Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
"గురువయ్యా! మరో ధ్యాస వద్దు. మనసును భగవంతుని మీద నిలుపు" అన్నాను. అలాగే అన్నట్లు తల ఊపాడు.
ఇంతలో సాయంత్రం పశువులను మళ్ళించుకొని వస్తున్న గొల్ల వీరయ్య వచ్చాడు. "గురువన్నా! ఇన్ని సారనీలు తాగుతవ?" అని అడిగాడు. గురువన్న 'ఇయ్యాల తాగిన రేపు తాగుతలే' అన్నట్లు సైగ చేశాడు.
నేను చకితుణ్ణి అయిపోయా! ఎంత ఆశ? ఇంతకుముందే పోతున్నా నన్నాడు. ఇప్పుడు రేపటిగురించి ఆటగా ఉన్నాడు!!!
నేను కాస్సేపు ఉండి వచ్చేశాను.
తెల్లవారి సాయంకాలం వీరయ్య తెచ్చిన సారాయి తాగి గురువయ్య గతించాడు!!! అప్పుడు నాకు ఆలోచన వచ్చింది.
అనుబంధాలు మృత్యువును మించి నిలిచి ఉంటాయి!
కోరికలు మృత్యువును గెలువగలవు!!
ఈ అంశం మీద 'శరతల్పం' అని ఒక నవల వ్రాశాను.
శరతల్పంలో హరిజన గురువయ్య నాయకుడు. అతనికి విచిత్రమైన పరిస్థితుల్లో ఒక వైష్ణవ స్వామితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం అతనిని దుర్మార్గాలనుంచి మరలిస్తుంది. గురువయ్య సన్మార్గగామి అయి స్వామిని 'అన్నగారి'ని చేసుకుంటాడు. శ్రీమద్భాగవతం వింటుండగా గురువయ్యకు క్షయ వ్యాధి వస్తుంది. స్వామి గురువయ్యను పట్నం దవాఖాన్ల చేర్పిస్తాడు. గడియల్లో ఉన్నాడు, తీసికెళ్ళమని ఆస్పత్రివారు స్వామికి కబురంపుతారు.
స్వామి గురువయ్యను తన ఇంటికి తెచ్చుకుంటారు. భాగవతం వినిపించడం సాగిస్తారు. 'అన్నగారూ! మీ రుణం ఎన్ని జన్మలకు తీర్చుకుంట?' అని అడుగుతాడు. 'గురువయ్యా! నీకు మరొక జన్మలేదయ్యా!' అంటారు స్వామి.
గురువయ్యకు చెప్పే పురాణం వినడానికి అశేషజనం వస్తుంటారు. భాగవతంలో చివరి పద్యం అయిపోతుంది. స్వామి పాదాలమీద ఉన్న గురువయ్య చేయి చల్లబడుతుంది.
"గురువయ్యగారు పరమ పదించిన్రు" అని ప్రకటిస్తారు స్వామి!
కోరిక బలమయినపుడు మృత్యువు జరిగిపోతుంది. గురువయ్య సారాయికోసం ఒకరోజు బ్రతికాడు. భాగవతం కోసం నేను నెల బ్రతికించాను.
కోరిక తీరడానికి బ్రతికిన వాస్తవ ఉదాహరణలు అనేకం భాగవతంలో జడ భరతుడు కోరికలతో జన్మలు ఎత్తాడు.
ఆ ఇంట్లో ఉండగానే నాకు తీవ్రమయిన జ్వరం వచ్చింది. అంత్యకాలం సమీపించింది అనుకున్నాను. బాధ్యతలు వదిలిపోవలసి వస్తున్నందుకు బాధపడిన మాట నిజం మిత్రులు - డాక్టర్లు - బాధ్యతలు నన్ను బ్రతికించాయి. అన్నింటికన్న సావిత్రి వంటి కమల సంకల్ప బలం బ్రతికించింది అనడం వాస్తవం కావచ్చు.
ఆర్ధిక దారిద్ర్యంలో నేను ఆ గొడ్ల కొట్టంలో చేరాను. బతికి ఉంటే అప్పులు తీర్చుకోవచ్చు, ఇల్లు మార్చండి అని కమల నిరంతరం వేధించింది.
