Home » vaddera chandidas » Anukshanikam 2
మళ్ళీ అతని మీదకి వొరిగింది.
చూడు పిన్నమ్మ పాడు పిల్లడు పైనపైన పడత నంటడు, పడత వుంటడు__అని అనుకుంటూ, మళ్ళీ అతని మీదకి వొరిగి కొన వేళ్ళతో నోట్ల అంచు పట్టుకుని కొద్దిగా లాగింది.
మళ్ళీ వెనక్కి జరిగింది.
'చూడు పిన్నమ్మా, చూడు పిన్నమ్మా, పాడు పిల్లడు__' అనుకుంటూ అతని వీపుకి తన వక్షం ఆనేలా జరిగింది, బస్సు కదలికలో. అతని పిర్రకీ ఆమె వొడికి మధ్య పవిట పొరల పక్కనుంచి ఆమె చేతివేళ్ళు.
చూడుపిన్నమ్మ పాడుపిల్లడు__తడిక చాటు చేసుకొని తలకిస్నానం, పవిటచాటు చేసుకొని తలకి స్నానం తడికచాటు చేసుకొని నా తలకి స్నానం చేస్తవుంటే, నీ జేబు స్నానం చేస్తవుంటే__చూడు పిన్నమ్మా పాడుపిల్లడు అనుకుంటూ నోట్లబొత్తి అరిచేతిలోకి తీసుకుంది. పవిట పొరల అడుగునుంచి ఆ బొత్తి బ్లౌజు కింది అంచులోంచి, నలిగి సాగిపోయిన స్తనాల మీదకి తోసింది వేళ్ళతో.
యీసారి వక్షమూ పొట్టా అతనికి అనుకునేలా జరిగింది.
చూడు పిన్నమ్మ పాడుపిల్లడు పైనపైన పడతనంటడు పాడుపిల్లడు పైనపైన పడతనంటడు కండక్టరబ్బాయా వొక బెల్లు కొట్టు నాయనా__అని అనుకుంటూ_
బస్సు ఆగింది ఓ స్టాపులో.
వెనక్కి తిరిగి జనాన్ని చీల్చుకుంటూ క్షణంలో దిగేసింది.
బస్సు కదిలింది.
పక్క సందులోకి చకచకా నడిచింది. పవిట పొరల కిందికి చెయ్యి దూర్చి వేళ్ళు బ్లౌజులోకి దూర్చి నోట్ల బొత్తి తీసింది.
లెక్క పెట్టింది. అన్నీ పదినోట్లే. పదకొండు. ఆ బొత్తి మధ్యలో తెల్ల కాగితం మడత విప్పింది.
కందిపప్పు అరకేజీ, చింతపండు పావుకేజీ, వాము పదిగ్రాములు, ధనియాలు పావుకేజీ, పంచదార రెండు కేజీలు, కాఫీ, టూత్ పేస్ట్, పెన్సిళ్ళు, ఎక్సర్ సైజు బుక్కులు __ వంద పేజీలు మూడు, రెండొందల పేజీలు రెండు, కాశ్మీర్ బూకే పౌడర్ టిన్ను, ఐటెక్సు కుంకుం ......
పాపం బక్కగుమాస్తా. పైనేమీ గిట్టుబాటు కాని సీటు కాబోలు. పాపం __పాపమే__ యెవరి పాపానికి వాళ్ళే కర్తలు__ అనుకుంటూ నడిచింది.
నోటు బుక్కులు తప్పించి ఆ లిస్టులో సరుకులతోపాటు ఐదుకిలోలు బియ్యం కొనుక్కుని రిక్షాలో యింటికి చేరింది రమణి.
వండుకు తిండి. కట్టె పుల్లలు తెప్పించుకుంది.
ఇంకా కొద్దిగా డబ్బులున్నాయి.
రాజవ్వ వచ్చింది. కబుర్లు.
రాత్రి.
