Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    బీరు చప్పరించాం ఛెడ చేదు! అయినా వదల్లేదు ఒక్కటే గ్లాసు తాగింది. తొలి తడవ కదా! ఊగిపోయాం. నేల ఊగుతున్నట్లనిపించింది. మేము ఊగుతున్నాం. అది ఒక ఆనందం కాదు. కాని, ఒక అందం అయిన అనుభూతి!
    
    పీనా నమానాహై నపిలానాహి మనాహై.
    పీనేకే బాద్ హోష్ మె ఆనాహి మనాహై
    (త్రాగడం తప్పుకాదు త్రాగించడం తప్పుకాదు.
    త్రాగి తెలివితప్పకుండడంమాత్రం శుద్దతప్పు!)
    
    ఆ రేయి కమలా నెఓ కలిసి డిగ్రీ పట్టామీద తాజమహళ్ళు - ఎర్రకోటలు నిర్మించుకున్నాం.
    
    నేను ఆర్ధికంగా ఆశించింది తక్కువ. అందువల్ల అవి గాలిమేడలు కాలేదు.
    
    నేను దాశరథి రంగాచార్య, బి.ఏ. అయినాను ఆ వ్రాత కాగితంమీద అనేకసార్లు వ్రాసాను. కొట్టివేయలేదు.
    
మహాంధ్రోదయం:
    
    తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్ల నృపులుగొలువ ఎరుగవే బాసాడి
    దేశభాషలందు తెలుగు లెస్స-
    
    అన్నవాడు - రేడు శ్రీకృష్ణరాయలు ఒక్కడు మాత్రమే సుదీర్ఘమైన తెలుగుల చరిత్రలో తెలుగు బాసను పట్టించుకున్న రేడు రాయలు -కవి పాల్కురికి మాత్రమే. తెలుగులకు తొలినుండి భాషాపరంగా అభిమానం లేదు. జాతిపరంగా ఐక్యత లేదు. మనం ఈ రెంటినీ గత తరంలో - రాజకీయ లబ్దికోసం - తమిళుల నుండి నేర్చుకున్నాం.
    
    తమిళులకు - కన్నడిగులకు భాష ఒక భగవానుడు జాతీయత ఒక దేవాలయం.
    
    తమిళులు అనాది నుంచి భాషాపరంగా స్వతంత్రులు భాషను సర్వతంత్ర స్వతంత్రంగా పెంచుకున్నారు. వారు సంస్కృతాన్ని ఆరాధించిన మాట నిజం. కాని ఆమోదించలేదు. తమిళ వైష్ణవులు తమిళంలో నాలాయిరం అనే నాలుగు వేదాలను, అష్టాదాశ రహస్యంగళ్ అనే పద్దెనిమిది పురాణాలను, పన్నిద్దరు - పన్నెండు మంది ఆళ్వారులను ఏర్పరచుకున్నారు. అలాగే శైవులు పెరియపురాణాన్నీ నాయనార్లనూ ఏర్పరచుకున్నారు. ఒక వాస్తవం అయిన భక్తి ఉద్యమం తమిళదేశంలో వెల్లివిరిసింది.
    
    అలాగే బిజ్జలుడు మున్నగువారు కన్నడంలో వీరశైవం ఏర్పరచుకున్నారు. కన్నడంలో పాల్కురికి సహితంగా - అనేక మంది కవులు అనంతం అయిన కన్నడ సాహిత్యం సృష్టించుకున్నారు. వీరశైవులు వీరావేశంలో తలపండ్లు సహితం సమర్పించుకున్నారు. తన బిడ్డను సహితం సమర్పించుకున్న శ్రీయాళుని కథ పతాకప్రాయం!
    
    తెలుగులకు - తమదిగా - ఒక మతం లేదు. తెలుగువాడయిన శ్రీమద్రామానుజా చార్యులు వైష్ణవంలో సంస్కృతం చేర్చి, విశిష్టాద్వైతం స్థాపించి, తెలుగు ప్రాంతానికి తెచ్చినారు. పాల్కురికి సోమనాథుడు మున్నగువారు కన్నడమును తెలుగు చేసి వీరశైవమును తెలుగులకు అందించినారు.
    
    తెలుగులకు నాటికి - నేటికి భాషాభిమానం - జాతీయభావం హుళక్కి ఇద్దరు తమిళులు - ఇద్దరు కన్నడిగులు - ఇద్దరు మహారాష్ట్రులు - ఇద్దరు ఏ ఇతర భాషలవాళ్ళు కలిసినా వారి భాషలోనే మాట్లాడుకుంటారు. ఇద్దరు తెలుగులు కలస్తే తమ భాషతప్ప అన్యభాషలో మాట్లాడుకుంటారు.
    