ఖమ్మం ఇంటిని గురించిన అనుభవం ఉంది. అక్కడ మూడు చావులు - కుటుంబ విచ్చినం జరిగింది. ఇక్కడ కవిత దూరం అయింది. నేను దూరం కానుండగా కమల దగ్గరకు తీసుకుంది. మనుషులు - చెట్లు - పశువులు మున్నగు సమస్త పదార్ధాలలో మంచివీ చెడ్డవీ ఉంటాయి. అలాగే ఇళ్ళల్లోనూ ముళ్ళబాట అని తెలిసినపుడు మంచి బాట చూడడం బుద్దిమంతుని లక్షణం. నేను స్కూలు దగ్గర నెలకు పదిహేడు రూపాయిల అద్దెకు ఒక ఇల్లు తీసుకున్నాను. ఆ ఇంటికి మారినపుడు కమలా - నేనూ మానసికంగా తేలికపడ్డాం.
అనుబంధపు ఆనకట్ట:
స్కూల్లో పిల్లలూ - టీచర్లు - హెడ్మాస్టరు నన్ను అభిమానించేవారు. పండితాస్సమ దర్శినః అన్నట్లు నాకు హెచ్చు, తచ్చులు - పెద్దా, పిన్నా - ధనికుడు, దరిద్రుడు అనే భేదాలు నాటికీ నేటికీ లేవు. నాకు బలం - భయం మీద విశ్వాసం లేదు. ఈ లోకం ప్రేమ, అనుబంధాల మీద నిలుస్తున్నదని నా విశ్వాసం.
స్కూల్లో నేను అందరినీ అభిమానించాను. అందరు కాకున్నా కొందరు నన్ను అభిమానించారు. పాఠం చెప్పడం నాకు అభిమాన విషయం. తెలుగు పాఠంలో నేను మైమరచేవాణ్ణి పిల్లలూ అలాగే వినేవారు. పీరియడు అయిపోయేవరకు పాఠం అప్పగించేవారు. ఒక్కొక్క పీరియడు సాంతం లోకవ్యవహారం మీద చర్చించేవాళ్ళం. పిల్లలు నిస్సంకోచంగా చర్చలో పాల్గొనేవారు. అనేక ప్రశ్నలు అడిగేవాళ్ళు. నాకు తెలియనివీ అడిగేవారు. తెలియదని స్పష్టంగా చెప్పేవాన్ని.
ఒకసారి ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధిని విపరీతంగా కొట్టాడు. తల్లితండ్రులు టీచరుమీద - స్కూలు మీద దుమ్ములు, మన్నులు పోశారు. అది అంతటితో ఆగలేదు. ఇప్పటివలె విద్యార్ధి సంఘాలు లేవు కాని, విద్యార్ధులు సమ్మె సంకల్పించారు. అది అప్పటికి కొత్త టీచర్లు, హెడ్మాస్టరు గడగడలాడారు.
ఒకనాడు స్కూలు సాగుతుండగానే విద్యార్ధులు విడుపుగంట కొట్టారు. పిల్లలందరూ క్లాసులు వదిలారు. బయట పడ్డారు. గేటు మూయలేదు. కాని, నేను వంటరిగా గేట్లో నుంచున్నాను. నేను ఎవరినీ ఆపలేదు. కాని, అందరూ అంగణంలో నిలిచిపోయారు. అందరూ అలా నిలిచిపోయారు. రామమూర్తిని పిలిచాను.
"ఎందుకు వెళ్ళిపోతున్నారు?"
"టీచర్ కొట్టినందుకు"
"ఒక్క టీచర్ మీది కోపం స్కూలుమీద చూపుతారా?"
"టీచర్ తప్పుచేసిండు సార్, శిక్షిస్తరా?"
"తప్పు ఎవరు చేసినా శిక్షించాల్సిందే గదా!"
"అని మీరు చెప్పుతరు" - చేయరు అనే ధ్వనితో అన్నాడు.
"మీరు గేటు దాటకండి" అని వాళ్ళను నిలిపి, ఉపాధ్యాయుడిని వప్పించడానికి సతమతం అయినాను. తుదకు విధిలేక - ఆ టీచరు వచ్చి, బహిరంగంగా విద్యార్ధులకు క్షమాపణ చెప్పాడు.
'తప్పులు అందరూ చేస్తారు. వ్యక్తి తప్పుకు సంస్థను కూలదోయ వద్దు' అని చెప్పాను. విద్యార్ధులు సమ్మె విరమించారు. అందరం ఊపిరి పీల్చుకున్నాం.
