Home » vaddera chandidas » Anukshanikam 2
నొప్పి, బాధ రాపిడి, మంట, రసి__
అతనిని కవ్వించి రెచ్చగొట్టి, మళ్ళీ మళ్ళీ వొకటీ రెండూ మూడూ నాలుగు__సారు.
తెల్లవారుజాము లేవలేకపోయింది. వొళ్ళు కూడా పచ్చిపుండులా అనిపిస్తోంది.
అతను నిద్రపోతున్నాడు.
రాత్రంతా గుర్తొచ్చింది. వుండబట్టలేక అతని సరసన చేరి కావిలించుకుని కాళ్ళు బిగించింది. బిచ్చగాడు స్పృహలేకుండా పడివున్నాడు.
పదిహేను రోజులైంది గుడిశలోంచి కదిలి. వొళ్ళు చాపకి అంటుకునిపోయింది. కానీ లోలోన ఆరాటం.
ఒంటిగంటకు రాజవ్వ, పిల్లాడికి బ్యాండేజీలు వేయించి తీసుకొచ్చింది పిల్లాణ్ణి రమణి గుడిశలోకి తీసుకొచ్చి చాపమీద పడుకోబెట్టి, "మలాము రాసి కట్లు కట్టిన్రు. వాండ్లే గోలీలిచ్చిన్రు. ఇది రాసిచ్చిన్రు వాళ్ళ తావలేదని. కొంటి, రెండు రూపాయలాయె. దేవతల్లే సాయపడ్తివి. చచ్చి నీ కడుపున పుడ్త. నా పిల్లగాని పానం కాపాడ్తివి జరంత చూస్తుంటవా? గిర్నికి పోత సగం దినం పైసలొస్తవి" అంది రాజవ్వ.
"అట్లానే. పోయిరా రాజవ్వా" అంది రమణి.
రాజవ్వ వెళ్ళింది.
పిల్లాడు నిద్రపోయాడు. నిద్రలో దగ్గిరికి జరిగాడు. తన వొళ్ళు పిల్లాడికి అంటకుండా దూరంగా జరిగింది.
అరగంటకి లేచాడు. మంచినీళ్ళు అడిగాడు.
కుండలోంచి చిన్న ముంతతో నీళ్ళు ముంచి తీసింది. ఇవ్వబోతూ ఆగిపోయింది.
ఇంట్లో మరో ముంతలేదు తను తాగే ముంతతో తాగిస్తే పసివాడికి అని భయపడి, బయటికి వెళ్ళి రాజవ్వ గుడిశలోకి వెళ్ళబోతే తడిక గొళ్ళెంకి తాళం నొక్కివుంది.
అటు నాలుగడుగులు నడిచి, ఓ చెట్టు ఆకు__పెద్దది తుంపుకొచ్చింది. దాంతో నీళ్ళు తాగించింది పిల్లాడికి.
పిల్లాడు బాధగా మూలుగుతున్నాడు.
మందులు తీసి చూసింది. పెయిన్ రిలీవింగ్ తుంపు వొకటుంది. కొస చించి మాత్ర తీసి ఆకులో నీళ్ళు తెచ్చి మాత్ర నోట్లోవేసి నీళ్ళు తాగించింది.
కబుర్లు చెబుతూ కూర్చుంది.
అరగంటకి పిల్లాడు కబుర్లు చెబుతున్నాడు. నొప్పి తగ్గింది. ఓరెండు మూడు గంటలు నొప్పి వుండదు. రిక్షా తనకి కొట్టుకోవటం సంగతీ, తనతోటి పిల్లల సంగతులు చెబుతున్నాడు.
నాలుగింటికే రాజవ్వ వచ్చింది.
"పిల్లగాని కెట్లున్నదో అని గిర్నాయనకు చెప్పి జెల్దీ వచ్చేస్తి." అంది రాజవ్వ.
పిల్లాడు చక్కగా కబుర్లు చెబుతూండటం చూసి స్థిమితపడి రమణిని "పుణ్యాత్మురాలివమ్మా" అని మెచ్చుకుని పిల్లాణ్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది.
