Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    ఆంధ్రుల బలహీనతలు ఎరిగిన రాజగోపాలాచారి - తమిళులకు ఉపకారం చేయడానికి - కృష్ణ నీటిని తమిళ ప్రాంతానికి మళ్ళించే - కృష్ణాపెన్నార్ ప్రాజెక్టు ప్రతిపాదించారు. దాంతో ఆగ్రహించిన గాంధేయవాది పొట్టి శ్రీరాములుగారు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. పొట్టి శ్రీరాములుగారి విషయంలో నెహ్రూ ప్రభుత్వం బ్రిటిషు ప్రభుత్వంకన్న రాక్షసంగా ప్రవర్తించింది. శ్రీరాములుగారు బెదిరింపులకు లొంగలేదు. ఆత్మార్పణం చేశారు.
    
    శ్రీరాములు గారి ఆత్మాహుతితో ఆంద్రప్రజ రెచ్చిపోయింది. చిచ్చు రగిల్చింది. నెహ్రూ లొంగక తప్పలేదు. జగడాల మధ్య కర్నూలు రాజధానిగా - ప్రకాశం ముఖ్యమంత్రిగా "ఆంద్రరాష్ట్రం" ఏర్పడింది అది భారతదేశంలో తొలి భాషా రాష్ట్రం!
    
    భారత చరిత్రలో భాషారాష్ట్రాలు - భాషారాజ్యాలు - కనిపించవు. భారతీయులు భాషాతత్వం ఎరుగరు. త్యాగరాజు తెలుగుపదాలను తమిళులు పాడారు. మలయాళ ప్రాంతపు ఆదిశంకరుని అద్వైతాన్నీ - తెలుగువాడయి తమిళం అవలంబించిన రామానుజుని విశిష్టాద్వైతాన్నీ యావద్భారతం ఆమోదించింది. భాషల పేరిట సంకుచితత్వాన్ని కూడా మనం యూరోపునుంచి కొని తెచ్చుకున్నాం. యూరోపుదేశాలన్నీ సుమారు భాషాదేశాలే!
    
    కాలగతిని నిలువరించడం ఎంతటివానికీ సాధ్యం కాదు. భాషారాష్ట్రాలు ఏర్పరచడానికి భారత ప్రభుత్వం ఫజల్ అలీ కమీషను నియమించింది. వారు సమర్పించిన నివేదికలో తెలంగాణం వెనుకపడినతనందృష్ట్యా అయిదేళ్ళు ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని నివేదించారు.
    
    ఈ విషయంలో హైదరాబాదు కాంగ్రెసు రెండుగా చీలిపోయింది. రామానంద తీర్ధ నాయకత్వాన ప్రగతి వర్గం విశాలాంధ్రకు అనుకూల ఉద్యమం నిర్వహించింది. కమ్యూనిస్టులు తొలినుంచి అనుకూలురు. నిజాం రాజ్యాన్ని ఆంద్ర-మహారాష్ట్రం - కన్నడిగ ప్రాంతాలుగా విడగొట్టాలనీ, ఆ ప్రాంతాలను ఆయా భాషారాష్ట్రాల్లో విలీనం చేయాలన్నది కమ్యూనిస్టుల నినాదం. అలా చేయడం వల్ల నిజాం పెత్తనం విరగడ అవుతుందనీ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనీ వారి వాదం బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి సహితంగా కమ్యూనిస్టుల వాదాన్ని అనుసరించారు.
    
    కన్నడిగులు - మహారాష్ట్రులు తమ నిజాం ప్రాంతాన్ని పొరుగు రాష్ట్రాల్లో విలీనం చేయడానికి అభ్యంతరం చెప్పలేదు. కాని, తెలంగాణలో కాంగ్రెసులోని ఒక ప్రగతి నిరోధక వర్గం - అచ్చంగా తమ పదవులకోసం తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక ఉద్యమం లేవదీశారు. దీనికి నాయకత్వం వహించినవాడు కొండా వేంకటరంగారెడ్డి, ప్రయోజనం పొందినవాడు మర్రి చెన్నారెడ్డి, అయితే వీరికి కావలసింది పదవి - ప్రజా ప్రయోజనం కాదు. పదవికోసం తాత్కాలిక ఒప్పందం పేర ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంతకాలు పెట్టారు.
    
    ఆంద్రరాజకీయాల్లోకి పొడుచుకువచ్చిన నీలం సంజీవరెడ్డి - ఆంద్రనాయకత్వం రాయలసీమ వాసులకు ఇచ్చిన కర్నూలు రాజధాని వాగ్దానాన్ని తుంగభద్రలో తొక్కి విశాల రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి - హైదరాబాదు రాజధానిగా ఆంద్రప్రదేశ్ ఏర్పడడానికి అంగీకరించారు.
    