స్కూల్లో క్లాసులు పెంచాలి. గ్రామస్తులకు శ్రద్ద ఉంది. వారికి నేను కొంత సాయపడ్డాను. డబ్బు వసూలు చేయడం ప్రధాన కార్యం. ఇప్పటివలె జీపులు - కార్లు లేవు. కాలినడకనో సైకిళ్ళ మీదనో గ్రామాలకు వెళ్ళేవాళ్ళం. ఒకరోజు సైకిళ్ళమీద "అమ్మపాలెం" వెళ్ళాం. కొన్ని వాగ్దానాలు - కొంత డబ్బు వసూలయింది. సైకిళ్ళమీద తిరిగి వస్తున్నాం. సైకిలు బండి చక్రం కింద పడిపోయింది. నేను తెలివిగా చక్రాల మధ్య ముడుచుకున్నాను. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. కాని, ప్రాణం దక్కింది.
మరుసటి సంవత్సరం తొమ్మిదవ క్లాసు వచ్చింది. నేను బి.ఏ.కు చదవడం ప్రారంభించాను. తెలుగు మెయిన్ సబ్జెక్టు. అంటే, నాలుగు పేపర్లుంటాయి. సంస్కృతం - ఎకనమిక్స్ సబ్సిడియరీ సబ్జక్టులు రెండు రెండు పేపర్లుంటాయి. ఇంగ్లీషు కాక రెండవ భాష హిందీ తీసుకున్నాను. సంస్కృతంలో కాళిదాసు "శాకుంతలం" నన్ను ముగ్ధుణ్ణి చేసింది. "మేఘసందేశం" పొంగుతున్న ఏటివడ్డున మేఘచ్చన్న వాతావరణంలో పాడుకున్నాను. ఎకనమిక్స్ ఏదో గొడవగా ఉండేది. అయినా అర్ధం చేసికోగలిగాను.
చదువుకోవడం - చదువు చెప్పడం - మిగిలిన ఒక్క క్లాసు పెంచడానికి ప్రయత్నించడం సజావుగా సాగుతుండగా ఒకనాడు ఒక విచిత్రం జరిగింది.
తిరుపతయ్య అనే ఒక టీచరు మా ఇంటి ముందు అద్దెకు ఉండేవాడు. అతడు విచిత్రుడు బహుసంతానం జీతం రాగానే అత్తరు, పన్నీరు లాంటివి కొనేవాడు. బయటపడేవాడు. భార్య చాల మంచిది తాను బయటపడకుండా కాలం గడిపేది.
ఒకనాడు భార్య గొల్లుమన్నది. పసిపిల్ల పక్కలు ఎగరేస్తున్నది. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. డాక్టరు మిత్రుడు రాధాకృష్ణను తీసుకువచ్చాను. అతను లాభం లేదన్నాడు. రోజు గడవడం గగనం అని ఇంజక్షను ఇచ్చి వెళ్ళాడు. తిరుపతయ్య లేడు. వాళ్ళ స్థితి చూచి నాకు పిచ్చి పిచ్చిగా ఉంది.
ఆ రాత్రి ఇంటిముందరి అరుగుల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఆదినారాయణగారనే నాటు వైద్యుడు ముచ్చటకు వచ్చాడు. తిరుపతయ్య బిడ్డను గురించి ప్రస్తావించాను. టార్చిలైటు ఉందా అని అడిగి తీసుకున్నాడు. నేనూ వెళ్ళాను. ఆదినారాయణగారు వెదికీ, వెదికీ గుప్పెడు ఆకులు తీసుకుని వచ్చాడు.
మేము తిరుపతయ్య ఇంటికి వెళ్ళాం. ఆకు గంటెలో వేసి నిప్పులమీద పెడ్తే పసరు అవుతుందనీ, అది ఒక్కొక్క చుక్క పాపనోట్లో వేస్తుండమని ఆదినారాయణగారు వెళ్ళిపోయాడు. నేనూ ఇంటికివచ్చి పడుకున్నాను. కాని, నిద్ర పట్టలేదు. ఏ రాత్రి గొల్లుమంటుందో అని ఎదురుచూస్తున్నాం. తెల్లవారుతుండగా పాప ఏడుపు వినిపించింది. వెళ్ళి చూచాం.
పాప కోలుకుంది!
హాయిగా తల్లిచన్ను కుడుస్తున్నది!
"అన్నగారు నా బిడ్డను బతికించిండు" అని సజల నయనాలతో బిడ్డను నా కాళ్ళమీద పడేసిందా తల్లి!