రమణి లేచి నీళ్ళతో ముఖం కడుక్కుంది. అంత సులభంగా చిరిగే అవకాశం లేని పాత నైలాన్ చీర. రంగు వెలిసి మాసినట్లుగా వుంది. విప్పి దులుపుతోంది. మురికి వోడుతున్న లోపావడా. చీర దులిపి, వొకటి రెండు చోట్ల దుమ్ము మరికలు కనిపించి వేళ్ళతో తుడిచింది పూర్తిగా పోకపోతే వుమ్మి తడిచేసి తుడిచింది. దుమ్ము మరక కనిపించటంలేదు. తడి మరక కనిపిస్తోంది.
దువ్వెన ముక్కతో తలదువ్వుకుంది. పౌడరు __ అడుగుకొచ్చి చిల్లులోంచి పడకపోతే కొన్నిరోజుల క్రితం డబ్బా మధ్యలో పగలగొట్టి వేళ్ళ కొసతో తీసి రాసుకుంది. వుత్తరేకు మిగలగా ఒకమూలకి విసిరింది.
దృష్టి పొయ్యిమీద పడి__ పొయ్యి ముందు కూర్చుని పొయ్యిలోంచి మేలిరకం బూడిద వేళ్ళతో తీసి యెడమ అరిచేతులో వేసుకుని వచ్చి అడ్డం పెంకులో చూసుకుంటూ ముఖానికి రాసుకుంది.
చెప్పులు__ యెప్పుడో యెక్కడో అనుకోకుండా అవి తన పాదాలకి వచ్చాయి. పల్లెటూళ్ళో కుట్టిన ఆకు చెప్పులు. నైలాన్ బట్టలాగే ఆ తోలు వొక పట్టాన చిరగదు. మాసిపోయి వున్నాయి. పాత బట్ట పీలికతో దులిపి తొడుక్కుంది. తడిక దగ్గిరికి లాగి__వీథిలో నడుస్తోంది.
ఐదు గంటలు.
నడుస్తోంది.
షామ్ థియేటర్. యె.జీ.ఆఫీసు__సెక్రటేరియట్ ముందు నిలుచుంది.
ఐదున్నర. ఆఫీసుల జనం. రద్దీ. తొందర.
ఓ బస్సులోకి చొరబడింది. ఆమె దగ్గిర పదిపైసల బిళ్ళకూడా లేదు.
నుంచుంది. ముందు, వెనక, ప్రక్కల జనం. సీట్లలో కూర్చున్న జనం స్థిమితంగా బయటికి చూస్తున్నారు.
బస్సు కదిలింది.
రెండు నిమిషాలు. కండక్టరొచ్చాడు __ టిక్కెట్లు యిస్తూ.
"దేర్, మై హబ్బీ విల్ టేక్" అంది.
"సీట్లో కూర్చుని ఆరోజు దినపత్రిక చూస్తున్న వొకతను __కిస్సా కుర్సీకా కేసు, సంజయ్ గాంధీని అరెస్టుచేసి తీహార్ జైల్లో పెట్టటం_వార్త. పైకి చదువుతున్నాడు. నలుగురూ అదే చర్చిస్తున్నారు తలో రకంగా. బస్సంతా అలజడితో నిండిపోయింది.
కండక్టరు టిక్కెట్లు యిస్తూ జనాన్ని చీల్చుకుంటూ ముందుకి సాగిపోతున్నాడు.
రమణి ముందు ఓ నలభయ్యేళ్ళతను ప్యాంటు. దాన్లోకి దూర్చిన షర్ట్.
బస్సు కదుపుకి రమణి అతని వీపుకి తగిలింది. తల రవ్వంత పక్కకి తిప్పితే చీరపొర కనిపించి పరవశించిపోయాడు. ఇంక తల పక్కకి తిప్పకుండానే వెనక్కి చూస్తున్నాడు బుర్రలోంచి.
గమనించింది.
హిప్ పోకెట్ లోంచి పది రూపాయల నోట్ల బొత్తి అంచు బయటకి కనిపిస్తోంది.
రమణికి __ సాధికారంగా తప్ప దొంగతనంగా తీసుకోవటం అలవాటు లేదు ఇంతవరకు.
బస్సు కదలికలో అన్నట్లుగా అతనిమీద వాలి, మళ్ళీ వెనక్కి సర్దుకుంది.
అతని కళ్ళు అతని సూడులోకీ వీపులోకీ చొరబడాలని యత్నిస్తున్నాయి.



