Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    "రక్తపు సీసా వంద. వంద ఇవ్వండి" అన్నాడు డాక్టరు. నాకు డాక్టరు మీద అపరిమితం అయిన కోపం వచ్చింది. అప్పుడు కోపంతో కాదు - డబ్బుతో ప్రయోజనం! వంద చెల్లించాను. అయిదో దశకంలో వంద విలువ చాల ఎక్కువ. ప్రభుత్వం రూపాయి విలువను యాభయిలతో పోల్చలేక ఎనభయిలతో పోల్చుతున్నది.
    
    ఇంతకూ ఆ డాక్టరు దగ్గర రక్తం విలువలేదు. అప్పుడు అతను ఒక రిక్షా అతన్ని పిలిపించాడు. అతని రక్తం సీసాలో నింపి - దానిని కమలకు ఎక్కించారు. ఒక సీసా రక్తం ఎక్కింతరువాత కమలకు స్పృహ వచ్చింది. మమ్ములను ఆమెను చూడడానికి అనుమతించారు.
    
    నేను కమలను చూచాను. కమల - అప్పుడప్పుడే- ప్రాణం పోసుకుంటున్నట్లున్నది. కష్టంగా అడిగింది-
    
    "ఏదండీ మన బిడ్డ? వీండ్లు ఏమీ చెప్పరు."
    
    నా గుండె అవిసిపోయింది. దుఃఖం తరంగాలుగా పొంగింది. ఏమని చెప్పటం? చచ్చిన బిడ్డను మూటకట్టి హోటలు గదిలో ఉంచామనా?
    
    "ఉన్నదమ్మా, ఉన్నది నీకు పూర్తిగ తెలివి రానివ్వు, తీసుకొస్త" పరంజ్యోతి జవాబు చెప్పింది. కాని నా దుఃఖం ఆగలేదు. గది బయటకు వచ్చి పెద్దగా ఏడ్చాను.
    
    మరొక సీసా రక్తం అవసరం అయింది. మరొక వంద ఇచ్చాం. మరొక రిక్షా అతను వచ్చాడు. అయితే మనసును కదిలించిన విషయం ఏమంటే - 'నా రక్తంతో బతికిన అమ్మ ఈమేనా?' అని అడిగి సంతృప్తిగా చూచిపోయిన తొలి రిక్షా అతను. డాక్టరులో లేని 'మానవత' రిక్షా అతని కన్నుల్లో నాకు గూడు కట్టుకుని దర్శనం ఇచ్చింది.
    
    వ్యాపారం మానవత ప్రాణం తీస్తుంది.
    
    కమల కోలుకుంటున్నది. హోటలు గదిలోని బిడ్డమూటను ఏం చేయాలి? బిడ్డ పుట్టి చచ్చిందనో, చచ్చి పుట్టిందనో చెప్పుకోలేని దుస్థితి కన్నబిడ్డను కనీసం ఖననం చేసుకోలేని కడుహీనస్థితి.
    
    భగవంతుడు మానవ రూపంలో వచ్చినట్లు - శ్రీనివాసాచార్యులు మూట తీసుకొని రిక్షా ఎక్కాడు. నన్ను ఎక్కించుకున్నాడు. లాకుల దగ్గర రిక్షా దిగాం. రాత్రిపూట అప్పుడు అక్కడ అంత జనసంచారం ఉండేది కాదు. మూట తీసుకుని కృష్ణవడ్డున చాల దూరం నడిచాం.
    
    "రంగన్నా! నీవు దుఃఖం దిగమింగు. మూట కృష్ణలో వేస్త" గొంతు పెకలకపోయినా శ్రీనివాసాచార్యులు అన్నాడు.
    
    "నేను ఇంకా బ్రతికి ఉన్నాను. దిక్కులేని బిడ్డను చేసి ఏట్లో వేస్తావా?" అని మూటను పట్టుకున్నాను.
    
    "మళ్ళీ ఎవరయినా చూస్తారు" అని మూట లాక్కుని శ్రీనివాస్ - నేను చూస్తుండగానే - కృష్ణలో విసిరాడు.
    
    నేను నేలమీద కూలబడ్డాను.
    
    నెత్తికొట్టుకొని ఏడ్చాను.
    
    ఏమీ చేయలేనపుడు మనిషి ఏడుస్తాడు!
    
    మూడో వంద - మూడో తులం బంగారం - మూడో రిక్షా అతని - మూడో సీసారక్తం ఇచ్చింతరవాత - కమల మానసికంగా కృంగిపోయినా - శారీరకంగా కోలుకుంది.
    
    కమలను తీసుకుని డోర్నకల్లు చేరుకున్నాం. మా అత్తగారు ఉదయను పట్టుకొని మా కోసం ఎదురు చూస్తున్నది. మేము గడపలో అడుగుపెట్టాం.
    
    "తమ్ముణ్ణి తెస్తానన్నారు, ఏడీ?" అని అడిగింది ఉదయ.
    
    కమల కూలబడి ఎలుగెత్తి ఏడ్చింది.
    
    నేను దొడ్లో బావిమీద కూర్చొని విలపించాను.
    
