Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    మా బిడ్డను దక్కించుకోలేకపోయామే అని మా గుండెలు నిండిపోయాయి! ఇంటికి వచ్చి ఏడ్చాం.
    
    టాను చచ్చేదాకా డాక్టర్ రాధాకృష్ణ నమ్మలేదు. చూచి చకితుడు అయినాడు!
    
    దీన్నే 'యోగం' అంటాం యోగం అంటే కలిసి రావటం ఇది వేదాంతం కాదు. పరిస్థితుల ప్రభావం కలిసి రావడం అంటే ఈ సంఘటనకు సంబంధించినంతవరకు ఇలా ఉంటుంది: 1. నేను వెళ్ళి చూడ్డం, 2. డాక్టరుకు చూపించడం, 3. సమయానికి ఆదినారాయణగారు రావడం, 4. నేను వారితో ప్రస్తావించడం, 5. వారికి ఆకు తెలియడం, 6. ఆకు లభించడం, 7. ఆకు వాడడం - ఇన్ని కలిసి వచ్చిన యోగంవల్ల బిడ్డ బతికింది. వీటిలో ఏ ఒక్కటి లోపించినా ఫలితం దక్కేది కాదు.
    
    అంతేకాక, బిడ్డకు ఆయుర్దాయం ఉంది. ఆయుర్దాయం సైతం ఆకాశం నుంచి వచ్చింది కాదు. మనం ఒక పదార్ధం కావాలనుకుంటాం. అది లేనే లేనప్పుడు మనవద్ద ఎంత సంపద ఉన్నా ప్రయోజనం శూన్యం ఒక్క ఆయుర్దాయమే కాదు, విద్య - వివేకం - రూపం - గుణం అన్నీ అలాంటివే! వాటి మూలం ఉంటే అభ్యసించి అభివృద్ధి చేయగలం.
    
    ఆకు - అలం మున్నగువానిలో అనంత శక్తులున్నాయి వాటిని గుర్తించాలి. మనం రోజూ వినియోగించే ఉల్లిగడ్డలు - వెల్లిపాయలు - మెంతులు వంటివాటిలో గొప్ప శక్తులు ఉన్నాయని పరిశోధనలు వెలడిస్తున్నాయి. ఎన్నో పరిశోధనలు చేసింతరువాతే మన పూర్వులు అలాంటి ఓషధులను ఆహారంలో భాగంగా మనకు విధించారు. అయితే, మనం ఎంత 'పరాయీకరణం' అయినామంటే, ఆ మాట పాశ్చాత్యులు చెప్పితేనే మనం నమ్ముతున్నాం!
    
సారస్వత ఆపేక్ష:
    
    నిజాం - మీర్ ఉస్మాన్ - తెలంగాణలోని తెలుగువారి వేష-భాషలను అంతం చేయడానికి పూనుకున్నాడు. తమ భాషాసంస్కృతులను రక్షించుకోవడానికి కాపాడుకోవడానికి రాతిమీద ఈదవలసి వచ్చింది. శేషాద్రి రమణ కవులు, ఆదిరాజు వీరభద్రరావు మున్నగు పరిశోధనాధురంధరులు తెలుగుల చరిత్రను వెలికి తీయడానికి తమ జీవితాలను దీపాలవలె కరిగించుకున్నారు.
    
    నిజాం 'ఉర్దూకరణ'ను అడ్డుకొనడానికి నాలుగవ దశకంలో ఏర్పడింది ఆంధ్ర సారస్వత పరిషత్తు నిబిడాంధకారంలో తెలుగు దివ్వె వెలిగించిన సంస్థ అది. దానికి నారు-నీరు పోసి పెంచినవారు దేవులపల్లి రామానుజరావుగారు. వారు నిత్యకృషీవలురు. మర్రిగింజ వంటి సంస్థను మహావృక్షం చేసిన యోగి పుంగవులు. వారు నిజాం రక్కసి కల్పించిన నిబిడాంధకారంలో "సారస్వత పరిషత్తు పరీక్షలు" అనే జ్యోతిని వెలిగించారు. పోలీసు చర్య తరువాత 'సారస్వత పరిషత్తు సర్టిఫికేట్లు' అనేకమంది జీవికకు సహితం ఉపయోగపడినాయి.
    
    తెలుగు అభిమానిగా నేను డోర్నకల్లులో "ఆంద్ర సారస్వత పరిషత్తు పరీక్షా కేంద్రం" ఏర్పాటు చేయించాను. యువకులను - యువకులను ప్రోత్సాహపరిచాను.
    
