స్వామి తెలంగాణలో ప్రథమ బ్యాచ్ లోని సత్యాగ్రహి పోలీసు చర్య జరిగేదాకా జేల్లోనే ఉన్నారు.
ఆళ్వార్ స్వామి స్ఫురద్రూపి. 'పుంసాం మోహన రూపాయ' వీరికి వర్తిస్తుంది. ఆళ్వార్స్వామి వలె నిష్కపటంగా నవ్వగల మరొకరు మహాత్ముడు మాత్రమే! అతను కట్టిన శుభ్రమయిన తెల్లని ఖద్దరు బట్టల వంటిదే అతని మనసు. మలినములేని మనసువాడు.
ఆళ్వార్ స్వామి కమ్యూనిస్టు పార్టీ మెంబర్. నాకు మాత్రం అతడు గాంధీవాదిగా దర్శనం ఇస్తాడు. వారింట్లోని ఒక పటంలో వినోబాజీ భూదానపు అంగ - స్టాలిన్ అంగకన్న పెద్దగా ఉంటుంది.
ఆళ్వార్ స్వామి దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు అభిమాని. వారి పేరా గ్రంథమాల - గ్రంథాలయం స్థాపించి, నిర్వహించారు. వారు తాము ప్రచురించిన గ్రంథాలు పట్టుకుని తెలంగాణం సాంతం మలయమారుతంలా పయనించారు. సాహితీ సుగంధాలు వ్యాపింపచేశారు. మేము కొండపల్లిలో ఉన్నపుడూ - దోర్నకల్లులో ఉన్నపుడూ వచ్చారు. మా ఇంటనే విడిశారు. వారుంటే ఒక సాహిత్యపు విందు! పసిపిల్లలతోవంటి పసందు!!
ఆళ్వార్స్వామికి నేనంటే ఎనలేని వాత్సల్యం. 'మా తమ్ముని ప్రతిభను నాకన్న ముందు ఆళ్వార్స్వామి గుర్తించారు.' అనేవారు మా అన్నయ్య నేను సికిందరాబాదు చేరుకున్నాక ఆళ్వార్స్వామి నన్ను వదలి ఎక్కడికీ వెళ్ళలేదు. కృష్ణశాస్త్రి - బుచ్చిబాబు - గోపీచంద్ - తాపీ ధర్మారావు వంటివారి దర్శన భాగ్యం నాకు కల్పించారు.
అప్పుడు జేమ్స్ స్ట్రీట్ క్లాక్ టవర్ వద్ద 'తెలుగుస్వతంత్ర' కార్యాలయం ఉండేది. ఆళ్వార్ స్వామితో వెళ్ళినపుడు గోరాశాస్త్రిగారితో పరిచయం ఏర్పడింది. మా ఇంటికి 'స్వతంత్ర' చాల దగ్గర - అనేకసార్లు గోరాశాస్త్రిగారిని కలిశాను. ప్రతిభకు మాగ్నెటులాంటివారు గోరాశాస్త్రి ఏదన్నా వ్రాయమనేవారు. 'ఏం వ్రాయాలో అర్ధం కావడం లేదు' అన్నాను. 'ప్రక్రియ వెదుక్కోవడం రచయితలందరికీ కష్టమే. ఏదో ఒకటి వ్రాయండి' అని ప్రోత్సహించారు.
'ఇండియా ప్రపంచశాంతి కృషి' అని వ్యాసం వ్రాశాను. శాస్త్రిగారు మెచ్చుకున్నారు, ప్రచురించారు.
నేను పట్నం చేరుకొని మూడున్నర దశాభ్దాలు దాటింది. అయినా పట్నం పరాయిగాను - పల్లె స్వంతంగానూ అనిపిస్తుంది. అవి కొత్తగా పల్లెనుంచి వచ్చినరోజులు. పల్లెల బాధలు - పట్నం విలాసాలు - ఈ వ్యత్యాసాలు - వెగటు కొట్టేవి ఈ విషయంలో ఏదయినా వ్రాయాలని తపన ఉండేది. ఒకనాడు అమాంతంగా ఒక ఊహ - ఒక ఆలోచన వచ్చింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు మిత్రులు - ఒకడు పదవి చేపట్టాడు. అతనికి 'భావదాసు' అని పేరు పెట్టాను. రెండోవాడు స్వచ్చందసేవకుడు అతనిని 'దేహదాసు' అన్నాను. దేహదాసు భావదాసుకు వ్రాసినట్లుగా ఒక ఉత్తరం వ్రాశాను. గోరా శాస్త్రిగారికి చూపించాను. అది చూచి వారు పొంగిపోయారు. పల్లెలను గురించి ఇంత స్పందించడం విశేషం అన్నారు. వారం వారం వ్రాయమన్నారు. పది పన్నెండు వారాలు వ్రాశాను. వాటికి మంచి ప్రతిస్పందన వచ్చింది. నేను భావదాసుకు వ్రాస్తే దేహదాసుకు వ్రాసినట్లు ఉత్తరాలు వచ్చాయి. ఆ తరువాత నేను జబ్బుచేసి దవాఖానాలో పడ్డాను. వ్రాయలేకపోయాను.