    ఇన్ని కుట్రలు, కూహకాల మధ్య - ఆంధ్రుల ఐక్యత అనే నేతిబీరవంటి - లోన లాటారం పైన పటారం అయిన - ఆంద్రప్రదేశ్ - ఒకటవ నవంబరు 1956న ఏర్పడింది. రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి - రాయలసీమ వాడు సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయినారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టి కొండా వేంకటరంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి అయినారు.
    
    ఆంద్రప్రదేశ్ లో ముఠా రాజకీయాలకు అంకురార్పణ జరిగింది. తన సర్వస్వం దేశానికి అర్పించి అనంత త్యాగం చేసి - నెహ్రూను సహితం ధిక్కరించగల ఆంద్రకేసరి టంగుటూరి ప్రకాశానికి పదవి ఊడింది. విశాలంధ్రకోసం నిరంతరం శ్రమించిన బూర్గుల రామకృష్ణారావుకు రాజకీయ సన్యాసం లభించింది.
    
    ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంనాడు అనేక సర్కారీ ఉత్సవాలు జరిగాయి. రేడియో - పత్రికలు, ఆస్థాన పండితులవలె ఏర్పడిన రాష్ట్రాన్నీ - ప్రభుత్వాన్నీ పొగడ్తలతో ముంచెత్తారు. కవులు సరేసరి.
    
    "నా తెలంగాణ కోటిరత్నాలవీణ" అన్న నా అగ్రజుడు మహాకవి దాశరథి "మూడు కోతుల నొక్కటే ముడిబిగించి" అని మహాంధ్రోదయ కావ్యము రచించినారు.
    
    ఒకటి నవంబర్ 1956న వెలువడిన గోలకొండ పత్రిక విశేష సంచికకు నేను 'తెలంగాణలో విద్యావికాసం' అనే వ్యాసం రచించాను.
    
    నేను ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి సంతోషంచను లేదు, విచారించను లేదు. ఏలననగా, మనుషులకు కూర్చే శక్తి ఏ సంస్థకూ లేకుండా పోయింది.
    
    మతం ఒక్కటేనన్న రాజకీయ నినాదంతో ఏర్పడిన పాకిస్తాన్ ముక్కలయింది. మతం ఒకటే అయినా ఇరాఖ్, కువైట్లు యుద్దానికి దిగాయి.
    
    ఒకే భాషా సంస్కృతులుగల వంగదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది.
    
    "ప్రపంచ శ్రామికులారా, ఏకం కండి!" అన్న మార్క్సు మహర్షి నినాదాన్ని వల్లించే దేశాలు - పార్టీలు రాజకీయ ప్రయోజనం కోసం ప్రజలను విడగొడ్తున్నాయి! రాజకీయ స్వప్రయోజనపరులే రష్యాలోని సోషలిస్టు సామ్రాజ్యాన్ని కూల్చివేశారు.
    
    మతం - కులం - దేశం - ప్రాంతం - భాషలాంటివి రాజకీయులకు తప్ప - ప్రజలకు ఉపయోగపడవు!
    
    రాజకీయ నరకుని అంతం చేసిననాడే సకల ప్రపంచ ప్రజలకు దీపావళి దివ్వెల పండగ!
    
దయ్యమేనేమో!:
    
    జీవితం సకాలానికి - సాహిత్యానికివలెనే - ముడిసరుకు జీవిత సంఘటనలే కాల్పనికములయి సాహిత్యరూపం ధరిస్తాయి. ఒక వాస్తవ విచిత్ర సంఘటన వివరిస్తాను.
    
    వేసవి శలవులకని అన్నయ్య కుటుంబం, మేము గార్ల చేరుకున్నాం. చెల్లెళ్ళు కూడా వచ్చారు. ఆనాడు రాత్రిదాకా మాటలు ముచ్చట్లు - హాస్యాలు పరిహాసాలతో గడిచింది.
    