    మా ఉభయుల శారీరక మానసిక ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. నాకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. B.A పట్టా పొందాలని పట్టుదల రాత్రింబవళ్ళు - అనారోగ్యంతో నిద్రాహారాలు మాని చదువుతున్నాను. కడుపులో మంట, వాంతులు అయినా లెక్క చేయడం లేదు. B.A అనిపించుకోవాలి. అదొక స్థిరసంకల్పం ఒక తపస్సు తపస్సుకు నిద్రాహారాలు ఉండవు!
    
    తొలి నుంచీ ఉస్మానియా యూనివర్శిటీ కేంపస్ లో కొన్నాళ్లుండాలనీ - ఆర్ట్స్ కాలేజీలో పరీక్ష వ్రాయాలనీ ఒక ఆకాంక్ష ఒక సంకల్పం ఒక స్వప్నం, అలాగే కొన్ని రోజులు ముందు హాస్టలు చేరుకున్నాను. ఒక మిత్రుని గదిలో ఉన్నాను. హాస్టలు తిండి - అనారోగ్యం - నిరంతర స్వాధ్యాయం, సరదాగా లేదు. అయినా హాస్టలు - కొందరు సహాధ్యాయులు - ప్రశాంతం అయి, విశాలం అయిన విడి స్థలం పార్కు -బాగానే ఉన్నాయి. బాగుండడం కాదు శ్రద్దకావాలి. "శ్రద్దావాన్ లభతే జ్ఞానం" అంటాడు కృష్ణపరమాత్మ గీతలో.
    
    ఈ లోకంలో - కాలంలో ఏదీ నిలిచేది లేదు. అంతా నిరంతరం సాగేదే సర్వం గడిచిపోయేదే. కాలానికి కళ్ళు లేవు. అయినా అన్నింటినీ పొట్టనపెట్టుకుంటుంది. సాగిపోతూనే ఉంటుంది. ఆగదు.
    
    పరీక్ష తొలిరోజు రానే వచ్చింది. నేను చాల ఉత్సాహంగా - ఆర్ట్స్ కాలేజీలో -పరీక్షకోసం ప్రవేశించినాను. ఆ మహోన్నత భవనంలో కూర్చుంటే విద్యాదేవి ఒడిలో కూర్చున్నట్లనిపించింది. వాస్తవంగా ఆ నిర్మాణం -నిజాంరాజు చేసినా -మెచ్చుకోదగింది. ఆ భవనం ఒక దర్జా - ఒక ఠీవి - ఒక ఔన్నత్యం - ఒక గాంభీర్యం సంతరించుకున్నది. అది చదువుల తల్లి నిలయంగా కనిపిస్తుంది. ఆ భవనంలో సగర్వంగా బి.ఏ. పరీక్షలు వ్రాస్తున్నాను.
    
    అనారోగ్యం మరచాను. పరిసరాలు మరచాను. పరిస్థితులు మరచాను. నిరంతర అధ్యయనం పరీక్ష వ్రాయడం. పరీక్షలు అయిపోయాయి. బాగానే వ్రాశాననిపించింది. కేంపస్ వదిలి వెళ్తుంటే - కణ్వాశ్రమం వాదులుతున్న శకుంతల వలె అనిపించింది. పరీక్ష ఫలితాల్లో ఇంగ్లీషు పోయింది. సప్లిమెంటరీ - 1956 సెప్టెంబరులో మళ్ళీ ఇంగ్లీషు పరీక్ష వ్రాశాను. సెకండ్ క్లాసులో ఉత్తీర్ణున్ని అయిన్నాటి నా ఆనందం వర్ణనాతీతం! తపస్సు చేసినవానికి భగవానుడు ప్రత్యక్షం అయినట్టూ - దుర్గమారణ్య ప్రయాణంలో మానవుని దర్శనం అయినట్లూ - ఎడారి యానంలో ఒయాసిస్సు చేరుకున్నట్లూ అనిపించింది!

 

                                  


    
    ఆ రోజుల్లో - తెలంగాణలో - బి.ఎ. సామాన్యం కాదు. నా నిరంతర స్వాధ్యాయం సామాన్యం కాదు! ఏ ఒక్క అధ్యాపకుని సాయం లేక - పుస్తకాలే గురువులుగా - అక్షరాల నుంచి పట్టందాకా - సంసార సాగరాన్ని ఈదుతూ నెట్టుకు రాగలిగాను!
    
    అవును ఇంత సంతోషం - ఇంత సంబరం - ఇంత ఆనందం అనుభవించడం వ్యక్తం చేయడం ఎలా? కమలా నేనూ కలిసి ఉక్కిరి బిక్కిరి అయినాం. ఆనందం గాని - దుఃఖంగాని - ఏదీగాని వంటరిగా అనుభవించలేం.
    
    శ్రీనివాసాచార్యులు - శివలింగం - నేను మూడురూపాయీల పావలాకు ఒక బీరుసీసా తెచ్చాం. ఇంటి పెరట్లో - వెన్నెట్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నాం. బీరు మూడు గ్లాసుల్లో పోసుకున్నాం. అది తీయగా ఉంటుందని మా భావన! కేప్స్టన్ సిగరెట్లు వెలిగించాం. చీర్స్ అనడం సహితం తెలియదు.
    
    మనసుల్లో ఆనందం.
    
    వెన్నెల - పాటలూ - పరుచుకుంది.
    
    కేప్ట్సెన్ సిగరెట్టు పొగమబ్బులు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.