Home » vaddera chandidas » Anukshanikam 2



    మట్టిరోడ్డు. నడుస్తున్నాడు.
    బీడు భూమి. నడుస్తున్నాడు కాలిబాటన.
    నడుస్తున్నాడు, దారిలేని దారిలో.
    ఈ చీకటిలోంచి మహా మోహ మొహాన మౌన నిష్క్రమణ.

                             123

    మగతగా పట్టిన నిద్రలోంచి లేచి, అటూ యిటూ చాపమీద నీరసంగా కదిలింది రమణి.
    చిరిగిన పాత చాప, తల కింద దిండులాగా పాత గోనెసంచి చుట్ట. నాలుగైదు మట్టిపాత్రలు తెడ్డులాగా వాడుతున్న వొక కర్ర పుల్ల. మూడు చిన్న రాళ్ళతో అమర్చిన పొయ్యి. పొయ్యిలో బూడిద. పక్కన పుల్లల కంప, చితుకులు.
    బయటి నుంచి ఏడుపు వినిపించి లేచి బయటికొచ్చి చూసి, "ఏం రాజవ్వ? ఏమాయె పిల్లగానికి?" అంది రమణి.
    పిల్లాడి కుడిచెయ్యీ భుజమూ చీరుకుపోయి నెత్తురొస్తోంది. యెడమ కాలూ చెయ్యీ చర్మం కందిపోయి నెత్తురు చమర్చుతోంది. ఒంటిమీద దుమ్ము. యెడమభాగం మరింత దుమ్ముతో నిండింది. ఆరేళ్ళ పిల్లడు.
    "గిప్పుడె అర్ధగంటాయె. గింత బువ్వ పెడ్తిని. ఆడుకునేటందుకు పోయిండు. నేను గిర్నిక పోదమని బీగమేస్తున్న, గంతల మల్లితోల్కొచ్చె ఆ రిక్షోడు__వానింట్ల పీనుగెల్ల. నిల్వనన్న నిల్వక_పోయిండట" అని శోకాలు పెడుతోంది రాజవ్వ.
    "ఆ పోరి యెవరు?" అంది రమణి మల్లిని చూసి.
    మల్లికి పదహారేళ్ళుంటాయి. నల్లగా కళగా పొట్టిగా గుండ్రంగా పొంకంగా వుంది__దుండు ముక్కలా.
    "గిర్నికి టేం ఐపోతున్నది. నేపోత. దవకానకు తీస్కపోరాజక్కా" అని మల్లి వెళ్ళిపోయింది.
    "మన బస్తిలనె వుంటది. నాతోటి గిర్నిల పనిజేస్తది. పనిగూడ చెయ్యదు. పోరి బుద్ధి మంచిది కాదు. పోరగాళ్ళతోటి తిర్గుతది. వాండ్లేమో సీన్మలకు తీస్కపోతరు. యిస్నోలు పౌడర్లు గవీ కొనిస్తరు" అంది.
    "బాగా దెబ్బలు తగిలినయ్. దవాఖానాకు తీసుకుపో వెంటనే." అని,
    "నీ మగడు లేడా?" అంది రమణి.
    "యింట్ల యెన్నడన్న కానొస్తడా! నాల్గు ముంతలు కల్లుతాగి రాతిరికొస్తడు. పెడ్తే గింత తింటడు. పైసలుంటే యివ్వు_అని సతాయిస్తడు" అంది రాజవ్వ.
    "ఇంకేం చెయ్యడా నిన్ను?" అంది రమణి.
    "పాపం వాన్కి యేమక్కరలే కల్లుంటే చాలు. వుంటె బుక్కెడు తినుడు అన్నమో గట్కనో. ఇప్పుడేమి చెయ్యాల__ఒక్క పైసగూడ లేదు నా తాన. మోటర్ల తోల్క పోదమన్న గూడ__" అంది రాజవ్వ.
    రాజవ్వ తెల్లవారుజామునే లేచి రెండిళ్ళలో పనిచేసి, వచ్చి కాస్తంత వుడకేసుకుని పిల్లాడికి పెట్టి తను తిని, పిండిమిల్లులో పనిచెయ్యటానికి వెళుతుంది.
    రమణి లోనకి వెళ్ళి చాప అంచు పైకెత్తింది. నాలుగు రూపాయల నోట్లు కొంత చిల్లరా. గుప్పెటతో ఆ నోట్లూ చిల్లరా పట్టుకుని బయటికి వచ్చి రాజవ్వ కిచ్చి, "రిక్షాలో తీస్కపో రాజవ్వా" అంది రమణి.
    రాజవ్వ పిల్లాణ్ణి భుజాన వేసుకుని వెళ్ళిపోయింది.
    రమణి లోనకి వచ్చి చాపమీద పడుకుంది.