    ఆంధ్రజాతి అభిశప్తజాతి. వారు తమను తాము గుర్తించరు. పదం కాస్త పరుషం కావచ్చుగాక - పరులకు దాసోహం అంటారు. ఆంధ్రజాతికి రాజకీయం తప్ప అన్యం అర్ధం అయినట్లు కనిపించదు. నన్నయ్య - తిక్కనల భారత ఆంధ్రీకరణ సహితము రాజకీయమే!
    
    ఆంధ్రులు కాకతీయుల పాలనలో ఒకే గొడుగు కిందికి చేరడం - కుతుబ్ షాహీ - ఆసఫ్జాహీల పాలనలో ఒకే పాలన క్రిందకు రావడం కేవలం యాదృచ్చికములే. ఆ కాలంలో తెలుగు భాషగాని సంస్కృతిగాని వికసించిన జాడలు కనిపించవు.
    
    ఆంధ్రులు సంస్కృత సాహిత్య వికాసానికి చేసిన కృషి అపారం. చాణక్యుడు ఆంధ్రుడు అనుకుంటే ఆనాడు దేశసమైక్యతకు ఆంధ్రులు చేసిన సేవ అనిర్వచనీయం.
    
    ఆసఫ్జాహీల కాలంలో ఒకే పాలనా క్రింద ఉన్న తెలుగువారిని విచ్చిన్నం చేయడం ఆంగ్లేయుల విభజించు భేదనీతి రాజకీయం. 1760 ప్రాంతంలో ప్రస్తుతపు ఆంద్రప్రాంతాన్నీ - 1800లో రాయలసీమ ప్రాంతాన్నీ కబళించిన ఈస్టిండియా కంపెనీ - భారత ప్రథమ స్వాతంత్ర్యం సమర ఫలితంగా - ఆంగ్రేజు దొరలు తెలంగాణం అనే ప్రస్తుత ప్రాంతాన్ని నిజాం నవాబులకు దక్కనిచ్చారు. ఒక ఆసక్తికరం అయిన విషయం ఏమంటే - గుంటూరు ప్రాంతం ఆలస్యంగా ఆంగ్లగతం అయింది. అందుకే ప్రకాశం పంతులు ఉర్దూ నేర్చుకున్నారు.  ఉన్నవ వారి "మాలపల్లి" తెలుగులో ఉర్దూ పదాలు కనిపిస్తాయి!
    
    ఆంగ్లేయులుకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యంకోసం పోరాడడం మనకు నేర్పింది ఆంగ్లేయులే అనడం వాస్తవ సత్యం. అలాగే తమిళులకు వ్యతిరేకంగా తెలుగులను ఏకం చేసింది తమిళులే అనేది సహితం సత్యదూరం కాదు.
    
    చెన్నపట్నం తెలుగువారి నగరం. ఆంగ్రేజులు మద్రాసును రాజధాని చేశారు. దానితో ఐక్య తమిళులు మద్రాసు రాష్ట్రం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. వారు బ్రిటిషాంధ్రంలోని ప్రభుత్వోద్యోగాలను ఆక్రమించారు. వారే కళాశాలలు నిర్వహించారు. పెత్తనం చలాయించారు. కన్యాశుల్కంలో Made difficult కుప్పుస్వామి కూడా అరవ్వాడే!
    
    ఆంగ్లేయులు మానను బానిసలను చేశారు. వారు మనను అలా అనడం భావ్యమే! కాని, బానిసలయిన తమిళులు ఆంధ్రులను బానిసలుగా పరిగణించారు. ఆంధ్రులు తమ పేర్లు సహితం తమిళులను అనుకరించి పెట్టుకున్నారు. ఉదాహరణకు రాధాకృష్ణన్.
    
    తమిళుల బంధంనుండి విడివడడానికి ఆంధ్రులను ఏకం చేస్తూ ఆంద్రమహాసభ ఏర్పడింది. ఈ ఉద్యమ నాయకులూ అభివృద్ధి చెందిన ఆంధ్ర జిల్లాలవారు. ఉత్తరాంధ్రులు - రాయలసీమవారు ఆంద్రమహాసభ నాయకత్వాన్ని విశ్వసించలేదు. తమిళుల పిడికిలి విడిపించుకొని - నాయకత్వం తమ మీద పెత్తనం చేసే రాజకీయం అని ఆ ప్రాంతాలవారు భయపడ్డారు. ఆంద్రమహాసభ నాయకత్వం ఉత్తరాంధ్రలో ఆంద్ర విశ్వకళాపరిషత్తు ఏర్పరచి, ఉత్తరాంధ్రులను సంతృప్తిపరచారు.
    
