Home » vaddera chandidas » Anukshanikam 2



    అరగంట.
    రివ్వున వీస్తున్న గాలి.
    ఆకులూ చెత్తా చెదారం ఆమె మీదకి యెగిరిపడ్డాయి. వాటిలో యేవో పదార్థాలు. తిని పారేసిన ఆకులు, గుడ్డ పీలికలు.
    మరో అరగంట.
    ఓ కుక్క పోతూ పోతూ ఆగి, చెత్తకుండీ దగ్గిరికి వెళ్ళి, కుండీకి ఒక కాలు ఆనించి వుచ్చపోసి యివతలికి అడుగులు వెయ్యబోయి, ఆ చెత్తా చెదారంలో మూతి పెట్టి వాసన చూస్తూ కెలికింది. వొక ఆకుని యేదో పదార్థముంటే నాకింది. మరింత ఆకలిగా అనిపించినట్లుంది__ఆ చెత్తా చెదారంలో అటూ యిటూ ముందు కాళ్ళతో జరిపి మూతి దూర్చి వాసన చూస్తోంది. ఇంకాస్త పక్కకి జరిగింది.
    మూతికి బట్ట చుట్టుకుంది. పళ్ళతో పట్టి లాగింది. మూతిగా గట్టిగా ఆనింది, చర్మం, గట్టిగా బొమిక.
    కండలేని ఆమె కాలు.
    పళ్ళతో నొక్కింది. వుత్త చర్మం. కండలేదు. బొవిక తగిలింది. వుత్సాహంగా పళ్ళతో బలంగా కొరికింది. వున్న కొద్ది కండా నరాలలోంచి పళ్ళు దిగి, బొవికని బలంగా నొక్కాయి పళ్ళు.
    అంతలో పక్కకి నేలమీదకి వొరిగింది కుక్క.
    కుక్క గిలగిలా కొట్టుకుంది. మూతి దుమ్ముకి అతికింది.
    కుక్క చచ్చిపోయింది కానీ రమణి యింకా బతికేవుంది__యింకో గంటో రెండు గంటలో వుండే కొన వూపిరితో.