    వారి కొరకు ఉచిత తరగతులు నిర్వహించాను. నేను అక్కడ ఉన్నంత వరకు పరీక్షలను నిర్వహించాను. వాటిలో అనేకమంది ఉత్తీర్ణులు అయినారు. ప్రయోజనం పొందారు.
    
    నాకు వాటివల్ల ఎలాంటి ప్రయోజనం లేకున్నా - ఆంద్ర సారస్వత పరిషత్తును గౌరవించడానికి మాత్రమే - పరీక్షలు వ్రాశాను. సగర్వంగా ఆ సర్టిఫికేట్లను భద్రపరచుకున్నాను.
    
దైవోపహతులు:
    
    "దైవోపహతుండు పోవు కడకుంబోవుంగదా ఆపదల్" అన్నాడు ఏనుగు లక్ష్మణ కవి - భర్త్రుహరి ఆంధ్రీకర్త ఆపదలు నన్ను వెదుక్కుంటూ వస్తాయి. వాటికి నేనంటే వలపు. విడాకుల వ్యవహారం వాటికి తెలియదు.
    
    ఆపదలు అందరి జీవితాల్లోనూ భాగమే! అయితే కొందరికి ఎక్కువ - కొందరికి తక్కువ. ఆపదలు ఎక్కువ మందిని - సంపదలు తక్కువ మందిని వరిస్తాయి! సంపదలను సహితం ఆపదలు వదలవు. అంటే, జీవితానికి సంపదలను మించిన భాగస్వాములు ఆపదలే అవుతాయి.
    
    నన్ను ఆపదలు - అతి ఇష్టంగా -వరించిన మాట వాస్తవ సత్యం. అయితే భగవదనుగ్రహం - మిత్రుల సాయం అనే సూర్యుడు ఆపదల అంధకారాన్ని ఆపదల మంచును కరిగిస్తారు. భగవదనుగ్రహం ఏలనయా అన్న మిత్రులు లభించుటయే భగవదనుగ్రహము. మిత్రలాభమును గురించి విష్ణుశర్మ పంచతంత్రమున వివరించియున్నాడు.
    
    వివరణ వదిలెదను. వాస్తవము వివరింతును.
    
    కమల - మళ్ళీ - గర్భవతి ఆర్ధిక దారిద్ర్యం కన్న నరకం మేలు అంటుంది పంచతంత్రం అది అక్షరాల నిజం. కమలను బస్తీల ఆస్పత్రులకు చేర్చి కాన్పు చేయించే స్తోమత లేదు. అంతేకాక, ఆరోజుల్లో ఇళ్ళ దగ్గరనే కాన్పులు జరిగేవి. అత్తగారిని పిలిపించాను. ఒక నర్సును కాన్పు చేయడానికి ఏర్పాటు చేశారు.
    
    కమలకు నెలలు నిండాయి. ఒకనాటి సాయంత్రం రక్తస్రావం ప్రారంభం అయింది. నర్సు వచ్చింది. ఆమెకు తెలిసినంత చేసింది. తెలిసిన వైద్యులూ సహకరించారు. అయినా తగ్గలేదు.
    
    అది కాళరాత్రి. కరాళరాత్రి. నా ప్రాణాలు విలవిలలాడుతున్నాయి. కవిత అనుభవం ఇంకా మరుగున పడలేదు. కమలకు ప్రాణాలమీదికి వస్తున్నది. కవిత పోయింది! కమల మిగలకుంటే!! ఆ రాత్రి కత్తులమీద - నిప్పులమీద నడిచాను. నిద్రరాదు. ఆపదల కొండలు నెత్తిన కూలుతున్నాయి!!!
    
    అందరి ప్రయత్నాలూ నిష్క్రయోజనములు అయినాయి చేతులు జోడించి ఆకాశానికి మొక్కుతూ కూర్చున్నాం. సర్వప్రయత్నాలూ విఫలం అయినాయి. కమల ఆయుర్దాయం అతివేగంగా కరిగిపోతున్నది. అలాంటప్పుడు ప్రార్ధన వినా గత్యంతరం లేదు.
    
    మానవుడు ఎంత నిస్సహాయుదో అర్దమైన గడియ అది. నా నొసటి వ్రాతను వెక్కిరిస్తూ సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు బయటి చీకట్లను మాత్రమే విడగొట్టగలడు! ఒక మిత్రుడు పిలపించగా మరొక మిత్రుడు డాక్టర్ లక్ష్మీపతి మానుకోటనుంచి దిగాడు. పరీక్షించాడు, పెదవి విరిచాడు. "మీరు నన్ను ఇంతకు ముందు పిలిపించాల్సింది. రక్తం సాంతం పోయింది. బెజవాడ తీసికెళ్ళి రక్తం ఎక్కించాలి. అక్కడిదాకా చేరగలుగుతే దక్కవచ్చు. నా నర్సును వెంటపంపుతా" అన్నాడు.
    