    రాయలసీమీయులు - నెల్లూరు వారు తమకు ఆంద్రరాష్ట్రం వద్దన్నారు. తమవారి పెత్తనం కన్న తమిళుల పెత్తనమే నయం అనుకున్నారు. నెల్లూరులో జరిగిన ఆంద్రమహాసభల్లో ఆంద్రరాష్ట్రం అక్కరలేదని తీర్మానం చేయడానికి అధిక సంఖ్యాక ప్రతినిధులు సన్నద్ధం అయినారు. హరి సర్వోత్తమరావుగారు తమ చాకచక్యంతో ఆ ఆపద నివారించారు.
    
    రాయలసీమీయులను వప్పించడానికి కర్నూలును రాజధాని చేస్తామని - ఆంధ్రమహాసభ నాయకత్వం - శ్రీభాగ్ వప్పందం కుదిరించుకుంది.
    
    ఇదంతా ఎందుకు జరిగిందీ అంటే, తెలుగులు తెలుగువారిని నమ్మలేదు. తెలుగులు తెలుగులమీద రాజకీయం నడిపించారు.
    
    ఆంధ్రుమహాసభవారు ఆంద్రరాష్ట్రం కోరింది రాజకీయ ప్రతిపత్తికి - తమిళుల దాస్య విముక్తికి తప్ప, ఆంద్రభాషాభివృద్దికి - జాతీయభావం కల్పించడానికి మాత్రం కాదని స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఆంద్రనాయకుల కీచులాటలు, ఆంధ్రప్రదేశం ఏర్పడిన తరువాతి పరిణామాలు స్పష్టం చేస్తాయి.
    
    ఆంధ్రులను అందరినీ ఏకం చేయడానికి ఆంద్రమహాసభ ఉద్యమించలేదు. బ్రిటిషాంద్ర ప్రాంతాలతో ఆంద్రరాష్ట్రం ఏర్పరచుకోవడం మాత్రమే రాజకీయ ధ్యేయం. విశాలాంధ్ర నినాదం, విశాలాంద్ర సంకల్పం ఉభయాంధ్ర కమ్యూనిస్టులది. పుచ్చలపల్లి సుందరయ్య, 'విశాలాంద్రలో ప్రజారాజ్యం' అనే గ్రంథం - వేములపల్లి శ్రీకృష్ణ చేయెత్తి జై కొట్టు తెలుగోడా!' అనే కవిత, "తెలుగుతల్లి బిడ్డలం - తెలంగాణ వీరులం" అంటూ కాదం తొక్కిన తెలంగాణ సాయుధపోరాటం మాలాంటి యువకుల్లో విశాలాంధ్ర ఉత్సాహం ఉరకలు వేయించింది.
    
    కమ్యూనిస్టులు విశాలాంధ్ర కోరడంలో రాజకీయం లేకపోలేదు. ఆనాటి పరిస్థితుల్లో విశాలాంధ్రలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడుతుందని దేశం యావత్తు భావించింది. కేంద్రంలోని కాంగ్రెసు సర్కార్ జంకింది కూడా! అయితే, ఆంధ్రరాష్ట్రంలో రాజకీయ కల్లోల ఫలితంగా - జరిగిన మధ్యంతర ఎన్నికల్లో - స్వయం కృతాపరాధం వల్ల - కమ్యూనిస్టులు అలాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నారు.
    
    ఆంధ్రులను అవమానించడానికీ - ఆంధ్రుల హక్కు అయిన మద్రాసును హరించడానికీ - గవర్నర్ జనరల్ పదవి నిర్వహించిన చక్రవర్తి రాజగోపాలాచారి మద్రాసు రాష్ట్రానికి ప్రధాని అయినారు. అయినా కాంగ్రెస్ నాయకులూ కీచులాడుకున్నారు తప్ప ఆంధ్రులను ఏకం చేయడానికి ఉద్యమించలేదు - రాష్ట్రం సాధించడానికి ప్రయత్నించలేదు.
    
    నాయకుల పదవుల కొట్లాటకు ప్రజలు సహితం విసిగారు. అలాంటి తరుణంలో గాంధేయుడు స్వామీ సీతారాం ఆంద్రరాష్ట్రంకోసం నిరశన వ్రతం ప్రారంభించారు. తెలుగు వారిలో కొంత ఉత్సాహం - కొంత చైతన్యం కలిగింది. ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు - తన ప్రభుత్వంమీద వత్తిడి తెస్తున్నందుకు స్వామి సీతారాం మీద కోపం వచ్చింది, హుంకరించారు. వినోబాజీ సలహా మేరకు సీతారాం నిరశన విరమించారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.