    నేనూ కమలా పిల్లలు ఇంటి ముందరి విడి స్థలంలో పడుకున్నాం. అన్నయ్యా వదినావాళ్ళు వెనుక దొడ్లో పడుకున్నారు. కృష్ణపక్షం తెల్లవారు జామున వెన్నెల వచ్చింది. నన్ను ఒక స్త్రీహస్తం కదిలించింది. నేను కమల అనుకున్నాను. కళ్ళు తెరచాను. తెల్లచీర ముసుగువేసుకున్న స్త్రీ! నాకు భయం వేసింది. "దెయ్యం - దెయ్యం" అని కేకలు పెట్టాను. అందరూ లేచారు. నేను దెయ్యాన్ని పట్టుకున్నాను. ఆమె తన పేరు చెపుతుంది. 'దెయ్యం అలాగే చెపుతుంది' అని పొదివి పట్టుకున్నాను. పడుకున్న వాళ్ళంతా లేచారు. వాళ్ళు ఏమీ చూడలేదు. "దెయ్యం - దెయ్యం" అని కేకలు పెట్టాను. అందరూ లేచారు. నేను దెయ్యాన్ని పట్టుకున్నాను. ఆమె తన పేరు చెపుతుంది. 'దెయ్యం అలాగే చెపుతుంది' అని పొదివి పట్టుకున్నాను. పడుకున్న వాళ్ళంతా లేచారు. వాళ్ళు ఏమీ చూడలేదు. "దయ్యం - దయ్యం" అని అరిచారు. ఆమె విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నది. నేను వదలడం లేదు.
    
    అన్నయ్య వెనుకనుంచి కుర్చీ ఎత్తుకొని వచ్చాడు. 'పులి అనుకున్నాను' అని కుర్చీ వేసుకొని కూర్చున్నాడు.
    
    తెల్లవారవస్తున్నది, ఇరుగు పొరుగు లేచారు. ఇంతకూ నేను పట్టుకున్నది పూర్వసువాసిని లక్ష్మీబాయమ్మను! అందరూ విడువమంటే విడిచాను. ఆమె తలవంచుకుని వెళ్ళిపోయింది.
    
    "తమ్ముడూ! ఆ పోయింది నిజంగా లక్ష్మీబాయమ్మేనంటావా? దయ్యం కాదుకదా!" అడిగాడు అన్నయ్య!
    
    "ఏమో!!" అన్నారు అంతా.
    
    "అరె! గిప్పుడే కదా పోయింది. కండ్ల బడ్తలేదు. దయ్యమే కావచ్చు" అన్నాది ఒక అవ్వ!
    
పట్నం కొలువు:
    
    వేసవి శలవులు అయిపోయాయి. మృగశిర ప్రవేశించిన్నాడు డోర్నకల్లు చేరాను. పదవ తరగతి వచ్చింది. పిల్లలు - తల్లిదండ్రులు - గ్రామస్థులు చాల సంతోషంగా ఉన్నారు. "రంగన్నా! అనుకున్నది నెరవేర్చినవు" - గండి మల్లన్న నాకు అభినందనలు తెలిపాడు.
    
    ఇంకా సంబరాల్లోనే ఉన్నాం. క్లాసులు మొదలు కాలేదు. పత్రికల్లో ఒక ప్రకటన వచ్చింది. అది సికిందరాబాదు ముస్నిపాల్ కార్పొరేషనులో తెలుగు అనువాదకుని పదవికి అభ్యర్ధులు కావలెననేది నా విద్యార్హతలు అందుకు సరిపోతాయి. అయితే నగరపు పొతెనెఇ నేను తట్టుకోగలననే నమ్మకం లేదు. అయినా దరఖాస్తు పంపించాను. ఆశ్చర్యం! ఇంటర్వ్యూకు రమ్మని జాబు వచ్చింది. హైదరాబాదులో అన్నయ్య ఇంట్లో విడిశాను. అన్నయ్యను అడగలేదు. నేను వారి సాయం కోరలేదు. ఎంచాతంటే, ఆ ఉద్యోగం నాకు వస్తుందని నమ్మకం లేదు.
    
    నేను వెతుక్కుంటూ మారేడు పల్లిలోని మునిసిపల్ ఆఫీసుకు చేరుకున్నాను. ఆఫీసు వాతావరణం నాకు కొత్త ఆడా, మగా ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూకు వచ్చారు. ఉద్యోగం రాదని నా నిశ్చయం అందువల్ల బుగులు పడలేదు!
    
    అందరి తరువాత - చివరకు - నన్ను పిలిచారు ఇంటర్వ్యూ చేస్తున్నది ఎనిమిది మంది సభ్యులు గల స్థాయి సంఘం దానికి గాడేపల్లి జగన్నాథంగారు చైర్మన్ - సాహిత్యంతో పరిచయం గలవారు. వారు సాహిత్యానికి సంబంధించిన కీలకం అయిన ప్రశ్నలు అడిగారు. నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. అప్పటికి పత్రికల్లో వచ్చిన నా వ్యాసాలు చూపించాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.