Home » vaddera chandidas » Anukshanikam 2



    ఒకచోట రోడ్డువారగా ఆపింది. పక్కకి తిరిగి అతని పెదాలమీద ముద్దిచ్చి, భుజం మీద తల ఆనించింది.
    కబుర్లు.
    కారులోని టేప్ రికార్డర్ లో తిరుగుతూన్న కేసెట్ లోని ఆఖరిపాట "గుడిసెనక గుడిశెదాన గుండీల రయికదాన-" ఐపోయింది.
    కారు బయల్దేరింది.
    మెహిదీపట్నం రోడ్డు.
    సరోజినీదేవి కంటి ఆస్పత్రి దగ్గిర ట్రాఫిక్ రద్దీ - పోలీసు చెయ్యెత్తాడు. కారు ఆగింది.
    అటు ప్రక్కగా వున్న హిందూ మిలిటరీ హోటల్లోని రికార్డ్ ప్లేయర్ లోంచి-"బొబ్బర్లంక చిన్నదీ కొబ్బరిలాగ వున్నదీ- బెల్లం పల్లి బుల్లోడు అల్లలాగ వున్నాడూ-" అని వినిపిస్తోంది.
    
                              125
    
    యెం.యెల్. యె బచ్చు గంగారాం, మధ్యాహ్నం రెండున్నరకి కారు పోర్టికోలో ఆపి-దిగి లోపలికి అడుగులు వేసి, "రవీ సాబ్ వున్నడు కదా?" అన్నాడు.
    "మినిస్టరుగారు పడుకుని వున్నారు" అన్నాడు రవి పర్సనల్ సెక్రటరీ
    "యీ టైంల పండుకుని వుంటడని తెల్సు. అందుకోసమే ఫోన్ చెయ్యక నేనె వొస్తి. జరూర్ పని."
    "మీ యిష్టం. వారాగ్రహించితే నా పూచీ లేదు" అన్నాడు సెక్రటరీ.
    పైకి వెళ్ళి తలుపుతట్టాడు గంగారాం. తలుపు తెరుచుకోలేదు
    దబదబా బాదాడు
    తలుపు తెరుచుకుంది
    ముఖంలోని చిరాకు తగ్గి-"వో నువ్వా గంగారాం! రా యెనీ థింగ్ అర్జెంట్?" అన్నాడు రవి.
    సోఫాలో కూచుంటూ, "చెప్పవల్సినది మస్తున్నది. కూకో రవీసాబ్" అన్నాడు గంగారాం.
    "వాడు గోవర్ధన్ రెడ్డి బై ఎలక్షన్ కి సీటు పర్చేజి చేసి చెన్నారెడ్డికి దగ్గరైన నంది నీకు అన్ని ప్రోబ్లమ్సె వొస్తున్నవి" అన్నాడు గంగారాం    
    "వెంగళ్రావు ప్రభుత్వం తరవాత రాష్ట్ర రాజకీయాలలో వెనకటి కాలపు కుల విధానం, వర్గవిధానం, నియోజకవర్గ బలం, వ్యక్తి  బలం పని చెయ్యటం లేదుగా! రాజకీయం. చదరంగం నుండి వైకుంఠపాళిగా మారింది" అన్నాడు రవి.
    పదిమంది ఎమ్మెల్యేల సపోర్టు వున్నవాడు మినిస్టరవుతాడు వొక్కొక్కరిని లక్షరూపాయలిచ్చి కొనుక్కోవాలి-అని రాజకీయ వర్గాలలో పరిపాటిగా అనుకుంటున్నారు.
    "అన్నిట్కి భీమ్ తీ యేర్పాటైనది. వన్ వే ట్రాఫిక్ వుండాల్నన్నా పోవాల్నన్నా యేపనీ కావాల్నన్నా పైసలతోటే. ముందటి లెక్క యిన్ఫ్లూ యన్స్ గాని మరేదిగాని బేకార్ ఐపాయె" అన్నాడు గంగారాం.