పొద్దుపోయాక రాజవ్వ మొగుడు వచ్చాడు, బాగా తాగి. పెళ్ళాంతో కాసేపు కీచులాడాడు.
మెక్కి పడుకుని వుంటాడు. రాజవ్వని హింసించుకు తింటున్నాడు, పనీపాటా లేకుండా తిరుగుతూ. తాగి వస్తాడు. తాగటానికి డబ్బులు రాజవ్వే ఇవ్వాలి పాపం__అనుకుంది రమణి.
యెప్పుడో నిద్రపట్టింది.
వుదయం బాగా పొద్దెక్కాక లేచింది.
రాత్రి కడుపునిండా తిన్నా సత్తువగా లేదు. లేవలేక అలాగే పడుకుంది. లోన మాత్రం ఆరాటంగానే వుంది.
పన్నెండింటికి లేచి అన్నం ఉడకేసుకుని ఉప్పూ నీళ్ళూ కలుపుకుని తిండి.
పడుకుంది. మగత.
వొళ్ళు__లోన పచ్చిపుండులా కురుపులా నొప్పి, మంట, రసి__లోలోన ఆరాటం.
ఇంకోరోజు, ఇంకోరోజు__మరింత క్షీణత.
లేచి అన్నం కూడా ఉడకేసుకునే ఓపికగా అనిపించక__అలాగే పడుకుంది మగతగా.
లేచింది. టీ తాగాలనిపించింది. టీ పొడి లేదు. కాఫీ కాచుకుని తాగింది.
పడుకుంది, మగత నిద్ర.
రాత్రి అయింది. ఇంకా మగత నిద్రే.
పది గంటలు.
ఆకలిగా వుంది. కానీ యేమీ తినాలనిపించటం లేదు.
చుట్టూ కలియజూసింది. పౌడరు, స్నో, తిలకం, దువ్వెన ముక్క, కాటుక, వంట సరుకుల తెరిచిన పొట్లాలు. మట్టి పాత్రలు__వొకటి మొన్న పగిలిపోగా యింకా మూడు వున్నాయి.
ఆ పాత్ర చూస్తే, తన చిన్నప్పుడు పాలకుండ గుర్తొచ్చింది__దాన్లో చల్ల చిలికేది వాళ్ళమ్మ.
కళ్ళలో నీళ్ళ తడి.
చిన్నగా నవ్వుకుంది.
లేచి కూర్చుని పౌడర్ చేతినిండా పోసుకుని ముఖానికి పూసుకుని అద్దంలో చూసుకుంది. ముఖం కనిపించలేదు. తెల్లగా పౌడరు.
చిన్నగా నవ్వుకుని పవిటతో తుడుచుకుంది.
కళ్ళకి కాటుక పెట్టుకుంది. నుదుట తిలకం బొట్టు పెట్టుకుంది.
వెల్లకిలా పడుకుంది.
రెండు నిమిషాలు.
పక్కకి తిరిగి మునగదీసుకుని, తొడల మధ్య చేతులు పెట్టుకుని పడుకుంది.
పిడికిలితో పైకి నొక్కింది. పిడికిలి విప్పి రెండు వేళ్ళు చీర పొరల్లోంచి గుచ్చింది.
కళ్ళలో నీళ్ళు.
టీ తాగాలనిపించింది.
టీ పొడి లేదు. కాఫీ పొడి వుంది. యీసారి కాఫీ తాగదలచలేదు. టీయే తాగాలనిపించింది. దగ్గిర్లోనే టీ బంకు వుంది.
ఓపిక కూడదీసుకుని లేచింది.
నడుస్తోంది__తడబడుతున్న అడుగులతో.
రాత్రి పన్నెండున్నర.
నడుస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి.
మరో అడుగు. మరో అడుగు.
పడిపోయింది నేలమీదకి. పక్కన చెత్తకుండీ__ సిమెంటుది. నిండిపోయి, దాని చుట్టూతా చెత్తాచెదారం పోగులు.
స్పృహలేదు.