    నా గుండెలో బండపడింది. హృదయంచలనం నిలిచినట్లయింది. బెజవాడ వెళ్ళాలి. రక్తం కొనాలి. డబ్బులేదు. ఉదయను వదిలివెళ్ళాలా? తీసికెళ్ళాలా? అసలు నేను వెళ్ళగలనా? రైల్లోనే ఏమైనా జరుగుతే? నా మీదినుంచి రైళ్ళు నిరంతరం శరవేగంతో పరుగులు తీస్తున్నాయి.
    
    ఒక మిత్రునికి కమల నగలు వలిచి ఇచ్చింది. అతడు తాకట్టుపెట్టి డబ్బు తెచ్చాడు.
    
    ఒక మిత్రుడు బండి కట్టి తెచ్చాడు. రైల్వే మిత్రులు సగం పెట్టె - ఆ రోజుల్లో ఉండేవి - మా కోసం ప్రత్యేకించి, మమ్ములను ఎక్కించారు.
    
    వెంట ముడుంబ శ్రీనివాసాచార్యులు - కాంపౌండర్ వేంకటాచార్యులు - నర్సు పరంజ్యోతి ఆపద్భాందవుల్లా ఉన్నారు.
    
    ఆ రోజుల్లో బండ్లన్నీ పాసింజర్లే. సింగిల్ ట్రాక్. ప్రతి స్టేషనులో ఆగాలి. క్రాసింగులు. నాకేమో అది పుష్కకం కావాలని! మనసు పరిపరి విధాల పరుగులు పెడ్తున్నది కన్నీటి పచ్చికుండ నెత్తిమీద ఉంది. కదిలిస్తే విచ్చుకునేట్లుంది. స్థైర్యం కలిగించే మిత్రులుండడం కొండంత అండ.

    మార్గమధ్యంలో - బోనకల్లు ప్రాంతంలో - కమల మృతశిశువును ప్రసవించింది. స్పృహ కోల్పోయింది మగ బిడ్డ ముద్దుగా ఉన్నాడు. పచ్చికుండ విచ్చుకుంది. బిడ్డను - నా కనుల ముందే సంచీలో - వస్తువులా కట్టారు. ప్రసవించి ప్రయాణం చేయరాదట! రైల్వేవాళ్ళు దింపేస్తారట! రూల్సుకు గుండెలుండవు. ప్రయాణించే రైల్వే సిబ్బంది మిత్రులు కాబట్టి సరిపోయింది.
    
    నేను అనుభవించిన యాతనకు భాష చాలదు. బండి బెజవాడ చేరింది. స్పృహలేని కమలను స్ట్రెచరు - తరువాత గుర్రబ్బండిలో గవర్నరు పేటలోని - డాక్టరు లక్ష్మీపతి చెప్పిన - నర్సింగ్ హోంకు చేర్చాం. డాక్టరుకు లేఖ అందించాను.
    
    వృత్తిరీత్యా డాక్టర్లు హృదయం ఇంట్లో పదిలపరచివస్తారు!
    
    "డెలివరీ అయి డెడ్ బేబీ అయితే మేము అడ్మిట్ చేసుకోం."
    
    ప్రాణం పోయాల్సిన డాక్టరు ప్రాణంలేని యంత్రంలా మాట్లాడుతున్నాడు! సాధించడం తప్ప అర్ధించడం నాకు చేతకాదు. నాలో ఉక్రోషం ఉప్పొంగుతున్నది. ఇది సమర సమయం కాదు అనే జ్ఞానంలేక ఆయత్తం అవుతున్నాను. కాంపౌండరు వేంకటాచార్యులు గమనించారు. నన్ను మాట్లాడనివ్వలేదు. డెలివరీ అయినట్టు చెప్పబోమనీ, మృతశిశువును లోనికి తేమనీ చెప్పింతరువాత కమలను అడ్మిట్ చేసుకున్నాడు డాక్టరు.
    
    హోటల్లో రూం అద్దెకు తీసుకుని, మృతశిశువు మూటను అక్కడపెట్టి వచ్చాడు శ్రీనివాసాచార్యులు!
    
    కమలకు స్పృహలేదు. తండ్రిగా నేను విలవిలలాడినతీరు చెప్పరానిది!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.