    "యేంటి అసలు సంగతి? యింత అర్జంటుగా మళ్ళీ-" అని ఆగి పోయాడు.
    క్రితం నెలలో తనని సమర్ధించే వొక ఎమ్మెల్యే జారుకుంటే మరొకతనిని పెట్టుకుని కొనాల్సివొచ్చింది. లక్షా పాతికవేలు. గతిలేక గంగిని అడిగాడు.
    "చూస్తివా పైస అంటే ఏమిటిదో! దునియా పూర పైసతోటి నడుస్తున్నది. అంత పైన యిస్తే యింక బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ ఐతది. మర్ల ఆపదొస్తే షేర్లు అమ్మాల్నో బంగ్ల కుదువ పెట్టాల్నో - ఆ పని చేస్తే ప్రిస్టేజ్ పూర పోతది" అని డబ్బు యిచ్చింది.
    ఆ తరవాత వొకతనిని గూండాలతో తన్నించాల్సి వొచ్చింది-పది వేల రూపాయల యిచ్చి. మరొకతనిని బ్లాక్ మెయిల్ చేస్తామని బెదిరించాల్సొచ్చింది. కొందరు గూండాలను మేపుతూ వుండాల్సొస్తుంది. వీటిలో యెక్కువగా గోవర్ధన్ రెడ్డి వల్ల కలుగుతున్న సమస్యలు. అతను ముఖ్యమంత్రికి చాలా సన్నిహితం అయ్యాడు.
    "వాడు లేడు? మీ ఖమ్మంజిల్లా మెంబర్ చిప్పల రంగయ్య, వాన్ని గోవర్ధన్ రెడ్డి తిప్పేస్కున్నడు. ఆ బద్మాష్ గోవర్ధన్ రెడ్డి సాలా. సి.యం, తోటి అన్ని పన్లు చేపించి పైస కమాయించి యిస్తున్నడు. యే పని కావాల్నన్న యీ బద్మాష్ గోవర్ధన్ ని అడ్గితే చాలు. రేటు చెప్తడు. బస్, పైసా యిస్తే చాలు పనిఐపోతది ఆ బద్మాష్ ని చావదన్ని తె."
    "నావల్ల మినిస్ట్రీలో యెవరికీ ఆదాయం లేనట్లే. యేదో చెయ్యాలి లేకపోతే-"
    "ముందు యీ ప్రోబ్లంలకెల్లి బయటపడాల. ఆ కరీంనగర్ మెంబర్ అట్కుల నియ్యని అడిగిచూసిన. వాడు పైసకుకూడమాట యినెటట్లు లేడు."
    పైస - అనేసరికి రవికి దడపుట్టింది.
    "నా నియోజకవర్గం ప్రజలందర్నీ అసెంబ్లీ మీదకి రెచ్చగొడతాను" అన్నాడు రవి- అసహాయంగా యేం చెయ్యాలో మార్గం కనపడక.
    "నీ కాన్స్తిట్యువన్సిల నీకెంత స్ట్రేంగ్త్ వున్నదో అందరికి యెరికనే. అట్ల చేస్తే ఫాయిదేమున్నది? సిట్యువేషన్ యింక యెక్కువ కష్టమైపోతది. వాడు గోవర్ధన్ దానికి వేరే కలరింగ్ యిస్తడు- నువ్వు సి.యం. కి యెగనెస్ట్ గా వున్నవని. దాన్కిది యేవిడెన్స్ అని ప్రోసగేట్ చేస్తడు. ఆ రామానంద్ కూడా చెయ్యిస్తడేమో నన్నట్లు కండ్లపడ్తున్నడు యివాల్రేపు గోవర్ధన్ సాలాకా చెమ్ చా గంగారాంతోటి తిరుగుతున్నడు"
    "మరేం చేద్దామంటావు?" అన్నాడు రవి.
    "నా కేమి సమజ్ కాకున్నది. నువ్వే సోంచాయించు, రవీ సాబ్" అన్నాడు గంగారాం.