    ఆకలిగా వుంది. పొయ్యి కిందికి వుంది గానీ పొయ్యి మీదకి యేమీ లేదు.
    ఆ డబ్బుల్తో రెండు కిలోలు బియ్యం తెచ్చుకోవాలనుకుంది.
    రమణి రెండు నెలల క్రితం యీ సిటీకి కొట్టుకొచ్చి పడింది. చిన్న గదిలో వుంది. అనారోగ్యం. చేతులోవున్న డబ్బులైపోయాయి. మళ్ళీ డబ్బులు రావటంలేదు చేతులోకి.
    శరీరం శిథిలమైపోయింది. అశక్తమైపోయి శరీరం లోలోన దాహంతో తపించిపోతూ వేడెక్కి __ జ్వరం వచినట్లుగా అవుతుంది. కళ్ళు మూసుకుంటుంది. బాధగా కళ్ళలో నీళ్ళు. చేతులు వక్షం చుట్టూ వేసుకుంటుంది. ఆ చేతుల మధ్య పురుషులు నలిగిపోతున్నట్లూ నలిగిపోతున్న ఆ పురుషులు తనలోకి చొచ్చుకుపోతున్నట్లూ భ్రమ. భ్రమలోంచి మగత. మగతలోంచి నిద్ర. నిద్ర లేచి__ పైన నిలుచోలేక కాసేపు నేలమీద కూలబడింది. ఆ ఒక్క డాక్టరుకి యింత చాంతాడు పొడవు రోగులు. యెంతసేపైనా అంతే వుండే చాంతాడు. యెప్పుడో టైం అవగానే తుంచితే తెగే చాంతాడు.
    డాక్టరు__ ఒక్కో పేషంటుని వొకటి రెండు క్షణాలకంటే యెక్కువసేపు చూసే వ్యవధి వుండదు. విసుగు, చీదర.
    క్యూ రమణిదాకా జరిగింది.
    రమణి స్టూలుమీద కూర్చుంది. వొకసారి రమణి వొంటివంక చూసి నోరు తెరవమంది. అరక్షణం__వొక్క దృక్కు_ చూపు మరల్చి పొట్ట భాగంకేసి చూస్తూ కాళ్ళు చూపెట్టమంది. చీర పైకి జరిపింది రమణి. పిక్కలు, మోకాళ్ళు, తొడలు.
    "ఛీ రొచ్చుముండా, అవతలికి పో" అని కసిరింది డాక్టరు.
    "షటప్ ఇట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యు ఆర్ ఎ పెయిడ్ సర్వెంట్_ఏ సర్వెంట్, యు ఆర్. వేర్ యోజ్ ఐ యామ్ వాట్ ఎ సర్వెంట్. ఐయామ్ ది మిస్ట్రెస్ ఆఫ్ మైసెల్స్. మిస్ట్రెస్ ఆఫ్ మై ఫెట్" అంది రమణి.
    విస్మయంగా గుడ్లప్పగించి చూసింది డాక్టరు. వెంటనే రమణి స్థితి గ్రహించింది. "సారీ ఆస్పత్రిలో మామూలుగా లభ్యమయ్యే మందులతో నయం కాదు. అసలు నయం కాకనూ పోవచ్చు__ చీఫ్ ని ఇంటి దగ్గర కలుసుకోమ్మా" అంది డాక్టరు, జాలిగానూ కసిగానూ అసహ్యంగానూ.
    రమణి తిన్నగా గూటికి తిరిగి వచ్చేసింది! అంతే. డబ్బులు లేవు. డబ్బులుండవు. మందులు లేవు. మందులున్నా ఆ వ్యాధి నయమవదు.
    ఒకరోజు రాత్రి ఓ పాడుపడిన సత్రవకి వెళ్ళింది. ఓ బిచ్చగాడు సరసన చేరింది. రూపాయి ఇచ్చాడు. మరసటిరోజు వెళ్ళింది ఆ బిచ్చగాడు మగతగా పడవున్నాడు రోగంతో. మరో బిచ్చగాడి సరసన చేరింది. తన దగ్గిరేం లేదు, రెండురోజులైంది తిండి తిని అన్నాడు అతను. తన దగ్గిరున్న రూపాయి అతనికిచ్చింది. వీధిలో నడుస్తోంది చిమ్మ చీకటిలో గుడ్డి దీపాల వెలుతురు. ఓ చెట్టు కింద ఓ బిచ్చగాడు సరసనచేరింది. ఆ బిచ్చగాడు మంచి పటుత్వంలో వున్నాడు. రెండు రూపాయల నోటు యిచ్చాడు.




Related Novels


Anukshanikam 2

ప్రేమతో ....వడ్డెర చండీదాస్

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.