                              124

    "యిక నేవెళ్తా డియర్" అని అంటే, ఆశ్చర్యంగా కసిగా చూసి, "అగో! ఇప్పుడే వస్తివో లేదో అప్పుడే పోతవా!" అంది గంగి అతనిమీదకి చెయ్యివేసి.
    "చాలాసేపవలే!" అన్నాడు యెర్రగా బొద్దుగా అందంగా వున్న యువకుడు.
    "యాడ? వొక్క ముద్దయిన మంచిగ పెట్టుకున్నమో లేదో!"
    "పహటా! పది పదిహేను ముద్దులు!" అన్నాడు తన పెదాలను నాలికతో తడుపుకుంటూ. వొత్తిడికి నలిగిన అతని పెదాలు, అలిసిన సౌందర్యంలా వున్నాయి.
    "ముద్దు పెట్టుకోంగనె ముచ్చట తీరిపాయెనా! కమాన్ మై స్వీట్ స్వీట్ లవ్" అని అతనిని తనకి బాగా దగ్గిరిగా లాక్కుంది.
    ఫోం పరుపు గిజగిజలాడింది.
    మళ్ళీ నాలుగైదు ముద్దులు.
    "రాజమండ్రి నుండి మా బాబా యొచ్చాడు. పొద్దుట వెళ్ళిపోతాడు. నా దగ్గిర తైలం అయిపోయింది_ ఓ నాలుగైదు వందలు పుచ్చుకోవాలి"  
    అతని బాబాయంటూ యెవరూ లేరు. నాలుగైదు వందలు ఇచ్చే చుట్టమెవరూ అందుబాటులో లేరు.
    "పొద్దుగల కద పోయేది__రాత్రికి తీస్కో" అంది గంగి.
    "రాత్రికి ఆయన యెవరింటి దగ్గిర మకాం వేసేది తెలియదు. పట్టుకోవడం సాధ్యం కాదు" అన్నాడు.
    కప్పోర్డు మీదున్న పర్స్ అందుకుని వందనోట్లు నాలుగు తీసియిచ్చి, "మీ బాబాయి ఇచ్చినాక ఇచ్చేద్దువులే" అని, "నీలాగా మాట్లాడాను కదా!" అని సంతోషంగా నవ్వింది.
    అనుకరణలా అదోలాగా అనిపించినా, "అమోఘం. అద్భుతం. అన్నిట్లోనూ నీకు నువ్వేసాటి స్వీటీ" అని ఆమె దగ్గిరికి జరిగాడు.
    సంతోషంతో పొంగిపోయి, అతని మీదకి బొక్క బోర్లా జరిగి పెదాలమీద ముద్దెట్టుకుంటూ అతనిని వూపి పక్కకి జరిగి. అతనిని తనమీదకి లాక్కుంది.
    ఆమె వొళ్ళు_
    తాగుడికీ తిండికి తిరుగుడికీ__వొళ్ళు కొవ్వు పట్టి కండలు తిరిగి_ వెనకటి వొంపులన్నీ పోయాయి. మాంసపు తుమ్మ మొద్దుమీద చిన్నపిల్లలు యెక్కి తొక్కినట్టుంది గవర్నర్ బాడీగార్డుకి ఆడవేషం కట్టినట్లనిపిస్తుంది చీకట్లో దూరం నుంచి చూస్తే. ఆ నలుపులో కాంతి అంతరించింది. బొగ్గుతనం బొంతతనం వచ్చాయి. తనంటే కుర్రాళ్ళకి ఆసక్తి కలగాలంటే యెదురు డబ్బివ్వాల్సొస్తుంది. కొందరికి వుద్యోగాలిప్పించాల్సొస్తుంది. కొందరికి తదితరమైన పనులు చేయించి పెట్టాల్సొస్తోంది.
    అరగంట.
    అతను లేచి ప్యాంటు తగిలించుకున్నాడు.
    "కూర్చో, ఇప్పుడే వస్తా" అని బాత్రూంలోకి వెళ్ళి స్నానించి వచ్చింది. వొంటికి యెర్రటి పెద్ద టర్కీటవల్ చుట్టుకుని. ఆ బొంత నలుపు మీద ఆ యెర్రదనం భయపెట్టేలాగా అనిపిస్తోంది.
    పావడా యెక్కించుకుంటూ అతనివంక చూసింది. అతను కిటికీలోంచి కిందకి పూల మొక్కల్లోకి చూస్తున్నాడు.
    తనని గమనించనందుకు నిరుత్సాహపడి "యీ టవల్ మంచిగున్నదన్నవులే, నీకు ప్రెజెంట్ చేస్త" అంది.
    ఆమె వైపు తిరిగాడు.
    సంతోషంగా అతని కళ్ళలోకి చూస్తూ__తెల్ల బ్లౌజు వేసుకుంది. ఉల్లిపొరలాంటి తెల్లచీర కట్టింది.
    ఆ నలుపుమీద ఆ తెలుపు స్వచ్చంగానూ చల్లగానూ అనిపించటంలేదు.
    ముస్తాబు బల్లముందు కూర్చుంది.
    పావుగంట.
    మెడమీద వీపుమీద పౌడరు చల్లుకుని అతనిని సహాయం చెయ్యమంది. వెళ్ళి చేత్తో పౌడర్ ని ఆమె చర్మానికి రుద్దుతున్నాడు. పౌడర్ సగం అతని అరిచేతిలో కలిసిపోయింది. మిగతా సగం ఆమె వొంటిమీద తెల్లటి పొరలా అతికింది.
    తన రెండు చేతులూ వెనక్కి వంచి అతనిచుట్టూ తిప్పి, "డియర్ మై స్వీట్ స్వీట్ డా__లింగ్" అంటోంది సంతోషంగా.
    ఆమె భుజాలు పట్టుకుని లేవదీశాడు. గిరుక్కున తిరిగి, అతనిని ముద్దెట్టుకుని, అ"అట్ల షైర్ కి పోదం. అటునుండి అటు నీవు వెళ్ళిపోదువు" అంది.
    మేడమీది ఆమె పడకగదిలోంచి బయటికి వచ్చారు. రెండో ప్రక్క రవి పడక గది.
    కారులో కూర్చున్నారు.
    నడుపుతోంది.
    గోల్కొండ కంటోన్ మెంట్ ప్రాంతం. సాయంత్రంవేళ నిర్జీవంగా వొంటరితనపు తారురోడ్లు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.