    గంగారాం, అసెంబ్లీలో రవికి అతినమ్మకమైన ఐదారుగురు అనుచరులలో వొకడు.
    "సరే నువ్వెళ్ళు. మీ అవ్వ కెట్లా వుంది?" అన్నాడు రవి.
    "అట్లనే వున్నది. యింటెన్సివ్ కేర్ ల పెట్టిన్రు"
    గంగారాం లేచి వెళ్ళాడు.
    రవి తలుపు వేసుకుని సోఫాలో వాలిపోయాడు. యీ రోజున తను కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా గాంధీ కర్నాటక చిక్ మగ్ లూరు నుంచి గెలిచింది. ఆ సంతోషమూ యీ సాయంత్రం అందరూ కలిసి జరుపుకోవాల్సిన ఆవేడుక-యివేవీలేకుండా దిగులుగా ముఖం వొడిలిపోయింది.
    అరిచేత్తో మొహం రుద్దుకున్నాడు.
    వొక వొరసలో యేదన్నా ఆలోచించే అవకాశం లేక బుర్ర వేడెక్కింది.

    పది నిమిషాలు.
    అతని కళ్ళముందు__ "మంత్రుల శాఖలలో మార్పులు. కార్మికుల మంత్రి రవికి ఉద్వాసన__" అని దినపత్రికలో తాటికాయలంత అక్షరాలూ కనిపించాయి.
    కంపించిపోయాడు చెమటలు పట్టాయి. వొంట్లో యెంత కూడా సత్తువ లేనట్లుగా నీరసించిపోయాడు.
    పది నిమిషాలు. కళ్ళముందు తనని సపోర్ట్ చేసే సభ్యులు కనిపించారు. కాస్త ధైర్యంగా అనిపించింది.
    ఆలోచిస్తున్నాడు బుర్ర వేడెక్కి పోయింది.
    ఆలోచన సాగక బుర్ర మరింత వేడెక్కిపోయింది.
    చటుక్కున లేచి, బాత్రూం తలుపు తెరిచి, షవర్ తిప్పి దానికింద నుంచున్నాడు.
    ఐదు నిమిషాలు చల్లటి నీళ్ళు.
    తడిచిన పైజమా లాల్చీ బన్నీ అండర్ వియర్ తీసేసి, వొళ్ళు తుడుచుకున్నాడు.
    వచ్చి బట్టలు వేసుకున్నాడు.
    సోఫాలో కూర్చున్నాడు. నుదుటిమీద పిడికిలితో నొక్కుకున్నాడు.
    ఐదు నిమిషాలు.
    బుర్రలో మెరపుతీగలా ఛక్ మని ఓ ఆలోచన వచ్చింది. తటాలున లేచి నిల్చున్నాడు. అంతలోనే కూర్చునిపోయాడు.
    ఫోను దగ్గిరికి వెళ్ళి రిసీవర్ యెత్తి డైరక్టరీలో ఓ నంబర్ చూసి తిప్పబోయి అంతలో__ఆగిపోయి వచ్చికూర్చునిపోయాడు. మళ్ళీ లేచాడు.
    తలుపు తెరిచి బయటికి అడుగులు వేశాడు.
    మెట్లు దిగుతున్నాడు.
    చెప్పుల సవ్వడి విని పనిమనిషి చూసి, ఆ వేళప్పుడు రవి కిందికి రావటం ఆశ్చర్యంగా అనిపించి, పరుగున సెక్రటరీ గదిలోకి వెళ్ళి చెప్పాడు. కునికిపాట్లు పడుతున్న సెక్రటరీ దిగ్గునలేచి. ఎదురువచ్చి "సార్" అన్నాడు.
    బయటికి వెళ్ళాలన్నట్లుగా చూశాడు రవి.
    పోర్టికోలో కారు.
    వెనకసీటు తలుపు తెరుచుకుంది. కూర్చున్నాడు. తలుపు మూసుకుంది.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.